తమిళనాడు సీఎంగా శశికళ..?
posted on Dec 19, 2016 @ 9:53AM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు పన్నీర్ సెల్వం తీసుకున్నసంగతి తెలిసిందే. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమ్మ నిచ్చెలి అయిన శశికళకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ పగ్గాలు అమ్మచేతికి అప్పగిస్తున్నట్టు ప్రకటన కూడా చేసింది పార్టీ. అయితే ఇప్పుడు తాజాగా ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే.. ముఖ్యమంత్రి పదవి కూడా శశికళకే కట్టబెట్టాలని చూస్తున్నారట. దీనిలో భాగంగానే.. సీనియర్ నాయకులు కొంతమంది శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరారట. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం ద్వారా కోటిన్నర మంది అన్నాడీఎంకే సభ్యులను, ముఖ్యమంత్రి పదవితో ఏడు కోట్ల మంది తమిళనాడు ప్రజలను కాపాడాల్సిందిగా చిన్నమ్మను కోరామని రాధాకృష్ణన్ చెప్పారు. వీళ్లతో పాటు వివిధ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు కూడా ఇదే తరహా తీర్మానాలు చేసి, వాటి కాపీలను శశికళకు అందించారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎంజీఆర్ కాలం నుంచి మంత్రులుగా పనిచేసిన కొంతమంది సీనియర్లు శశికళను వ్యతిరేకించినట్లు కథనాలు వచ్చినా.. తర్వాత ఏమైందో గానీ వాళ్లు కూడా సమాధాన పడిపోయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో శశికళ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.