టిఆర్ఎస్‌లోకి మాజీ ఎంపి వివేక్?

  కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ గాలి వివేక్ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ కేశవరావు తెలంగాణ మంత్రి హరీశ్ రావు భేటీ అయిన నేపథ్యంలో మాజీ ఎంపీ వివేక్ కూడా ఈ భేటీకి హాజరుకావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ఆ స్థానానికి టీఆర్ఎస్ తరుపున వివేక్ ను బరిలోకి దిగమని హరీశ్ రావు కోరగా.. వివేక్ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నవంబర్‌ 4తో నామినేషన్‌ గడువు ముగియనుంది. కాగా వివేక్‌తో పాటు ప్రొ. సాంబయ్య, ఎర్రొళ్ల శ్రీనివాస్‌, రవికుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్‌ లేదా రవికుమార్‌ ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అదివారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

దేవాన్ష్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య.. అమరావతిని పాలించాలని

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాన మంత్రి మోడి అయిన సెంట్రాఫ్ యాట్రక్షన్ అయ్యారో లేదో కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్యల మనువడు దేవాన్ష్ మాత్రం కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రతిఒక్కరూ దేవాన్ష్ ను ముద్దు చేశారు.. ఆఖరికి మోడీ కూడా దేవాన్ష్ ను కొద్దిసేపు ముద్దుచేశారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా దేవాన్ష్ ను ఎత్తుకున్న రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రేవంత్ రెడ్డి దేవాన్ష్ ను ఎత్తుకుని అతని మెడలో అమరావతి కండువ వేయగా.. పక్కనే ఉన్న చంద్రబాబు భార్య భువనేశ్వరి.. దేవాన్ష్ నాయనమ్మ అమరావతి కండువా వేశావు.. మరి పసుపు కండువా ఎప్పుడు వేస్తావు అని అడుగగా దానికి రేవంత్ రెడ్డి భవిష్యత్ లో అమరావతిని పాలించడానికి ఈ కండువా వేశాను.. పసుపు కండువా తాతగారు వేస్తారు అని అక్కడ ఉన్న వారిని నవ్వించారు. మొత్తానికి నారా దేవాన్ష్ కు ఇప్పటినుండే రాజకీయా ఓనమాలు దిద్దేలా ఉన్నారు.

కేంద్రం చంద్రబాబుకు పవర్స్ ఇచ్చింది.. కోదండరాం

  తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్స్ గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తెలంగాణపై చంద్రబాబుకు కేంద్రం అధికారాల్ని కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన లాంటి అంశాలు చంద్రబాబు ఆదేశాల్ని బట్టి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అసలు హైకోర్టును విభజించాలని కేంద్రాన్నికోరితే చంద్రబాబు లేఖ రాస్తే తప్ప చేయమంటున్నారు.. ఒక రాష్ట్రపతి చేయాల్సిన పనిని చంద్రబాబు ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. ఉద్యోగుల విభజన పై ఏర్పాటు చేసిన కమల్ నాథ్ కమిటీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది.. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇంతవరకూ ఈ సమస్యకు ఓ కొలిక్కి తీసుకురాలేదు.. కావాలనే జాప్యం చేస్తుంది.. అక్కడ ఆంధ్రాలో తెలంగాణ ఉద్యోగులు నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారు.. వారిని వెనక్కి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు లేఖలు రాసిని ప్రయోజనం ఉండటం లేదు’’ అంటూ మండిపడ్డారు. నిజంగానే చంద్రబాబుకు అంత పవర్ ఉంటే ఆయన పాలిస్తున్న రాష్ట్రానికి ఏం కావాలో ఎప్పుడో చేయించుకునే వాళ్లు కదా.. ఈ  విషయం కోదండరాం ఆలోచించలేదేమో..

జయలలిత పై నగ్మా కామెంట్స్.. మహిళల్నివిధవల్ని చేస్తున్నారు

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై నగ్మా ఘాటైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు సినిమాల్లో నటించిన అందాల తార నగ్మా చాలా కాలం తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది. అయితే ఇప్పుడు నగ్మా జయలలిత పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహిళలకు చీరలు పంచిపెడుతూనే.. మధ్యం విక్రయాలు పెంచి అదే మహిళల్ని విధవల్ని చేస్తున్నారని జయలలితపై నగ్మా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. అంతేకాదు తనకు జయలలితపై ఎనలేని గౌరవం ఉందంటూనే ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సుపరిపాలన అంటే ముందువెనుక ఆలోచించకుండా వరాలు ఇవ్వడం కాదని.. ప్రజల కష్టనష్టాలు తీర్చడమేనని సూచించింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఖుష్బూతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తానని తెలిపింది. మరి నగ్మా చేసిన వ్యాఖ్యలకు జయలలిత ఎలా కౌంటర్ ఇస్తుందో.

రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం.. నువ్వు ఐటెం గార్ల్ వి.. నువ్వు కోవర్టువి

  టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, యువనేత రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య బేధాభ్రిపాయలు  నడుస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే జరిగిన తెలంగాణ అధ్యక్ష పదవిలో వీరిద్దరి మధ్య గట్టిపోటీనే ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు పరిస్థితిని చక్కబెట్టి ఎవరూ నొచ్చుకోకుండా పదవులు కట్టబెట్టారు. అయితే మళ్లీ ఇప్పుడు వీరిద్దరి తీరుపై పార్టీకి సమస్యలు తలెత్తేలా కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికకు తేదీ ఖరారైన నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు గాను నిన్నఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  రేవంత్ మాట్లాడుతూ... వరంగల్ లోకసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ పెట్టాలని ప్రతిపాదించారు. దీనికి ఎర్రబెల్లి కల్పించుకొని గత ఎన్నికల్లో మిత్రధర్మంతో బీజేపీకే ఛాన్సిచ్చామని, ఇప్పుడూ ఇవ్వకతప్పదని, అన్నీ ఆలోచించి మాట్లాడాలని బదులిచ్చారు. దీంతో కోపాద్రిక్తుడైన రేవంత్ రెడ్డి అంటే అన్నీ మీరేనా? చివరకు పార్టీ క్యాడర్‌కు పంపించే ఎస్సెమ్మెస్‌లు కూడా నీ పేరు, రమణ పేరుతోనే వెళ్తున్నాయని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అని, తన పేరు అక్కర్లేదా? చివరకు టీడీఎల్పీలో కూడా తన మాట వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య మాటాల తూటాలు పేలాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి ఎల్.రమణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాను వర్కింగ్ ప్రసిడెంట్ అలాంటిది నాకు చెప్పకుండా  సమావేశాలు పెడుతున్నారని నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఎల్ రమణను కూడా రేవంత్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎర్రబెల్లి మళ్లీ కల్పించుకొని.. ఐనా నువ్వు పార్టీలో ఓ ఐటెం సాంగ్ గర్ల్‌గా మారిపోయావని, ఇలా వచ్చి అలా వెళ్తుంటావని, నీతో పార్టీకి ఒరిగిందేం లేదని వ్యాఖ్యానించగా దానికి రేవంత్ రెడ్డి నీలా నేను కోవర్టును కాదని ధీటుగా సమాధనమిచ్చారు. అయితే ఈ గొడవలో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అందేంటంటే రేవంత్ రెడ్డి ఒంటరివాడయ్యాడనే విషయం. ఎందుకంటే ఎర్రబెల్లికి ఉన్నసీనియర్ల సపోర్టు రేవంత్ రెడ్డికి లేకపోవడం.. అంతేకాదు సీనియర్లంతా ఆయనపై గుర్రుమంటున్నారు. కాగా ఈ విషయాన్ని రమణ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఏరకమైన నిర్ణయం  తీసుకుంటారో చూడాలి.

