50 కోట్లు ఇవ్వకపోతే సీఎంను చంపేస్తాం..
posted on Dec 13, 2016 @ 10:38AM
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 కోట్లు ఇవ్వాలని... లేదంటే సీఎం ను చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఆ సీఎం ఎవరనుకుంటున్నారా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బెదిరింపు లేఖ వచ్చింది సీఎంకు కాదు.. తూర్పు రైల్వేకు. ఉన్నపలంగా రూ.50 కోట్లు సమకూర్చాలని లేదంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామని, హౌరా రైల్వేస్టేషన్ను పేల్చుతామని తీవ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ నుంచి తూర్పు రైల్వే కార్యాలయానికి ఈ లేఖ అందింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చెందిన ఓ తీవ్రవాది చేతివ్రాతతో ఈ బెదిరింపు లేఖ హెడ్క్వార్టర్స్కు వచ్చింది. ఆ లేఖలో తమ గ్రూప్ కోసం రూ.50 కోట్లను తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ అందించాలని, ఒకవేళ తమ డిమాండ్ నెరవేర్చకుంటే హౌరా రైల్వేస్టేషన్ను ఐఈడీతో పేల్చి, లక్షలాది మంది ప్రయాణికులను చంపేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మమతా బెనర్జీని కూడా తమ ఆర్గనైజేషన్ హతమారుస్తుందని బెదిరించారు. దీంతో లేఖను డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ బద్రినారాయణ్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ లేఖను మాజీ దూరదర్శన్ ఉద్యోగి ఎస్సీ దాస్ రాసినట్టు.. గత కొద్ది కాలంగా ఉగ్రవాదులకు తన ఫ్లాట్స్లో ఆయన ఆశ్రయం ఇస్తున్నట్టు తెలుస్తోంది.