ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ.. తొలి మహిళగా రికార్డ్

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా భారత్ తరఫున ఆమె నామినేట్ అయ్యారు. దీంతో ఆగస్టు 2 నుంచి 4 వరకు రియోడీజనిరోలో జరగనున్న ఐఓసీ సెషన్ ఎన్నికల్లో ఆమె బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నీతా విజయం సాధిస్తే... ఐఓసీలో అడుగుపెట్టిన తొలి భారత మహిళా సభ్యురాలిగా రికార్డులకెక్కనున్నారు. ఎన్నికలో నీతా విజయం సాధిస్తే... ఆమెకు 70 ఏళ్లు వచ్చేదాకా అందులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. కాగా ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పేరిట ఓ క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన నీతా... క్రీడలపై అమితాసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.

కదిరికి మారిన జగన్ యాత్ర.. హైటెన్షన్ వాతావరణం..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అనంతపురం జిల్లా యాడికిలో జగన్ యాత్రను టీడీపీ నేతలు అడ్డుకోగా.. ఈరోజు కదిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర కదిరిలో జరగనుంది. దీంతో రంగంలోకి దిగిన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కందికుంట వెంకటప్రసాద్ తన అనుచరులతో కలిసి రోడ్డెక్కారు. చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెబితేనే యాత్రను కొనసాగనిస్తామని కందికుంట కదిరిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను ముట్టడించే యత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

  తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-లారీ ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం సంభవించింది. వివరాల ప్రకారం.. కృష్ణగిరి సమీపంలోని మేలుమళై వద్ద 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కారు, లారీ అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా... మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతుల్లో చిన్నారి సహా ఆరుగురు మహిళలు ఉన్నారు. 30 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కృష్ణగిరిలోని ప్రభుత్వాసుత్రికి తరలించారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాహుల్‌కు ఓటేయడానికి భారతీయులు వెర్రొళ్లా..?

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని..ఆ పార్టీ అధినేతగా చేయడానికి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తుండటంతో దేశంలో పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై అందరూ తలొక మాట అంటున్నారు. ఈ విషయమై బాలీవుడ్ నటుడు ఓంపూరి కాస్త ఘాటుగా స్పందించారు. రాహుల్‌ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తే..అతనే ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించినట్టే. రాహుల్ అధ్యక్షుడైతే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. మనకు మోడీ తప్ప మరో దిక్కుండదు. రాహుల్ వయసెంత..అతని అనుభవం ఎంత. అసలు అతను ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు..అతడిని ప్రధానిగా ఓటేయడానికి భారతీయులు వెర్రివారా..? అన్నారు.

ట్రంప్ ను నమ్మి న్యూక్లియర్ కోడ్ చెప్పలేం.. హిల్లరీ

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ ట్రంప్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అలాగే హిల్లరీ క్లింటన్ మరోసారి ట్రంప్ శైలిపై విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ ను నమ్మి అమెరికాను అతని చేతిలో పెడితే ఘోర ప్రమాదాలు జరుగుతాయని.. పుతిన్ లాంటి నియంతను ట్రంప్ ప్రశంసించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఆలోచనా విధానం దేశానికి ప్రమాదకరమని ఆమె చెప్పారు. అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సిన పరిజ్ఞానం ఆయనకు లేదని అలాంటి.. వ్యక్తిని నమ్మి, అమెరికా న్యూక్లియర్ కోడ్ ను ఆయన చేతిలో పెట్టలేమని ఆమె స్పష్టం చేశారు. అధ్యక్ష స్ధానాన్ని అలంకరించేందుకు ట్రంప్ సరైన వ్యక్తి కాదని ఆమె స్పష్టం చేశారు.

వలసవచ్చిన పాకిస్థానీయులకు భారత పౌరసత్వం..

భారత్‌లోకి అక్రమంగా వలస వచ్చి స్థిరపడిన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన హిందువులకు భారత ప్రభుత్వం ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. వారందరికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ రెండు దేశాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. దీంతో ఈ దేశాలలోని ముస్లింల వేధింపులతో వేలాదిమంది శరణార్థులు భారత్‌కు వలస వచ్చి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికి పౌరసత్వం ఇవ్వాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అందుకుగాను 1955 పౌరసత్వచట్టానికి సవరణలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే ఆ రెండు దేశాల నుంచి వలస వచ్చిన సుమారు 2 లక్షల మంది హిందువులు లబ్థిపొందే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

కేసీఆర్ కు హరీశ్ రావు పాదాభివందనం..

  తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు ఈరోజు తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయన ముఖ్యమంత్రి, తన మామ అయిన కేసీఆర్ ను కలిశారు. ఆయనకు పాదాభివందనం చేయగా..  కేసీఆర్‌ ఆయనను ఆశీర్వదించారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాష్ట్ర‌ మంత్రులు, ప‌లువురు కార్య‌క‌ర్త‌ల న‌డుమ ఆయ‌న కేక్ క‌ట్ చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి.. హరీశ్‌రావుకు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పుట్టిన రోజు వేడుక సంద‌ర్భంగా హ‌రీశ్ రావుకి శుభాకాంక్ష‌లు తెల‌ప‌డానికి మంత్రులు, కార్య‌కర్త‌లు రావ‌డంతో అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. కొందరు మహిళా నేతలు ఆనందంతో నృత్యాలు చేశారు.

ఒకపక్క మాథుర్ లో హింసాత్మక ఘటనలు... మరోపక్క హేమమాలిని ఫొటోలు

  బాలీవుడ్ డ్రీమ్ గాళ్, ఎంపీ హేమమాలిని అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు మాథుర్ ఘటనలో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మథురలోని జవహార్ భాగ్ ప్రాంతంలో అక్రమణలను తొలగించేందుకు వచ్చిన పోలీసులపై అక్రమణదారులు తుపాకులు, గ్రానైడ్లతో దాడి చేయడంతో ఎస్పీతో సహా.. పలువురు మృతి చెందారు. అయితే ఒకవైపు అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగుతుంటే హేమమాలిని తన సినిమా షూటింగ్ కు సంబంధించిన పొటోలను అప్ లోడ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక అంతే హేమమాలిని చేసిన ఈ పనికి ఆమెపై విమర్శల బాణాలు విసురుతున్నారు. ఇక అంతా అయిపోయిన తరువాత జ్ఞానోదయం అయిన హేమమాలిని ఆఖరికి ఫొటోలు తీసేసింది.

మరో వివాదంలో సిద్ద రామయ్య... 1.3కోట్ల ముడుపులు..

  కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకున్న సిద్ద రామయ్య.. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ)కు స్టివార్డ్‌గా వివేకానంద అనే వ్యక్తిని సిద్దరామయ్య ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఎంపికపై సిద్దరామయ్యకు ముడుపులు అందాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎస్.భాస్కరన్ అనే సామాజిక కార్యకర్త  స్టివార్డ్‌గా నామినేషన్ వేసిన ఎల్.వివేకానందతో సిద్ధరామ‌య్యకు లావాదేవీలు జ‌రిగాయ‌ని.. స్టివార్డ్‌గా  నామినేట్ అయిన కొద్ది రోజుల‌కే సిద్ధరామయ్య ఆయ‌న నుంచి రూ.1.3కోట్ల రుణం తీసుకున్నార‌ని ఆధారాలను సంపాదించి స్పందించారు. కర్ణాటక గవర్నర్ ఈ వ్య‌వ‌హారంపై జోక్యం చేసుకోవాల‌ని ఎస్.భాస్కరన్ కోరారు. మరోవైపు ఈ విష‌య‌మై వివేకానంద స్పందిస్తూ.. సీఎంతో ఎటువంటి లావాదేవీలు జ‌ర‌గ‌లేద‌ని, త‌మ‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని అన్నారు.

ఒబామా ప్రసంగిస్తుండగా..కూలిన విమానం

అమెరికా అధ్యక్షుడు ఒక చోట ఉన్నాడంటే అక్కడ సెక్యూరిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. డ్రోన్‌లు, యుద్ధ విమానాలు, సైన్యంతో కంటికి రెప్పలా తమ అధ్యక్షుణ్ని కాపలా కాస్తుంటాయి. అలాంటిది ఆయన ప్రసంగిస్తుండగా పేలుడు సంభవించిందంటే ఇంకేమైనా ఉందా. నిన్న అమెరికాలోని కొలరాడోలో ఒబామా ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ యుద్ధ విమానం ఆయన ఉన్న వేదిక మీద నుంచి ఎగురుతూ వెళ్లింది. ఆ కొద్ది సేపటికే అందరూ చూస్తుంగానే ఆ విమానం కూలిపోయింది. అంతే భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. పీటర్సన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చెందిన ఆ యుద్ధ విమానం అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ గ్రాడ్యుయేషన్ సామర్థ్యాన్ని తెలిపేలా ప్రదర్శనలు ఇస్తుండగా కూలిపోయింది. అయితే అందులోని పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి సమయంలో ఏ అధ్యక్షుడైనా తన సభను ముగించుకుని తిరుగు ప్రయాణమవుతాడు. కాని ఒబామా మాత్రం ఆ పైలెట్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.

