శుక్రవారం మహ్మద్ ఆలీ అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అంత్యక్రియలు వచ్చే శుక్రవారం జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆలీ స్వగ్రామం కెంటకీలోని లూయిస్‌విల్లేలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, హాలీవుడ్ నటులు తదితరులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఆలీ పార్థివదేహన్ని లూయిస్‌విల్లే వీధుల్లో అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సంతాపసభ నిర్వహించనున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఆలీ సంతాపసభలో ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు ప్రముఖ కమెడియన్ బిల్లీ క్రిస్టల్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ బ్రయాంట్ గంబెల్ కూడా ఆలీకి తమ సంతాపం తెలపనున్నారు.

గెట్ అవుట్ అన్నందుకు..బాస్‌ను మట్టిలో పాతేశాడు..

తనను గెట్ అవుట్ అన్నందుకు ఓ బాస్‌పై ఓ ఉద్యోగి దారుణంగా పగతీర్చుకున్నాడు. ఫ్లోరిడాలో ఓ నిర్మాణం వద్ద ఎరిక్ కాక్స్‌ అనే వ్యక్తి రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ సైట్‌లో మట్టి తీస్తూ ఉంటాడు. ఆ సమయంలో తన సూపర్‌వైజర్ వచ్చి ప్రశ్నించడంతో పాటు చేయి కూడా చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతే తన రోలర్‌తో గుద్దించడమే కాకుండా ఐరన్ రాడ్‌తో అతని తలపై కొట్టి స్పృహలేకుండా పడిపోయాడు. అయినా కోపం తగ్గని ఎరిక్ అతడిని నడుము వరకు మట్టిలో పాతేశాడు. దూరం నుంచి మనోడి పిచ్చి చేష్టలు చూస్తున్న ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఎరిక్స్‌ను అరెస్ట్ చేసి బాస్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే తనను కారణంగా లేకుండా దూషించాడమే కాకుండా  గెట్ అవుట్ అన్నాడని, అనంతరం చేయి చేసుకుని తల నరికేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో తాను రోలర్ నడుపుతుండటంతో ప్రమాదవశాత్తూ దాని కింద పడ్డాడని అన్నాడు

అలనాటి బాలీవుడ్ నటి శులభ దేశ్‌పాండే కన్నుమూత

అలనాటి బాలీవుడ్ నాటి శులభ దేశ్‌పాండే కన్నుమూశారు. ఆమె వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శులభ నిన్న మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె పలు మరాఠీ, హిందీ సినిమాలతో పాటు పలు సీరియళ్లలో నటించారు. హిందీలో విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్ సినిమాలతో పాటు ఇటీవల ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించారు. మరాఠీలో రంగస్థల సంస్థ రంగయాన్‌తో కలిసి పనిచేశారు. భర్త అరవింద్ దేశ్‌పాండే‌తో కలిసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును స్థాపించారు. శులభ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది దుర్మరణం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై-పుణే జాతీయ రహదారిపై ఓ లగ్జరీ బస్సు వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా..కార్లలో ఉన్న పలువురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

పాక్ తో సంబంధాలు మూసుకుపోతున్నాయి.. పారికర్

  మనోహర్ పారికర్ పాక్-భారత్ ల మధ్య చర్చల గురించి ప్రస్తావించారు. సింగపూర్లోని ఒక సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తుందని.. ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో పాకిస్థాన్ చిత్తశుద్ధిపై ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయని.. అందువల్ల ఆదేశంలో స్నేహ పూర్వక సంబంధాలకు భారత్ తెరిచిన తలుపులు మూసుకుపోతున్నాయని మనోహర్ పారికర్ అన్నారు. స్నేహ, సౌహార్ధ సంబంధాలకు భారత్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. మనోహర్ పారికర్ తో పాటు ఈ సదస్సులో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి రాం మాధవ్ కూడా పారికర్ మాటలను సమర్ధించారు.

ట్విట్టర్, యాహూలో విలీనం..?

ట్విట్టర్, యాహూలో విలీనం కానుందా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ట్విట్టర్ సీఈవో, యాహూ సీఈవో ఇద్దరు ఈ విషయంపై గంటలపాటు జరిపి ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వెబ్ ఆధారిత సేవలు అందించడంలో ముందున్న యాహూనుంచి సేవలందుకునేందుకు ట్విట్టర్ ఆసక్తి చూపుతోందని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం ఫేస్ బుక్ ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న నేపథ్యంలో  ట్విట్టర్, యాహూలో విలీనం కావడం రెండు సంస్థలకు లాభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి రెండు సంస్థలు ఇప్పటివరకూ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. చట్టప్రకారం విలీనం పూర్తయ్యాక దీనిపై ప్రకటన చేస్తే మంచిదని రెండు సంస్థలు భావిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై రెండు సంస్థలు నోరు విప్పితే కాని అసలు విషయం తెలుస్తుంది.

