టీడీపీ ర్యాలీలో ఉద్రిక్తం..
posted on Jan 31, 2016 @ 2:31PM
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తూ చాలా బిబీగా ఉన్నాయి. అందునా ఈరోజు ప్రచారానికి ఆఖరికి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. అయితే టీడీపీ నేత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుండి ముందస్తు అనుమతి లేదని.. ర్యాలీని నిర్వహించడానికి కుదరదని.. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. మరోవైపు టీడీపీ నేతలు ఈ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం అయిదు గంటల లోపు అభ్యర్థులు ప్రచారం ముగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి అన్నారు. ఎస్సెమ్మెస్‌లు, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, టీవీల్లో ప్రచారాలు నిలిపివేయాలన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు.