భారత్... ఏపీ వైపు చూస్తోంది-వెంకయ్య

  అభివృద్ధి విషయంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు, అమరావతి శంకుస్థాపన వేదికపై నుంచి మాట్లాడిన వెంకయ్య... ప్రపంచంలోనే అద్భుత రాజధానిగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు, అభివృద్ధిలో ప్రజలంతా భారతదేశం వైపు చూస్తుంటే, భారత్ మాత్రం హైదరాబాద్ వైపు, ఏపీ వైపు చూస్తుందని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్... పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో పోటీ పడాలన్న వెంకయ్యనాయుడు....పరిపాలన సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు ప్రజలంతా కలిసుండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ ఒక వేదిక పైకి రావడం సంతోషకరమని, కేసీఆర్, చంద్రబాబులు ప్రజలకు మంచి మార్గాన్ని చూపారని అన్నారు. ప్రభుత్వం, ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ రాజధాని నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు వెంకయ్యనాయుడు

కేసీఆర్ మాటలకు జైకొట్టిన ఆంధ్రులు

  అమరావతి శంకుస్థాపన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తారని ఆహ్వానించగానే ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది, కేసీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు ఏపీ ప్రజలు పాజిటివ్ గా స్పందించారు, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మాణం కావాలంటూ కేసీఆర్ చెప్పగానే హర్షధ్వానాలు చేశారు, అలాగే అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం... అన్ని సహాయ సహాకారాలు అందిస్తుందని ప్రకటించిన కేసీఆర్... తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఏపీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగులో మాట్లాడిన సింగపూర్ మంత్రి

  ఏపీ నూతన రాజధాని అమరావతికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శుభాకాంక్షలు తెలియజేశారు, అక్కడక్కడా తెలుగులో మాట్లాడుతూ దసరా శుభాకాంక్షలు చెప్పిన ఈశ్వరన్... ఆంధ్రులను ఆకట్టుకున్నారు, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందని, ఏడాది క్రితమే చంద్రబాబు తన విజన్ గురించి వివరించారని, అందుకే అమరావతి మాస్టర్ ప్లాన్ చేసిచ్చామని అన్నారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ పెద్దలు, ప్రజల మద్దతుతో సింగపూర్‌ సంస్థలు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాయని, దీన్ని జులైలోనే ఏపీకి అందజేశామని ఈశ్వరన్ తెలిపారు, సింగపూర్‌ ప్రధాని, ప్రజల తరపున ఏపీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈశ్వరన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

అమరావతికి అండగా ఉంటాం-కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తన శుభాకాంక్షలు తెలియజేశారు, కేసీఆర్ ప్రసంగిస్తారని వ్యాఖ్యాతలు చెప్పగానే ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది, కేసీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రజలు తమ సంతోషాన్ని తెలిపారు, కేసీఆర్ మాటలకు ప్రతిస్పందిస్తూ జయధ్వానాలు చేశారు, విజయదశమి రోజు శంకుస్థాపన చేసుకున్న అమరావతి విజయవంతంగా ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మాణం కావాలంటూ కేసీఆర్ చెప్పగానే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది, అలాగే అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం... అన్ని సహాయ సహాకారాలు అందిస్తుందని కేసీఆర్ ప్రకటించారు, చివరిగా ఏపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

ఆంధ్రుల మనసు గెలుచుకున్న మోడీ

  నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ.. తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు, శంకుస్థాపన చేయడమే కాకుండా చంద్రబాబు ప్రారంభించిన 'మన నీరు మన మట్టి' కార్యక్రమంలో నేనుసైతం అంటూ పార్లమెంట్ ప్రాంగణం నుంచి తీసుకొచ్చిన మట్టిని, యమునానది నుంచి సేకరించిన పవిత్ర జలాలను చంద్రబాబుకి అందించారు, శ్రీశ్రీ కవితను ప్రత్యేకంగా ప్రస్తావించిన మోడీ... అక్కడక్కడా తెలుగులో మాట్లాడుతూ ఆహుతులను ఆకట్టుకున్నారు, ప్రజారాజధాని అమరావతి కోసం పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టిని, యమునానది నుంచి పవిత్ర జలాలను తీసుకురావడం ద్వారా ఆంధ్రుల మనసులను ప్రధాని మోడీ గెలుచుకున్నారు.

