మోడీ.. జర భద్రం!
posted on Nov 9, 2013 @ 5:07PM
ఇప్పుడు దేశమంతా నరేంద్ర మోడీ వైపు ఆశగా చూస్తోంది. తమను కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తప్పించే ఏకైక శక్తి నరేంద్ర మోడీ అని దేశ ప్రజలు భావిస్తున్నారు. మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీలో వున్న కొన్ని లోపాలను ప్రజలు క్షమించడం ప్రారంభించారు. బీజేపీ మీద వున్న మతతత్వ ముద్రను మోడీ తుడిచేస్తారని భావిస్తున్నారు. 2014 ఎన్నికలలో మోడీని ప్రధాని చేయడం కోసం ఎదురు చూస్తున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్న మోడీ దేశానికి ప్రధాని అవడం కొన్ని శక్తులకు ఇష్టం లేదు. ఆయన్ని దేశానికి ప్రధానమంత్రి కాకుండా చేయడానికి, అవసరమైతే వ్యక్తినే కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద శక్తులు మోడీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్నీమధ్య పాట్నాలో మోడీ మీటింగ్ సందర్భంగా జరిగిన బాంబు పేలుళ్ళు! మోడీకి తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర నిఘా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో మోడీకి భద్రత పెంచాలని భారతీయ జనతాపార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే బీజేపీ విజ్ఞప్తిని కేంద్రం లైట్‌గా తీసుకుంది. మోడీకి ఆల్రెడీ ఎన్.పి.జి. భద్రత వుందని, ఆ భద్రత స్థాయిని ఎన్.పి.జి.కి పెంచాల్సిన అవసరం లేదని కేంద్రం సమాధానమిచ్చింది. అయితే బీజేపీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. కేంద్రం మోడీకి ఉద్దేశపూర్వకంగానే భద్రత పెంచడం లేదని ఆరోపిస్తోంది. మోడీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు వుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచడానికి నిరాకరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ భద్రత విషయంలో కేంద్రం అలసత్వంతో వ్యవహరించడం భావ్యం కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ దేశానికి మోడీ అవసరం ఎంతో వుంది.. తనకోసం కాకపోయినా.. కాంగ్రెస్ కబంద హస్తంలో ఇరుక్కుపోయిన ఈ దేశాన్ని కాపాడ్డం కోసమైనా మోడీ.. జర భద్రం!