టీజీ గారి అతి తెలివి!

 

 

 

విభజనవాదులు ఎవరికైనా అదనపు తెలివితేటలు కావాలంటే రాష్ట్రమంతి టీజీ వెంకటేష్ దారి దగ్గర పొంగి పొర్లుతున్న అతి తెలివి తేటల నుంచి అప్పు తీసుకోవచ్చు. పేరులో టీజీ వున్నా సమైక్యవాదినని చెప్పుకునే టీజీ వెంకటేష్ రాష్ట్రం విడిపోదని సీమాంధ్ర ప్రజలని చాలాకాలం మభ్యపెట్టాడు. సీమాంధ్రలో వున్న ఇలాంటి పెద్దమనుషుల మాటలు నమ్మిన సీమాంధ్రులు ఇప్పుడు నిండా మునిగిపోయారు. తెలంగాణకి అడ్డుపడతా... ఊడబొడిచేస్తా అని ఏవేవో స్టేట్‌మెంట్స్ ఇచ్చి వార్తల్లో ఒక వెలుగు వెలిగిన టీజీ వెంకటేష్, కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాక సైలెంటైపోయాడు.

 

 

ఇంతకాలం సమైక్య హీరోలా పోజులు కొట్టి, పులిలా గర్జించిన టీజీ వెంకటేష్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం వంటింట్లో పిల్లిలాగా మ్యావ్ అంటున్నాడు. తాజాగా టీజీ మాట్లాడిన మాటలు సమైక్యవాదుల రక్తం మరిగేలా చేస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం గట్టిపట్టుదలతో ఉండటానికి కారణం సమైక్య ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్లే కారణమట. సమైక్యవాదులే కేంద్రం రెచ్చిపోయి హడావిడిగా విభజన చేయడానికి నూటికి నూరుశాతం కారణమట.




ఇంతకీ సమైక్య ఉద్యమంలో జరిగిన అల్లర్లు ఏమిటయ్యా అని అడిగితే, సమైక్యవాదులు రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, సోనియాగాంధీకి సమాధి కట్టడం.. ఇవేనట! తాము చేసిన విజ్ఞప్తులకు కరిగిపోయి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రక్రియను నిలిపేసేదేనట! కానీ, సీమాంధ్రులు పైన పేర్కొన్న అల్లర్లు చేయడం కారణంగానే సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా హర్టయిందట. అందువల్లే తమ మాట వినకుండా విభజన చేసేస్తున్నారట. ఇలాంటి వంకర మాటలు మాట్లాడడానికి టీజీకి నోరెలా వస్తోందోనని సమైక్యవాదులు మండిపడుతున్నారు. టీజీ వెంకటేష్‌లో నిన్నటి వరకూ నిద్రపోయిన మరో వాది కూడా బయటికొచ్చాడు. ఆ వాదిపేరు రాయల తెలంగాణ వాది. రాయలసీమలో చాలామంది రాయల తెలంగాణని కోరుకుంటున్నారంటూ తానేం కోరుకుంటున్నాడో చెప్పకుండానే చెప్పేశాడు. ఇంతకాలం ఇలాంటి నాయకుడిని నమ్మినందుకు సీమాంధ్రులు చెంపలేసుకోవాలి.