కాంగ్రెస్ షరతులపై వెంకయ్య ఫైర్..
posted on Jan 18, 2016 @ 10:13AM
జీఎస్టీ బిల్లుపై బీజేపీ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ మధ్య మంతనాలు జరుగుతున్న సంగతి తెలసిందే. ఈ బిల్లుపై రెండు మూడు నెలల క్రితం ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చించారు కూడా. అయితే తమ షరతులకు ఒప్పుకుంటే బిల్లు ఆమోదానికి సహకరిస్తామని వారు చెప్పడం జరిగింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధించిన షరతులపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డుతున్నారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన బిల్లు విషయంలో షరతులు విధించటం కాంగ్రెస్ పార్టీకి సరి కాదని.. వాస్తవానికి ఈ బిల్లు కాంగ్రెస్ అధికారంలో వున్నపుడు చేపట్టినదేనని అన్నారు. అప్పుడు ఎలాంటి షరతులు పెట్టని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి షరతులు తెస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ సమయంలో కాని.. జిఎస్‌టి బిల్లు స్టీరింగ్ కమిటీకి సారధ్యం వహించిన చిదంబరం కాని ఈ బిల్లుకు పన్నుల పరిమితి షరతు అవసరమని చెప్పలేదని.. ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పన్నులపై పరిమితి వుండాలనటంలోని ఔచిత్యమేమిటని ఆయన ప్రశ్నించారు.