జూన్ 27 నాటికి ఉద్యోగులు ఏపీ రావాల్సిందే..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆయన పలు విషయాలు చర్చించి  నిర్ణయం తీసుకున్నట్టు తెలస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 8న మహాసంకల్పం పేరుతో ఒంగోలులో బహిరంగసభను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులు బదిలీ గురించి కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ఈనెల 10 నుండి 20 వరకూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని.. జూన్ 27 నాటికి ఉద్యోగులు హైదరాబాద్ నుండి ఏపీకి రావాల్సిందేనని.. వారికి చేయాల్సిన ఏర్పాట్లు బాధ్యత సీఆర్డీఏదే అని తేల్చిచెప్పారు. ఇంకా రేపు జరిగే నవ నిర్మాణ దీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని, అలాగే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మరి ఏపీకి రావడానికి ఆసక్తి చూపించని ఉద్యోగులు బాబు ఆదేశం మేరకు ఎంతవరకూ వస్తారో చూడాలి.

ప్రత్తిపాటి పుల్లారావుకు నాన్ బెయిలబుల్ వారెంట్..

  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు రైల్వే కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సమైఖ్యాంధ్ర ఉద్యమం సందర్భంగా 2014లో రైల్ రోకో నిర్వహించారు. అప్పుడు దీనిపై పలువురు నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో మంత్రి పుల్లారావుతో పాటు ఎమ్మెల్యే ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, లింగంశెట్టి ఈశ్వర్రావు, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి నిందితులుగా ఉన్నారు. అయితే దీనిపై విచారించిన కోర్టు పలుమార్లు కోర్టుకు హాజరుకావాలని సూచించింది. అయినా  కోర్టు వాయిదాలకు హాజరుకాని కారణంతో వీరందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

సెల్ఫీ తీసుకుందామని.. భార్యను చంపేసిన భర్త..

  సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు మరణించినవారు చాలామందే ఉన్నారు. అయితే అదే సెల్ఫీ పేరుతో తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. యూపీలోని మీరట్లో ఆప్తాబ్ అనే వ్యక్తి తన భార్య ఆయేషాతో సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి గంగాన‌ది వ‌ద్ద‌కు తీసుకెళ్లి న‌దిలో తోసేశాడు. అనంతరం.. త‌న ఎనిమిది నెల‌ల కొడుకుతో పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కొంద‌రు దుండ‌గులు త‌మ‌పై దాడి చేశార‌ని, ఆ గొడ‌వ‌లో త‌న భార్య‌ను గంగా న‌దిలో తోసేశార‌ని పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. అయితే అప్తాబ్ పై అనుమానం వచ్చిన పోలీసులు అతనిని విచారించగా అసలు నిజం బయటపడింది. అద‌న‌పు క‌ట్నం కోసం భార్య ఆయేషాతో త‌రుచూ త‌గాదాలు పెట్టుకుంటోన్న ఆఫ్తాబ్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

వంగవీటి రాధా అరెస్ట్..

  వైసీపీ నేత వంగవీటి అరెస్ట్ తో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సింగ్ నగర్ కు చెందిన పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు వంగవీటి రాధా నేతృత్వ వహించారు. అయితే దీనికి పోలీసుల అనుమతి లేదంటూ.. దర్నా విరమించాలని పోలీసులు చెప్పినా వినకపోవడంతో వంగవీటిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులోకి ఎక్కించి అక్కడికి సమీపంలోని పాయకాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంగవీటి అరెస్ట్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

చిరంజీవి, నాగార్జున, సచిన్ లు కలసిన రహస్యం ఇదే..

