నడిరోడ్డుపైనే కానిస్టేబుల్ ని నరికి చంపారు

  మెదక్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గజ్వేల్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ను నడ్డిరోడ్డుపైనే కత్తులతో నరికి కిరాతకంగా చంపండంతో కలకలం రేగింది. వివరాల ప్రకారం నర్సింహులు అనే వ్యక్తి హైదరాబాద్ లోని బేగంపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే నర్సింహులు తన సొంత పనిమీద గజ్వేల్ వెళ్లగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపారు. దీంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా నర్సింహులు హత్య జరగడానికి కటుంబకలహాలే కారణమని.. అతని భార్యకు అతనికి మధ్య విభేధాలు ఉన్నాయని అంటున్నారు. ఈనేపథ్యంలో ఆమె ఒకసారి నర్సింహులుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. కాగా ఈ హత్య జరగడం వెనుక అతని భార్య హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు.

అమరావతిలో కాపులకు చోటు ఎందుకివ్వలేదు?

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమ వేదికపై కాపు నాయకులకు ఎందుకు చోటివ్వలేదని కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు, వేదికపైకి కాపు నాయకులను పిలవకపోవడం అవమానకరంగా ఉందని, ఇది కాపులను అవమానించడమేనని అన్నారు, డిప్యూటీ సీఎం చినరాజప్ప లేదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ శంకుస్థాపన వేదికగా గౌరవించలేదని కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మండిపడ్డారు, ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదని ఆరోపించారు, కాపులను బీసీల్లో చేర్చుతామని, 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చంద్రబాబును కాపునాడు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు

చంద్రబాబును అభినందించిన రైతులు

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని ఏపీ రైతులు చంద్రబాబుకి కితాబిచ్చారు. ఈ రోజు ఉదయం ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని అభిందించారు. అంతేకాదు రాజధాని నిర్మాణం ద్వారా రైతులకు, యువకులకు ఉపాధి కల్పించాలని రైతులు చంద్రబాబును కోరడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ ప్రజల కల రాజధాని అమరావతి అని.. రాజధానిని త్వరగా పూర్తి చేసుకుందామని రైతులకు చెప్పారు. అంతేకాదు రాజధాని అమరావతికి రైతులు భూములను స్వచ్ఛందంగానే ఇచ్చారని.. కొంతమంది కావాలనే పంటలు తగలబెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మనకు తిండి పెట్టే పంటలను తగలబెట్టే సంస్కృతి తమది కాదని అన్నారు. మొత్తానికి రైతులే స్వయంగా చంద్రబాబు అభినందించడం శుఖపరిణామమే.

రేపిస్టులపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పు

  రేపిస్టులపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని నపుంసకులుగా మార్చాలంటూ అత్యంత కఠినమైన తీర్పు ఇచ్చింది, చిన్నపిల్లలపై అత్యాచారాలు, అకృత్యాలకు పాల్పడేవారికి ఇదొక్కటే మందు అని, ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని లైంగికంగా పనికిరాకుండా చేయాలని న్యాయమూర్తి కృపాకరన్ అభిప్రాయపడ్డారు, ఇది ఆటవికంగా కనిపించొచ్చు కానీ, ఆటవిక చర్యలకు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు, సంప్రదాయ చట్టాల ప్రకారం ఇలాంటి కేసుల్లో దోషులకు సరైన శిక్షలు పడటం లేదని, కానీ చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిని నపుంసకులుగా  మార్చాల్సిన అవసరముందన్నారు న్యాయమూర్తి కృపాకరన్

పార్టీపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. జిల్లా ఇంఛార్జిల నియామకం

  టీడీపీ అధినేత చంద్రబాబు మొన్నటి వరకూ అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీబజీగా గడిపేశారు. అయితే ఇప్పుడు పార్టీపై పూర్తి దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇప్పుడు జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే చాలా కాలంగా పెండింగుల్లో ఉన్న జిల్లా ఇంఛార్జిలను నియామించడం జరిగింది. * కడప - అనంతపురం జిల్లాల ఇంఛార్జిగా మాజీ మంత్రి దివంగత బీవీ మోహనరెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. * కర్నూలు చిత్తూరులకు వర్ల రామయ్యను నియమించారు. * గుంటూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించారు. * విజయనగరం - శ్రీకాకుళం - పశ్చిమగోదావరిలకు రెడ్డి సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించారు. * కృష్ణా - తూర్పుగోదావరి - విశాఖ జిల్లాల ఇంఛార్జిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి నియమించారు.

