చనిపోయిన టెక్కీ.. సిపిఎం నేత మేనల్లుడు.. డబ్బుల కోసమే..

  హైదరాబాద్ నగరం లింగంపల్లిలో హష్మీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హష్మీని హత్య చేసింది.. స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి అనే విషయం పోలీసులు తెలిపారు. అంతేకాదు.. హష్మీ.. సిపిఎం ఎపి శాఖ కార్యదర్శి మధు మేనల్లుడు అనే విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హష్మీ గత వారం రోజుల క్రితమే టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. అయితే హష్మీ స్నేహితుడైన నరేష్ కుమార్ రెడ్డి అతనిని పదివేలు కావాలని అడిగాడు. హష్మీ తన వద్ద లేవని చెప్పడంతో.. అతని వద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరేష్ కుమార్ రెడ్డి బండరాయితో హష్మీని కొట్టి చంపేసి.. తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, సెల్ ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు వచ్చి.. మోటరు బైక్ ఇవ్వడానికి వచ్చానని హష్మీ తల్లిదండ్రులతో కట్టు కథ అల్లినట్టు పోలీసులు తెలిపారు.

మాల్యా చెక్ బౌన్స్ కేసులో ట్విస్ట్.. మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోండి..

విజయ్ మాల్యాను చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ ఎర్రమంజిల్ కోర్టు వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు పంపిన వారెంట్లు మళ్లీ తిరిగి ఎర్రమంజిల్ కోర్టుకే తిరిగి వచ్చేశాయి. కోర్టు పంపించిన అడ్రస్ కు వారెంట్లు వెళ్లినా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. తిరిగి ఆ వారెంట్లను కోర్టుకే పంపించేశారు. అంతేకాదు ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారని.. అందులో ఏ ఒక్క వ్యక్తి లేరని కోర్టుకు తెలిపారు.   ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసు విచారణను వచ్చే నెల 6 కు వాయిదా వేసిన కోర్టు... అసలు మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తాను జారీ చేసిన సమన్లు వెనక్కు రావడంతో కొత్తగా మరోమారు సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. అయితే ఆ సమన్లను ఏ అడ్రెస్ కు పంపాలన్న విషయాన్ని పోలీసులే చెప్పాలని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ (జూన్ 6వ తేదీ)లోగా మాల్యా ఉంటున్న అడ్రెస్ ను తమకు అందజేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ,టీడీపీ మిత్రపక్షంగా.. ఇప్పుడే చెప్పలేం..

  గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉండి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మారిన పరిస్థితులను బట్టి ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందునుండి బీజేపీ నేతలు, టీడీపీ నేతల ఒకరి మీద ఒకరు విమర్సలు గుప్పించుకున్నా.. ఆ తరువాత పెద్దలు కలుగజేసుకోవడంతో పరిస్థితులు చక్కబడేవి. ఒకానొక సందర్భంలో రెండు పార్టీలు విడిపోతాయి అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే రెండు పార్టీలు విడిపోతాయేమో అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే పార్టీలు.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం పై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో మిత్రపక్షంగా కొనసాగే అవకాశాలు లేవని అర్ధమవుతోంది.   అంతేకాదు దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కురాలు పురందేశ్వ‌రి మాట్లాడుతూ.. అలాంటి అవకాశం లేదని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రానున్న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగానే కొన‌సాగుతూ త‌దుప‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై నిర్ణ‌యాన్ని తాము ఇప్పుడే చెప్ప‌లేమని..  ప్ర‌స్తుతం రాష్ట్రంలో త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చే దిశగానే దృష్టి పెట్టామ‌ని, టీడీపీతో పొత్తు అంశాన్ని గురించి ఎటువంటి నిర్ణ‌యాన్ని తెలప‌లేమ‌ని ఆమె అన్నారు. ఇంకా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ఆమె స్పందిస్తూ.. తమ పార్టీ అధిష్టానం రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలపై దృష్టి పెడుతుందని.. అనవసరంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంపే..

