గాంధీ గురించి గాంధీ గారి గోల!

  కాంగ్రెస్ పార్టీని ఎవరైనా చంపేస్తున్నారా? లేక తనే చచ్చిపోతుందా? ఇది కొంచెం దుర్మార్గమైన ప్రశ్నే కావొచ్చు! కాని, ప్రాక్టికల్ గా దేశంలో అదే పరిస్థితి నెలకొంది! సెంచరీ కొట్టిన ఆ పార్టీని ఎవరో చంపాల్సిన పని లేకుండా తానే చాప సర్దేసుకుంటుంది! అదీ విషాదం....    కాంగ్రెస్ గత అరవై అయిదేళ్లుగా రాష్ట్రాల్లో, ఢిల్లీలో తనకు చేతనైనంత అధికారం వెలగబెట్టింది. ఇప్పుడు ఒకట్రెండు చెప్పుకోతగ్గ రాష్ట్రాల్లో తప్ప మరెక్కడా అడ్రస్ లేకుండా పోయింది. బీజేపి ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. మిగిలిన చోటంతా ప్రాంతీయ పార్టీలు ఖతం చేశాయి. అయితే, ఇవన్నీ కాంగ్రెస్ మీద కక్ష్యతో ఎవరో కూర్చుని చేసినవి కావు! కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఎదుటి పార్టీలకి ఎదిగే అవకాశం పుష్కలంగా ఇచ్చింది. అందుక్కారణం విస్పష్టంగా గాంధీలే!   మహాత్మ గాంధీ వంటి తిరుగులేని నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పని చేశాడు. దాన్ని నడిపాడు. తరువాత స్వతంత్రం వచ్చింది. బ్రిటీషు వాళ్లు పోయారు. కాని, నెహ్రు తరువాత నుంచి చాలా ఏళ్ల పాటూ మనల్ని గాంధీలే ఏలుతూ వచ్చారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ మాటున సోనియా గాంధీ... ఇలా దశాబ్దాల పాటూ గాంధీల యుగమే నడిచింది. ఎట్టకేలకు పార్లమెంట్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ వారి కాంగ్రెస్ బిక్కుబిక్కుమంటుంది!   ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ ... వీళ్ల పేర్ల చివర్లో వున్న గాంధీకి, మహాత్మా గాంధీకి ఏంటి సంబంధం అంటే స్పష్టమైన సమాధానం లేదు భారతీయుల వద్ద. కాకపోతే, గాంధీలే కదా అనుకుని ఇంతకాలం నెత్తిన పెట్టుకున్నారు. కాని, ఈ మధ్య రాహుల్ గాంధీ తన మేధావితనంతో పాపం మహాత్ముడ్ని కూడా రచ్చలోకి లాగాడు. గాంధీ హత్యకి అరెస్సెస్ కారణం అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు!   అరెస్సెస్ కోర్టు మెట్లు ఎక్కి రాహుల్ ని ముప్పతిప్పలు పెట్టింది. కోర్టు రాహుల్ కి తప్పుదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది. లేదంటే పరువు నష్టం కేసు విచారణ ఎదుర్కోవాలని హెచ్చరించింది. ఈ పరిణామంతో షాకైన యువరాజా వారు కోర్టుకు అరెస్సెస్ తప్పేం లేదని సెలవిచ్చారు. గాంధీ హత్యలో అరెస్సెస్ ప్రమేయం లేదన్నారు. ఇక్కడితో ఆగిపోయి వుంటే రాహుల్ మిగతా అందరు పొలిటీషన్స్ లా మెచ్యురిటీ వున్నవాడే అనిపించుకునే వాడు. కాని, అలా చేయలేదు!   కోర్టు ముందు అరెస్సెస్ కి , గాంధీ హత్యకి సంబంధం లేదన్న రాహుల్ మళ్లీ ట్విట్టర్ లో మాత్రం తాను ముందన్న మాటలకి కట్టుబడి వున్నానని అన్నాడు! ఇదేం విచిత్రం? ముందొక మాట, కోర్టు ముందు ఒక మాట, మళ్లీ ట్విట్టర్ లో ఇంకో మాట! ఇలా చేస్తే కాంగ్రెస్ టాప్ లీడర్ గా ఆయన్ని జనం ఎలా నమ్ముతారు? నిజంగా తాను అరెస్సెసే గాంధీ హత్యకి కారణం అనుకుంటే కోర్టులో కూడా అదే చెప్పి పోరాడితే పోయేది కదా? లేదంటే చేసిన తప్పు ఒప్పేసుకుని గొడవని ఇంతటితో ముగిస్తే పోయేది కదా? ఇలా రెండు రకాల మాటలు మాట్లాడితే కాంగ్రెస్ లోని చోటా మోటా నాయకులకి, రాహుల్ కి వున్న భేదం ఏంటి? ఆయన్ని సీరియస్ గా తీసుకుని జనం ప్రధాని ఎప్పుడు చేస్తారు? అసలు రాహుల్ లాంటి గాంధీ చేతిలో మహాత్మ గాంధీ పని చేసిన కాంగ్రెస్ మరి కొంత కాలం బతుకుతుందా? 

నాటీ ఆరోపణల నట్టి కుమార్! 

