ఎన్టీఆర్ జయంతి.. ఘనంగా నివాళులు

టీడీపీ మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు.  పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని వేదిక మీదే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, బాలయ్య, పార్టీ నేతలు నివాళి అర్పించారు.   మరోవైపు నేటి ఉదయం ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రాం, తారకరత్న, లక్ష్మీపార్వతి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి వేర్వేరుగా ఆయనకు నివాళి అర్పించారు. బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి తండ్రికి నివాళి అర్పించారు.

తప్పుడు ప్రచారాలు చేయోద్దు.. రాం దేవ్ బాబాకు ఝలక్..

ప్రముఖ యోగా గురువు రాం దేవ్ బాబాకు ఓ ఝలక్ తగలింది. ఆ ఝలక్ ఇచ్చింది ఎవరో కాదు ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ). గతంలో పతంజలి ఆయుర్వేద సంస్థ కోల్డ్‌ ప్రాసెస్డ్  టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని ప్రచారం చేసిన నేపథ్యంలో వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌ఈ), ఆహార భద్రతా ప్రమాణాల భారతీయ సంస్థ  (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రకటనల ప్రమాణాల మండలి ఫిర్యాదు చేసింది. తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. పతంజలి సంస్థ మాత్రం తాము ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయలేదని అంటుంది. దీంతో దీనిపై విచారించిన ప్రమాణాల భారతీయ మండలి పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది.  తనకు అందిన సుమారు 156  ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది. మరి దీనిపై ఇప్పుడు పతంజలి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఉప్పల్ స్టేడియం పేరు మారిస్తే ఊరుకోం.. వీహెచ్

  ఈ మధ్య నెహ్రూ-గాంధీ కుటుంబాల పేర్లు పలు కట్టడాలకు, రోడ్లకు పెట్టడంపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు బీజేపీ తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ స్టేడియం పేరు మార్చాలన్న ఆలోచన విరమించుకోవాలని.. ఉప్పల్ స్టేడియం పేరు మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండేళ్ల బీజేపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. నెహ్రూ కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. రాజ్యసభకు పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై రేపటి కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం తరువాత ఓ స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

వాటివల్ల మీకే ముప్పు.. పాక్ కు అమెరికా హెచ్చరిక..

  పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదుల వల్ల ఆ దేశానికి నష్టమని అమెరికా హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థల వివరాలు వెల్లడించాలని అమెరికా కోరింది. అంతేకాదు తాలిబన్ ఉగ్రవాద సంస్థలతో అక్కడ ఉగ్రచర్యలకు పాల్పడుతున్న ఇతర సంస్థలవల్లే పాకిస్థాన్ కే ముప్పు అని  అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ మార్క్ టోనర్ హెచ్చరించారు. ఇంకా ఆయన.. నాడు జరిగిన ముంబై దాడి కేసులో.. భారత్ కు సహకరించాలని.. భారత అధికారులకు ముంబై దాడుల విచారణలో పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించామని తెలిపారు.

నెహ్రూని పొగిడాడు.. బదిలీ అయ్యాడు..

  నెహ్రూని పొగిడిన ఐఏఎస్ ఆపీసర్ కి దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మధ్యప్రదేశ్ లోని బర్వానీలో అజయ్ సింగ్ గంగ్వార్ అనే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈయన నెహ్రూని పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇక అంతే ఆ పోస్ట్ వైరల్ గా మారి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం వరకూ వెళ్లింది. అంతేకాదు.. దీనిపై బీజేపీ నేత వివ్ఆస్ సారంగ్  స్పందించి.. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వాన్ని, వ్యవస్థను టార్గెట్ చేస్తూ అజయ్ గంగ్వార్ పేరు ఉందని ఆరోపించారు. దీంతో కేంద్రం ఒక పదవిలో ఉన్న అధికారులు.. రాజకీయ అంశాలపై కామెంట్లు చేయరాదన్న విషయాన్ని మరచిపోయి.. ఆ నిబంధనను ఉల్లంఘించినందుకుగాను ఆయనను అక్కడి నుండి బదిలీ చేశారు. కాగా అజయ్ సింగ్ గంగ్వార్ చేసిన పోస్ట్..   ”నెహ్రూ చేసిన తప్పులను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 1947 తరువాత మనం హిందూ తాలిబన్‌ రాష్ట్రం కాకుండా నెహ్రూ అడ్డుపడ్డారు. ఇది ఆయన చేసిన తప్పా? ఐఐటిలు, ఇస్రో, బిఎఆర్‌సి, బిహెచ్‌ఇఎల్‌, స్టీల్‌ ప్లాంట్లు, డ్యామ్‌లు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు మొదలైనవి స్థాపించారు.. ఇది నేరమా? విక్రమ్‌ సారాభాయ్‌, హోమిభాభా వంటివారిని సత్కరించారు, రామ్‌దేవ్‌, ఆశారామ్‌ వంటి ‘మేధావుల’ను కాదు..” అంటూ అజయ్‌సింగ్‌ గంగ్వార్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.     మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం బీజేపీ అజయ్ సింగ్ గంగ్వార్ పై వ్యవహరించిన తీరుపై మండిపడుతోంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు దేశంలో అసహనం ఉందనడానికి.. స్వాతంత్ర్య సమరయోధుడిని పొగడటం కూడా తప్పేనా అని ప్రశ్నించింది.

