తమిళనాడులో భద్రత కట్టుదిట్టం..
posted on Dec 5, 2016 @ 9:46AM
నిన్న రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుకు గురవ్వడంతో తమిళనాడు మొత్తం ఆందోళనలో ఉంది. అమ్మ ఆరోగ్యం సీరియస్ గా ఉందన్న విషయం తెలియగానే పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఇక ఆడవాళ్లు అయితే కన్నీరు మున్నీరవుతున్నారు. అమ్మ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మండలస్థాయి నుంచి పోలీసులను భారీగా మోహరించారు. ఇక పోలీసులకు సెలవులకు రద్దు చేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న పోలీసులు విధుల్లో త్వరగా చేరాలని, ప్రతి ఒక్కరూ యూనిఫాంలోనే విధి నిర్వహణ చేయాలని ఆదేశించారు. అపోలో ఆస్పత్రి, జయలలిత నివాసం, అన్నాడీఏంకే కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్‌తో పాటు పోలీసులు భారీగా మోహరించారు.