  టాలీవుడ్ స్టార్లు చిరంజీవి, నాగార్జున క్రికెటర్ సచిన్ ఒకేసారి తిరుమల దర్శనం చేసుకున్నారు. అయితే వీరు ముగ్గురు యాదృశ్చికంగా కలిశారు అని అనుకున్నారు కానీ.. ఓ పనిమీదే కలిశారన్న విషయం చాలా లేట్ గా అర్దమైంది. తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం అనంతరం.. వీరు ముగ్గురు నేరుగా కేరళ సీఎం పినరాయి విజయన్ ను కలిశారు. కేరళలో ఫుట్ బాల్ అకాడమీని నెలకొల్పాలని పక్కా ప్లాన్ వేసుకున్న ముగ్గురూ ..దీనిపై మాట్లాడటానికి సీఎం పినరాయి విజయన్ అపాయింట్ మెంట్ ముందే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందు తిరపతిలో దర్శనం కొరకు వచ్చి.. అక్కడి నుండి కేరళ వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.   ఇక వీరికి స్వాగతం పలికిన విజయన్ అకాడమీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ లు కేరళా బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టుకు యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరితో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

కర్ణాటక కానిస్టేబుళ్ల సామూహిక సెలవు.. ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించిన సీఎం

  తక్కువ జీతాలు ఇస్తూ.. పనిభారం పెరిగిపోయిన కర్ణాటక కానిస్టేబుళ్లు ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, విద్యాసౌకర్యాలు కల్పించకపోవడం వంటి పలు సమస్యలకు నిరసనగా సుమారు 60 వేల మంది కానిస్టేబుళ్లు ఈ నెల 4వ తేదీన సామూహికంగా సెలవు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనిపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందిస్తూ.. కానిస్టేబుళ్లు కనుక ఈ కార్యక్రమం చేపడితే వారిపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు నిరసనలో పాల్గొన్న కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలనుంచి తొలగిస్తామని డైరెక్టర్‌ జనరల్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఓం ప్రకాశ్‌ ఒక సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. కానిస్టేబుళ్లకు ఎవరికీ ఆ రోజు అనారోగ్యంతో ఉన్నారని మెడికల్‌ సర్టిఫికెట్లు ఇవ్వరాదంటూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వాసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మీడియాకు నిజాయితీ లేదు.. నిప్పులు చెరిగిన ట్రంప్

  అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఆయన మీడియాను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అందుకే మీడియాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. న్యూయార్క్ లో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయనను.. తాను సేకరించిన 6 మిలియన్‌ డాలర్ల నిధులపై ప్రశ్నించారు. అంతే ఇక కోపం కట్టలు తెంచుకొచ్చిన ట్రంప్ మీడియాపై నిప్పులు చెరిగారు. మీడియాకు నిజాయితీ లేదని..  పత్రికల్లో, టీవీల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. అవన్నీ అసత్యాలని ప్రజలకు తెలుసన్నారు. అంతేకాదు ఏబీసీ న్యూస్‌ జర్నలిస్ట్‌ టామ్‌ లలామస్‌పై కూడా మండిపడ్డారు. అతనిది అనైతిక ప్రవర్తన అని.. అతడికి నిజానిజాలు బాగా తెలుసని ట్రంప్‌ మండిపడ్డారు. కాగా ఛారిటీల కోసం జనవరిలో ట్రంప్‌ నిధుల సేకరణ కార్యక్రమానికి విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.

ఆ రాజ్యసభ అభ్యర్దిపై 28 క్రిమిన‌ల్ కేసులు..

బీజేపీ రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించిన వారిలో గోపాల్ నారాయణ్ సింగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రం నుండి ఈయన రాజ్యసభకు ప్రాతినిద్యం వహించనున్నారు. అయితే బీజేపీ నారాయణ సింగ్ ను ఎన్నుకోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర అధికార పార్టీ జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పలు విమర్శలు గుప్పిస్తోంది. ఆయ‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు 28 సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని..  పేర్కొంది. జేపీలో ఎంతో మంది అర్హులైన నేత‌లుండ‌గా గోపాల్ నారాయ‌ణ్ సింగ్ నే త‌మ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింద‌ని, దీంతో ఆ పార్టీ దారులు ఎటుగా ఉన్నాయో.. వారి దృక్ప‌థం ఎలాగుందో తెలుస్తోంద‌ని అంటున్నారు.