పరిటాల నుండి తుని ఘటన వరకూ.. చేయిచేయి కలిపి ప్రతిజ్ఞ

  తిరుపతిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘమైన ఉపన్యాసమే చేశారు. ఈ ప్రసంగంలో ఆయన పలు అంశాలను లేవనెత్తారు. ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. నాటి పరిటాల హత్య కేసు నుండి ఇటీవల జరిగిన తుని ఘటన వరకూ ఆయన ప్రస్తావించి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోశారు. పరిటాలది ముమ్మాటికి అప్పటి ప్రభుత్వ హత్యేనని.. ఈ విషయంపై అప్పటి అసెంబ్లీలో వైఎస్సార్ ని కూడా నిలదీశానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అరాచక శక్తులు చెలరేగినా దాని వెనుక వైఎస్ఆర్ కుటుంబసభ్యుల హస్తం ఉంటుందని.. ఈ మధ్య జరిగిన తుని ఘటనలో కూడా వారి హస్తం ఉందని ఆరోపించారు.   రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం.. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. నిధులు లేకపోయినా రైతు రుణాలు మాఫీ చేశాం.. నీరు ప్రగతి వల్ల చరిత్ర సృష్టించాం.. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే తమ అభిమతమని, గృహ నిర్మాణాన్ని మరింత సులభం చేసేందుకే ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అడ్డుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తామని చంద్రబాబు తెలిపారు.   చంద్రబాబు ప్రసంగం పూర్తి అయిన అనంతరం వేదికపై ఉన్న నేతలందరూ చేయిచేయి కలపి రాష్ట్రప్రగతికి ప్రతిజ్ణ చేశారు. చంద్రబాబుకు ఒక వైపు తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, మరో వైపు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకటరావు ఉన్నారు.

రాజన్ పై నోరు తెరిచిన మోడీ.. అంత ఆసక్తి అనవసరం

  ఆర్బీఐ గవర్నర్ రాజన్ పై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి గత కొద్ది రోజుల నుండి ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయనను ఆర్బీఐ గవర్నర్ గా తొలగించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. మరోవైపు ఈసారి కూడా ఆర్బీఐ గవర్నర్ గా రాజనే కావాలంటూ.. ఆయన ఉంటేనే వ్యవస్థకు మంచిది అంటూ కొంతమంది నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ నోరు తెరవని మోడీ ఇప్పుడు మొదటిసారి రాజన్ గవర్నర్ పదవిపై స్పందించారు. ఓ కార్యక్రమంలో రాజన్ గవర్నర్ పదవిపై ప్రభుత్వ నిర్ణయం ఏంటని ఆయనను అడుగగా.. ఇది పరిపాలనకు సంబంధించిన విషయం.. అయినా ఆయనకు ఇంకా సెప్టెంబర్ వరకూ సమయం ఉంది.. ఈలోగా ఏదో ఒకటి ఆలోచిస్తాం.. ఈ విషయంలో మీడియాకు అంత ఆసక్తి అనవసరం అని కాస్త గట్టిగానే చెప్పారు. మరి అప్పటిలోగా ఏం జరుగుతుందో చూడాలి.

ఒక్క డిబేట్.. 67 కోట్లు అడిగిన ట్రంప్..

  ఒక డిబెట్ లో పాల్గొనేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 కోట్లు అడిగాడు. ఇంతకీ అడిగింది ఎవరో తెలుసా.. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్. డిబేట్ ఏంటీ.. డబ్బులు ఏంటీ అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ కు హిల్లరీ క్లింటన్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బెర్నీ సాండర్స్ తో వాగ్వాదానికి సిద్ధమా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ట్రంప్ వెంటనే.. సిద్దమే కానీ దానికి డబ్బులు ఇవ్వాలని.. అది కూడా 10 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 67 కోట్లు ఇవ్వాలని అడిగాడట. ఆ డబ్బును చారిటీకి వాడుతానని కూడా చెప్పాడు. సాండర్స్ నాకు స్నేహితుడు.. అలాంటిది అతనితో వాగ్వాదం జరిగితే ఇష్టమేనని.. రేటింగ్ కూడా మంచిగా వస్తుందని.. మీడియా వ్యాపార ఎత్తులు తనకు తెలుసునని చెప్పాడు. మరి ట్రంప్ అడిగినట్టు అంత డబ్బు వెచ్చించి.. ఇద్దరికీ ఎవరు డిబేట్ పెట్టిస్తారో చూడాలి.