  టీ కప్పులో తుఫాన్ అంటారు తెలుసుగా.... అదుగో అదే జ్ఞాపకం వస్తుంది ఎవరికైనా! ఇంతకీ దేని గురించి అంటారా? మన నట్టి కుమార్ నాటీ మాటల గురించి!    తెలుగు మీడియాలో నెంబర్ వన్ గా చెప్పుకునే ఓ ఛానల్ స్టూడియోకి వచ్చి, రీసెంట్ గా, నట్టి చాలా హంగామా చేశాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎప్పుడూ నట్టి కుమార్ హంగామాని లైట్ తీసుకునే ఇతర మీడియా వాళ్లు కూడా ఈసారి కాస్త ఇంట్రస్ట్ చూపారు. అందుక్కారణం నట్టి కుమార్ అటు పాలిటిక్స్ ను, ఇటు సినిమాను, మధ్యలో నొటోరియస్ నయీమ్ ను ఒక్క చోట చేర్చాడు. అదీ విశేషం...    నయీమ్ ఈ మధ్య ఎన్ కౌంటర్ అయ్యాడు కాబట్టి అతడి గురించి ఏం చెప్పినా, ఎవరు చెప్పినా జనాలకి ఇంట్రస్ట్ గ్యారెంటీ. అలాగే, అధికార తెలుగు దేశం నేత అచ్చెన్నాయుడిని కూడా రొంపిలోకి లాగితే ఇక తిరుగే లేదు. అక్కడితో ఆగకుండా నట్టి కుమార్ నాటీగా ఇండస్ట్రీలో ఎవరెవరి పేర్లో చెప్పేశాడు! అంతా నయీమ్ తో లింక్ లున్న వారే అన్నాడు!   నట్టి కుమార్ నిజం చెప్పాడా? లేదా? ఈ ప్రశ్న జటిలమైంది. కాకపోతే, రెవెన్యు, పోలీస్ శాఖాల వంటి వాట్ని కూడా వదలని నయీమ్ సినిమా ఇండస్ట్రీని వదిలపెడాతడని ఎవరం అనుకుంటాం. సహజంగానే అక్కడా మనోడు కర్చీఫ్ వేసి వుంటాడు. తన ప్రతాపం చూపి వుంటాడు. కాని, నట్టి కుమార్ మాటలు పట్టుకుని ఆయన చెప్పిన కొద్ది మందికి మాత్రమే నయీమ్ తో సంబంధాలున్నాయని డిసైడ్ అవ్వటం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే, అప్పుడప్పుడూ ఇలా వచ్చి రొటీన్ గా ఆరోపణలు చేసి సైలెంట్ అవ్వటం నట్టికి మామూలే అంటున్నారు ఆయనతో పడని వాళ్లు. కాబట్టి ఈ సారి ఆయన సిరియస్ గా మాట్లాడుతున్నాడని అనుకోవటం తెలివితక్కువతనమే అవుతుందని వారి వాదన. మరో వైపు, ఇలా నట్టి కుమార్ పై చాలా ఆరోపణలు చేస్తున్న వారే మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.    నట్టి వద్ద బోలెడు సాక్ష్యాధారాలు వుంటే నేరుగా దర్యాప్తు చేస్తున్నసిట్ వద్దకి వెళ్లకుండా టీవీ స్టూడియోకి ఎందుకు వచ్చినట్టూ అని! ఈ డౌట్ కూడా సహజమే! నట్టి కుమార్ ఇప్పుడు తన ఆరోపణలు నాటీ ఆరోపణలు కావని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది...   

కస్సుమంటున్న కేసీఆర్... తుస్సుమంటున్న టీ కాంగ్రెస్!

  కేసీఆర్... తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ పేరు ఉద్యమానికి పర్యాయపదం. కాని, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి. అందుకు తగ్గట్టే ఆయన ఉద్యమ సమయంలో లాగా ఈ మధ్య భాషా ప్రయోగం చేయటం లేదు. సాధ్యమైనంత వరకూ సంయమనం పాటిస్తున్నారు. అయినా కూడా అడపాదడపా ప్రతిపక్షాల మీద ఘాటు కామెంట్స్ చేస్తూనే వున్నారు. అయితే, తాజాగా కేసీఆర్ ఆగ్రహానికి టీ కాంగ్రెస్ నేతలు అల్లాడిపోయారు!   మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక ఒప్పందాలు చేసుకుంది. వీటి వల్ల గోదావరిపై అనేక ప్రాజెక్ట్ లు పూర్తయ్యే అవకాశం వస్తుంది. అంతే కాదు, తెలంగాణలోని కోటి ఎకరాల భూములు పచ్చగా మారతాయి! అయితే, ఇదంతా నిజంగా జరుగుతుందా? జరిగినా ఎప్పటిలోపు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. కాని, అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ తన పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతల్ని, టీ కాంగ్రెస్ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా మహారాష్ట్ర నుంచి వచ్చి బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడే కడిగిపారేశారు. ఇంకా గంట సేపు వుంటాను. ఇక్కడికే సాక్ష్యాలు తీసుకుని రా అంటూ సవాలు విసిరారు కేసీఆర్! నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తానని వేడి పుట్టించారు....   కేసీఆర్ చేసిన అతి తీవ్రమైన దాడికి బహుశా కాంగ్రెస్ నేతలు అవాక్కై వుంటారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ హస్తం పార్టీ కేసీఆర్ కి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోతోంది. ఇలాగే ప్రతీసారి ఏదో ఒకటి అనటం... దానికి కేసీఆర్ దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వటం... టీ కాంగ్రెస్ నేతలు మెల్లగా వెనక్కి తగ్గటం ... ఇదే నడుస్తోంది!   కేసీఆర్ తెలంగాణ రైతులకి నీళ్లు ఇవ్వాలని సంకల్పించటం, కాంగ్రెస్ నేతల్ని ఏకిపారేయటం... ఇదంతా పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. కాని, కేసీఆర్ తనపై, తన ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని బెదిరించటమే కాస్త ఆందోళనకరం అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఎందుకంటే, డెమొక్రసీలో ప్రతిపక్షల పనే పాలక పక్షాన్ని కార్నర్ చేయటం. అలా చేసినంత మాత్రన కేసులు పెడతామని బెదిరిస్తే ఎలా? వాళ్ల ఆరోపణల్ని గట్టిగా తిప్పి కొట్టాలిగాని అంటున్నారు విమర్శకులు...   కేసీఆర్ కేసులు పెడతామని అనటానికి కొద్ది గంటల ముందే తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలతకి సుప్రీమ్ కోర్టు గట్టి హెచ్చరిక చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కేసులు బనాయించటం సరైన పద్ధతి కాదని హితవు చెప్పింది. ఈ విషయం కేసీఆర్ కూడా గుర్తించాలంటున్నారు ఆయన ప్రత్యర్థులు. టీ కాంగ్రెస్, టీ టీడీపి నేతలే కాదు కనీసం కోదండరామ్ లాంటి న్యూట్రల్ వ్యక్తులు కూడా టీఆర్ఎస్ హీట్ ను తట్టుకోలేకపోతున్నారు. ఆ మద్య ప్రొఫెసర్ కోదండరామ్ కూడా గవర్నమెంట్ పై ఆరోపణలు చేస్తే విపరీతంగా తిట్టిపోశారు గులాబీ నేతలు. ఆయన ఆరోపణల్ని సమర్థంగా ఎదుర్కోవటం కాకుండా ప్రతి దాడికి దిగారు. ఇలా ప్రతిధ్వని అన్నదే లేకుండా గొంతు నొక్కేయటం ప్రజాస్వామ్యానికి ఎంతైనా మంచిది కాదని ఆందోళన చెందుతున్నారు ప్రజాస్వామ్యవాదులు...

