టూరిస్టు జగన్!
posted on Nov 7, 2013 @ 2:00PM
జగన్ అరికాలిలో పెద్ద పుట్టుమచ్చ లాంటిదేమైనా ఉందేమోనన్న డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే, పాపం జైల్లో వున్న ఆ పదహారు నెలలు తప్ప ఎప్పుడు చూసినా దేశదిమ్మరిలా దేశాలు పట్టి తిరుగుతూనే వున్నాడు. ఓదార్పు యాత్ర అనో, మరో యాత్ర అనో ఏదో ఒక టూర్ ప్రోగాం పెట్టుకుని ప్రకృతిని ఆరాధిస్తూ తిరిగాడు. మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ సీఎం కుర్చీని చేరుకోవడం కోసం బహుదూరపు బాటసారిలా ప్రయాణాలు, ప్రయత్నాలు చేసిన జగన్ ఇప్పుడు సీమాంధ్ర సీఎం కుర్చీ కోసం ప్రయాణాలు ప్రారంభించబోతున్నాడు.
మేకతోలు కప్పుకున్న పులిలాగా, గోముఖ వ్యాఘ్రం లాగా జగన్ కూడా సమైక్య ముసుగు వేసుకున్న విభజనవాది అని విమర్శకులు ఎంత విమర్శిస్తున్నా వెనకడుగు వేయకుండా తన ప్రయాణ సన్నాహాల్లో వున్నాడు. ఒక వైపు రాష్ట్ర విభజనకు కేంద్రం వేగంగా పావులు కదుపుతుంటే జగన్ తీరిగ్గా సీమాంధ్ర జిల్లాల్లో రహదారులను దిగ్బంధం చేయించడంలో బిజీగా వున్నాడు. మొన్నటి వరకూ జగన్ హైదరాబాద్‌లోనే వుండాలని కంట్రోల్ చేసిన సీబీఐ కోర్టు ఓవారం క్రితం జగన్ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చంటూ అనుమతి ఇచ్చింది. దాంతో జగన్‌కి రెక్కలొచ్చాయి. తాను ప్రస్తుతం దిగ్బంధం చేయిస్తున్న రహదారుల్లోనే త్వరలో మరోసారి ఓదార్పు యాత్ర చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
సీమాంధ్ర జిల్లాల్లో తాను చేయబోయే ఓదార్పు యాత్రకి సంబంధించిన వివరాలను ఈనెల పదిహేను తర్వాత ప్రకటించే అవకాశం వుంది. రాష్ట్రం విభజనకు గురవుతోందని గుండెమంటతో వున్న సీమాంధ్రులు జగన్ చేయబోతున్న ఓదార్పు యాత్ర విషయంలో ఎలా రియాక్టవుతారో చూడాలి. ఇదిలా వుంటే రాష్ట్రంలో తిరిగితే చాలదన్నట్టు జగన్ బాబు దేశమంతా చుట్టిరావాలని కోరుకుంటున్నాడు. దానికోసం జగన్ తనకు దేశమంతా తిరిగే పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మమతా బెనర్జీతోపాటు జాతీయ నాయకులందర్నీ కలవాల్సిన అవసరం వుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనికి కూడా అనుమతి వచ్చేసిందంటే ఇక అయ్యగారు దేశమంతా ఒక రౌండ్ కొట్టి వస్తాడన్నమాట. తిట్టేనోరు తిరిగేకాలు ఊరకే ఉండవంటే ఇదేనేమో!