టీ సమయం..ఇంగ్లండ్ 5 వికెట్ల‌కు 205 ప‌రుగులు

  మోహాలీ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ముందు కాస్త తడబాటుతో ఆడినా ఆతరువాత కాస్త కుదురుకొని బాగానే స్కోర్ సాధించింది. టాపార్డ‌ర్ కుప్ప‌కూలినా.. మిడిలార్డ‌ర్ ఇంగ్లండ్‌ను ఆదుకుంది. మ‌రోసారి జానీ బెయిర్‌స్టో, స్టోక్స్ జోడీ.. వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకోగా.. ఆ తర్వాత బెయిర్‌స్టో, బట్ల‌ర్ జోడీ ఇంగ్లండ్‌ను గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు దిశ‌గా న‌డిపిస్తోంది. దీంతో టీ స‌మ‌యానికి ఇంగ్లండ్ 5 వికెట్ల‌కు 205 ప‌రుగులు చేసింది.

క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్‌ క్యాస్ట్రో మృతి...

  క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో(90) ఈరోజు  కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్యాస్ట్రో  తుది శ్వాసను విడిచారు. కాగా 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో జన్మించిన ఆయన అసలు పేరు ఫిడెల్‌ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్‌. ఈయన 1959 నుంచి 1976 వరకూ క్యూబా ప్రధానిగా పనిచేశారు. అనంతరం  1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా పనిచేశారు. క్యూబాను దాదాపు 5 దశాబ్దాల పాటు పాలించిన క్యాస్ట్రో ప్రాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యునిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి... అమెరికా సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడేవారు. అంతేకాదు ఇందుకుగాను క్యాస్ట్రోను చంపేందుకు అమెరికా 638 సార్లు ప్రయత్నించింది కూడా.

ప్రధాని బందోబస్తు.. ఎస్ఐ ఆత్మహత్య...

హైదరాబాద్ లో ఓ  ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీకి బందోబస్తుగా వచ్చిన ఎస్ఐ. వివరాల ప్రకారం.. కొమురం భీమ్ జిల్లా పెంచికల్ పేట్ ఎస్ఐగా ఉన్న శ్రీధర్ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో బందోబస్తు కోసం హైదరాబాద్ వచ్చాడు. అయితే అతను శ్రీధర్ మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై... పిల్లర్ నెంబర్ 174 వద్ద పిస్టల్ ను గుండెకు గురిపెట్టుకుని, కాల్చుకుని చనిపోయాడు. అయితే శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. కాగా శ్రీధర్ 2012 బ్యాచ్ కు చెందిన అధికారి.

కిడ్నీలు చెడిపోయిన మహిళ.. ముందుకొచ్చిన కేటీఆర్...

  తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అంతే కాదు ట్వీట్టర్ ద్వారా నెటిజన్లు ఏమన్న విజ్ఞప్త్లు చేసినా ఆయన సాయం అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాగే ఓ మహిళకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. అసలు సంగతేంటంటే.. కరుణ అనే 55 ఏళ్ల ఆమె హైదరాబాద్‌ ఉప్పల్‌లో ‘కారుణ్య ఆర్ఫా అండ్‌ ఒల్డేజ్‌ హోమ్‌’ అనే పేరుతో అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో దాదాపు 70 మంది అనాథా చిన్నారులకు, నలుగురు వృద్ధ వితంతువులకు సేవలు అందిస్తున్నారు కరుణ. అయితే ఈమెకు రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇక ఆపరేషన్ కు ఎక్కువ మొత్తంలో ఖర్చవడటంతో ఏం చేయాలో తెలియక హృదయ స్పందన అనే స్వచ్ఛంద సంస్థ  ఆమెకు నిమ్స్‌లో చికిత్స అందించాల్సిన అవసరముందని, ఆమె వైద్యఖర్చులకు రూ. 3 లక్షలు ఖర్చు అవుతుందని కోరుతూ ట్విట్టర్‌లో కేటీఆర్‌ను, తెలంగాణ సీఎంవోను విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ ట్వీట్ ను చూసిన కేటీఆర్ ఆమెకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ మ్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటింగ్...

  భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మోహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కాగా ఇప్పటివరకూ రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగగా మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇక రెండో మ్యాచ్ లో టీమిండియా గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. టీం ఇండియా ఆటగాళ్లు: మురళీ విజయ్, పార్థీవ్ పటేల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, కేకే నాయర్, అశ్విన్, జడేజా, యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ ఇంగ్లండ్ టీం: కుక్, హమీద్, రూట్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, వోక్స్, రషీద్, బ్యాటీ, అండర్‌సన్

హైదరాబాద్లో ఈరోజు ప్రధాని షెడ్యూల్ ఇదే...

  ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ లో డీజీపీల వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గాను మోడీ నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి ఇక్కడే బస చేసిన మోడీ ఈరోజు జాతీయ పోలీస్ అకాడమీలో డీజీపీల సదస్సులో పాల్గొననున్నారు. ఈరోజు హైదరాబాద్లో మోడీ షెడ్యూల్ ఒకసారి చూస్తే.. * ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఐపీఎస్‌లతో యోగా కార్యక్రమం. * 8గంటల నుంచి సాయంత్రం 5 గంటలదాకా డీజీపీల సదస్సులో పాల్గొంటారు. * సాయంత్రం 5.05గంటలకు రోడ్డు మార్గాన ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. * 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. * 7.40 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇదిలా ఉండగా మోడీతో పాటు ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హన్స్ రాజ్ గంగారామ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొననున్నారు.

హైదరాబాద్ కు మోడీ...

  ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ఉదయం జరగనున్న జాతీయ డీజీపీల సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో ఆయన ఈరోజు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. ఆయన వెంట పలువురు కేంద్రమంత్రులు, అధికారులు కూడా ఈ ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీకి ఘన స్వాగతం పలకడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాన రోడ్డుమార్గంలో కిషన్‌ గూడ, కామంచెర్వు, మధురా నగర్‌, ఆర్బీనగర్‌, కొత్వాల్‌ గూడ చౌరస్తా, భారత చౌరస్తా, సాతం రాయి, గగన్‌ పహాడ్‌, ఓల్డ్‌ కర్నూల్‌ చౌరస్తా గుండా శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీకి చేరుకోనున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సైనాను వెనక్కి నెట్టిన సింధు..

  ఒలింపిక్స్ లో పతంక సాధించిన పీవీ సింధూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటికే తన ప్రతిభను చాటిన సింధూ మరో ఘనతను సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌ జాబితాలో సింధూ టాప్-10లో స్థానం దక్కించుకుంది. టాప్-10లో సింధు తొమ్మిదో స్థానం సాధించింది. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో సింధు స్థానం సాధించగా.. సైనా నెహ్వాల్‌ మాత్రం తన ర్యాంకును కోల్పోయింది. టాప్‌-10లో చోటు కోల్పోయి 11వ ర్యాంకుకు పడిపోయింది. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్‌-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి.

పాక్ కు చుక్క నీరు కూడా ఇవ్వం...

సింధూ నది జలాలపై ప్రధాని మోడీ పాకిస్థాన్ కు భారీ షాక్ ఇచ్చారు. ఈరోజు పంజాబ్ పర్యటన చేసిన ఆయన సింధూ నది జలాల గురించి మాట్లాడుతూ.. సింధూ నది జలాలను చుక్క కూడా పాక్‌కు అనుమతించబోమని, ఆ నీటిని భారత రైతులకు అందించేందుకు తాము ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పారు. పాకిస్థాన్లోకి వెళ్లిపోతున్న నదీ జలాలను ఉపయోగించుకునే హక్కు భారత రైతులకు ఉందని 'సింధూ నదీ జలాలు భారత హక్కు.. కానీ పాక్‌లోకి వెళ్లిపోతున్నాయి.. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లన్నీ కూడా భారత రైతులవే. ఆ నీళ్లను భారత రైతులకు అందించే చర్యలన్నీ తీసుకుంటాం. పాక్‌కు చుక్క నీరు పోనివ్వం' అని మోదీ స్పష్టం చేశారు.