టీడీపీకే ఓటేశాను... అయినా వేధిస్తున్నారు

  ఏపీ రాజధాని అమరావతికి భూమి ఇవ్వలేదని తన ఐదెకరాల పొలంలో చెరుకు పంటను తగలబెట్టారని గుంటూరు జిల్లా మల్కాపురానికి చెందిన రైతు గద్దె చంద్రశేఖర్ వాపోయాడు, తనను పరామర్శించడానికి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపిన గద్దె చంద్రశేఖర్... రాజధానికి పొలం ఇవ్వనందుకు పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, నా పొలంలో నేను షామియానాలు, కుర్చీలు వేసుకుంటే.... కానిస్టేబుళ్లు వచ్చి బలవంతంగా జీపులో ఎక్కించుకుని వేధించారని మాజీ ఎమ్మెల్యే గద్దె రత్తయ్య కుమారుడు చంద్రశేఖర్ వాపోయారు. రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించినందుకే తనపై కక్షగట్టి పోలీసులను ప్రయోగిస్తున్నారని, తాను టీడీపీకే ఓటు వేశానని, అయినా ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు, జగన్ పార్టీకి తాను ఓటు వేయలేదని, అయినా నన్ను పరామర్శించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

మాఫియాడాన్ ఛోటారాజన్ అరెస్ట్

  మాఫియాడాన్ ఛోటారాజన్ అరెస్ట్ అయ్యాడు, భారత్ లో అనేక నేరాలకు పాల్పడుతూ 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఛోటారాజన్ ను ఇంటర్ పోల్ వర్గాలు... ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటించారు, ఒకప్పుడు అండర్ వరల్డ్ ఢాన్ దావూద్ ఇబ్రహీంకి సన్నిహిత సహచరుడైన ఛోటారాజన్... ఆ తర్వాత దావూద్ నే ముప్పుతిప్పలు పెట్టి గట్టి ప్రత్యర్ధిగా మారాడు, దాంతో దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ గ్రూప్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఛోటారాజన్ కి సంబంధించిన సమాచారాన్ని దావూద్ మనుషులే పోలీసులకు చెప్పారని, వాళ్లిచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే ఛోటాను పట్టుకున్నారని అంటున్నారు, 1995 నుంచి ముంబైలో పలు నేరాలకు పాల్పడుతున్న ఛోటారాజన్ కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా భారత నిఘా ఏజెన్సీలు, ముంబై పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇంటర్ పోల్ అతడ్ని అరెస్ట్ చేయడంతో భారత్ కి ఛోటారాజన్ ని డిపోర్ట్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

తోక "చుక్క" తెచ్చింది

వినడానికి కొంచం విడ్డూరంగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని నిజాలు నమ్మక తప్పుదు. అలాంటిదే ఇప్పుడు జరిగింది. అదేంటంటే అంతరిక్షంలో ఆల్కహాల్ ఉత్పత్తి అవడం. అక్కడ ఎవరు ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తున్నారా అని అనుకుంటున్నారా... దీని కారణం లవ్ జాయ్ అనే ఒక తోకచుక్కట. లవ్ జాయ్ అనే తోకచుక్క సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ ను అంతరిక్షంలోకి విడిచిపెడుతోందట.. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని ప్యారిస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిశీతల వాతావరణం కలిగిఉన్న ఈ లవ్ జాయ్ అనే తోకచుక్క ఈ ఏడాది జనవరి 30 న సూర్యుని దగ్గరకు వచ్చిందట. అయితే సూర్యుని వేడికి ఇది సెకనుకు 20 టన్నుల నీటి ఆవిరిని రోదసిలో విడుదల చేయగా దీనిలో 500 బాటిళ్లకు సమానమైన ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి మందుబాబులకు ఈ విషయం తెలిస్తే రాకెట్ వేసుకొని అక్కడికి కూడా వెళిపోతారేమో..