చంద్రబాబు మనుమడిని ముద్దాడిన ప్రధాని నరేంద్ర మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన వేదిక వద్దకు చేరుకొన్నారు. మొదట ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరావతి చిత్ర ప్రదర్శను తిలకించారు. ఆ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే ఉన్న నారా లోకేష్ చేతిలో ఉన్న దేవాన్ష్ తో కాసేపు ముద్దులాడారు. ఆయన తన కళ్ళద్దాలను తీసి ఆ పిల్లాడికి పెట్టి ఆడించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, నారా లోకేష్ దంపతులు కలిసి ఆయనతో ఫోటో దిగారు. తరువాత ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి అమరావతి విశేషాలను, తను దానిని ఏవిధంగా నిర్మించబోతున్నారో వగైరా వివరాలతో కూడిన 3డి చిత్రాలను చూపించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

గన్నవరంలో మోడీకి ఘనస్వాగతం

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఘనస్వాగతం పలికారు, పుష్పగుచ్చాలు, పట్టు శాలువాలతో మోడీని చంద్రబాబు సత్కరించారు, ఉదయం పదకొండున్నర సమయంలో భారత వాయుసేన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చిన మోడీ... సెక్యూరిటీ చెకింగ్స్ అనంతరం కిందికి దిగారు, తెల్లని వస్త్రాలు, బూడిద రంగు కోటు ధరించిన మోడీ... చాలా హుందాగా, శోభాయమానంగా కనిపించారు, అనంతరం మోడీ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతి ప్రాంతానికి వచ్చారు, మోడీ ప్రయాణించిన హెలికాప్టర్ ను మరో మూడు హెలికాప్టర్లు అనుసరించాయి, అత్యాధునికమైన ఈ హెలికాప్టర్లు రాడార్ సిస్టమ్ ద్వారా మోడీ భద్రతను పర్యవేక్షిస్తాయి

అమరావతిలో సినీ ప్రముఖుల సందడి

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ దంపతులతోపాటు హీరో వెంకటేష్‌, కృష్ణంరాజు, సినీనటులు సాయికుమార్‌, సుమన్‌లు తరలివచ్చారు. సినీనటుల రాకతో అమరావతి ప్రాంగణం కోలాహలంగా మారింది. మరోవైపు తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు క్యూకట్టడంతో అమరావతి పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి, ముఖ్యంగా రాయలసీమ నుంచి జనం బారులు తీరారు, అమరావతి శంకుస్థాపనకు తరలివస్తున్న అశేష జనవాహినికి, అతిథులకు స్వాగతం పలుకుతున్న మంత్రి నారాయణ... సభాప్రాంగణం దగ్గర ఉంటూ పర్యవేక్షిస్తున్నారు,

ఉద్దండరాయుని పాలెం చేరుకొన్న ప్రధాని, ప్రముఖులు

  ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికేరు. ఆయన హెలికాఫ్టర్లో వేదిక వద్దకు చేరుకొంటారు.   బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, తెలుగు సినీ పరిశ్రమ నుంచి కృష్ణం రాజు, వెంకటేష్, సుమన్, అలీ, చలపతి, ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్ తో సహా నందమూరి కుటుంబానికి చెందిన 50మంది సభ్యులు ఈ కార్యక్రమానికి తరలివచ్చేరు.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఆయనతో బాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, నామా నాగేశ్వర రావు తదితరులు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చేరు.   కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి వేదిక వద్దకు చేరుకొన్నారు.ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు సతీ సమేతంగా వచ్చేరు. ముంబై కి చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేదిక వద్దకు తమకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో చేరుకొంటున్నారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయిన అతిధులను, లక్షలాది ప్రజలను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు శివమణి డ్రమ్ బీట్స్ తో మొదలయ్యాయి.

మా జన్మ ధాన్యం అయ్యింది: సాయి కుమార్, సునీత

  అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా పాల్గొనేందుకు తమకు అవకాశం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని యాంకరింగ్ చేయబోతున్న డబ్బింగ్ కింగ్ సాయి కుమార్, సునీత చెప్పారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరుగకుండా ఆశించిన దానికంటే గొప్పగా యాంకరింగ్ చేసేందుకు గత రెండు రోజులుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నామని వారు తెలిపారు.   ఇటువంటి అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని సాయి కుమార్ అన్నారు. అవకాశం రావడానికి అమరేశ్వరుని ఆశీస్సులే కారణం. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇది మన ఇంటి పండుగ మన అందరి పండుగ. అమరేశ్వరుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను అని గాయని సునీత అన్నారు.