చెప్పుదెబ్బలు - చీపురు దెబ్బలు!

 

 

 

కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన సూచనలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎన్నికలలో ఏం చేయబోతున్నారని అక్కడి ప్రజల్ని అడిగితే, చెప్పులతో కొట్టి, చీపుళ్ళతో తన్ని ఊడ్చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు మానసికంగా సిద్ధమైనట్టే కనిపిస్తోంది. భవిష్యత్తులో తాము కాంగ్రెస్‌ని ఎలా దెబ్బ తీయబోతున్నామన్న దానికి సమైక్యవాదులు ఆల్రెడీ శాంపిల్ చూపించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి చెప్పులు విసిరారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో సీమాంధ్ర నుంచి ఊడ్చిపారేయడానికి సీమాంధ్ర మహిళలు చీపుళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. సీమాంధ్రలో చీపుళ్ళు సిద్ధమవుతున్నాయి.

 

 

ఢిల్లీలో మాత్రం ఆల్రెడీ కాంగ్రెస్‌ పార్టీని ఊడ్చేయడానికి చీపుళ్ళు సిద్ధమయ్యాయి. చీపురుకట్ట గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఢిల్లీని మురికికూపంగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు ఊడ్చిపారేసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకి అందుతున్న చందాల విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించింది. తమకు అందిన చందాల వివరాలను బయటపెట్టింది. అందులో కొన్ని ప్రవాస భారతీయుల నుంచి అందిన చందాలు కూడా వున్నాయి. విదేశాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిన చందాలపై విచారణ జరిపించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది తమమీద విజయం సాధించబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


ఇది కాంగ్రెస్ మార్కు విచారణ జరిపి, ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగమని అభివర్ణిస్తున్నారు. రాజకీయ పార్టీలకు లభించే చందాలను బహిర్గతం చేయాల్సన అవసరం లేదనీ గొంతెత్తి చాటి, పార్లమెంటులో బిల్లు కూడా ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ చందాలపై విచారణ జరిపించాలనుకోవడం విచిత్రంగా వుందని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొడుతున్నారు. తన పార్టీ చందాలపై విచారణ జరిపించే ముందు కాంగ్రెస్ పార్టీ తనకు వస్తున్న చందాలను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. చందాల బహిర్గతం విషయంలో కాంగ్రెస్ కిక్కురుమనడంలేదు.