15 మంది పాకిస్థాన్ రేంజర్లు.. 10 మంది ఉగ్రవాదులు హతం...
posted on Nov 30, 2016 @ 3:38PM
భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జమ్ము కాశ్మీర్ లోని నగ్రోటాలో పోలీసుల దుస్తుల్లో ఉగ్రవాదులు చొరబడి భారత్ ఆర్మీ ఆర్టిలరీ విభాగంలో చొరబడి కాల్పులు జరపగా.. భారత సైన్యం కూడా రంగంలోకి దిగి ముష్కరులను మట్టు బెట్టారు. అయితే ఇప్పుడు బీఎస్‌ఎఫ్ డీజీ కేకే శర్మ మాట్లాడుతూ.. భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి ఉగ్రవాదుల శిబిరాలపై చేసిన లక్షిత దాడుల తరువాత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్ రేంజర్ల ఆగడాలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని, ఇప్పటి వరకు 15 మంది పాకిస్థాన్ రేంజర్లను మట్టుబెట్టామని.. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ప్రయత్నించిన 10 మంది ఉగ్రవాదులను కూడా హతమార్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో భద్రతాదళాలకు ఇబ్బందులు ఏమీ లేవని స్పష్టం చేశారు.
ఇంకా సరిహద్దు భద్రత గురించి మాట్లాడుతూ.. సరిహద్దుల్లో 24 గంటలూ నిఘా ఉందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో సాంకేతికత వినియోగం పెరుగుతోందని.. సరిహద్దు ప్రాంతాల్లో కంచెల ఆధునికీకరణకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని, ఉగ్రవాదుల చొరబాట్లను, దాడులను తిప్పికొడుతున్నామని చెప్పారు.