సోనియా, మోడీలను భయపెడుతున్న 'ఆమ్ఆద్మీ'
posted on Nov 11, 2013 @ 10:14AM
ఢిల్లీలో బలంగా ఉన్న కాంగ్రెస్, బిజెపిలను 'ఆమ్ఆద్మీ' కలవరపెడుతున్నాడు. కాంగ్రెస్, బిజెపిలతో ఈ కొత్త పార్టీ హోరాహోరీగా పోరాడుతుందని ఇప్పటికే వివిధ సర్వేలు నిర్దారించడంతో భవిష్యత్ రాజకీయాలలో 'ఆమ్ఆద్మీ' ప్రభావం పై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతో౦ది.
ఇప్పుడున్న రాజకీయపార్టీలు అనుసరిస్తున్న పద్దతులకు భిన్నమైన పద్దతులు అనుసరించడం ద్వారా 'ఆమ్ఆద్మీ' పార్టీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. నీతి నీజాతి పరులు, సమర్ధులు అనే వారికీ ప్రాధాన్యం ఇచ్చి అభ్యర్ధులను ఎంపిక చేయడంతో పాటు, నిరాడంబరంగా ఆ పార్టీ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్, బిజెపిలకు చెమటలు పట్టిస్తోంది.
ప్రజల వద్దకు ప్రజలు అనే భావంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్రజలకు అర్ధంకాని భారీ వాగ్ధానాలతో లేనిపోని ఆశలు సృష్టించకుండా, నిత్య జీవితంలో వారికి ఎదురవుతున్న సమస్యలకు ఎలా పరిష్కారం చూపగాలమో చెబుతున్నారు. ప్రధాన పార్టీలు చేస్తున్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణాలను ప్రస్తావిస్తూ 'ఆమ్ఆద్మీ' ప్రధాని పై విమర్శలు చేస్తున్నారు. వ్యవస్థలో మార్పు రావాలాని మీరు కోరుకుంటున్నారా? లేదా ? అని ప్రజలను స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు.
అక్రమంగా సేకరించిన డబ్బుతో కాంగ్రెస్, బిజెపిలు ఒక్కో ఓటుకు భారీ ఎత్తున డబ్బు చెల్లించే అవకాశం ఉందని...అయితే ఓట్ల కోసం డబ్బులు, చీరలు ఇస్తే తీసుకోండని ప్రజలకు చెప్పడం ఆసక్తికరం. అదంతా ప్రజల డబ్బెనని, అందువల్ల ఆ పార్టీలు ఇచ్చినవి తీసుకొని ఓటు మాత్రం 'ఆమ్ఆద్మీ' పార్టీకి వేయాలని కోరుతున్నారు. మద్యం అనారోగ్యం కాబట్టి దానిని తీసుకోవద్దని సూచిస్తున్నారు.
'ఆమ్ఆద్మీ' పార్టీ ఢిల్లీలో పోరాడుతున్న తీరు దేశవిదేశాల్లోని వారికి ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. పోలింగ్ కి దూరంగా ఉండే ఐటీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు వంటి వారిలో 'ఆమ్ఆద్మీ' పట్ల కలుగుతున్న ఆసక్తి వల్ల ఢిల్లీలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోందని మేధావి వర్గాలు భావిస్తున్నాయి.