  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ విజయ పంధాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇదే అద్యక్ష బరిలో ఉన్న హిల్లరీ అప్పుడప్పుడూ కాస్త నెమ్మదించినా.. ట్రంప్ మాత్రం ముందునుండి తన సత్తా చాటుతున్నాడు. ఇక సర్వేలు కూడా ట్రంపే కాబోయే అమెరికా అధ్యక్షుడు అని చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్, హిల్లరీ క్లింటన్లలో ఓట్లు ఎవరికి వేస్తారనే నేపథ్యంలో ఐదు సర్వేలు నిర్వహించారు. ఈ ఐదు సర్వేల్లో రెండింటిలో ట్రంప్ పై ఆధిక్యం సాధించిన హిల్లరీ క్లింటన్... మూడింటిలో మాత్రం వెనుకబడిపోయారు. దీంతో సర్వేల ప్రకారం.. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనని అభిప్రాయపడుతున్నారు. అయితే హిల్లరీ కంటే ట్రంప్ కేవలం 0.2 శాతం మాత్రమే ఓట్లు అత్యధికంగా సాధించగలిగారని సర్వేలు వెల్లడించాయి. మరి సర్వేలు చెప్పినట్టు ట్రంప్ అధ్యక్షుడవుతాడో లేక.. సర్వేలను తిరగరాస్తూ హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవిని సొంతం చేసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ప్లాన్.. స్టాంప్ పేపర్ పై బాండ్

  రాష్ట్రం ఏదైనా కానీ పార్టీ ఫిరాయింపులు మాత్రం కామన్. అధికారంలో ఉన్న పార్టీల్లోకి నేతలు జంప్ అవ్వడం పారిపాటైపోయింది. అయితే ఈ పార్టీ ఫిరాయింపులను ఆపేందుకు కాంగ్రెస్ ఓ కొత్త పథకాన్ని ఎంచుకుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంత ఫలితాలు రాలేదు. దీంతో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి.. తాము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని, రూ. 100 స్టాంప్ పేపర్ పై బాండ్ రాసి ఇవ్వాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులతో బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడానికి ఇదేమి బాండ్ పేపర్ కాదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించకుంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. పార్టీ పట్ల విధేయతపై వారి బాధ్యతలను గుర్తు చేసేందుకే ఇలా అడిగాం" అని చౌదరి వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూద్దాం.

పఠాన్ కోట్ లా మరో భీకర దాడి.. నిఘా వర్గాల హెచ్చరిక..

  పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో దాడి జరపడానికి.. ఏ క్షణమైనా ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని.. భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు దీనికోసం జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని..  పఠాన్ కోట్ దాడికన్న భీకర దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారుని.. దీనికి సంబంధించిన నివేదికను పంజాబ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఈ దాడులకు ప్రధాన సూత్రధారి పాక్ లోని ఒకారా ప్రాంతానికి చెందిన అవాసీ అని.. జైషే మహమ్మద్ కమాండర్ అయిన అవాసీ స్వయంగా మలేషియా మీదుగా భారత్ కు రావాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఇంకా ఈ దాడుల కోసమే పాక్ లో జైషే మహమ్మద్ మరో మూడు కార్యాలయాలు తెరిచిందని నిఘా వర్గాలు తెలిపారు. దాడులు ఎప్పుడైనా జరగవచ్చని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్లో టెక్కీ దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి

  హైదరాబాద్లో రోజు రోజుకు టెక్కీల హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి హష్మీ ఒక రోజు క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్‌ వద్ద హష్మీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హష్మీని దుండగులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సెల్‌ఫోన్‌, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మీని హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మొన్ననే ఎమ్మెల్యే అయ్యాడు..అంతలోనే

నిన్న గాక మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కాని ఆ ఆనందం కొద్ది రోజులు కూడా నిలవలేదు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరుప్పరంగుండ్రం నియోజకవర్గం నుంచి శీనివేల్ అనే వ్యక్తి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గుండెనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. అయితే శీనివేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన మరణించకపోయినప్పటికి మరణించినట్టు పుకార్లు వ్యాపించాయి. వీటిని ఆయన కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఖండించారు. అయితే నిన్న అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. శీనివేల్ మృతిపట్ల అన్నాడీఎంకే నేతలు సంతాపం తెలిపారు.