ఉత్తరాది వణికింది, కాశ్మీర్ కూలింది

  అఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ పర్వతాలు కేంద్రంగా ఏర్పడిన భూకంపం ప్రభావం ఉత్తర భారత్ పై పడటంతో నార్తిండియన్స్ వణికిపోయారు, జమ్మూకాశ్మీర్ మొదలుకుని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వరకూ భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు, జమ్మూకాశ్మీర్ పై భూకంప ప్రభావం అధికంగా ఉండటంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తోంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని, ఎక్కడికక్కడ కరెంట్ పోల్స్ కూలిపోయాయని తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్ లో ప్రాణ ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తర భారత్ లో భారీ భూకంపం

  పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది, దాని ప్రభావం భారత్ పైనా పడింది, నార్తిండియాలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి, అఫ్ఘన్ లోని హిందూకుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా ఏర్పడిన ఈ భూకంపం తీవ్రత పాకిస్తాన్ లో 7.7గా నమోదు కాగా, ఉత్తర భారత్ లో అది 7.5గా ఉందని చెబుతున్నారు, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఐదారు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు, ఢిల్లీలో మెట్రోరైల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు, భూకంపం ప్రభావం జమ్మూకాశ్మీర్ లో అధికంగా ఉందని తెలుస్తోంది, భూప్రకంపనల ధాటికి కాశ్మీర్ లో పలు భవనాలు ధ్వంసమయ్యాయని వార్తలు అందుతున్నాయి.

రఘువీరాపై జేసీ వ్యాఖ్యలు.. రెండుసార్లు దెబ్బలు తిన్నాడు.. మూడోసారి నేను కొడతా

  సంచలన వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తరువాతే ఎవరైనా. అది ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయనకు అలవాటు. అసలే కోపం ఎక్కువ అలాంటిది జేసీ జోలికి వెళితే ఎలా ఉంటుందో.. రఘువీరారెడ్డిని చూస్తే తెలుస్తుంది. తాజాగా ఆయన లంచం తీసుకుంటున్నా అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసి అందరూ షాకయ్యేలా చేశారు. దీనికి రఘువీరా రెడ్డి స్పందించి ఆయనపై విమర్శలు చేయడం.. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రివర్స్ లో ఆయనేమి సత్య హరిశ్చంధ్రుడు కాదు.. ఆయన జీవితంలో ఎప్పుడూ లంచాలు తీసకోలేదా అంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు జేసీ రఘువీరారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తాను మాట్లాడాలనుకుంటే ఎవరి గురించైనా మాట్లాడుకోవచ్చని.. తన గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోనని.. బట్టలు ఊడదీసి కొడతానని హెచ్చరించారు. అంతేకాదు ఇప్పటికే రెండుసార్లు ప్రజల చేతిలో దెబ్బలు తిన్న రఘువీరా రెడ్డి.. మూడోసారి తన చేతిలో తన్నులు తినాల్సి వస్తుందని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు సంపాదించిన దానిలో 20 శాతం పిల్లాడైన జగన్ తింటే.. మిగిలిన 80శాతం రఘువీరారెడ్డి లాంటివారు తిన్నారని విమర్శించారు. మొత్తానికి జేసీ జోలికి వస్తే ఎలా ఉంటుందో రఘువీరాకి ఇప్పటికే అర్ధమైఉంటుంది.

వీధుల్లోనే ఎక్కువ గడుపుతున్న జగన్

వైకాప అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ కు మరో వార్త పిడుగులా ఆయన మీద పడింది. ఆ పార్టీలోని ఇద్దరు నేతలు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఆలోచించేలోపే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు దీనిపై ఆందోళనలు చేయడానికి బయల్దేరారు వైకాపా శ్రేణులు. అంతేకాదు రాజధాని ప్రాతం తుళ్లూరులోనూ.. ఉద్దండరాయుని పాలెంలోనూ రైతులతో సమావేశం కానున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం జగన్ ను ఇంట్లో కంటే వీధుల్లోనే ఎక్కువ గడిపేలా చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. దానికి జగన్ ఆందోళనలు.. నిరసనలు అంటూ వీధులకెక్కడం ఇదే సరిపోతుంది. మరి పార్టీ గురించి ఎప్పడు ఆలోచిస్తాడు.. పార్టీ బలోపేతానికి ఏం చేస్తాడు అని పలు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వరంగల్ ఉపఎన్నిక.. టీడీపీ బీజేపీకే ఆ ఛాన్స్ ఇవ్వనుందా?

