తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. పెద్ద నోట్ల రద్దుపై చర్చ..
posted on Dec 16, 2016 @ 11:47AM
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన ఈ సమావేశాలు... ఈ నెల 30 వరకు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలలో పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పెద్ద నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నదని.. అవినీతి, ఉగ్రవాదం, నల్లధనం నిర్మూలనకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని...అవినీతి రహిత భారతాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని.. ప్రధానిని కలిసి చేపట్టాల్సిన పనులను సూచించామని చెప్పారు. ఆసరా పెన్షన్లు విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను వివరించామన్నారు. నగదు కొరత తీర్చేందుకు రెండుసార్లు ఆర్‌బీఐకి లేఖ రాశామని తెలిపారు. నల్లధనం నిర్మూలించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. విపక్షాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, పలు సమస్యలపై చర్చించేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి రేగుతోంది.
కాగా ఇప్పటికే పార్లమెంట్ లో ఉభయ సభల్లో పెద్ద నోట్లపై రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య ఎన్ని మాటల యుద్ధాలు తలెత్తుతాయో చూడాలి.