సిబ్బంది నిర్లక్ష్యం..చచ్చేవాడికి వైద్యం ఎందుకు..?

చావు బతుకుల మధ్య ఉన్న రోగిని శతవిధాలా కాపాడేందుకు ఎంతోమంది వైద్యులు ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రిలోకి చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. శంషాబాద్‌లోని ఆహ్మద్‌నగర్ బస్తీకి చెందిన జోగు శ్రీను అనే వ్యక్తికి సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు 108 సాయంతో హుటాహుటిన శంషాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పుడు విధుల్లో ఉన్న ఎంన్‌ఓ నాసర్‌ఖాన్, వాచ్‌మెన్ కృష్ణ మద్యం మత్తులో ఉండి అంబులెన్స్‌ను ఆస్పత్రిలోకి రానివ్వకుండా రోగి బతకడు..వైద్యం అవసరం లేదని బాధ్యతారాహిత్యంగా గొడవకు దిగారు. విషయం మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈ లోపు మీడియా ప్రతినిధులు రావడంతో సిబ్బంది గేట్‌ తెరిచారు. వైద్యులు రోగికి వెంటనే సెలైన్ ఎక్కించడంతో అతని ప్రాణం నిలబడింది. అక్కడ ఏమాత్రం అటు ఇటైనా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేది.

మన సినిమాల్ని ప్రొత్సహించేందుకు..

భారతీయ చిత్రాల నిర్మాతలకు చేయూత నిచ్చే ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వారికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగానే.. ఇకపై ఆస్కార్, కేన్స్ వంటి చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడే చిత్రాలకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసందర్బంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఆస్కార్ కు ఎంపికయ్యే చిత్రానికి రూ.కోటి, కేన్స్ కు అయితే రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని భావిస్తున్నట్లు  తెలిపారు. భారత్ లో షూటింగ్ నిమిత్తం వచ్చే విదేశీ ఫిల్మ్ మేకర్లకు వీసా వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.   

మోడీ సమక్షంలో సీఎంగా ప్రమాణం చేసిన సోనోవాల్..

] అసోం ముఖ్యమంత్రిగా శర్వానంద సోనావాల్ ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పీబీ ఆచార్య సోనావాల్ చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఆరుగురు బీజేపీ సభ్యులుకాగా, అసోం గణపరిషత్‌కు చెందిన ఇద్దరు, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఇద్దరు ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. 

జయలలిత ప్రమాణ స్వీకారం.. స్టాలిన్ సీటుపై వివాదం..

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.  ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేత ఎం.కే స్టాలిన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన వెనుక వరుసలో కూర్చోవడంపై వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో దీనిపై జయలలిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్టాలిన్‌ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు అధికారులు ముందుగానే తనకు చెప్పి ఉంటే ప్రోటోకాల్‌ పక్కనపెట్టి ఆయనకు ముందు వరుసలో సీటు కేటాయించమని చెప్పేదానినని.. స్టాలిన్‌ శాసనసభ్యుల కోసం కేటాయించిన సీటులో కూర్చున్నారని ఆమె అన్నారు.  దీనిలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. స్టాలిన్‌ పట్ల, వారి పార్టీ పట్ల తనకు ఎలాంటి అగౌరవం లేదని, రాష్ట్రాభివృద్ధికి వారితో కలిసి పని చేయాలనుకుంటున్నామని జయలలిత చెప్పారు. మరి దీనిపై డీఎంకే పార్టీ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

