రష్యా విమానాన్ని కూల్చివేసిన ఐసిస్ ఉగ్రవాదులు?

  రష్యాకు చెందిన నెంబర్: 9268 విమానం ఈజిప్టులో సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో ఈరోజు ఉదయం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 217 మంది ప్రయాణికులు 7 మంది విమాన సిబ్బంది కలిపి మొత్తం 224మంది ఉన్నట్లు సమాచారం. వారందరూ ఈ మరణించి ఉండవచ్చని ఈజిప్ట్, రష్యా దేశాలు భావిస్తున్నాయి. ఈజిప్టు స్థానిక కాలమాన ప్రకారం ఇవ్వాళ్ళ ఉదయం 06:51గంటలకు షర్మ్-అల్-షేక్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఫ్లయిట్ నెంబర్: 9268 విమానం, టేక్-ఆఫ్ తీసుకొన్న23 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం ఈజిప్టు నుండి బయలుదేరి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో గల పుల్కొవ్ విమానాశ్రయానికి 12:10 గంటలకు చేరుకోవలసి ఉంది. కానీ సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో కూలిపోయినట్లు ఈజిప్ట్ ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ కార్యాలయం ద్రువీకరించింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై రష్యా దాడులు చేస్తునందున వారు అందుకు ప్రతీకారంగానే ఈ విమానాన్ని కూల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ వార్తలను ఇంకా దృవీకరించలేదు. ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఇంత వరకు దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.

హైదరాబాద్ లో ఉంది.. మరి ఏపీలో ఎక్కడ?

  ఈ మధ్య కాలంలో ఏ చిన్న విషయానికైనా ధర్నాలు చేయడం కామన్ అయిపోయింది. మరి అలాంటి ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ చేస్తే అటు అధికారులకూ.. ఇటు ప్రజలకూ ఇబ్బందే. అందుకే గతంలో దీని గురించి ఆలోచించే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని భావించి అందుకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఏర్పాటుచేశారు. అయితే అది అప్పటి సంగతి.. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది.. ఎపీలో కూడా ధర్నాలు ఎక్కువయ్యాయి. మరి ఏపీకి కూడా ధర్నా చౌక్ ఉండాలి కదా.. ఇప్పుడు దీని గురించి కసరత్తు జరుగుతుంది. మొన్నటి వరకూ అయితే విజయవాడలోని బందరు రోడ్డులో సబ్ కలెక్టరేట్ ఎదుట విక్టోరియా మ్యూజియం ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి ఉంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు పాలన విజయవాడ నుండి పాలించడం మొదలు పెట్టారో.. అప్పుడు సీఎం క్యాంపు కార్యాలయాన్ని జల వనరుల శాఖ ఆవరణలో ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ విధించడంతో బందరు రోడ్డు ప్రాంతంలో ధర్నాలు, ర్యాలీలకు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ధర్నా చౌక్ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ కసరత్తు చేపట్టింది. అంతేకాదు సీఎం క్యాంప్ కార్యాలయానికి దూరంగా ట్రాఫిక్ సమస్య తలెత్తని చోట ధర్నా చౌక్ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. దీనిలో భాగంగా సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ కు వెళ్లే రోడ్డుకు బిఆర్ టిఎస్ రోడ్డుకు మధ్య ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ధర్నా చౌక్ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.

