ప్రముఖ హాస్య నటుడు ‘మాడా’ మృతి
posted on Oct 25, 2015 8:23AM
ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు(65) నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 17న అపోలో ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స తీసుకొంటున్నారు. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన మరణించారు.
‘మాడా’ గా తెలుగు ప్రజలకు సుపరిచితులయిన ఆయన పూర్తి పేరు మాడా వెంకటేశ్వర రావు. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో దుళ్ల గ్రామంలో 1950 అక్టోబర్ 10న జన్మించారు. ఆయనకు నలుగురు కుమార్తెలున్నారు. ఆయన సినీ పరిశ్రమలో ప్రవేశించే ముందు నాటక రంగంలో తన ప్రతిభను చాటుకొన్నారు. దర్శకుడు బాపు ఆయన ప్రతిభను గుర్తించి తన సినిమాలలో అవకాశం కల్పించారు. నాటక రంగానికి రాక పూర్వం మాడా వెంకటేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఇంజనీరుగా పనిచేసేవారు. బాపు సహాయంతో సినీ పరిశ్రమలో ప్రవేశించిన మాడా సుమారు 300కి పైగా సినిమాలలో నటించారు. ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ళ రాందాసు వంటి సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టాయి.
ముఖ్యంగా 1977 సం.లో విడుదలయిన దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ సినిమాలో ‘పువ్వుల కొమ్మయ్య’ అనే నపుంసక పాత్ర, దానికి ఆయన చేసిన ‘చూడు పిన్నమా...పాడు పిల్లోడు..’అనే పాట ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత ఆయన ఎన్ని విభిన్నపాత్రలు పోషించినప్పటికీ మాడా అంటే చటుక్కున అందరికీ అదే పాత్ర గుర్తుకు వస్తుంది. అంత అద్భుతంగా ఆయన ఆ పాత్ర చేసారు.