సినిమా థియేటర్లలోనే జాతీయగీతం ఎందుకు..?
posted on Dec 1, 2016 @ 1:45PM
రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏం విషయంపై ఎలా స్పందిస్తాడో చెప్పలేం. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై స్పందించి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దానిపై స్పందించిన వర్మ... ‘జాతీయగీతం థియేటర్లలోనే ఎందుకు ప్రసారం చేయాలి? కస్టమర్లు దుకాణంలో అడుగుపెట్టే ముందు జాతీయగీతం ప్రసారం చేశాకే లోపలికి ఎందుకు వెళ్లకూడదు? ప్రతి టీవీ ప్రోగ్రాం, టీవీ సీరియల్ ఎపిసోడ్, రేడియో ప్రోగ్రాంలు ఆరంభంలో జాతీయగీతాన్ని ఎందుకు ప్రసారం చేయకూడదు? వార్తలు అందించే ముందు టీవీలో ఎందుకు జాతీయ గీతాన్ని ప్రసారం చేయకూడదు? తల్లిదండ్రులు, పిల్లలు ఉదయాన్నే నిద్రలేవగానే జాతీయగీతం పాడి దినచర్య ప్రారంభించకూడదా? అన్ని మతాల ప్రార్థనాలయాల్లో ప్రార్థనలకు ముందుగా జాతీయగీతాన్ని ప్రసారం చేయకూడదా? నైట్ క్లబ్స్‌లో తాగడానికి, డ్యాన్స్ చేయడానికి ముందు జాతీయగీతం ప్రసారం చేయకూడదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. అంతేకాదు జాతీయగీతం సారాంశం గురించి రాయమని పరీక్షల్లో అడిగితే దాదాపు 99 శాతం భారతీయులు ఖచ్చితంగా ఫెయిలవుతారు అని అన్నారు. మన రాష్ట్రీయ భాష హిందీకి చాలా వెర్షన్లు ఉన్నప్పుడు భారతీయులకు అర్థమయ్యేలా జాతీయగీతాన్ని అన్ని వెర్షన్‌లలోనూ విడుదలచేయకూడదా?’ అంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్లు విసిరాడు. మరి నిజంగానే వర్మ చెప్పిన దాంట్లో కాస్త లాజిక్ ఉన్నట్టే కనిపిస్తోంది కదా...