మోడీ వచ్చినా ఉపయోగం లేదు...
posted on Dec 14, 2016 @ 12:16PM
పార్లమెంట్ లోక్ సభలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన సంగతి తెలిసిందే. అయితే మోడీ సభకు హాజరైనా ఎలాంటి ప్రయోజనం మాత్రం లేదు. మోడీ వచ్చినందుకైనా ఈరోజు పెద్ద నోట్లపై చర్చ జరుగుతుందని అందరూ భావించినా.. అది మాత్రం జరగలేదు. అయితే ఈరోజు పెద్ద నోట్ల రద్దుపై కాకుండా అగస్టా కుంభకోణంపై కేంద్ర మంత్రి రిజిజుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అధికార, విపక్ష నేతల మధ్యం మాటల యుద్దం జరిగింది. అగస్టా కుంభకోణంలో త్యాగి అరెస్టు అంశంపై భాజపా సభ్యుడు మాట్లాడటంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే అరుణాచల్‌ప్రదేశ్‌లో విద్యుత్ ప్రాజెక్టు కుంభకోణం, పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించాలని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రాజెక్టు కుంభకోణంలో రిజిజు ప్రమేయం ఉందని, ప్రాజెక్టు బిల్లు చెల్లింపుల్లో కిరణ్‌రిజిజు ఒత్తిడి చేశారని విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజుజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్ స్పందిస్తూ.. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉండగా .. విపక్షాలు అడ్డుకోవడం సబబు కాదన్నారు. ఎంతకీ విపక్షాలు ఆందోళనలు ఆపకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.