వాహనదారులకు ఒడిషా షాక్.. "నో హెల్మెట్..నో పెట్రోల్ "..!

హెల్మెట్ పెట్టుకోండి..సీటు బెల్ట్ కట్టుకోండి..అని బుద్ధిగా చెబితే ఎవరు వింటారు. అలా చెప్పి..చెప్పి విసిగిపోయారేమో ఒడిషా పోలీసులకు చిర్రెత్తుక్కొచ్చింది. అందుకే ఇకపై కఠినంగానే వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. రాజధాని భువనేశ్వర్‌లో వచ్చేనెల 15 నుంచి ద్విచక్ర వాహనాలు వినియోగించే వారు హెల్మెట్ లేకుండా బంక్‌కు వెళ్లి పెట్రోల్ పొందాలనుకుంటే..అక్కడి సిబ్బంది వారికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే సమాధానాన్ని చెప్పనున్నారు. ఈ మేరకు  ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వాహనదారులకు, పెట్రోల్ బంక్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ద్విచక్రవాహనాలు అమ్మేటప్పుడే వాటితో పాటుగా హెల్మెట్‌ను కూడా తప్పనిసరిగా అమ్మాలని కూడా అక్కడి  వాహన విక్రయదారులను ఆదేశించారు.

టీడీపీ లోకి వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలు బాధ పడుతున్నారు.. వైసీపీ

వైసీపీ పార్టీ నుండి ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల గురించి వైసీపీ పార్టీ కొత్త విషయాలు బయటపెడుతోంది. వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. టీడీపీలోకి వచ్చిన తరువాత.. ఇలా ఎందుకు చేశామా అని బాధపడుతున్నారని చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్, ప్రతాప్ కుమార్లు మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్బంలో పై విధంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా, తమకు వచ్చే నష్టమేమీ లేదని.. విజయసాయిరెడ్డి గెలుపుపై తమకు అనుమానాలు లేవని స్పష్టం చేశారు. తెదేపాలో చేరిన 17 మందిలో తప్పుతెలుసుకున్న అత్యధికులు తిరిగి వెనక్కు రానున్నారని అన్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

గండిపేటలో కాల్పుల కలకలం..

  హైదరాబాద్ నగరంలోని గండిపేటలో కాల్పుల కలకలం రేగింది. గండిపేటలోని పుప్పాలగూడ వద్ద నిన్న రాత్రి జరిగిన కాల్పుల వల్ల అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల ప్రకారం.. గోల్కొండ రిసార్ట్‌లో నిన్న రాత్రి ఓ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ ఫంక్షన్ కు  గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్, న‌ల్గొండ జిల్లా కోదాడ‌కు చెందిన ప్ర‌భాక‌ర్ హాజ‌ర‌య్యారు. అయితే వీరిద్దరికి ఓ ఆస్తి వివాదంలో వాగ్వాదం జరుగగా.. ప్ర‌శాంత్‌ను బెదిరించేందుకు ప్ర‌భాక‌ర్ గాల్లోకి కాల్పులు జ‌రిపారు. అయితే కాల్పులు జ‌రిపిన స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్ తాగి ఉన్నాడ‌ని పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నామని తెలిపారు.

మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి... పిచ్చి మాటలు వద్దంటున్న సోనియా..

  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా ఇష్టం. అందునా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం అంటే ఇంకా ఇష్టం. అందుకే వారి కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఏదో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అలాగే ఈసారి కూడా మరో బాంబు పేల్చారు. అయితే ఈసారి సోనియా గాంధీ అల్లుడుపై ఆరోపణలు గుప్పించారు. సోనియా గాంధీ అల్లుడు, వివాదాస్పద వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా... బ్రిటన్ పౌరసత్వం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారని.. త్వరితగతిన బ్రిటన్ పౌరసత్వం పొందేందుకే వాద్రా ఈ నిధులు వెచ్చించారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు, పౌరసత్వం రాగానే బ్రిటన్ చెక్కేసేందుకు వాద్రా సన్నాహాలు చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వాద్రాపై నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.   మరోవైపు ఈ ఆరోపణలపై సోనియా గాంధీ స్పందించి బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. "ప్రతి రోజూ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇదో అలవాటైపోయింది. ఏవైనా ఆధారాలుంటే, విచారణ జరిపి ఆరోపణలను రుజువు చేసి చూపండి. పిచ్చి మాటలు ఎందుకు?" అని ఆమె అన్నారు. ఇండియాలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న అజెండాతో సాగుతున్న బీజేపీ ఈ తరహా కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, మోదీ కేవలం ప్రధానమంత్రే తప్ప, షహన్ షా (రాజు) కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఏపీ ప్రత్యేక హోదాపై సోము వీర్రాజు కొత్త లెక్కలు..

  ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం పరోక్షంగా అర్ధమైపోయింది. ఇప్పటికే కేంద్ర పెద్దల నుండి.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా రాదని.. ఇచ్చే అవకాశం లేదని తేటతెల్లమైపోయింది. గతంలో ఏపీకి అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై కొత్త లెక్కలు చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని.. ఏమాత్రం అలక్ష్యం చేయదని చెపుతూ.. ప్రత్యేక హోదా ఇస్తే... కేంద్రం నుంచి కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే వస్తాయని.. అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే... కేంద్రం నుంచి ఏపీకి ఏకంగా రూ.42 వేల కోట్ల మేర నిధులు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని ఆయన వాదించారు.

చనిపోయిన శవాన్ని బైక్ కు కట్టుకొని..

  భువనేశ్వర్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఓ శవాన్ని బైక్ కు కట్టుకొని వెళుతున్నఘటన అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల ప్రకారం.. భువనేశ్వర్ భారాముండా గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని మరణించింది. అయితే ఆమె మృత దేహానికి పోస్ట్ మార్టం చేసిన తరువాత.. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. అలా ప్యాక్ చేసిన మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు బైక్ వెనుకాల కట్టుకొని తీసుకెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక  వారు అలా చేశారా? లేక  వాహనంలో తరలించేందుకు అవసరమైన  డబ్బులు లేక అలా చేశారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.   మరోవైపు దీనిపై జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా స్పందించి.. ఆ చుట్టుపక్కల 20కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని.. మృతదేహాలను తరలించేందుకు వీలుగా పేదలకోసం వీటిని అందుబాటులో ఉంచామని ఆమె  తెలిపారు.

వెనక్కి తగ్గిన కేంద్రం.. ఒక శాతం పన్ను తొలగింపు..

  కేంద్రం వివిధ రకాల విలువైన లోహాలతో తయారుచేసే ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అరుణ్ జైట్లీ వీటిపై కొత్త పన్ను విధిస్తూ ప్రతిపాదించగా.. దానిని వ్యతిరేకిస్తూ ఆభరణాల దుకాణాదారులు దాదాపు ఆరు వారాల నుండి సమ్మె చేశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తామని ప్రకటించింది. దీంతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం రేపటి నుంచి (జూన్ 1) అమలులోకి వస్తుందని ప్రకటించింది.

కోర్టులపై పారికర్ సంచలన వ్యాఖ్యలు.. అర్థరహిత ఆదేశాలు..

  కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజిల్ వాహనాలు రద్దు చేయాలంటూ ఇటీవల ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పారికర్.. కోర్టుల ఆదేశాలు అర్థరహితమంటూ వ్యాఖ్యానించారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండానే అర్థరహిత ఆదేశాలు ఇస్తున్నారు అని అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన ఒక విషయాన్ని తెలియజేశారు. ‘‘ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఓ నివేదిక చదివాను. కోర్టు తీసుకున్న నిర్ణయాలు తమకు అర్థం కావట్లేదంటూ వారు భారత దేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని నిలిపేశారు. డీజిల్ వాహనాల నిషేధం వెనుక ఉన్న తర్కాన్ని తాము అర్థం చేసుకోలేకపోతున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు అని చెప్పారు. కోర్టులు తీసుకునే ఇలాంటి నిర్ణయాలు వల్ల దేశానికే నష్టమని.. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు.

కలెక్టర్ ను హీరోయిన్ లా ఉన్నారన్న ఎమ్మెల్యే.. కేసు నమోదు..