ప్రముఖ హాస్య నటుడు ‘మాడా’ మృతి

  ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు(65) నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 17న అపోలో ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స తీసుకొంటున్నారు. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన మరణించారు.   ‘మాడా’ గా తెలుగు ప్రజలకు సుపరిచితులయిన ఆయన పూర్తి పేరు మాడా వెంకటేశ్వర రావు. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో దుళ్ల గ్రామంలో 1950 అక్టోబర్ 10న జన్మించారు. ఆయనకు నలుగురు కుమార్తెలున్నారు. ఆయన సినీ పరిశ్రమలో ప్రవేశించే ముందు నాటక రంగంలో తన ప్రతిభను చాటుకొన్నారు. దర్శకుడు బాపు ఆయన ప్రతిభను గుర్తించి తన సినిమాలలో అవకాశం కల్పించారు. నాటక రంగానికి రాక పూర్వం మాడా వెంకటేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఇంజనీరుగా పనిచేసేవారు. బాపు సహాయంతో సినీ పరిశ్రమలో ప్రవేశించిన మాడా సుమారు 300కి పైగా సినిమాలలో నటించారు. ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ళ రాందాసు వంటి సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టాయి.   ముఖ్యంగా 1977 సం.లో విడుదలయిన దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ సినిమాలో ‘పువ్వుల కొమ్మయ్య’ అనే నపుంసక పాత్ర, దానికి ఆయన చేసిన ‘చూడు పిన్నమా...పాడు పిల్లోడు..’అనే పాట ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత ఆయన ఎన్ని విభిన్నపాత్రలు పోషించినప్పటికీ మాడా అంటే చటుక్కున అందరికీ అదే పాత్ర గుర్తుకు వస్తుంది. అంత అద్భుతంగా ఆయన ఆ పాత్ర చేసారు.

వరంగల్ ఉప ఎన్నిక.. టీడీపీ, బీజేపీ పోటాపోటిగా బరిలో

  వరంగల్ లోక్ సభ నియోజక వర్గ ఉప ఎన్నిక స్థానానికి షెడ్యూల్ విడుదలైందని విదితమే. అయితే ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ ఉప ఎన్నిక స్థానానికి పార్టీలు బానే పోటీపడుతున్నాయి. మరోవైపు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలు కూడా ఈ నియోజక వర్గం నుండి పోటీ చేయడానికి పోటీపడుతున్నాయి. రెండు పార్టీలు ముందు నుండీ పొత్తులో భాగంగా ఆస్థానం నుండి పోటీ చేయాలనీ అనుకున్నారు కానీ.. తీరా ఎన్నికల తేదీ వెల్లడయ్యే సరికి ఇరు పార్టీల కార్యకర్తలూ కూడా తమ అభ్యర్థే రంగంలో ఉండాలని పట్టుపడుతున్నాయి. దీనిలో భాగంగానే టీ టీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్ లో సమావేశమవ్వగా.. బీజేపీ నేతలు వారి కార్యలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు పార్టీలు ఈ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. కాగా మెదక్ లోక్ సభ.. రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలప్పుడు టీడీపీ మిత్రధర్మం వహించిందని.. ఇప్పుడు బీజేపీ కూడా అలానే పాటించాలని టీడీపీ గుర్తుచేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

అలా విమర్శిస్తే దైవ ద్రోహం.. ప్రతిపక్షాలపై యనమల ఫైర్

ఏపీ ప్రతిపక్షాల తీరుపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో.. దానిని వ్యతిరేకిస్తూ  నిన్న వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టడాన్ని యనమల తప్పుబట్టారు. మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటికి చెందిన పక్షులని అన్నారు. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ ఎంతో గౌరవంగా మట్టిని, పవిత్రమైన గంగా నది జలాన్ని తీసుకొస్తే దాన్ని విమర్సిస్తారా.. భూదేవిని, గంగను విమర్శించడం దైవ ద్రోహమని మండిపడ్డారు. శంకుస్థాపనకు మొత్తం పదమూడు వేల గ్రామాల నుండి మట్టి తీసుకొచ్చారని వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కించపరచకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలతో గొడవ పడటం వల్ల సాధించేది ఏదీ లేదని వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తారా? ధర్నా చేయమంటారా?.. అంబటి

ఆర్టీసీ చార్జీల పెంపుదలపై వైకాపా నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆర్టీసీ చార్జీలను 10 శాతం పెంచినట్టు గత రాత్రి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. దానివల్ల డీజిల్ ధరలు తగ్గుతున్నా ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతుందో అర్ధంకావట్లేదు అని అన్నారు. ఆర్టీసీని నడిపే సామర్ధ్యం ఏపీ ప్రభుత్వానికి లేకపోవడంవల్లే ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. అంతేకాదు రేపటి కల్లా ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తున్నామని నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే ఎల్లుండి అంటే 26 వ తేదీన జగన్ చెప్పినట్టు అన్ని ఆర్టీసీ డిపోల ముందు ధర్నాలు చేస్తామని చెప్పారు. కావాలనే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని.. ఆర్టీసీ చార్జీలు పెంచడం వల్ల ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఎక్కుతారని.. ప్రైవేటు సంస్థలన్నీ చంద్రబాబు, ఇతర నాయకులకు బినామీ సంస్థలేనని ఆరోపించారు.

