అందుకే విరమించాను.. ముద్రగడ
posted on Feb 1, 2016 @ 1:58PM
ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన ఉద్యమంపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ పలు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ కాపు గర్జన సదస్సుపై చంద్రబాబే ఎదురుదాడి చేశారని.. కాపులతోనే ఉద్యమాన్ని నీరుగార్చాలని చూశారని అన్నారు. లక్ష్యాన్ని దెబ్బతీయడానికి అసాంఘిక శక్తులను దింపారు.. టీడీపీ నేతలే విద్వంసానికి దిగారు.. చంద్రబాబు ఆదేశాల మేరకే నిన్న ఘటనలు జరిగాయి అని ఆరోపించారు..అందుకే వెంటనే రాస్తా రోకో విరమించాను అని తెలిపారు. కాపు జాతికి చేతనైన సాయం చేయడానికే ఈ ఉద్యమం చేపట్టాను..మహాత్మా గాంధీ బాటలోనే రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం తలపెట్టామని అన్నారు. కొన్ని మీడియాలు వంకర రాతలు రాశారు అని మండిపడ్డారు.
అంతేకాదు నాలుగైదు రోజుల్లో నేను నాభార్య నిరాహార దీక్షకు పూనుకుంటున్నాం.. తమను అరెస్టు చేసినా పర్వాలేదు.. బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోము.. జైల్లో ఉండే దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. తమ దీక్షకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడి రావొద్దని, ఎవరికి వాళ్లు తమ ఇళ్లలోనే నిరాహార దీక్ష చేయాలని కోరారు. నేను చనిపోయిన తరువాత అయినా సరే రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి అని అన్నారు.