జయ మృతికి ప్రముఖుల నివాళులు.. ఎవరెవరు ఎమన్నారంటే...
posted on Dec 6, 2016 @ 3:14PM
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత నిన్న రాత్రి తన తుదిశ్వాస విడిచారు. దీంతో జయలలితకు పలువురు నివాళులు అర్పించారు. జయలలిత మృతిపై ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం..
రాష్ట్రపతి..
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. జయలలిత మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. జయలలిత ప్రజాకర్షణ కలిగిన గొప్ప నేత పరిపాలన దక్షత కలిగిన నాయకురాలని.. కోట్లాది మంది ప్రజలు ఆరాధించిన, ప్రేమించిన గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందని అన్నారు.
ప్రధాని మోడీ..
జయలలిత మృతిపట్ల మోడీ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆమె మృతిపై స్పందించిన ఆయన భారత రాజకీయాల్లో ఆమె మరణం తీరని నోటు.. అనేకసార్లు జయలలితతో సంభాషించిన సందర్బాల్ని నేను మరచిపోలేనని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఆమెకు సంతాపం తెలిపారు.
సోనియా గాంధీ..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జయలలిత మృతిపై స్పందించి.. తీవ్ర కలతచెందానని.. దేశంలోనే కాక రాజకీయంగాను ఆమె గొప్ప నేత అని అన్నారు. దేశరాజకీయాల్లో జయలలిత లేని లోటు తీర్చలేనిదని ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జయలలితకు నివాళులు అర్పించారు. గొప్ప నేతను కోల్పోయాం.. మహిళలు, రైతులు మత్స్యకారులు జయలలిత కళ్లతో కలలు కనేవారు అని అన్నారు.
ఎం.కె స్టాలిన్
తమిళనాడు ప్రత్యర్థ పార్టీ అయిన డీఎంకే పార్టీ నేత కుమారుడు స్టాలిన్ కూడా జయలలిత మృతికి సంతాపం తెలియజేశారు. ముఖ్యమంత్రి మరణంతో తీవ్రంగా కలతచెందా.. పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులకు ఈ విషాద సమయంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు.
సీఎం కేజ్రీవాల్..
జయలలిత మృతికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాళులు అర్పించారు. అమ్మ మృతి వార్త విని చాలా బాధపడ్డా.. చాలా చాలా గొప్పనేత.. సామాన్యుల నాయకురాలు..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు.
సీఎం మెహబూబా ముఫ్తీ..
తమిళ ప్రజలకు జయలలిత దేవత అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. జయలలిత ప్రజల ముఖ్యమంత్రి అని, ఆమె మృతి తీరని లోటు అని అన్నారు. ఈ సందర్భంగా జయ మృతి పట్ల ఆమె సంతాపం ప్రకటించారు.
సీఎం మమతా బెనర్జీ
జయలలిత మరణం దేశ రాజకీయాలకు తీరని నష్టమని.. గొప్ప, బలమైన, ధైర్యవంతమైన, ప్రజాదారణ కలిగిన ఆరాధ్యనేతను కోల్పోయాం. నిరంతరం ఆమె అభిమానుల హృదయాల్లో ఉంటారు అని ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు.
సీఎం చంద్రబాబు..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా అందరు రాష్ట్ర మంత్రులూ ఈ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు తెలిపారు. ఆమె మృతి దేశంలో ప్రతి ఒక్కరికి షాక్ లాంటిదని..అన్ని పోరాటాల్లోనూ ఆమె విజయాన్ని సాధించారని తెలిపారు.
సీఎం కేసీఆర్..
తమిళనాడు సీఎం జయలలిత మృతి తమిళ సమాజానికి తీరనిలోటని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. జయ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జయలలిత మరణం తమిళ సమాజానికి తీరని లోటని.. జయలలిత రాజకీయ ప్రస్థానం సాహసోపేతమైనదని పేర్కొన్నారు. ఆమె అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం తమిళ రాజకీయాల్లో గొప్ప విషయమన్నారు. ఆమె తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నేత అని కొనియాడారు.
సీఎం నితీశ్ కుమార్...
జయలలిత మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని.. దేవుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని.. బీహార్ లో ఒకరోజు సంతాపదినం ప్రకటిస్తున్నాం అని నివాళులర్పించారు.
వైఎస్ జగన్..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం పట్ల జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక శక్తివంతమైన మహిళా శకం ముగిసిందని..తమిళనాట ఎన్నో సంక్షేమ పథకాలను ఓ ఉద్యమంలా ప్రారంభించి, కొనసాగించిన ఆమె ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు.
రజనీకాంత్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆ రాష్ట్ర సీఎం జయలలిత మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దేశం ఓ ధైర్యవంతురాలైన కూతుర్ని కోల్పోయిందని రజనీకాంత్ తన ట్వీట్‌లో జయను కీర్తించారు. కేవలం తమిళనాడు మాత్రమే కాదని, యావత్ దేశం ధైర్యవంతురాల్ని కోల్పోయినట్లు, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు రజనీ ఆమెకు నివాళులర్పించారు.
అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా సీఎం జయ మృతి పట్ల సంతాపం తెలిపారు. జయ మృతి విషాదకరమని ఆయన అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పార్తిబన్, జీయమ్ రవి, త్రిష, శృతి హాసన్, డైరక్టర్ గౌతమ్ మీనన్ జయ మృతి పట్ల సంతాపం తెలిపారు.