సైనా, సింధుల సక్సెస్ లో చంద్రబాబు పాత్ర ఎంత?

  సింధు ఒలంపిక్స్ లో పతకం సాధించిన తరువాత తెలుగు రాష్ట్రాలు రెండూ పూనకంతో ఊగిపోయాయి. అసలు ఇంకే వార్తా లేదన్నట్టు వ్యవహారం నడిచింది. ఆమె సెమీఫైనల్ గెలిచి పతకం కన్ ఫర్మ్ అయ్యాక హీట్ మరీ పెరిగింది. రియో నుంచి హైద్రాబాద్ వచ్చి విజయవాడ చేరుకుని ఇరు రాష్ట్రాల సన్మానాలు స్వీకరించే దాకా సింధు మేనియా నిరాటంకంగా సాగింది. అయితే, ఒకవైపు జనం సంతోషంతో ఊగిపోతుంటే సోషల్ మీడియాలో మాత్రం కొందరు సెటైర్ సత్తిపండు అవతారాలు ఎత్తారు. ఎప్పటిలాగే చంద్రబాబును టార్గెట్ చేస్తూ పోస్ట్ లు విసరటం ప్రారంభించారు!   సింధు సక్సెస్ కి చంద్రబాబుపై సెటైర్లకి ఏంటి లింక్ అంటారా? మరేం లేదు సింధుకి సిల్వర్ ఖాయం చేసుకున్న వెంటనే ఓ సభలో బాబు ఆమె విజయానికి తన కృషే కారణమన్నారు! ఇదే అన్ని కుతలకి కారణమైపోయింది...నిజంగా సింధు విజయానికి చంద్రబాబుకి ఏమైనా లింక్ వుందా? పైకి చూస్తే ఏమీ లేనట్లే వున్నా యాక్చువల్ గా వుంది. అది అర్థం చేసుకునే ఓపిక, నిజాయితీ రెండూ లేని నెటిజన్లు ఎడాపెడా విమర్శలు, జోక్ లు మొదలుపెట్టారు.   సింధు సక్సెస్ కి మెయిన్ రీజన్ ఆమె కోచ్ గోపిచంద్. ఆయన హైద్రాబాద్ లో కోచింగ్ అకాడమీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబే గచ్చిబౌలిలో 5ఎకరాల భూమి ఇచ్చారు. అలా మొదలైంది ఇప్పటి ఈ ఒలంపిక్ పతకాల వేట. సైనా, సింధు గోపిచంద్ అకాడమీలో, చంద్రబాబు ఇచ్చిన భూమి మీదే ప్రాక్టీస్ చేసి మెడల్స్ గెలుచుకున్నారు! అంతే కాదు, ఇప్పటికి పదహారేళ్ల కిందే 2000వ సంవత్సరంలో బాబు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించారు! ఎన్నో ప్రొత్సాహకర చర్యలు తీసుకున్నారు. కాని, అంతలోనే అధికారం కోల్పోవటంతో అవ్వన్నీ అర్దాంతరంగా ఆగిపోయాయి. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ఆటల్ని ఆదుకున్న పాపన పోలేదు....   ఇదంతా విన్నాక ఇప్పుడు చెప్పండి... తన పాలన కాలంలో ఇచ్చిన ప్రొత్సాహంతో ఇవాళ్ల మెడల్ వచ్చిందని బాబు చెప్పటం తప్పెలా అవుతుంది? పైగా ఇప్పుడు కూడా మెడల్ గెలిచిన సింధుని సన్మానించటమే కాకుండా అమరావతిలో అకాడమి స్టార్ట్ చేయటానికి ఆయన గోపిచంద్ ని ఆహ్వానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఒక నాయకుడు చేయాల్సింది ఇదే కదా? దీనికి కూడా సెటైర్లు వేస్తూ మేధావుల్లా ఫీలైతే మనం ఏం చేయగలం... ఎవరి పిచ్చి వారికానందం!

వరద బాధితులతో వెటకారాలాడిన లాలూ...

  మనిషికుండాల్సిన అనేక మంచి లక్షణాల్లో సెన్సాఫ్ హ్యూమర్ ఒకటి! కాని, సెన్సాఫ్ హ్యూమర్ వుంది కదా అని దాన్ని ఎక్కడంటే అక్కడ ప్రయోగిస్తే చండాలంగా వుంటుంది. శోభనం గదిలో భక్తి పాటలు విన్నట్టు... మన లాలూ ప్రసాద్ యాదవ్ తన పైత్యం మరోసారి ప్రదర్శించాడు!   సమోసాలో ఆలూ వున్నంత వరకూ బీహార్లో లాలూ వుంటాడు అని చెప్పుకునే వాడు ఒకప్పుడు ఈ మాజీ సీఎం. అయితే, తరువాత సీఎం కుర్చీపోయి ఢిల్లీలో కేంద్ర మంత్రి పదవి ఎలగబెట్టాడు. అది కూడా పోయి దాణా కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి ఏ పదవికి పనికి రాకుండా పోయాడు. అయినా కూడా సుడి బావుండి నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరాడు. అందుకే, మరోసారి తన సెన్సాఫ్ హ్యూమర్ కి పదును పెట్టాడు లాలూ.   ముఖ్యమంత్రిగా వున్నా, కేంద్ర మంత్రిగా వున్నా ఎప్పుడూ మీడియాని తనవైపుకి తిప్పుకోవటం లాలూకి డైలాగులతో పెట్టిన విద్య. అందుకే, ఆయన ఎప్పుడు మీడియా గొట్టాల ముందుకొచ్చి ఏం చెప్పినా సెన్సేషన్ అవుతుంటుంది. కాని, ఈసారి లాలూ సెన్సాఫ్ హ్యూమర్ మరీ పచ్చిగా మారిపోయింది! ఎదుటి వాడి కష్టం, కన్నీళ్లు ఆయనకు కామెడీగా తోచాయి. అంతే కాదు, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే అన్న సామెత నిజం చేసి కూర్చున్నాడు!   బీహార్లో అనేక గ్రామాలు గంగా నది వరదలకి తడిసి ముద్దాయ్యాయి. అయితే, ఆ వరద బాధితుల్ని పరామర్శించటానికి వెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్ ఊరికే తిరిగి రాకుండా ఓ వెకిలి కామెంట్ పడేశాడు. గంగ స్వయంగా మీ ఇళ్లలోకి వచ్చింది. మీరెంతో పుణ్యాత్ములు అన్నాడట! పేద జనం గూడు, గుడ్డా తడిసిపోయి వణుకుతూ కుర్చుంటే ఈయనగారికి జోక్ లు ఎందుకు అవసరం అయ్యాయో గంగమ్మకే తెలియాలి!   జనం సంక్షోభంలో వున్నప్పుడు లాలూ లాగా పిచ్చి మాటలు మాట్లాడే రాజకీయ నాయకులు ఈ మధ్య బోలెడు మంది తయారవుతున్నారు. ఇలాంటి వారు అన్ని పార్టీల్లోనూ వుండటం మరో విషాదం...  