రాజకీయ నేతలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బుక్కవుతుంటారు. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మహిళా కలెక్టర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బుక్కయ్యాడు. అసలు సంగతేంటంటే.. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా.. సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్ మాట్లాడుతూ.. సర్‌గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్‌ను చూసి, ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్‌లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా..  తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ లాంటి పిచ్చివాడిని చూడలేదని అన్నారు. ఇక అంతే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న ఆయన ఒక మహిళపట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇక బేజేపీ నేతలు కూడా భగత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

ఏపీ రాజ్యసభ అభ్యర్దిగా సురేష్ ప్రభు నామినేషన్..

  ఏపీ కోటా నుండి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్దిగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకి టికెట్ ఖాయం అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్ వచ్చిన ఆయన పలువురు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ అయిన సురేష్ ప్రభు, పార్టీ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన బస చేసిన ప్రాంతానికి తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. మరికాసేపట్లో నామినేషన్ వేసేందుకు వెళ్లనున్న సురేష్ ప్రభు వెంట అసెంబ్లీకి విష్ణుకుమార్ రాజు, కావూరీ తదితర బీజేపీ నేతలు తోడు వెళ్తారని తెలుస్తోంది. కాగా ఏపీ కోటాలో టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కగా అందులో మిత్రపక్షమైన బీజేపీకి ఒక స్థానం ఇచ్చింది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు అవకాశం దక్కింది.

పల్గాన్‌లో అగ్నిప్రమాదం.. 18 మంది జవాన్లు, ఇద్దరు అధికారులు మృతి

  మహారాష్ట్ర పల్గాన్ లోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందగా.. 19 మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. చనిపోయిన 20 మందిలో 18 మంది జవాన్లు ఉండగా ఇద్దరు అధికారులు ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అంతేకాదు మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.   మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ హుటాహుటిన మహారాష్ట్రలోని పల్గాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఆర్మీఆయుధ కార్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో విషయం తెలుసుకున్న పారికర్‌ సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు.

కంప్లయింట్ తీసుకోవాలంటే..షూ పాలిష్ చెయ్..!

తమకొచ్చిన కష్టం తీర్చమంటూ పోలీస్ ‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు మనలో చాలా మంది. అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్ సిగ్గుపడేలా ఉత్తరప్రదే‌శ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసులు వ్యవహరించారు. ముజఫర్‌నగర్ సమీపంలోని హైబత్పూర్ అనే గ్రామానికి చెందిన సిత్తు ఓ చమారీ అనే వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. అయితే అతని సెల్‌ఫోన్‌ని ఎవరో కొట్టేశారు. దీనిపై పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నాడు. అయితే సిత్తు చెప్పులు కుట్టేవాడని తెలిసిన పోలీసులు..స్టేషన్‌లో ఉన్న అందరి బూట్లూ పాలిష్ చేస్తేనే కంప్లయింట్ తీసుకుంటామని బెదిరించారు. దాంతో సిత్తు తన గ్రామం వెళ్లి సామాగ్రి తెచ్చి వారందరి బూట్లూ పాలిష్ చేశాడు. పోలీసుల తీరుపై అతని తోటివారు భగ్గుమన్నారు..అంతటితో ఆగకుండా అతని చేత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయించారు. సదరు పోలీసులపై చర్య తీసుకుంటానని జిల్లా ఎస్సీ సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.

ఆలయ ఈవోపై పెట్రోల్ దాడి..

  ఓ ఆలయ ఈవో పై పెట్రోల్ దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూల్ జిల్లాలోని యాగంటి ఆలయ ఈవో ఆదిశేషునాయుడుపై దాడి చేసి పెట్రోల్ పోసి అంటించి హతమార్చేందుకు విఫలయత్నం జరిగింది. ఈ దాడికి పాల్పడింది జూనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి. వివరాల ప్రకారం.. కృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో ఈవో ఆయన జీతాన్ని నిలిపివేశారు. ఆ కోపంతో కృష్ణారెడ్డి.. ఆదిశేషునాయుడుపై పెట్రోల్ పోసి దాడి చేశారు. దీంతో వెంటనే సిబ్బంది తేరుకొని ఆయన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆదిశేషునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.