మళ్లీ భూసేకరణ.. వెలిసిన పవన్ ఫ్లెక్సీలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను భూసేకరణకు వ్యతిరేకమని.. రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కుంటే పోరాడతామని గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం కూడా కాస్త వెనక్కి తగ్గి భూసేకరణను ఆపింది. అయితే ఇప్పుడు మళ్లీ భూసేకరణపై వివాదాలు తలెత్తుతున్నాయి. ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ భూసేకరణ గురించి మాట్లాడటం.. నవంబర్ మొదటి వారంలో భూసేకరణ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చాంశనీయమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తెరమీదకి వచ్చాయి. ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండలాల రైతలు తమ భూములు ఇవ్వబోమంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తుళ్లూరు మండలంలో ఉన్న 300 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని ప్రకటించడంతో ఇప్పుడు తుళ్లూరు రైతులు కూడా వారికి జతకట్టనున్నారు. దీనిలో భాగంగానే అప్పుడే మంగళగిరి మండలం నవులూరు, ఎర్రబాలెం, కురగల్లు గ్రామాల రైతులు జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రాజధాని మండలాల్లో అలజడి రేగింది. కాగా ఇప్పటికే రాజధాని భూముల నేపథ్యంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కి, పవన్ కళ్యాణ్ కు విభేధాలు తలెత్తాయన్న దానిలో సందేహం లేదు. మరోసారి ఈ వివాదం తెరపైకి రావడంతో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో.. ఈసారి ఎలాంటి విభేధాలు తలెత్తుతాయో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోయినసారి పవన్ కళ్యాణ్ మాట మేరకు ప్రభుత్వం భూసేకరణను నిలిపింది.. మరి ఈసారి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది.. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అసలు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

మోడీని కలవడానికి ఆరాటపడుతున్న కేసీఆర్.. అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు కేంద్రానికి.. మోడీకి చాలా దూరంగా.. అంటీముట్టనట్టు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. ఇప్పుడు కేసీఆర్ మోడీని కలవడానికి తెగ ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ ఢిల్లీ పర్యటనలోనే ఉన్న కేసీఆర్ కు మోడీని కలిసే అవకాశం దక్కలేదు. కావాలనే అపాయింట్ మెంట్ ఇవ్వలేదో.. లేకపోతే నిజంగానే టైమ్ లేక ఇవ్వలేదో తెలియదు కాని మోడీని కలిసే ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వలేదు. అయితే మళ్లీ కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 3 నుండి 5 వరకూ ఢిల్లీలోనే పర్యటించి..మోడీని కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతలా కేసీఆర్ మోడీని కలవడానికి ఎందుకు ఆరాటపడుతున్నారా అని అప్పుడే సందేహాలు మొదలయ్యాయి. ఒకవైపు నవంబర్ 3 - 4 తేదీల్లో ఢిల్లీలో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశాలకు హాజరు కావడానికే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నా మరో వైపు ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. గత కొద్ది రోజుల కిందట కేసీఆర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న కేసీఆర్ ఆశాఖలో జరిగిన కొన్ని అవకతవకలు కారణంగా సీబీఐ కేసీఆర్ ను ప్రశ్నించింది. దీనికి తోడు మళ్లీ సహారా సంస్థ నుండి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో వీటి గురించే మోడీతో మాట్లాడేందుకే కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పాపం ఇన్ని రోజులు కేంద్రంతో కోపంగా ఉన్న కేసీఆర్ కి ఇప్పుడు కేంద్రంతోనే పనిబడింది. మరి మోడీ ఈసారైనా కేసీఆర్ ను కరుణిస్తారో? లేదో?

వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు

వరంగల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్ధి పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రకటించింది. టీఆర్ఎస్ తరుపున ఈ ఉపఎన్నికు పోటీ చేసే అభ్యర్ధిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు. ఢిల్లీ నుండి వచ్చిన కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమై అన్ని విధాలా చర్చించి దయాకర్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడి వరకూ బానే ఉన్నా నిన్న మొన్నటి వరకూ టికెట్ తనకే వస్తుందని భావించిన గుడిమళ్ల రవికుమార్.. తనను కాదని కేసీఆర్ దయాకర్ కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు మొదటి నుండి టికెట్ తనకే ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకూ న్యాయం అంటూ తన సన్నిహితుల దగ్గర ఆరోపించడంతో కేసీఆర్ రవికుమార్ ను బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్లనే రవికుమార్ టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని.. పార్టీలో కీలక పదవి ఇస్తానని.. నిరాశ పడాల్సిన అవసరం లేదని రవికుమార్ కు హామీ ఇచ్చారంట. కాగా పసునూరి దయాకర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ.. పార్టీకోసం పనిచేస్తూ.. ప్రస్తుతం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా పనిచేశారు.

కేంద్రమంత్రిగారి కోరిక సూపర్..