ప్రత్యర్థులకి బొమ్మ చూపిస్తోన్న అమ్మ!

  అమ్మ దయ వుంటే అన్నీ వున్నట్టే. ఇలా మనం చెప్పుకోవటం మామూలే. కాని, తమిళనాడులో పరిస్థితి మరీ దారుణం. అక్కడ 'అమ్మ' దయ లేకుంటే ఏమీ లేనట్టే! ఇంతకీ అమ్మెవరో తెలుసుగా? పురుచితలైవి జయలలితే!   జయలలితకు కోపం తెప్పిస్తే తమిళనాడు బార్డర్స్ లో వుండటం కష్టమే. అలా తయారైంది పరిస్థితి. పైగా ఈ మధ్యే ఆరోసారి చెన్నై సింహాసనం అధిష్టించిన అమ్మగారు ఎవ్వరికీ వినటం లేదు. ఆమెను వ్యక్తిగతంగా విమర్శించటం కాదు కనీసం పాలనాపరమైన అంశాలపై విమర్శిస్తే కూడా ప్రత్యర్థుల్ని ముప్పతిప్పలు పెడుతోంది. అందుకు, రాజమార్గంలో చట్టాన్నే ఎంచుకుంటోంది!   జయలలిత గత కొంత కాలంగా తన శత్రువుల పని పట్టేందుకు పరువు నష్టం దావాని ఆయుధంగా చేసుకుంది. ఎవ్వరు ఏ చిన్న విమర్శ చేసినా దాన్నే ప్రయోగిస్తుంది. అంతే కాదు, ప్రభుత్వ యంత్రంగమే ఈ కేసులు వేయటానికి రాత్రింబవళ్లూ కష్టపడుతోంది. చివరకు, ఇది ఎంత వరకూ వచ్చిందంటే సుప్రీమ్ కోర్టు జయలలితను హెచ్చరించాల్సి వచ్చింది!   సీఎం ఆరోగ్యం గురించి, ఆమె సెలవుల గురించి, నీటి సమస్య గురించి, ఎన్నికల హామీల అమలు సంగతి గురించి... ఇలా ఏ చిన్న అంశంలో వైరి వర్గం నోరు విప్పిన జయ పరువు నష్టం కేసుతో వాళ్లకు మూడు చెరువులు నీళ్లు తాగిస్తోంది. ఇలా అయితే, పబ్లిక్ లైప్లో వుండకూడదని సుప్రీమ్ ఆమెను కడిపారేసింది. ప్రజా జీవితంలో వున్నాక విమర్శలు వస్తుంటాయని, వాట్ని సమర్థంగా ఎదుర్కోవాలిగాని కేసులు వేసి న్యాయస్థానం సమయం వృథా చేస్తారా అంటూ ప్రశ్నించింది.   ఇలా అమ్మకు కోర్టు ఆశీర్వచనాలీయటం రెండు నెలల్లోనే ఇది రెండో సారి. అసలు 5ఏళ్లలో జయ ప్రభుత్వం 213పరువు నష్టం కేసులు వేసిందంటే... అరాచకం ఏ రేంజ్లో వుందో అర్థం చేసుకోవచ్చు!

రాంగ్ డైలాగ్ తో బుక్కైన కాంగ్రెస్ హీరోయిన్

మేధావులు పిచ్చి వాళ్లలా కనిపిస్తారు. కాని, పిచ్చివాళ్లు కారు! అలాగే, అప్పుడప్పుడూ పిచ్చివాళ్లని చూస్తే మేధావులనిపిస్తుంది. కాని, వాళ్లు మేధావులు కాదు! ఈ సూత్రం కొంతమంది కాంగ్రెస్ నేతలకి వాడుకునే టైం వచ్చేసింది....కాంగ్రెస్ తనకు తాను మైనార్టీల పెద్ద దిక్కుగా భావిస్తుంది. బీజేపిని బూచిలా చూపించి ముస్లిమ్ లని చాలా కాలమే తన కంట్రోల్ లో పెట్టుకుంది. కాని, మోదీ ప్రభంజనంతో ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయింది. అలాగే, రాష్ట్రాల్లో కూడా లోకల్ నేతలు బలంగా వుంటే కాంగ్రెస్ అధికారం కోల్పోతూ వస్తోంది. ఇక మిగిలిన ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక! అది కూడా పళ్లెంలో పెట్టి బీజేపికి ఇచ్చేసే పనిలో వున్నారు బెంగుళూరు కాంగ్రెస్ నేతలు!   మన దేశం ముస్లిమ్ లని సమర్థించటం వేరు, పాకిస్తాన్ ను కూడా పొగిడేయటం వేరు. ఈ చిన్న తేడాని గుర్తించలేకపోతున్నారు కాంగ్రెస్ సెక్యులర్ ఛాందసవాదులు. తాజాగా... సినిమా యాక్ట్రస్ నుంచి ఎంపీ అయిన కన్నడ బ్యూటీ రమ్య అదే తప్పు చేసింది. ఆమె పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చి ఆ దేశమేం నరకం కాదని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే కాదు, భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గతంలో అలా అనటం తప్పని సెలవిచ్చింది. అయితే, ఇక్కడ రమ్య చిన్న లాజిక్ మిస్సైపోయింది. ఆమెకు మనోహర్ పారికర్ పై వ్యతిరేకత వుంటే ఆయన గురించి మాట్లాడాలిగాని పాకిస్తాన్ గొప్ప దేశం అనటం ఏంటి? ఇప్పుడు రమ్య చేసిన ఈ మేధావి మార్కు స్టేట్మెంట్  కర్ణాటక బీజేపికి మంచి ఆయుధంలా దొరికింది. ఏకంగా ఆమె మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని వారంటున్నారు.   రమ్య అంటే నిన్నటి మొన్నటి వరకూ గ్లామర్ ప్రపంచంలో ఆడిపాడిన అమ్మాయి కాబట్టి పెద్దగా రాజకీయ లౌక్యం తెలియదనుకోవచ్చు. కాని, ఈ మధ్య వరుసగా కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ పాట పాడుతున్నారు. సెక్యులర్ ఛాందసవాదిగా పేరున్న మణిశంకర్ అయ్యర్ అయితే పాకిస్తాన్ కి పోయి అక్కడి వారితో మనం కలిసి పోరాడి మోదీని అధికారంలోంచి దించేయాలి అంటూ పైత్యం ప్రదర్శించాడు! మరో కాంగ్రెస్ కరుడుగట్టిన లౌకికవాది, దిగ్విజయ్ సింగ్ కూడా హఫీజ్ అలీ, ఉసామా బిన్ లాడెన్లను జనాభ్ అంటూ, సాహెబ్ అంటూ కీర్తించాడు! తాజాగా కాశ్మీర్ ని భారత ఆక్రమిత కాశ్మీర్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు!   బీజేపినే రాజకీయంగా ఎదుర్కోటానికి కాంగ్రెస్ వాళ్లు ఇండియన్ ముస్లిమ్ లని సమర్థించాలిగాని మరీ నీచంగా పాకిస్తాన్ని, అక్కడి ఉగ్రవాదుల్ని వెనకేసుకురావటం దిగజారుడుతనం అవుతుంది. అంతే తప్ప భారతీయ ముస్లిమ్ ల ఓట్లేం రాలిపడిపోవు. ఎందుకంటే, పాకిస్తాన్ ని అభిమానించే మనదేశ ముస్లింల సంఖ్య చాలా తక్కువే కాబట్టి... 

