భగత్ సింగ్ మీద పాకిస్తాన్‌లో కేసు!
posted on Feb 1, 2016 @ 12:14PM
పాకిస్తాన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మొన్నటికి మొన్న భారతదేశ జెండా ఎగురవేశారని విరట్ కోహ్లీ అభిమానికి జైలు శిక్ష విధించారు. ఇప్పుడేమో భగత్ సింగ్‌ని నిర్దోషిగా గుర్తించమంటూ లాహోర్ హైకోర్టులో ఒక కేసు నడుస్తోంది. భగత్‌సింగ్‌ని సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి హత్యకేసులో 85 ఏళ్ల క్రితం లాహోర్‌లో ఉరితీశారు. అయితే నిజానికి భగత్‌సింగ్ ఆ హత్య చేయలేదనీ అతడిని నిర్దోషిగా గుర్తించమనీ ఖురేషీ అనే న్యాయవాది లాహోర్ హైకోర్టులో కేసు వేశారు. దానికి రుజువుగా ఆనాటి ఎఫ్.ఐ.ఆర్ కాపీలను కూడా బయటకు తీయించారు ఖురేషీ. ఆనాటి ఎఫ్ఐ.ఆర్‌లో భగత్‌సింగ్ పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు. భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడేకానీ హంతకుడు కాదంటారు ఖురేషీ. భగత్‌సింగ్‌ని ఇప్పుడు న్యాయస్థానం నిర్దోషిగా గుర్తిస్తే ఆయనపట్ల పాకిస్తాన్ ప్రజల్లో మరింత గౌరవం పెరుగతుందనీ, ఏమైనా అవార్డులూ గట్రా ఇవ్వాలనుకుంటే కూడా నిర్భయంగా ప్రకటించవచ్చనీ ఖురేషీ ఆశ. మరి కోర్టు ఆయన వాదనతో ఎంతవరకు ఏకీభవిస్తుందో చూడాలి మరి!