  కోరికలు ఎవరికైనా ఉంటాయి అది మానవ సహజం.. కానీ వాటిని తీర్చుకోవాలంటేనే కొంచం కష్టపడాల్సి వస్తుంది. సాధారణంగా ఎవరి స్థాయిని బట్టి వారికి కొన్ని కోరికలు ఉంటాయి.. కానీ ఇక్కడ ఓ కేంద్రమంత్రి తన స్థాయికి తగ్గ చిరకాల వాంఛని ఒకటి బయటపెట్టారు. అది వింటే ఎవరైనా వావ్ అనాల్సిందే. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి కోరిక ఏంటంటే.. దుబాయ్ బీచ్ ఒడ్డున ఉన్న బూర్జ్ ఖలీఫాకు అంతర్జాతీయంగా అన్నింటికంటే ఎత్తైన భవనం అని అందరికి తెలిసిందే. అయితే ఈ భవనాన్ని మించిన భవనం చూడాలన్నదే నితిన్ గడ్కరి కోరికట. అంతేకాదు అందులో ఏముండాలో కూడా మంత్రిగారు చెప్పుకొచ్చారు. ఆ భారీ భవనంలో 30 అంతస్తులు మీటింగ్స్ కోసం ఉండాలట.. ఇంకో 30 అంతస్తులు రెస్టారెంట్లు.. మరో 30 అంతస్తులు హోటల్స్.. ఇంకో 20 అంతస్తులు షాపింగ్ కోసం.. అయితే దీనితో పాటు ఇంత బిల్డింగ్ ఉన్నప్పుడు అందుకు అనువైన పార్కింగ్ కూడా ఉండాలట. మొత్తానికి గడ్కరి కోరిక వినడానికి చాలా బావున్న అది కట్టేది ఎవరు.. తను చూసేది ఎప్పుడు.

జి.హెచ్.ఎం.సి.కమీషనర్ సోమేశ్ కుమార్ బదిలీ!

  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ 22 మంది ఐ.ఏ.ఎస్‌. అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు. నిన్న బదిలీ అయిన వారిలో జీ.హెచ్‌.ఎం.సీ. కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, జి.హెచ్.ఎం.సి. స్పెషల్‌ కమిషనర్లు నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌ లు కూడా ఉన్నారు. జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఓటర్ల జాబితా సవరణ పేరిట 6,32,000 మంది ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడంతో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేసేందుకు డిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌ సీఈవో సునీల్‌ గుప్తా నేతృత్వంలో 14 మంది అధికారులను హైదరాబాద్ కు పంపింది. వారు నిన్న క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో ఓటర్ల జాబితా సవరణలో చాలా అవకతవకలు జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జీ.హెచ్‌.ఎం.సీ. కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, జి.హెచ్.ఎం.సి. స్పెషల్‌ కమిషనర్లు నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌ లను నిన్న రాత్రే బదిలీ చేయడం గమనార్హం. సోమేశ్ కుమార్ ని గిరిజన సంక్షేమ శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమించింది.

తెరాస అభ్యర్ధిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు

  వరంగల్ ఉప ఎన్నికలకు మిగిలిన అన్ని పార్టీల కంటే ముందుగా తెరాస తన అభ్యర్ధిని ఖరారు చేసింది. తెరాస ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలలో, తెలంగాణా ఉద్యమాలలో ఆయన చాలా చురుకుగా పాల్గొన్నారు. గతంలో ఆయన యువజన విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట రవికుమార్ పేరు ప్రతిపాదించారు. అయితే ఆయన కులం విషయంలో కొన్ని సందేహాలు ఉండటంతో ఆయన స్థానంలో పసునూరి దయాకర్ పేరు ఖరారు చేసారు. పసునూరి దయాకర్ ని తెరాస అభ్యర్ధిగా రేపు కేసీఆర్ ప్రకటించవచ్చునని సమాచారం. వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు వచ్చే నెల 21వ తేదీన జరుగుతాయి. 24వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.

రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే

  కృష్ణా డెల్టాలో సాగునీటి ఎద్దడి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చిక్కులు తెచ్చిపెడుతోంది, గతంలో ఎన్నడూలేనివిధంగా సాగునీరు అందక పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో కృష్ణా డెల్టాలో పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేపై ఒత్తిడి పెరుగుతోంది, నీళ్ల కోసం రైతులు నిలదీస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అధికార పార్టీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు, దాంతో సాగునీటి సమస్యపై కొందరు ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్తున్నారు, ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు... నీటిపారుదలశాఖ అధికారులపై మండిపడ్డారు, కృష్ణా డెల్టాలో సాగునీటి ఎద్దడిని తీర్చకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరిస్తున్నారు, సాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతానని, అయినా పరిష్కారం కాకపోతే అప్పుడు రాజీనామాపై ఆలోచిస్తానని పెడన ఎమ్మెల్యే అంటున్నారు.

బైక్ ఎందుకు ఎక్కుతుందని డౌట్ ఉండేది... కానీ

  అనూహ్య రేప్ అండ్ మర్డర్ కేసులో దోషిగా తేలిన క్యాబ్ డ్రైవర్ చంద్రభాన్‌కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడేలా ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. చంద్రభాన్ ను తాను చూసినప్పుడు అతనికి తప్పు చేశానన్న బాధ గానీ, భయం గానీ కనబడలేదన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తుపై మొదట్లో కొన్ని అనుమానాలు ఉండేవని, అనూహ్య అసలు ఎందుకు బైక్ ఎక్కుతుంది, అంతదూరం ఎందుకెళ్తుందని డౌట్ వచ్చిందన్నారు. అయితే ముంబై పోలీసులు తాము సేకరించిన సాక్ష్యాలను గురించి తనకు వివరించడంతో నమ్మకం కుదిరిందన్నారు, చంద్రభాన్ తాను క్యాబ్ డ్రైవర్ నని, తనకు కారు ఉందని చెప్పడంతోనే ఆమె రెండో ప్లాట్ ఫాం నుంచి నాలుగో ప్లాట్ ఫారం వచ్చిందన్నారు, అయితే తన సామాన్లు పోతాయనే భయంతోనే అనూహ్య బైక్ పై వెళ్లి ఉంటుందని ఆమె తండ్రి ప్రసాద్ అన్నారు, ఇలాంటి క్రూర మనస్తత్వం కలిగిన వాళ్లకి ఇలాంటి ఉరిశిక్షలు వేయకపోతే మహిళలపై అఘాయిత్యాలు మరింత పెరిగిపోతాయని, నాలుగురోజులు జైల్లో ఉంటే సరిపోతుందిలే అనుకుంటారని అనూహ్య తండ్రి అభిప్రాయపడ్డారు.

నేను ఇప్పుడే బీఫ్ తింటా.. ఎవరేం చేస్తారు.. కర్ణాటక సీఎం

  గత కొద్దిరోజుల నుడి దేశ వ్యాప్తంగా బీఫ్ మాంసంపై పెద్ద పెద్ద వివాదాలే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదాల వల్ల చాలా మంది నేతలపై విమర్శలు.. కొంతమందిపై దాడులు కూడా జరిగిన సంగతి మనకు విదితమే. అయితే ఇప్పుడు ఈ వివాదాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను ఇంతవరకూ బీఫ్ ఎలా ఉంటుందో తినలేదని.. వీరు చేసే దానికి ఇప్పుడు బీఫ్ మాంసం తింటానని.. ఇప్పటికిప్పుడు తెచ్చుకుని తింటే ఎవరేం చేస్తారని సవాల్ విసిరారు. బెంగుళూరు టౌన్ హాల్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఏం తినాలన్నది అది తన ఇష్టమని.. ఒకరు తినే స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని.. ఎవరి ఇష్టం వచ్చింది వారు తింటారని వ్యాఖ్యానించారు. కాగా రెండు రోజుల క్రితం ఢిల్లీలోని కేరళ అతిధి గృహంలో బీఫ్ అమ్ముతున్నారంటూ పోలీసులు తనిఖీలు చేయడంతో అక్కడ పెద్ద దుమారమే రేగింది. పోలీసులు చేసిన తనిఖీలకు కేరళ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గెస్ట్ హౌస్‌లో ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పడానికి మీరెవరంటూ సూటిగా నిలదీశారు. ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నది పోలీసులా లేదంటే బీజేపీ కార్యకర్తలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనూహ్య కేసులో చంద్రభాన్ కు ఉరిశిక్ష

  కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య రేప్ అండ్ మర్డర్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనూహ్యపై అత్యాచారం చేసి హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ చంద్రభాన్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది, 2014 జనవరి 4న ముంబై రైల్వేస్టేషన్ నుంచి అనూహ్యను బైక్ పై తీసుకెళ్లిన చంద్రభాన్... మార్గమధ్యంలో ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు, అయితే ముంబై రైల్వేస్టేషన్లో దిగిన అనూహ్య ఏమైందో తెలియక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టడంతో చంద్రభాన్ దురాగతం బయటపడింది, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు... ముంబై రైల్వేస్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నారు, ఇంటరాగేషన్లో చంద్రభాన్ చెప్పిన సమాచారం ఆధారంగా కుళ్లిపోయిన స్థితిలో అనూహ్య డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు... బ్యాగ్, ఐడీ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు, దాదాపు ఏడాదిన్నరపాటు ఈ కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు... చంద్రభాన్ ను దో్షిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది.

జెరుసలేం మత్తయ్య.. చంద్రబాబు, కేసీఆర్ నావల్లే కలిశారు..

  ఇప్పటికే అవరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ను పిలవడం.. కేసీఆర్ కూడా మాట తప్పకుండ రావడం.. కేసీఆర్ ను చంద్రబాబు జాగ్రత్తగా చూసుకోవడం పై పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరూ కలవడం ఒకరకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంతోషానిచ్చినా.. రాజకీయ నేతలు మాత్రం వారి ధోరణిలో ఆలోచిస్తూ వీరిద్దరూ ఎందుకు కలిశారు.. కలిసి ఏం మాట్లాడుకున్నారు లాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరూ ఎవరి ఆలోచనలో వాళ్లు ఉండగా జెరుసలేం మత్తయ్య మాత్రం వీరిద్దరు కలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెరుసలేం మత్తయ్యం ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ తాను తన  క్రైస్తవ సోదరులూ కలిసి ప్రార్థనలు చేసిన కారణంగానే ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత ఏర్పడిందని అన్నారు. తమ ప్రార్ధనల వల్లే సీఎంల ఇద్దరి మద్య కొత్తగా స్నేహం చిగురించిందని అన్నారు. అంతేకాదు తమ ప్రార్ధనల వల్లే రెండు ప్రభుత్వాలు ఓటుకు నోటు కేసు నుండి బయటపడ్డాయని.. కేసీఆర్ - చంద్రబాబు - కేటీఆర్ ముగ్గురూ జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు - క్రైస్తవుల సంక్షేమానికి ఇద్దరు సీఎంలూ కృషి చేయాలని కూడా మత్తయ్య డిమాండ్ చేసాడు.

లోకేష్ స్నేహితుడు అభీష్టపై మళ్లీ ఆరోపణలు

  టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్నేహితుడు అభీష్టపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు, నిబంధనలకు విరుద్ధంగా అభీష్టను సీఎం చంద్రబాబు పేషీలో ఓఎస్డీగా నియమించారని ఆరోపించిన రఘువీరా.... లోకేష్ స్నేహితులు, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు, అభీష్టతోపాటు మరికొందరు లోకేష్ సన్నిహితులు... బినామీ కంపెనీల పేరుతో ప్రభుత్వ ధనాన్ని తమ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అమరావతి శంకుస్థాపన ఏర్పాట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ కూడా అభీష్ట కనుసన్నల్లో నడుస్తున్నదేనని ఆయన ఆరోపించారు, సీఎం ఓఎస్డీగా అభీష్టను అధికారికంగానే నియమించామని ఒకసారి, అధికారికంగా నియమించలేదని మరోసారి చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు, రూల్స్ కి విరుద్ధంగా అభీష్టను ఓఎస్డీగా నియమించి... అతనికి కీలకమైన శాఖలు అప్పగించారని ఏపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు.

మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్య.. చంద్రబాబు తర్వాత నాదే బాధ్యత

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నేపథ్యంలో మంత్రి నారాయణ మీద వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ దగ్గర నుండి, రాజధాని కాంట్రాక్టర్ ను నిర్ణయించడం, మాస్టర్ ప్లాన్ తదితరాల్లో అంశాల్లో నారాయణ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఆర్డీఏలో తనదే హవా అంటూ నారాయణపై పలు విమర్సలు తలెత్తాయి. ఈ విమర్శలకు నారాయణ స్సందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు.. చంద్రబాబు తర్వాత రాజధాని బాధ్యత మొత్తం తనదేనని చెప్పారు. కావాలనే పనిగట్టుకొని కొందరు తనమీద విమర్శలు చేస్తున్నారని.. ఎవరెన్ని విమర్శలు చేసినా నేను పట్టించుకోను.. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని వెల్లడించారు. తనపై తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం మరోప్రాణం బలి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే చాలా మంది నిరసనలు చేస్తున్నారు. గతంలో మునికోటి అనే వ్యక్తి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కిరోసిన్ పోసుకొని ఆత్మహుతి చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మరో ప్రాణం బలిగొంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఆగస్టు 25న ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుపడుతుందని అన్నారు. అసలే ఆర్ధికంగా వెనుకబడి ఉన్న సీమాంధ్రకు కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజలకు కష్టాలు తప్పవని ఆరోపించారు. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ప్రత్యేక హోదా వస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని.. వేలాది మంది ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక హోదా కోసం తనను తాను బలి చేసుకుంటున్నట్టు లేఖ రాశారు. ఆ తరువాత కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే శరీరం బాగా కాలిపోవడంతో ఆయన్ను పలు ఆస్పత్రులకి తిప్పినా ఉపయోగం లేకుండా పోయింది.  ఈ ఉదయం ఆయన మరణించారు. ఆయనకు భార్య.. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

రాధాకృష్ణపై ఎంపీ బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు.. నీచ్ కమీనే కుత్తేగాడు

టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆంధ్రజ్యోతి మేనిజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలో ఆదర్శ పాఠశాల, హాస్టల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణ నేను ఇక్కడి వాడిననే చెప్తాడు కాని వాడు చంద్రబాబు పంచన చేరినోడని.. ఆ నీచ్ కమీనే కుత్తేగాడు తిన్నా, పన్నా, లేచినా సీఎం కేసీఆర్ మీదనే రాస్తుంటడని, వాడే రాధాకృష్ణ అని బాల్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు అనని మాటలు కూడా అన్నట్టు రాసి ఆనందపడుతుంటాడని.. తెలంగాణ ఇమేజే డామేజ్ చేయడానికే చూస్తున్నాడని అన్నారు. తెలంగాణ బాగుపడుతుంటే చూడలేడని విమర్శించారు.

స్ఫెషల్ స్టేటస్ పై జైట్లీ వ్యాఖ్య.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టేనా?

  ప్రత్యేక హోదా గురించి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీహార్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ స్పెషల్ స్టేటస్ కా దౌర్ సమాప్త్ హో చుకా హై అని అన్నారు. అంటే ప్రత్యేక హోదా శకం ముగిసిందని వ్యాఖ్యానించారన్నమాట. అయితే ఇప్పుడు అరుణ్ జైట్లీ బీహార్ ను ఉద్దేశించి ఆమాటలు అన్నా.. అది ఏపీ ప్రత్యేక హోదాకి కూడా వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టే అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పన్నుల ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీకి 14వ ఆర్థిక సంఘం రాజ్యాంగం ప్రకారం ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రత్యేక ప్యాకేజికి అర్థం లేదని అన్నారు. అంతేకాదు ఇప్పటికే బీహార్ ప్రధాని మోడీ లక్షా 65వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని.. దీనితో పాటు ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టుల కోసం మరో 40 వేల రూపాయలు ప్రకటించారని చెప్పారు.