వృక్షాలకి పూజలు సరే... కొత్త విత్తనాలు నాటేదెప్పుడు?

మనం వృక్షాలకి దారాలు చుట్టి పూజలు చేయటం చూస్తుంటాం! అది వీలవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఎవరో ఒకరు ఆ వృక్షానికి కారణమైన విత్తనాన్ని నాటాలి! విత్తనం నాటితేనే వృక్షం పుట్టేది! ఇదంతా ఎందుకనేనా మీ డౌట్?   ప్రపంచంలో ప్రతీ దానిపై స్పందించే వర్మ ఈ ఒలంపిక్స్ పతకాల హంగామాపై కూడా స్పందించాడు. ఆయన సూటిగా చెప్పిందేంటంటే రెండు పతాకలు వచ్చిన మనం ఇంతగా ఎగిరితే అత్యధిక పతకాలు కొట్టిన అమెరికా లాంటి దేశాలు ఏం చేయాలి అని! నిజమే... అసలు ఒక్క స్వర్ణమూ రాని ఇండియా ఇంతగా పీలైపోవటానికి అస్సలేం లేదు. అయినా మన మీడియా, ప్రభుత్వాలు కాస్త అవసరానికి మించి హడావిడి చేస్తున్నాయి. అందుక్కారణం కాస్త కరుకుగా వున్నా మనం మాట్లాడుకుని తీరాలి. అప్పుడే కనీసం వచ్చే ఒలంపిక్స్ కన్నా పరిస్థితి కాస్త  మెరుగవుతుంది.   జనాభా పరంగా చూసినా, దేశం విస్త్రీర్ణం పరంగా చూసినా ఇండియా బోలెడు పతకాలు సాధించాలి. కాని, అలా జరగలేదు. ఈ అవమానకర స్థితే మన వాళ్ల హడావిడికి మెయిన్ రీజన్! అసలు ఓటమిని కప్పిపెట్టటానికి గెలిచిన వాళ్లని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలాగని సింధులాగా మెడల్ గెలిచిన వార్ని ఇక్కడ మనం తక్కువేం చేయాల్సిన పని లేదు. కాకపోతే, మనం గుర్తించాల్సింది ఒక్కటే... మొత్తం భారతదేశం తరుఫున యాభై వరకూ పతకాలు వచ్చి వుంటే... మన రాష్ట్రాల్లో కూడా కనీసం అయిదారుగురు ప్లేయర్స్ మెడల్స్ గెలిచేవారు! అప్పుడు అంత మందికి మన ముఖ్యమంత్రులు ఇప్పుడిచ్చినట్టు కోట్లకు కోట్లు ఇచ్చేసే వారా? ఇదీ అసలు పాయింట్! గెలిచిన వారు ఒకరిద్దరు మాత్రమే వుండటంతో వాళ్లనే సన్మానించి, సత్కరించి మైలేజ్ పొందేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. దీనికి ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ నేత, ఆ నాయకుడు అన్న తేడా లేదు. అందరూ అనివార్యంగా ఈ హడావిడికి పూనుకోక తప్పటం లేదు.   మెడల్స్ గెలిచిన వార్ని సన్మానించటం తప్పేం కాకపోయినా ప్రభుత్వాలు చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయి. అసలు చాలా మంది పట్టించుకోలేదుగాని ఒలంపిక్స్ లో పతకాల గోల నడుస్తుండగానే పంజాబ్ లో ఒక జాతీయ స్థాయి అథ్లెట్ పేదరికం కారణంగా ఆత్మహత్య చేసుకుంది. మరో వైపు రియో ఒలంపిక్స్ లో మన మారథాన్ రన్నర్స్ కు కనీసం మధ్య మధ్యలో నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదట ఇండియన్ ఒలంపిక్ సంఘం అధికారులు. 42కిలో మీటర్లు నీళ్లు లేకుండా పరుగెత్తిన జిషా అనే అథ్లెట్ అఖరుకి స్పృహ తప్పి పడిపోయింది! ఇంతలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ గెలిచిన వార్ని మాత్రం నెత్తికెత్తుకుంటే ఏం లాభం? రానున్న ఒలంపిక్స్ లో కూడా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది! దేశం మొత్తం సన్మానించుకోటానికి, ప్రైజ్ మనీలు ఇచ్చుకోటానికి ఒకరో, ఇద్దరో అథ్లెట్లు మిగులుతారు!   నిజంగా  మన కేంద్ర, రాష్ట్ర పాలకులకి చిత్తశుద్ది వుంటే ఇప్పటికిప్పుడు ప్రతీ స్కూల్లో పిల్లలకి ఆటలాడుకునే ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే, ముందు విత్తనాలు వేస్తే కదా వృక్షాలు పుట్టుకొచ్చేది....

