మరో వివాదంలో గాలి జనార్ధన్ రెడ్డి.. డ్రైవర్ ఆత్మహత్య..
posted on Dec 7, 2016 @ 3:34PM
ఇప్పటికే కూతురు పెళ్లికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని గాలి జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు రాగా.. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. కర్నాటకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. అక్కడ దొరికిన సూసైడ్ నోట్ లో గాలి జనార్ధన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివరాల ప్రకారం.. మద్దూర్‌లో రమేశ్ గౌడ అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను భీమానాయక్ అనే ల్యాండ్ రిజిష్ట్రేషన్ అధికారి దగ్గర అతను డ్రైవర్‌గా పనిచేసేవాడు. గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు వివాహం కోసం దాదాపు 100 కోట్ల నల్లధనాన్ని వైట్‌గా మార్చేశాడట. భీమానాయక్ సాయంతో గాలి జనార్ధన్ రెడ్డి నల్లధనాన్ని మార్చాడట. దీనికి గాను భీమానాయక్ 20 శాతం కమీషన్ కూడా తీసుకున్నాడట. అంతేకాదు 2018వ సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు ఇప్పించాలని కూడా భీమా నాయక్ ఒప్పందం కుదుర్చుకున్నాడట. అయితే కూతురి వివాహానంతరం.. గాలి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేశారు. దీంతో రమేశ్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయట. అందుకే బెదిరింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రమేశ్ తన సూసైడ్ నోట్ లో తెలిపాడు. మొత్తానికి గాలికి ఒకదాని తరువాత మరొక సమస్య వస్తూనే ఉంది. మరి దీనిపై గాలి ఎలా స్పందిస్తాడో.. ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో చూద్దాం...