పవన్ రాకపోవడానికి కారణం అదా..!

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రాకపోవడంపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ లు ఇద్దరు స్వయంగా వెళ్లి పవన్ ను ఆహ్వానించగా.. ఆయన అప్పుడే తాను వస్తానో? రానో? అని చెప్పారు. తాను వచ్చేది.. రానిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే ఇప్పుడు నిజంగానే షూటింగ్ బిజీలో ఉండి రాలేదా.. లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న దానిపై పలువురు పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. అసలు కేసీఆర్ ను, రామోజీ రావును చంద్రబాబు స్వయంగా పిలిచారని.. తమ నాయకుడిని స్వయంగా పిలవలేదని అప్పుడే పవన్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మరీ రావాలని ఆహ్వానించారు.. ఈ విషయంపై చంద్రబాబు కూడా పవన్ తప్పకుండా వస్తారు.. ఫోన్ చేసి మరీ చెప్పాను.. విబేధాలు ఎన్ని ఉన్నా వాటిని కలిపి చూడకూడదు.. పవన్ వస్తారు అని ఖచ్చితంగా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. అయితే పవన్ తాను చెప్పినట్టు నిజంగానే షూటింగ్ లో బిజీగా ఉన్నారా? అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఒక్కరోజు షూటింగ్ ఆపేసి రావడం పెద్ద విషయం కాదు.. ఒక్కరోజు కాదు అంతకన్నా ఎక్కువ రోజులు తీసుకున్నా డైరెక్టర్ ఒక్కమాట కూడా మాట్లాడడు. మరి ఎందుకు రాలేదు? మరోవైపు పవన్ రాకపోవడానికి మరో కారణం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. భూసేకరణ వివాదంలో టీడీపీకి పవన్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. తానే భూసేకరణకు వ్యతిరేకమని.. రైతుల కోసం పోరాడతానని చెప్పి.. ఇప్పుడు ఆభూముల్లో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ఎలా వెళతాను అని ఆలోచించి తాను హాజరుకాలేదని అంటున్నారు. అందుకే ఇవన్నీ ముందే గ్రహించే పవన్ కళ్యాణ్ తాను వస్తానో? రానో? అని చెప్పారని అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో ఆయనకే తెలియాలి.

విపక్షాలు అందుకే తట్టుకోలేకపోతున్నాయి.. కేఈ

  ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రతిపక్షాలతీరుపై మండిపడ్డారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని.. ఈ కార్యక్రమం అంతలా విజయవంతం అయిందనే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని అన్నారు. అందుకే అనవసరమైన విమర్శుల చేస్తూ.. నిరసనలు చేస్తూ కొంతమంది నేతలు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు శక్తి, సామర్ధ్యాలు ఏంటో అందరికి తెలిసిందని అన్నారు. అందుకే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని విమర్శించారు. అంతేకాదు త్వరలోనే మీ ఇంటికి - మీ భూమి రెండో విడుత కార్యక్రమం చేపడుతున్నామని.. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాస్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు బుజ్జగించారా?క్లాస్ తీసుకున్నారా?

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమంది నేతల పేర్లుతో శిలాఫలకం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ శిలాఫలకంపై ఉన్న పేర్లతోనే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శిలాఫలకంపై ప్రధాన మంత్రి మోడీ, ఇతర ప్రముఖుల పేర్లు ఆఖరికి పక్క రాష్ట్రమైన కేసీఆర్ పేరును కూడా ఉండేట్టు చూసుకున్నారు.. కానీ పార్టీ నేతల పేర్లు ఉన్నాయే లేదో అంతగా పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏపీ శంకుస్థాపనకు సంబంధించిన వ్యవహారాలలో గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. కానీ వారిపేర్లు మాత్రం శిలాఫలకంపై లేకపోవడాన్ని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు వారిద్దరిని పిలిచి బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంత మంది వారిని బుజ్జగించారు అని అనుకుంటుంటే.. కొంతమంది మాత్రం క్లాస్ తీసుకున్నారు అని అనుకుంటున్నారు. అంతేకాదు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరిగిన సందర్బంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో వీరిద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టుకున్నారు.