బ్రాండ్ అంబాసిడర్ బాల్... కేసీఆర్ కోర్టులోకి!

అమితాబ్ బచ్చన్ గుజరాత్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే, ఆయన గుజరాత్ రాష్ట్ర పర్యాటక శాఖ యాడ్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తుంటారు. అంతే కాదు, గుజరాత్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ పాల్గొంటూ వుంటారు కూడా. అది బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన బాధ్యత. అయితే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం... మీకు ఎప్పుడైనా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా అలా కనిపించిందా? ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది... సింధు పతకం గెలిచాక ఎఫ్బీలో చాలా మంది షేర్ చేస్తున్న పోస్టుల్లో ఒకటి సానియా బదులు సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ చేయాలని! ఇలా ప్రచారం చేసేవాళ్లలో చాలా మంది రైట్ వింగ్ జనం కూడా వున్నారు. వాళ్లు సానియా మతాన్ని చూసి అలా నోరు పారేసుకుంటున్నారని మనం లైట్ తీసుకోవచ్చు. కాని, హిందూత్వ ఎజెండా లేని వాళ్లు కూడా కొందరు సానియా కంటే సింధు బెటర్ అంటున్నారు. కారణం... టెన్నిస్ సెన్సేషన్ మిసెస్ మీర్జా అంబాసిడర్ గా ఇప్పటి వరకూ ఏ ఒక్క బాధ్యతా నిర్వహించకపోవటమే. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు గుజరాత్ అంబాసిడర్ అమితాబ్ లా ఆమె యాక్టివ్ గా అస్సలు లేదు. సానియానే కాదు చాలా మంది సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వున్నప్పుడు పెద్దగా యాక్టివ్ నెస్ చూపించరు. కాని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కోరి నియమించిన సానియా ఎంతో కొంత చేయాల్సి వుంది. కాని, ఇప్పటి వరకూ ఆమె ఎలాంటి చొరవా చూపించలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, హరితహారం వగైరా వగైరా లాంటి అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. అలాగని సానియా మ్యాచ్ లతో ఫుల్ బిజీయా అంటే అదీ కాదు. ఆమె అనేక ప్రైవేట్ కార్యక్రమాల్లో దర్శనమిస్తూనే వుంది. చివరకు, కపిల్ శర్మా షో లాంటి కమర్షియల్ టీవీ షోస్ లో కూడా పాల్గొంటోంది.   సానియాకి భిన్నంగా సింధు ఇప్పటికే తెలంగాణ సంప్రదాయాన్ని నెత్తికెత్తుకుని బొనం సమర్పించింది అమ్మవారికి. ఆ ఫోటోల్ని చూపిస్తూనే నెటిజన్లు సానియా బదులు సింధు కావాలంటున్నారు. మరి ఇలాంటి డిమాండ్లని సీఎం కేసీఆర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సానియా మైనార్టీ వర్గానికి చెందిన అమ్మాయి కావటం వల్లే దురుద్దేశాలతో ఇలా టార్గెట్ చేస్తున్నారని కొట్టిపారేస్తారా... లేక వాల్డ్ ఛాంపియన్ గా నిలిచిన సింధు నిజంగా సానియా కంటే బెటర్ అని డిసైడ్ అవుతారా... వీ హ్యావ్ టూ వెయిట్ అండ్ సీ! బాల్ ఈజ్ ఇన్ కేసీఆర్స్ కోర్ట్...    ఎవరు బ్రాండ్ అంబాసిడరైనా యాక్టివ్ గా వుండి రాష్ట్ర ప్రగతికి తోడ్పడితే కోట్ల రూపాయల నజరానాలు సమర్పించుకున్నందుకు.... అదే పది వేలు! 

రాక్షసత్వానికి సరికొత్త వికృత నిర్వచనం ఇచ్చిన ఐసిస్!

ప్రేమలో , యుద్ధంలో ఏదీ తప్పు కాదంటారు! ప్రేమ సంగతి దెవుడెరుగు. యుద్ధంలో మాత్రం ఏదీ తప్పు కాదన్న కర్కోటక సత్యం ఐసిస్ సంస్థ బలంగా నమ్ముతుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు. పబ్లిగ్గా తలలు నరకటం మొదలు ఇంకా పసితనం వాడని అమ్మాయిల్ని వేలానికి అమ్మటం వరకూ వాళ్లు చేయని దారుణం లేదు. ఇప్పుడు తమ వికృత చర్యల్ని వారికి వారే అధిగమించారు. టర్కీలో తాజా మానవబాంబు పేలుడుతో ఐఎస్ఐఎస్ రాక్షసత్వం కొత్త ఎత్తులకు చేరుకుంది...   యూరప్ ఖండంలోని ఏకైక ఇస్లామిక్ దేశం టర్కీ. ఐఎస్ ఉన్మాదంతో కకావికలైపోయిన సిరియాకి ఈ దేశంతో సరిహద్దు వుంది. అక్కడ్నుంచి టర్కీలోకి ఇబ్బడిముబ్బడిగా శరణార్థులు వస్తున్నారు. వాళ్ల ముసుగులోనే ఐసిస్ ఉగ్రవాదులు కూడా దేశంలో చొరబడుతున్నారు. అయితే, ఈ ఉగ్రవాదుల్ని గుర్తించటం టర్కీ పోలీసులకి, రక్షణ బలగాలకి అస్సలు కావటం లేదు. ఈ సంవత్సరం ఏకంగా రాజధాని ఇస్తాంబుల్ లోనే వరుస బాంబులు పేలుతున్నాయి. మొన్నా మధ్య దేశాధ్యక్షుడ్ని దించేసేందుకు ఆర్మీలో కుట్ర కూడా జరిగింది. ఇన్నిటి మధ్య టర్కీ పాలిట ఐసిస్ రాక్షసత్వం శనివారం నాడు కొత్త హద్దులు దాటింది...   సిరియా సరిహద్దు ప్రాంతంలోని టర్కీలో జరుగుతోన్న ఓ పెళ్లి వేడుకల్లో పెద్ద బాంబు పేలింది. అది ఓ మానవ బాంబు. మొత్తం 50మందికి పైగానే పొట్టన పెట్టుకున్నాడు తనని తాను పేల్చుకున్న ఐఎస్ ఉగ్రవాది. కాని, తరువాత అందర్నీ విభ్రాంతికి గురి చేసింది బాంబు పేలుడు కాదు. సదరు మానవ బాంబు వయస్సు! తనని తాను పేల్చుకున్న ఉగ్రవాది కేవలం 12సంవత్సరాల వయస్సు వాడై వుంటాడని టర్కీ అధ్యక్షుడు చెప్పాడు! ఉగ్రవాద దాడుల చరిత్రలోనే ఇంతలా 12ఏళ్ల పసివాడ్ని కూడా వాడుకున్న దాఖలాలు మనకు ఎక్కడా కనపడవు. మొత్తం ప్రపంచాన్ని రక్తం పీల్చే పిశాచిలా వేధిస్తున్న ఐసిస్ ఆ పని చేసేసింది. ముందు ముందు ఈ అరాచక ఉన్మాద సంస్థ ఇంకేం చేస్తుందో...    