ట్రంప్ కు భద్రతా సిబ్బంది ఎంతమందో తెలుసా..?

  అమెరికా అధ్యక్ష బరిలో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. మరి మామూలు రాజకీయ నేతలకే రక్షణ సిబ్బంది చాలా మంది ఉంటారు. అలాంటిది ఇక అమెరికా అధ్యక్షుడికైతే  భద్రత  ఏ రేంజ్ లో ఉంటుంది మరీ. డోనాల్డ్‌ ట్రంప్‌ భద్రత కోసం రహస్య రక్షణ సిబ్బంది ట్రంప్‌ టవర్స్లోని రెండు అంతస్తులు కోరారట. కొద్దికాలంపాటు ట్రంప్‌ ఇక్కడే ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 250మంది ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలు చూడనున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఎక్కడ ఉండాలి? ఎలా విధులు నిర్వర్తించాలి? ఆయనను కలిసేందుకు వచ్చే వ్యక్తులుపై ఎలాంటి నిఘా నిర్వహించాలి? అనే తదితర అంశాలపై ట్రంప్ చర్చించనున్నారు.

పీఓకే ఇండియా అబ్బ సొత్తా?

  ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండియా-పాక్ మధ్య తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అప్పుడు దీనికి తోడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాక్ ఆక్రమిత కాశ్మీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  చీనాబ్ లోయలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన "పీఓకే ప్రస్తుతం పాకిస్థాన్ అధీనంలో ఉంది.. పీఓకే ఏమైనా ఇండియా అబ్బ సొత్తా? అని ప్రశ్నించారు. అదేమీ భారత వ్యక్తిగత ఆస్తి కాదు. తల్లిదండ్రులు, తాతముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి కాదు.. ఈ విషయంలో పాకిస్థాన్ కూ వాటా ఉంది.. పీఓకే ఇండియాలో భాగమని ఓ తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదు" అని ఆయన అన్నారు. పాక్ నుంచి ఆక్రమిత కాశ్మీర్ ను వెనక్కు తిరిగి తెచ్చే దమ్ము, ధైర్యం భారత్ కు లేవని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలకు కోహ్లీ ఫైర్...

టీమిండియా టెస్ట్ మ్యాచ్ కెప్టన్  విరాట్ కోహ్లీపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈవిషయంపై సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవంబర్‌9 నుంచి 13 వరకు రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్‌ కోహ్లీ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్‌’ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కోహ్లీ ఇండియా- ఇంగ్లాండ్‌ క్రికెట్‌ సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్థంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డాడు. ‘నిజానికి నాకు న్యూస్‌ పేపర్లు చదివే అలవాటులేదు. రాజ్‌కోట్‌(మొదటి) టెస్ట్‌లో నేను బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని ఒక పేపర్‌లో వచ్చిన సంగతి నాకు ఐదు రోజుల కిందటే తెలిసింది. ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. విచక్షణతో ఆలోచిస్తే.. హోరాహోరీగా సాగుతోన్న ఇండియా-ఇంగ్లాండ్‌ సిరీస్‌పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది’అని అన్నారు. కాగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్‌ మొహాలీలో జరగనుంది.

మోడీ పంజాబ్ టూర్... ఎయిమ్స్‌కి శంకుస్థాపన

  నేడు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా మోడీ పంజాబ్‌లోని బఠిండాలో ఎయిమ్స్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల వికాసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. రహదారులు, విమానాశ్రయాలు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అత్యున్నత ప్రమాణాలు గల పాఠశాలలు ఆస్పత్రులు మనకు అవసరమని.. తమ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాదని.. తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఏ దైశమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు కల్పనే ముఖ్యమన్నారు.