నన్ను ఆంధ్రా పంపించవద్దు ప్లీజ్.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం..

  ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ జూన్ 27 నాటికి ఏపీ రావాలని చెబుతున్నారు. మరోపక్క ఉద్యోగులు మాత్రం ఏపీకి రావడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. కొంతమంది ఉద్యోగులైతే .. స్వచ్చంద పదవీ విరమణ చేద్దామని కూడా నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ఆంధ్రాకు వెళ్లి తాను ఉద్యోగం చేయలేనని, తెలంగాణలోనే ఉంటానంటూ ఒక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని అగ్రికల్చరల్ కమిషనర్ కార్యాలయం ఎదుట సదరు ఉద్యోగి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉద్యోగిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తనను ఆంధ్రాకు పంపవద్దని ఆ ఉద్యోగి విజ్ఞప్తి చేశాడు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఓటుకు నోటులో మత్తయ్యకు ఊరట..!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న జెరూసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్యపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిని కొట్టివేయాలని మత్తయ్య తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం మత్తయ్యపై నమోదైన ఆరోపణలను కొట్టివేసింది. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు లంచం ఇస్తూ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలను తెలంగాణ ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు.  

స్పెల్లింగ్ సరిగా రాయడం రాదు.. డిగ్గీ పై కేటీఆర్

  తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు నిన్నఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవేడుకల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కేసీఆర్ పై విమర్శలు చేసిన సంగతి కూడా విదితమే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కేసీఆర్‌ ఉత్సవాలను జరిపిస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే.. మరోవైపు వేడుకలు చేసుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు’ అని దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారు.   అయితే ఇప్పుడు డిగ్గీ చేసిన ట్వీట్లకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్పందించి చురకలు అంటించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ స్పెల్లింగ్‌ రాయటం కూడా తెలియదు. ఆయన కేసీఆర్‌ను విమర్శిస్తారు!’ అంటూ విమర్శించారు.  

కొత్తగా పెళ్లైన బీఎస్‌ఎఫ్ సైనికులకు శుభవార్త..!

త్యాగాలకు..పోరాటానికి మారుపేరు భారత సైన్యం..ఎన్ని కష్టాలొచ్చినా దేశభద్రతే పరమావధిగా బతుకుతారు మన సైన్యం. ఆఖరికి ఉదయం పెళ్లైయితే సాయంత్రం విధుల్లో చేరేందుకు కూడా మన జవాన్లు ఏ మాత్రం బాధపడరు. కానీ పెళ్లైన గంటకే తమ భర్తలు దేశ సరిహద్దులకు పయనమవ్వడాన్ని వారి భార్యలు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు సైనికులు కూడా కాపలా కాస్తున్నప్పటికి మనసంతా వారి భార్యలపైనే ఉంటోంది. వీరి పరిస్థితిని గమనించిన బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు దీనికి ఒక ఉపాయం ఆలోచించారు. ఇకపై కొత్తగా పెళ్లైన బీఎస్‌ఎఫ్ జవాన్లు దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ భార్యతో కలిసి ఉండవచ్చు. ఈ మేరకు కొత్తగా వివాహం జరిగిన సైనికుల నుంచి బీఎస్ఎఫ్ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఎవరు ముందుగా దరఖాస్తు చేస్తే వారికే అవకాశం. అది కూడా జైసల్మేర్ ఉత్తర, దక్షిణ సెక్టార్‌లో విధులు నిర్వహించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే జవాన్లకు కూడా కల్పించాలని బీఎస్ఎఫ్ యోచిస్తోంది.

యాపిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్..!

  బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను యాపిల్ భారత రాయబారిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది యాపిల్ సంస్థ కొత్త మోడళ్లను విడుదల చేయనున్న నేపథ్యంలో షారుఖ్ ను భారత రాయబారిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. భారత పర్యటనకు వచ్చిన యాపిల్ సంస్థ సీఈవో టీమ్ కుక్.. షారుఖ్ ఇచ్చిన డిన్నర్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడే దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ప్రముఖ బ్రెజీలియన్‌ సాకర్‌ క్రీడాకారుడు నేమార్‌, అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు స్టీఫ్‌ కర్రీ ఇలా చాలా మంది యాపిల్‌కి రాయబారులుగా నియమితులయ్యారు.