కాశ్మీర్ వేర్పాటువాదం : మంచు మాటున వంచన పర్వం!

కొన్నాళ్ల కింద కాశ్మీర్ అట్టుడికిపోయింది. ఆర్మీపైన అక్కడి అల్లరి మూకలు రాళ్ల వర్షం కురిపించాయి. బుర్హాన్ అనే ఉగ్రవాదిని ఎన్ కౌంటర్లో చంపినందుకు నిరసనగా రోడ్లపైకి వచ్చి వేర్పాటు వాదులు అరాచకం సృష్టించారు. ఆర్మీ కూడా ఆత్మరక్షణ కోసం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించింది. ఈ మొత్తం గొడవలో చాలా మందే మరణించారు. కాని, నిజంగా కాశ్మీర్ వేర్పాటు వాదం వెనుక నమ్మలేని నిజాలు మీకు తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు! కాశ్మీర్ విషయంలో మన శత్రువులు కేవలం పాకిస్థాన్ లో లేరు. అంతర్గతంగానే ఎక్కువ వున్నారు. అభ్యుదయవాదులుగా, మేధావులుగా, జర్నలిస్టులుగా చలామణి అవుతూ 'కాశ్మీరియత్' అనే కొత్త పదాలు ప్రయోగిస్తూ యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్నారు. కాశ్మీర్ లో అసలు ఇండియాతో కలిసి వుండేందుకు ఇష్టపడే జనమే లేరన్నట్టు కొన్ని లెఫ్ట్ భావజాలం ముదిరిన న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. కాని, సత్యం మరోలా వుంది! కాశ్మీర్ కి ఇండియా జెండా కాకుండా తనదైన ప్రత్యేక జెండా వుంది. ఈ విషయం మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కాని, అక్కడి వేర్పాటు వాదులు తమ నిరసనల్లో భాగంగా కాశ్మీర్ జెండా ఎగురవేయరు. పాకిస్తాన్ జెండా రెపరెపలాడిస్తుంటారు. ఇది దేనికి సంకేతం? కాశ్మీర్ లో వేర్పాటువాదం వినిపిస్తోన్న అరాచక వర్గం నిజంగా స్వేఛ్ఛ కోరుకోవటం లేదు. పాకిస్తాన్ కాసులకు ఆశపడి అమ్ముడుపోతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ఏదో ఒక రోజు మొత్తం కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ధారదత్తం చేయాలని కుట్రపన్నుతున్నారు. అందుకే, రకరకాలుగా కాశ్మీరీ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినా కూడా ఇలా స్వతంత్ర కాశ్మీర్ కావాలని కోరుకుంటున్న జనం ఎంతో తెలుసా? జస్ట్ పదిహేను శాతం! అదెలాగో చూద్దం రండి... భారతదేశం ఆధీనంలో వున్న జమ్మూ, కాశ్మీర్ మొత్తం విస్త్రీర్ణం 101380 చ.కి. అందులో 15శాతం మాత్రమే వేర్పాటు వాదం వున్న కాశ్మీర్ ప్రాంతం. మిగతా 85శాతం జమ్మూ, లద్ధాఖ్ ప్రాంతాలు. ఇక్కడ ఇండియాకి వ్యతిరేకమైన సెంటిమెంట్ అస్సలు వుండదు. భారతదేశంలో ఇప్పటి వరకూ హిందూ ముఖ్యమంత్రే లేని రాష్ట్రం జమ్మూ, కాశ్మీర్. కాని, నిజానికి అంతా అనుకున్నట్టు జె అండ్ కే ముస్లిమ్ మెజార్టీ రాష్ట్రం కాదు. అక్కడి 85శాతం ప్రాంతంలో ముస్లిమ్ లు మైనార్టీలే. జమ్మూ, లద్ధాఖ్ లాంటి చోట్లలో హిందువులు, ఇతర వర్గాలే అత్యధికులు. మొత్తం 1.25కోట్లున్న జనాభాలో 69లక్షలు కాశ్మీర్లో, 53లక్షలు జమ్మూలో, 3లక్షలు లద్ధాఖ్ లో వుంటారు. మరో 7.5లక్షలు మంది జమ్మూ, కాశ్మీర్ పౌరసత్వం లేని సెటిలర్స్. ఇకపోతే 22జిల్లాల మొత్తం రాష్ట్రంలో కేవలం 5జిల్లాలు మాత్రమే వేర్పాటు వాదుల ప్రభావంలో వున్నాయి. అవ్వి శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుల్గాం, పుల్వామాలు. ఇవి కాక 17జిల్లాలు ఎలాంటి వేర్పాటువాదంతోనూ లేవు. అంతే మెజార్టీ ప్రాంతం, ప్రజలు ఇండియాతోనే వుండాలని కోరుకుంటున్నారన్నమాట! అలాగే, ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ జపం చేసే వేర్పాటు వాదులున్న 5జిల్లాలు పాక్ సరిహద్దుకి దూరంగా వుంటాయి. నిజంగా ఆ దేశంతో సరిహద్దు పంచుకునే కాశ్మీరీ జిల్లాలు ఎంత మాత్రం వేర్పాటువాదానికి సహకరించవు. ఇండియాతోనే వుండాలని కోరుకుంటాయి. జమ్మూ, కాశ్మీర్ జనాభాలో 85శాతం రకరకాల మతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన వారు. వీళ్లెవరూ భారత్ కు వ్యతిరేకం కాదు. ఇందులో ముస్లిమ్ లే అయిన షియాలు కూడా వుంటారు. వీళ్లు ఇస్లాం అనుసరించినా సున్నీ ప్రాబల్యం వున్న పాకిస్తాన్ అంటే అస్సలు ఇష్టపడరు. ఒకింత భయపడతారు కూడా... కాశ్మీర్ లో షియా ముస్లిమ్ లు కాకుండా రాజ్ పుత్, బ్రాహ్మణ, మహాజన వర్గాలకు చెందిన డోగ్రాలనే సామాజిక వర్గం వుంటుంది. వీళ్లతో పాటూ దారుణంగా హింసకు గురైన కాశ్మీరీ పండిట్లు కూడా ప్రధానంగా వుంటారు. అంతే కాకుండా ఈ హిమాలయ రాష్ట్రంలో సిక్కులు, బౌద్ధులు, గుజ్జర్లు, బకర్ వాల్స్, పహరీస్, బాల్టీస్, క్రిస్టియన్లు, ఇంకా మైక్రో మైనార్టీ వర్గాలు వుంటారు. వీళ్లెవరూ వేర్పాటు వాదానికి అనుకూలం కాదు.    ఇక మన జాతీయ మీడియాలో ప్రధానంగా వినిపంచే కాశ్మీరియత్ ఒట్టి భ్రమ మాత్రమే. జమ్మూ, కాశ్మీర్లో నిజంగా కాశ్మీరీ భాష మాట్లాడేది 33శాతం జనాబానే. మిగతా వారు డోగ్రీ, గుజ్జరీ, పంజాబీ, లద్దాఖీ లాంటి భాషలు మాట్లాడతారు. కాని, 33శాతం కాశ్మీరీ మాట్లాడేవారే వేర్పాటు వాద హురియత్ ని, ఉగ్రవాద సంస్థల్ని, ఒమర్ అబుద్ధల్లా నేషనలిస్ట్ కాంగ్రెస్ ని, మెహబూబా ముఫ్తీ పీడీపీని కంట్రోల్ చేస్తారు. అంతే కాదు, వ్యాపారాలు, వ్యవసాయం, గవర్నమెంట్లో కీలక పదవులు అన్నీ కూడా ఈ కాశ్మీరీ మాట్లాడే వారి చేతుల్లోనే వుంటున్నాయి. అందుకే, వారి మాటే చెల్లుతూ వస్తోంది. మొత్తం మీద కాశ్మీర్ లోని సున్నీ ముస్లిమ్ లు తప్ప మిగతా ముస్లిమ్ వర్గాలతో సహా హిందు, సిక్కు, బౌద్ధ మరే ఇతర వర్గం కూడా వేర్పాటు కోరుకోవటం లేదు. అలా కోరుకునే సున్నీ వర్గం కేవలం 15శాతానికే పరిమితం. వాళ్లే పాకిస్తాన్ తో అంటకాగి, ఆర్మీ పై రాళ్లు రువ్వుతూ అల్లకల్లోలం సృష్టిస్తుంటారు. వాళ్లకే మన మీడియా అభ్యుదయవాదం ముసుగులో చేతనైనంత సాయం చేస్తుంటుంది. మొత్తం జమ్మూ, కాశ్మీర్ ఇండియాకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చేసిందని హడావిడి చేస్తుంటుంది. కాని, గొడవంతా జరిగేది 5జిల్లాల్లో మాత్రమే. మిగతా 17 జిల్లాలు మిగతా భారతదేశంలో అన్ని ప్రాంతాలు ఎలాగ ఈ దేశంలో అంతర్భాగంగా వుండాలని కోరుకుంటున్నాయో అలాగే భావిస్తున్నాయి. వీటిలో 90శాతం పైగా ముస్లిమ్ జనాభా వున్న సరిహద్దు జిల్లాలైన పూంచ్, కార్గిల్ వంటివి కూడా వున్నాయి!