మోడీకి అఫ్ఘాన్ పురస్కారం..

  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఓ పురస్కారం దక్కింది. మోడీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్లో ఉన్నారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని మోడీకి ఆమిర్‌ అమానుల్లా ఖాన్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతంరం.. ఆఫ్ఘన్‌-భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. 'నిజమైన సోదరభావానికి లభించిన గౌరవం ఇది. అఫ్ఘానిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారమైన ఆమిర్ అమానుల్లా ఖాన్ అవార్డు ప్రధానికి లభించింది' అని విదేశాంగ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రధాని మోదీ అవార్డు అందుకుంటున్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు.

నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు... హేమమాలిని

  ఒక పక్క మథురలో హింసాత్మక ఘటనలు జరగుతుంటే మరో పక్క ట్విట్టర్లో తన ఫొటోలు పోస్ట్ చేసి విమర్శలు పాలయ్యారు బాలీవుడ్ డ్రీమ్ గాళ్, ఎంపీ హేమమాలిని. అయితే ఆ తరువాత ఫొటోలు తీసేశారనుకోండి. అయితే ఈ విషయంపై స్పందించిన హేమమాలిని.. మథుర అల్లర్లు జరగడంలో నాకు సంబంధం ఏంటో నాకు అర్ధం కావట్లేదు.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు.. మథురలో లా అండ్ ఆర్డర్‌ని డీల్ చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిది అని ఆరోపించారు. గత పదిరోజులుగా నేను మథురలోనే ఉన్నాను.. నేను ఇక్కడి నుండి వెళ్లిన తరువాత ఘటన జరిగింది.. ఆసమయంలో నేను షూటింగ్లో ఉన్నాను.. ఆ ఫొటోలు పోస్ట్ చేశాను..  వార్త తెలియగానే వెంటనే ఇక్కడి వచ్చేశాను అందులో తప్పేంటి అని ప్రశ్నించారు. అనంతరం మథుర కాల్పుల్లో మృతిచెందిన ఎస్పీ ముకుల్ ద్వివేది ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. ఆతరువాత ఈ హింసాత్మక ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆమె పరామర్శించారు. మొత్తానికి హేమమాలిని తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు. 

96 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా.. గిన్నీస్ రికార్డ్

  96 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొంది గిన్నీస్ రికార్డ్ సాధించాడు ఓ తాతయ్య. ఆశ్చర్యంగా ఉంది కదా.. జ‌పాన్‌కు చెందిన షిగేమి హిరాటా అనే తాత‌య్య 85 ఏళ్ల వ‌య‌సులో డిగ్రీ కోర్సును ప్రారంభించి 11 ఏళ్ల త‌రువాత‌ తాజాగా ఆ డిగ్రీని పూర్తి చేసి ప‌ట్టా అందుకున్నారు. క్యోటో యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ నుంచి ఇటీవ‌ల డిగ్రీ ప‌ట్టాను అందుకున్న ఈ తాత‌య్య గిన్నీస్ బుక్‌లోకి ఎక్కేశారు. 96 ఏళ్ల వ‌య‌సులో డిగ్రీని పూర్తి చేసిన వ్య‌క్తి ప్ర‌పంచంలో మ‌రెవ‌రూ లేరంటూ ఆయ‌నకు గిన్నిస్ బుక్ ప‌ర్య‌వేక్షకులు స‌ర్టిఫికెట్ ఇచ్చేశారు. ఈ తాత‌య్య యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌ నేవీలో ప‌నిచేశారు.

ఆఎ్ఘాన్‌ – భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్ ను ప్రారంభించిన మోడీ...

  ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ హెరాత్‌లోని ఆఎ్ఘాన్‌ – భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌(సల్మా డ్యామ్‌)ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆఎ్ఘాన్‌- భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌గా పేరు పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ డ్యామ్‌ నిర్మాణంతో ప్రజల జీవితాల్లో వెలుగులు చిగురిస్తాయని అన్నారు. గత డిసెంబర్‌లో పార్లమెంట్‌ భవనం ప్రారంభించేందుకు ఆప్ఘనిస్తాన్‌ వచ్చినట్లు చెప్పారు. సల్మా డ్యామ్‌.. ఆప్ఘనిస్తాన్‌ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

తగ్గని జగన్.. చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైంది..

ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీ అంతటా నిరసనలు వెల్లువెత్తుతుంటే.. ఇప్పుడు మరోసారి ఆయన చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కదిరిలో రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. హిట్లర్ లా వ్యవహరిస్తున్న చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు. సోలార్ హబ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం పరిహారం అందజేయడంలో తాత్సారం చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ‘నీళ్లున్న చోట సోలార్ ప్లాంట్ క‌ట్ట‌డ‌మేంటీ..?' అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.. ‘చంద్రబాబుకి ఎప్పటికైనా జ్ఞానం వస్తుందని ఆశిద్దాం’ అని ఆయ‌న అన్నారు. మరి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇంకెన్ని ఆందోళనలు తలెత్తుతాయో చూడాలి.

దిగొచ్చిన మహారాష్ట్ర మంత్రి.. పదవికి రాజీనామా..

  మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని.. ఇంకా అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో ఆఖరికి ఖడ్సే తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అసలు సంగతేంటంటే.. ఖడ్సేకు దావూద్ ఇబ్రహీం నుండి ఫోన్ కాల్స్ వచ్చాయని ఓ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతున్న సమయంలో.. అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రి గారిని రాజీమానా చేయాలని ఆదేశించారు. అయితే సదరు మంత్రిగారు మాత్రం ససేమీరా అనడంతో.. సీఎం నేరుగా ప్రధానమంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితా షా లకు ఫిర్యాదు చేయడంతో.. వీరు ఇద్దరు ఆగ్రహించే సరికి ఖడ్సే రాజీనామా చేయాల్సి వచ్చింది. తన రాజీనామా లేఖను ఫడ్నవీస్ కు అందజేశారు.

ఏపీ రాజధానికి పైసా ఇచ్చేది లేదు.. కేంద్రం

  పీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసిన కేంద్రం ఇప్పుడు మరో షాకింగ్ వార్తను బయటపెట్టింది. ఇప్పటివరకూ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.2,050 కోట్ల నిధులు ఇవ్వగా.. ఇకపై అమరావతి నిర్మాణానికి సింగిల్ పైసా విడుదల చేయలేమని.. ఇప్పటిదాకా కేటాయించిన నిధులతోనే సరిపెట్టుకోవాలని చెప్పింది. అరుణ్ జైట్లీ సమక్షంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులతో భేటీ జరుగగా.. కేంద్ర చెప్పిన మాటలు విని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అవాక్కైనంత పనైంది. విభజన చట్టంలోని 94(3) సెక్షన్ ప్రకారం.. రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను మాత్రమే తాము నిర్మించాల్సి ఉందని.. ఈ భవనాలన్నింటినీ రూ.2,050 కోట్లతోనే నిర్మించుకోవచ్చని వాదించింది. అంతేకాదు సాధ్యం కాదని ఏపీ భావిస్తే... ఆ నిధులను వెనక్కిస్తే తామే వాటిని నిర్మించి ఇస్తామని చెప్పడంతో ఏపీ అధికారులు ఖంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బాక్సింగ్‌ దిగ్గజం మహ్మద్‌అలీ కన్నుమూత.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల నివాళులు

బాక్సింగ్‌ దిగ్గజం మహ్మద్‌అలీ (74) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఫీనిక్స్ లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. మహ్మద్‌అలీ 1942 జనవరి 17న జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టిన అలీ.. 22 ఏళ్లకే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా అవతరించాడు. ఆయన మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా గెలిచారు.   మరోవైపు మహ్మద్‌అలీ మృతికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. బాలీవుడ్ చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్... అలీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. బాక్సింగ్ లెజెండ్ ఆత్మకు శాంతి చేకూరాలని అతడు కోరాడు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా అలీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయామని అతడు ఆ సందేశంలో పేర్కొన్నాడు.

మథురలో కొనసాగుతున్న ఉద్రిక్తత... హేమమాలినిని అడ్డుకున్న పోలీసులు..

  మథురలో ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమణలను తొలగించేందుకు వచ్చిన పోలీసులపై అక్రమణదారులు తుపాకులు, గ్రానైడ్లతో దాడి చేయగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఎస్పీ సహా 24 మంది మృతి చెందారు. మరోవైపు ఈ కేసులో భాగంగా ఇప్పటికే 400 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఇంకా సీఎం అఖిలేష్ యాదవ్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలుస్తోంది.   ఇదిలా ఉండగా ఎంపీ హేమమాలిని మథుర ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. కాగా బీజేపీ మథురలో బంద్ కు పిలుపునిచ్చింది.