రాహుల్ చచ్చు తెలివి!
posted on Nov 9, 2013 @ 1:06PM
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ కన్‌ఫమ్ అయిపోయింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ నెత్తిన తెల్లగుడ్డేనన్న విషయం అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాను ప్రధాని కాలేమోనన్న భయం రాహుల్ గాంధీని పట్టి పీడిస్తోంది. ఆ భయంతోనే తానేం మాట్లాడుతున్నాడో తనకే అర్థంకాని స్థితిలో వున్నాడు. జనాన్ని బుట్టలో పెట్టడానికి మామూలు తెలివితేటలు పనికిరావని చచ్చు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు.
చచ్చు తెలివితేటలంటే జనానికి చావుల పేరు చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నించడం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో వుంది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. మొన్నామధ్య జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, దేశం కోసం తన నాయనమ్మ, తన తండ్రి చనిపోయారని, తనను కూడా తీవ్రవాదులు చంపే అవకాశం వుందని ప్రకటించిన రాహుల్ అందరి చేతా తలంటి పోయించుకున్నాడు. తన కుటుంబంలో జరిగిన మరణాలని, తనకున్న ప్రాణభయాన్ని సాకుగా చూపి ఓటర్ల నుంచి సానుభూతి పొందాలని రాహుల్ ప్రయత్నించడాన్ని ఎవరూ హర్షించలేదు. చావుల ప్రస్తావన తెస్తే ఒకసారి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తినా రాహుల్ గాంధీలో మార్పు రాలేదు.
మరోసారి తన చచ్చు తెలివితేటలు ప్రదర్శించాడు. ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆమధ్య జరిగిన మావోయిస్టుల దాడి సంఘటనని ప్రస్తావించాడు. ఛత్తీస్‌ఘడ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, మావోయిస్టుల దాడిలో కేంద్ర మాజీ మంత్రి వి.సి.శుక్లా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడితోపాటు చాలామంది కాంగ్రెస్ పార్టీవాళ్ళు చనిపోయారని అన్నాడు. ఇంతటి ప్రాణ త్యాగాల పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటేయాలన్నాడు. మావోయిస్టుల దాడిలో జరిగిన మరణాలను ప్రస్తావించి ఓటర్ల నుంచి సానుభూతి పొందడానికి రాహుల్ ప్రయత్నించడం మరోసారి వివాదాస్పదం అయింది.