దేశంలో అత్యాచారాలు పెరగడానికి గాంధీ కుటుంబమే కారణం.. బీజేపీ ఎమ్మెల్యే

  బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వివాదాస్పద విషయాల్లో ఇరుక్కోవడం కామన్. గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్ దేవ్ ఆహుజా ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి నెహ్రూ, గాంధీ కుటుంబమే కారణమని.. వ్యాఖ్యానించారు. అన్ని రకాల సామాజిక సమస్యలకు నెహ్రూ కుటుంబమే కారణమని.. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా.. మన దేశంలో నెహ్రూ, గాంధీలకు సంబంధించిన అన్ని విగ్రహాలను, ఇతర స్మారకాలను ధ్వంసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

"శక్తిమాన్‌" జ్ఞాపకంగా..

కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన పోలీస్ గుర్రం శక్తిమాన్‌కు గుర్తుగా డెహ్రాడూన్‌లో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని పోలీస్ లైన్స్‌ ప్రాంతంలో జూన్‌లో శక్తిమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ధ్యాన్‌ సింగ్ నేగి అనే శిల్పి శక్తిమాన్ విగ్రహాన్ని రూపొందించనున్నారు. శక్తిమాన్ 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండగా, ఆ విగ్రహాం 9 అడుగుల ఎత్తుంటుంది. ఇప్పటికే శక్తిమాన్ జ్ఞాపకర్థం పోలీస్ లైన్స్ వద్ద నిర్మాణంలో ఉన్న పెట్రోల్ పంప్‌కు శక్తిమాన్ పేరు పెట్టారు. శక్తిమాన్ జ్ఞాపకాలు ఎప్పుడూ తమ గుండెల్లో పదిలంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.

ఎవరెస్ట్‌పై పాదం మోపిన నవ్యాంధ్ర తొలి మహిళ..

ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఎన్నో వ్యయ ప్రయాసల్ని ఎదుర్కొవాలి. వాటన్నింటిని తట్టుకుని ఒక తెలుగు వనిత ఎవరెస్ట్‌ను అధిరోహించింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెనికి చెందిన నీలిమ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు చిన్ననాటి నుంచి సాహసాలంటే ప్రాణం. ఎప్పటికైనా ఎవరెస్ట్‌ ఎక్కడమే తన లక్ష్యమని సన్నిహితులతో చెప్పేది. దీనిలో భాగంగా ఎవరెస్ట్‌ అధిరోహించాలని గత ఏడాది ఏప్రిల్‌లో ప్రయత్నించింది. అయితే నేపాల్‌లో భూకంపం సంభవించడంతో వెనక్కి వచ్చేసింది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా మళ్లీ తన ప్రయత్నాలను ప్రారంభించి మరోసారి ఎవరెస్ట్‌ అధిరోహించేందుకు వెళ్లి ఈ సారి విజయం సాధించింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్ నుంచి ఎవరెస్ట్‌ అధిరోహించిన తొలి మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది.

ల్యాప్‌టాప్‌లు షాక్ కొడతాయి..ప్రాణాలు తీస్తాయి..!

సెల్‌ఫోన్ పేలి పలువురు మృతిచెందిన వార్తలు వింటూ ఉంటాం. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ల్యాప్‌టాప్‌లు వచ్చాయి. ల్యాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కరెంట్‌ షాక్‌కు గురై యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సింగ్ అనే యువకుడు తన ల్యాప్‌టాప్‌కు చార్జింగ్ పెట్టి మెయిల్స్ చూసుకుంటున్నాడు. ఈ సమయంలో కరెంట్ షాక్ తగలడంతో అతడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిది అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బ్రిజేశ్‌కు కొద్ది రోజుల క్రితమే పెళ్లైంది. తల్లిదండ్రులు, భార్యతో కలిసి గోవిందపురిలో నివాసముంటున్నాడు.