సోనియా అల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. సంజయ్ భండారీతో రెగ్యులర్ టచ్..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సంజయ్ భండారీ నుండి వాద్రా లండన్ లో ఓ లగ్జరీ ప్లాట్ ను బహుమతిగా స్వీకరించారని కూడా అంటున్నారు. అయితే వీటిపై స్పందించిన సోనియా మాత్రం.. పిచ్చి ప్రేలాపనలు వద్దు.. విచారణ జరిపించి రుజువు చేయించండి.. అని నిప్పులు చెరిగారు. అయితే సోనియా అన్న మాటలను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్టు ఉంది. అందుకే ఈ సవాల్ ను స్వీకరించి.. వేగవంతమైన దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ఒక విషయం బయటకు వచ్చింది. ఈ విషయానికి సంబంధించి గతంలో 2011 లో ఐబీ(ఇంటెలిజెన్స్ బ్యూరో) ఒక నివేదిక ఇవ్వగా ఇప్పుడది బయటకు వచ్చింది. అందులో సంజయ్ భండారీ... వాద్రాతో నిత్యం టచ్ లో ఉన్నట్లు.. తన కంపెనీ పేరిట తీసుకున్న వాద్రా మొబైల్ ఫోన్ కు భండారీ పలుమార్లు ఫోన్లు చేసినట్టు ఉంది. దీంతో వాద్రాకు మరింత ఉచ్చు బిగించినట్టైయింది. మరి దీనిపై సోనియా ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలంగాణ టీడీపీకి షాక్.. నేడు కారెక్కనున్న ఎంపీ మల్లారెడ్డి..

  ఒక పక్క ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీ నేతలు వరుస పెట్టి వలసలు పోతుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్దంగా పార్టీ నేతలు టీడీపీకి హ్యాండ్ ఇస్తున్నారు. తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ఇప్పటికే అందరూ టీఆర్ఎస్లో చేరారు. ఇంకా ఓ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. ఇప్పుడు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎప్పటి నుండో ఆయన టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అంతేకాదు ఓ బహిరంగ కార్యక్రమంలో ఆయన కేసీఆర్ పనితీరును పొగిడేశారు. దీనిపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినా తాను మాత్రం వాస్తవాలే మాట్లాడుతున్నానని సమర్థించుకున్నారు. దీంతో ఆయన కూడా టీఆర్ఎస్లోకి వెళతారంటూ వార్తలు వచ్చాయి. కానీ, అప్పుడు ఆయన కొంత వేచిచూశారు. చివరకు ఇప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో ఆయన తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. ఈరోజు మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

అలా అయితే కేసీఆర్ 114 సార్లు త‌ల న‌రుక్కోవాలి..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో ఆయనకు తోడుగా ఉండి.. ఉద్యమం విజయవంతం అయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించింది ఎవరంటే తెలంగాణ‌ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం గుర్తుకు వస్తారు. అయితే అప్పుడు కేసీఆర్ కు అంత దగ్గరగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా కేసీఆర్ పై, ఆపార్టీపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. ఒకానొక సందర్బంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ  ఏర్పాటు చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మరోసారి కోదండరాం.. కేసీఆర్ కు.. కేసీఆర్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు.   కరీంనగర్లో నిర్వహించిన ముస్లిం గర్జన కార్యక్రమానికి హాజరైన ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని , బడ్జెట్‌లో వాటో కోసం మైనార్టీలు ఐక్యంగా ఉద్యమించి, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. గతంలో మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు  రంగనాథ్‌ మిశ్రా, సచార్‌ కమిటీలు వేయగా.. అవి కూడా ఆర్థికంగా, విద్యా, ఉపాధిలో వెనుకబడిన మైనార్టీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చని సూచించారు. అయినా కూడా ప్ర‌భుత్వం ఆమేర‌కు నేటికీ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విమ‌ర్శించారాయ‌న. అంతేకాదు తాను మాట మీద నిలబడే వ్యక్తినని.. కేసీఆర్‌ మాట తప్పితే తలనరుక్కుంటానని ప‌దే ప‌దే చెప్పినా.... ఇప్పటివరకు ఆయన 114 సార్లు మాట తప్పారని ఎన్ని సార్లు త‌ల న‌రుక్కున్న‌ర‌ని కోదండరాం విమ‌ర్శించారు.   మరోవైపు కోదండరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. త‌న రిటైర్మెంట్ త‌రువాత అక్కున చేర్చుకుని శాస‌న మండ‌లిలో త‌న‌కు స్ధానం క‌లిపించ‌నందునే కోదండ‌రాం కేసీఆర్‌ని బ‌ద‌నాం చేస్తున్నార‌న్న‌ది తెరాస వ‌ర్గాల వాద‌న‌. చూద్దాం ... భ‌విష్య ప‌రిణామాలు ఎలా ఉండ‌బోతున్నాయో....