ఏపీని నెంబర్ వన్ గా చేయాలి..

  ఎన్నో పార్టీలు, జెండాలు వచ్చినా అన్నీ కనుమరుగైపోయాయి.. అనేక ఇబ్బందులకు, ఒడిదుడుకులకు ధీటుగా నిలిచిన ఏకైక పార్టీ టీడీపీనే.. ఎన్నో సంక్షోభాలు చూశాం.. గౌరవం కూడా పొందాం అని చంద్రబాబు మహానాడు సభలో వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడానికి హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది టీడీపీనే.. తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని హైదరాబాద్ ను అభివృద్ధిచేశాం.. కానీ రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్ట్రపోయింది.. ఇప్పుడు అభివృద్ధిలో ఏపీని నెంబర్ వన్ గా చేయాలి.. కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సిన భాధ్యత మనపై ఉంది అని అన్నారు. అంతేకాదు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. విభజన ఇబ్బందులు అధిగమించేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అని అన్నారు.

నేనూ ఓ కార్యకర్తనే.. కార్యకర్తలే నా కుటుంబం. చంద్రబాబు

  టీడీపీ కార్యకర్తలు చేసుకునే ఏకైక పండుగ మహానాడు అని.. నేనూ ఏ కార్యకర్తనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యుగపురుషుడి జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం.. ఎన్టీఆర్ పుట్టినరోజు తెలుగుజాతి పండుగరోజు.. తెలుగు జాతి ఎన్నటికీ మరిచిపోలేని నేత ఆయన.. తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నేత ఎన్టీఆర్.. అని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కార్యకర్తలు అనేక త్యాగాలు చేశారు.. నేనూ ఓ కార్యకర్తనే.. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఓ కార్యకర్తల్లా చూడలేదు.. నా కుటుంబ సభ్యుల్లానే చూశానని చెప్పారు. ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం ఖర్చు పెట్టారు..ప్రాణ త్యాగం చేశారు.. అటువంటి వారిని తెలుగుదేశం ఎన్నడూ మరచిపోదన్నారు. తాను పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలుగుదేశం కుటుంబ పెద్దగా కార్యకర్తలందరికీ అండగా ఉంటానని చంద్రబాబునాయుుడ చెప్పారు.

రాహుల్ గాంధీ మా సర్వెంట్.. స్టాంపేసిన పోలీసులు

  ఉత్తర ప్రదేశ్లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ ఇంట్లో పనిమనిషిగా చేసిన వైనం బయటపడింది. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురం రెసిడెంట్స్ వెల్పేర్ సొసైటీ పరిశీలనలో ఈ ఉదంతం బయటపడింది. ఓ వ్యక్తి రాహుల్ గాంధీ తన ఇంట్లో హెల్పర్ గా ఉన్నాడంటూ.. ఆయన ఫోటోను అతికించి పోలీసులకు వెరిఫికేషన్ ఫారమ్ ఇచ్చాడు. అంతేనా రాహుల్ చిరునామాను హౌస్ నంబర్ 12, తుగ్లక్ లేన్, న్యూఢిల్లీ అని, వృత్తి వద్ద రాజకీయాలని, మెరిటల్ స్టేటస్ వద్ద పెళ్లి కాలేదని కూడా రాశాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు ఇవేమి గమనించకుండా.. దాన్ని ఓకే చేసి.. స్టాంపేసి సంతకం కూడా పెట్టేశారు. మరోవైపు దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఇది ఎవరో ఆకతాయి చేసిన పని అని అంటున్నారు.

టీడీపీ మహానాడు ప్రారంభం..

  తిరుపతిలో టీడీపీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు కార్యక్రమానికి వచ్చారు. పార్టీ పతాకం ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రక్త శిబిరాన్ని ప్రారంభించారు. ఇంకా సభా ప్రాంగణంలో త్రీడీ షో, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివస్తున్నారు. దీంతో తిరుపతి నగరం పసుపుశోభతో నిండిపోయింది. కాగా జాతీయ పార్టీగా ఏర్పడిన తరువాత టీడీపీ తొలి మహానాడు ఇదే. కార్యక్రమానికి దాదాపు 30 వేల మంది హాజరవుతున్న నేపథ్యంలో అందరికి ఘుమఘుమలాడే వంటకాలు అందిస్తున్నారు.