  వరంగల్ ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే ఈ ఉపఎన్నికకు టీటీడీపీ.. బీజేపీ పార్టీలు తమ అభ్యర్ధులను బరిలోకి దింపడానికి పోటీపడుతున్న సంగతి తెలసిందే. దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో శాసనసభ స్థానానికి.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను టీడీపీ బీజేపీ తరుపున మిత్రధర్మం పాటించిందని.. ఇప్పుడు బీజేపీ కూడా మిత్రధర్మ పాటించాలని సూచించారు. అయితే ఇప్పుడు టీడీపీ ఈ విషయంలో కొంచం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది.. ఈ పరిస్థితిలో పోటీ చేయడం.. ఒకవేళ పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని భావించి ఆ అవకాశం బీజేపీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో అనవసరమైన తప్పుల్ని చేయకూడదన్న లక్ష్యంతోనే వరంగల్ ఉఫ ఎన్నికకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఉపఎన్నికు బీజేపీ ముగ్గురు పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది.. వారిలో డాక్టర్ పంగిడి దేవయ్య.. డాక్టర్ రాజమౌళి.. డాక్టర్ ఎ. చంద్రశేఖర్ లు ఉన్నారు.

ప్రియాంకని హీరో.. రాహుల్ ని జీరో చేస్తున్న కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరికీ తెలుసు కానీ.. ఏ ఒక్కరూ బయటకు చెప్పే సాయసం చేయరు సరికదా.. తన శక్తి సామర్థ్యాల గురించి సోనియమ్మ దగ్గర ప్రశ్నించే ధైర్యం చేయరు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏదో చేసేస్తాడని భావించిన రాహుల్ గాంధీని హీరోని చేస్తూ తెగ పొగిడిన నాయకులకు.. ఆ ఎన్నికల్లో రాహుల్ ఘోర పరాజయం అవ్వడం వలన ఆ హీరోకి అంత సీన్ లేదని అర్ధమయింది. ఆ తరువాత విశ్రాంతి పేరిట కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ వచ్చిన రాహుల్ ఏమైందో ఏమో తెలియదు కాని కొన్ని రోజులు హడావుడి చేశారు. కానీ ఆ హడావుడి గురించి కొన్ని రోజులు చెప్పుకున్న దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి చిన్నచిన్నగా మారుతుంది. ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీని సీన్ లోకి ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు.. అప్పట్లో ఇందిర తన రాజకీయ వారసురాలిగా ప్రియాంకగాంధీనేనని చెప్పేవారని ఆయన వెల్లడించారు. ఆయన అలా వ్యాఖ్యానించిన తరువాత ఇంకో నేత ఎం.ఎల్. ఫోతేదార్ కి కూడా ధైర్యం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆయన కంటే కాస్త ఘాటుగానే రాహుల్ గాంధీని విమర్శించారు. రాహుల్ కు పార్టీ పగ్గాలు ఇవ్వటానికి పార్టీలో చాలామంది ఒప్పుకోవటం లేదని.. పార్టీ అధ్యక్ష పదవి కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా రాహుల్ సరైన వ్యక్తికాదని వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్క ప్రియాంక గాంధీని హీరోని చేసే క్రమంలో పాపం రాహుల్ గాంధీని జీరో ని చేస్తున్నారు పార్టీ నేతలు. మరి ఈ విషయంలో అమ్మ సోనియా గాంధీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