నేపాల్‌లో చిక్కుకున్న 65 మంది ఖమ్మం వాసులు.. చేతులెత్తేసిన ట్రావెల్స్

  నేపాల్‌లో పర్యటించేందుకు వెళ్లిన 65 మంది ఖమ్మం వాసులు ఆ దేశంలో చిక్కుకుపోయారు. మరోవైపు వీరిని తీసుకెళ్లిన ట్రావెల్స్ సంస్థ వారిని వెనక్కి తీసుకరావడంలో చేతులెత్తేసింది. దీంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని సురక్షితంగా స్వస్థలాలకి చేర్చాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిశారు.  దీంతో తుమ్మల ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం విదేశాంగ మంత్రితోపాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో వేణుగోపాలాచారి సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కుటుంబీకులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తుమ్మల హామీ ఇచ్చారు.

నాకు లేని బైకు ఎవ్వరికి ఉండకూడదని ఏం చేశాడంటే..?

మనకు లేనిది ఇతరులకు ఉంటే ఎవరికైనా ఈర్ష్య, అసూయ కలగడం సహజం. బయటకి ఎలా ఉన్న లోలోపల మాత్రం ఉడికిపోవడం మానవ సహజం. అయితే అలా ఆ ఉడుకుమోతుతనాన్ని లోపల దాచుకోలేకపోవడం ఢిల్లీ పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్య బైకులు తగలబడిపోతున్నాయి. దీనిపై పోలీసులకు లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.  పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఈ కేసులో చిక్కుముడి వీడటం లేదు.   ఈ నేపథ్యంలో మే 28న ఎప్పటిలాగే ఒక బైకు తగులబడుతోంది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నంచారు. ఇందులో విచిత్రమేంటంటే ఆ బైకుకు నిప్పు పెట్టిన వ్యక్తి కూడా ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం. ఆ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.  తన పేరు సునీల్ కిశోర్ అని, తనకు బైకులంటే చాలా ఇష్టమని చెప్పాడు. అయితే రోజు కూలిగా పనిచేసే తనకు బైకులు కొనే స్తోమత లేదని అందుకే బైకులు దొంగతనం చేయాలనుకున్నట్టు తెలిపాడు. కాని దొంగతనం చేసిన తర్వాత దొరికిపోతానేమోనన్న భయంతో తనకు లేని బైకులు ఎవ్వరికి ఉండకూడదని వాటిని తగులబెడుతున్నాని చెప్పాడు. దీంతో నిర్ఘాంఘపోవడం పోలీసులవంతైంది.

మహానాడులో ఎమ్మెల్యే డబ్బులు కొట్టేసిన దొంగ అరెస్ట్..

  టీడీపీ మహానాడు సభలు మూడురోజులు ఘనంగా జరిగాయి. కొన్ని వేలమంది టీడీపీ నేతలు ఈ సభలకు హాజరయ్యారు. అయితే పనిలో పనిగా పిక్ పాకెటర్స్ కూడా చాకచక్యంగా తమ చేతికి పనిచెప్పారు. అలా ఒక ఎమ్మెల్యే డబ్బులు కాజేసి దొరికిపోయాడు ఓ దొంగ. మహానాడు సభకు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు కూడా వచ్చారు. అయితే సభకు వచ్చిన ఆయన దగ్గర నుండి డబ్బులు కాదు. దాదాపు 95 వేల రూపాయలు దొంగలు కాజేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే డబ్బు పోయిందని పోయిందని జయరాములు ఫిర్యాదు చేయగా, దాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అన్నీ పరీశీలించి ఆఖరికి దొంగలను కనిపెట్టారు. జయరాములు వెనుక ఇద్దరు వ్యక్తులు కదలాడుతున్నారని.. వారే దొంగలని గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే నుంచి దొంగిలించిన సొమ్మును రికవరీ చేశారు.