మట్టి తెచ్చిన మోడీపై "మట్టి సత్యాగ్రహం"

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఢీల్లీలోని పార్లమెంట్ ఆవరణం నుండి మట్టిని, యమునా నది నుండి నీటిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోడీ తీసుకొచ్చిన మట్టిపై పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయకుండా అక్కడినుండి మట్టి తీసుకొచ్చి ఇక్కడి ప్రజల నోట్లో కొట్టారని విమర్సిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి మోడీ ఎటువంటి ప్రకటన చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని.. ఏపీ ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాడతామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన మట్టి రాజకీయానికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని.. ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం 'మట్టి సత్యాగ్రహం' పేరుతో వినూత్న నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. తన సొంత నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మహిళా సర్పంచ్‌లు సేకరించిన మట్టిన ప్రధాని మోడీకి పంపిస్తున్నామని.. ఈరకంగా తెలుగు ప్రజల ఘోష మోడీకి తెలుస్తుందని అన్నారు.

నువ్వు లాడెన్ ఫ్రెండ్ వి.. నవాజ్ షరీఫ్ ని తిట్టిన నిరసనకారుడు

  పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అతనికి ఓ చేదు అనుభవం ఏదురైంది. అందేంటంటే.. నవాజ్ షరీఫ్ వాషింగ్టన్ లో ప్రముఖ మేధో సంస్థ అయిన యూఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఉండగా మధ్యలో ఒక వ్యక్తి లేచి నిలబడి బలూచిస్థాన్ కు విముక్తి కలిగించండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. దీంతో నవాజ్ షరీఫ్ ఒక్కసారిగా షాకయ్యి.. కొద్ది సేపు ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడ్ని బయటకు తీసుకెళ్లగా.. అయినా అతను ఆగకుండా నువ్వు లాడెన్ స్నేహితుడివి అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన నవాజ్ షరీప్.. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా పాక్ లోని బలూచిస్థాన్ కు స్వేచ్ఛను ప్రసాదించాలన్న గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ రాజీనామా?

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకూ ఎన్నో నిరసనలు, దీక్షలు చేశారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటి వరకూ చేసిన దీక్షలకు ఎలాంటి ఫలితం రాలేదు.. అఖరికి నిరాహార దీక్ష చేసిన కూడా పెద్దగా ఎవరూ పట్టించుకున్న పాపాన లేదు. అయితే ఇప్పుడు జగన్ కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. తను రాజీనామా చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోడీ ఏపీకి ఎటువంటి వరాలు ప్రకటించలేదని చెప్పి కాంగ్రెస్, సీపీఐ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఆ పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో  భాగంగానే కాంగ్రెస్ పార్టీకి, వైకాపా పార్టీకి మధ్య కేవీపీ రాయబారాలు కూడా నడుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ జగన్ కనుక రాజీనామా చేస్తే అతని వెంట ఎంతమంది వస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. వైకాపా పార్టీ నుండి 67 మంది ఎమ్మెల్యేలు.. ఆరుగురు ఎంపీలు గెలవగా వారు అందరూ కూడా రాజీనామా చేస్తారా? చేయరా అన్నది ప్రశ్న.. ఒకవేళ చేస్తే అది స్పీకర్ ఆమోదిస్తే మొత్తానికే మోసం వస్తుంది. దీంతో ఏ చేయాలనేదానిపై జగన్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారట. మరి జగన్ ఎంత వరకూ రాజీనామా చేస్తారో చూడాలి.

ఏపీ శంకుస్థాపన.. దివంగత ఎన్టీఆర్ ఎక్కడ?

ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అంతా బాగానే జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా.. ఏ లోటు రాకుండా చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది ప్రముఖులు, విదేశీ ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వగా ఇప్పుడు అందరూ చర్చించుకునే విషయం ఒకటే. అది దివంగత ఎన్టీఆర్ గురించి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు ఎక్కడా కనిపించకపోవడం.. వినిపించకపోవడం గురించి. శంకుస్థాపన కార్యక్రమం పనులు చేపట్టిన దగ్గర నుండి ఎంతో ప్రచారం చేసినా.. ఈ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన ప్రకటనల్లో చంద్రబాబు, లోకేశ్, మోడీ ఉన్నారే తప్ప ఎన్టీఆర్ ది చిన్న ఫొటో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో చాలామంది చంద్రబాబు, లోకేశ్ తో పాటు ఎన్టీఆర్ ఫొటో కూడా ఉండి ఉంటే బావుండేదని.. ప్రకటనకే నిండుదనం వచ్చేదని అనుకుంటున్నారు. అంతేకాదు ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు చేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అయితే ఆఖరికి మనువడు దేవాన్ష్ తో కూడా ప్రచారం చేయించారు.. అలాంటిది తెలుగు జాతి కోసం పార్టీ పెట్టి.. ఎన్నో ఏళ్ల నుండి పాలిస్తున్న కాంగ్రెస్ ను సైతం మట్టి కరిపించి విజయం సాధించిన ఎన్టీఆర్ ను మరిచిపోయారా అంటూ విమర్సిస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ స్థాపించిన నాయకుడినే మరిచిపోవడం బాధాకరమైన అంశమే.

శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏ.పి.ఎస్.ఆర్టీసీ చార్జీల పెంపు

  ఏ.పి.యస్.ఆర్టీసీ చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 10 శాతం పెంచుతున్నట్లు ఆర్టీసీఎం.డి. సాంభశివరావు తెలిపారు. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర మరియు గరుడ సర్వీసులపై ఒకేసారి చార్జీలు పెరిగాయి. దాని వలన ప్రతీ కిలోమీటరుకి 8-9 పైసలు చొప్పున, పల్లె వెలుగు బస్సు సర్వీసులపై 5శాతం చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే విద్యార్ధుల బస్ పాసుల చార్జీలు పెంచలేదు. ఇటీవల ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంటును పెంచడంతో ఆర్టీసీపై ఏడాదికి రూ.660 కోట్ల అదనపు భారం పడుతోంది. అదీగాక సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. కనుక తప్పనిసరి పరిస్థితులో చార్జీలు పెంచవలసి వచ్చిందని ఆయన తెలిపారు. తాము 20శాతం పెంపుకి ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 శాతం పెంపుకు మాత్రమే అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో సంస్థకున్న ఆస్తులను వాణిజ్యపరమయిన కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం ద్వారా సంస్థ ఆదాయం పెంచుకొని నష్టాలను అదుపు చేసుకోమని ముఖ్యమంత్రి సలహా ఇచ్చేరని ఆయన తెలిపారు. పెరిగిన ఈ కొత్త చార్జీల ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్ కి రూ.213 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.235 అవుతుంది.

ఏపీ విద్యుత్ ఉద్యోగులు వెంటనే విధుల్లోకి.. టీ సర్కార్

ఎప్పటినుండో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తరువాత స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో రోజుల నుండి హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు రిలీవ్ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రిలీవ్ చేసిన  ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నామని.. 1,252 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వీరికి చెల్లించాల్సిన వేతనాలను కూడా  ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వాలు కలిసి చెల్లించనున్నాయి.

చంద్రబాబు, కేసీఆర్ల మధ్య రాయబారి.. మాకు తెలుసు.. షబ్బీర్ అలీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శంకుస్థాపనకు పిలవడం.. ఆయన కూడా ఇచ్చిన మాట తప్పకుండా శంకుస్థాపనకు రావడం జరిగింది. అయితే వీరిద్దరి మనసులో ఏమున్నా కానీ.. కలిసి సన్నిహితంగా ఉండటం మాత్రం తెలుగు ప్రజలకు ఆనందాన్నిచ్చే విషయమే. కానీ వీరిద్దరి కలయికపై తెలంగాణ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు మధ్య ఒప్పందం కుదరడానికి మధ్యవర్తిగా వ్యవహరించిందో ఎవరో తమకు తెలుసునని అన్నారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు మధ్యవర్తి పేరు బయటపెడుతామని ట్విస్ట్ కూడా ఇచ్చారు. కాగా.. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర విభజనప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర విభజనను తప్పుబట్టారని.. అలాంటి మోడీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు, కేసీఆరే అని విమర్శించారు. విభజన హామీలను మోడియే కాదు ఎవరు ప్రధానిగా వచ్చినా అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.