పార్టీ పరువు తీస్తున్నారు.. చంద్రబాబు

వరంగల్ ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో టీ టీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో దూషించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జరిగిన గొడవ గురించి చంద్రబాబు ఫోన్ చేసి తెలుసుకోగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. ఈసందర్బంగా చంద్రబాబు పార్టీ నేతలపై మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నికల సందర్బంగా ఈ గొడవలు ఏంటి.. పార్టీ పరువును తీస్తున్నారు అని పార్టీనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా సోమవారం నాడు నేతలను విజయవాడ రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ నేతలందరూ ఒకటై రేవంత్ రెడ్డిని ఒంటరి వాడిని చేశారన్న ఆరోపణలపై..  గొడవ పడకుండా రేవంత్‌రెడ్డికి సహకరిస్తూ పార్టీ కార్యక్రమాలను కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని ఆగ్రహంగా చెప్పారని సమాచారం. కాగా తనపై నేతలు ప్రవర్తిస్తున్న తీరును.. నేతలు తనను అవమానిస్తున్నా, దూషిస్తున్నా పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డు చెప్పలేదని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో మూడు రోజులు మకాం దేనికో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఎదుర్కొనే ప్రశ్న ఆయన డిల్లీ పెద్దలతో ఎందుకు దూరంగా ఉంటున్నారని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన చాలా తక్కువ సార్లు డిల్లీ వెళ్ళారు. ఆయన కేంద్రప్రభుత్వంతో కూడా గొడవలు పెట్టుకొంటూ, దానికి దూరంగా ఉంటున్నందునే తెలంగాణా రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆయన డిల్లీ వెళ్లి అక్కడే మూడు రోజులు మకాం వేయబోతున్నట్లు తెలియగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. సీబీఐ కేసు మెడకు చుట్టుకోగానే దానిని వదిలించుకోనేందుకే ఆయన డిల్లీలో పెద్దలను కలిసేందుకు వెళుతున్నారని అందుకే అక్కడ ఆయన మూడు రోజులు మకాం వేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   రేపు డిల్లీలో జరుగబోయే నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ డిల్లీ బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో సమావేశం అవుతారని సమాచారం. తెలంగాణాకు కేంద్రం విడుదల చేయవలసిన నిధులు, వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన వారితో చర్చిస్తారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ లో చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చిన వివేక్

మాజీ ఎంపీ వివేక్ టీఆరెస్ లోకి చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్ ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున పోటీ చేయమని మంత్రి హరీశ్ రావు అడిగినట్టు, దానికి వివేక్ కూడా సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆవార్తలకు బ్రేక్ వేశారు వివేక్. తానే స్వయంగా మీడియా ముందుకొచ్చి ''నేను టీఆరెస్ లో చేరబోవడం లేదు.. కాంగ్రెస్ ను వీడడం లేదు'' అని క్లారిటీ ఇచ్చారు. దీంతో టీఆరెస్ లో ఆయన చేరిక లేనట్లేనని తేలిపోయింది. అంతేకాదు.... వివేక్ ను చేర్చుకుని వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావిస్తున్న టీఆరెస్ ఇప్పుడు కొత్త అభ్యర్థిని వెతుక్కనే పనిలో పడింది. కాగా ఇప్పుడు మరో అనుమానం వ్యక్తం అవుతుంది. వివేక్ టీఆర్ఎస్ ఆఫర్ చేసిన ఎంపీ సీటు మంచిదేనని.. మరి ఎందుకు వివేక్ ఈ అవకాశాన్ని వదులుకున్నారో అని.. బహుశా ఆయనకు అధిష్టానం ఫోన్ చేసి ఇంకా ఏదో మంచి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మరి ఏం జరిగిందో వివేక్ కే తెలియాలి.

రఘువీరాకి జేసీ కౌంటర్.. ఆయన ఏమి సత్య హరిశ్చంద్రుడు కాదు

  జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. వాళ్లు అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా చాలా దర్జాగా.. ఎలాంటి బెదురు లేకుండా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వారు.. తాజాగా తాము లంచం తీసుకుంటామని.. ఆ వచ్చిన డబ్బుతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దీనికి ఏపీ కాంగ్రెస్ రథసారధి రఘేవీరా వెంటనే స్పందించి విమర్శలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరుకుంటారా ఆయన కూడా రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు.  రఘవీరా ఏమీ సత్య హరిశ్చంద్రుడేమీ కాదన్నారు. రఘువీరా తన జీవితంలో ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదా? అని సూటిగా ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులతో రఘువీరా నీలకంఠాపురం వచ్చి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. మొత్తానికి జేసీ మీద వ్యాఖ్యలు చేసిన రఘువీరాను జేసీ చాలా తెలివిగా ఇరికించారు. మరి జేసీ సవాల్ కు రఘువీరా వివరణ ఇస్తారో లేదో చూడాలి.