శ్రీలంక అధ్యక్షుడికి జరిగిందే అమెరికా ప్రెసిడెంట్ కైతే!?

  తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవటానికి వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఏం జరిగిందనేది పక్కన పెట్టండి. మరో ఊహాజనితమైన పరిస్థితిని ఇప్పుడు మాట్లాడుకుందాం! అదేంటంటే... అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియా వచ్చాడు. ఓ చోట ఒక కార్యక్రమం కోసం ఆగాడు. తిరిగి బయటకొచ్చే సరికి ఆయన కాన్వాయ్ నడపాల్సిన డ్రైవర్లు ఒక్కరూ లేరు! కొంత సేపు ఒబామా తన కార్ లోనే కూర్చుని డ్రైవర్ల కోసం ఎదురు చూశాడు! ఇప్పుడు చెప్పండి... ఇలాంటి సమన్వయ లోపం భారత్ కు ఎంత అప్రతిష్ఠకరం? పైగా ఒక దేశాధ్యక్షుడికి ఎంత ప్రమాదకరం?   మనం ఊహించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడికి ఆయన పర్యటనలో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు కాని శ్రీలంక ప్రెసిడెంట్ కి వచ్చాయి. సాటి దేశపు అధ్యక్షుడు అయిన ఆయన శ్రీవార్ని దర్శించుకుని గుడి నుంచి బయటకు రాగానే కాన్వాయ్ బయలుదేరలేదు. కారణం టీటీడీ అధికారులకి, పోలీసులకి మధ్య జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్. డ్రైవర్లంతా ఎక్కడో వుండగానే వచ్చి కార్లో కూర్చున్న మైత్రిపాల సిరిసేన కాస్సేపు టెన్షన్ టెన్షన్ గా అందులో వెయిట్ చేసి డ్రైవర్స్ వచ్చాక బయలుదేరారు. ఇది మనకు చిన్న విషయంగానే తోచవచ్చు కాని చాలా పెద్ద అవమానం, ప్రమాదం కూడా!   శ్రీలంక అధ్యక్షుడంటే సహజంగానే ఇండియాలోని అతివాద తమిళ సంస్థలకి కోపం వుంటుంది. అలాంటి హిట్ లిస్ట్ లో వున్న వీవీఐపీ సెలబ్రిటీని టీటీడీ, పోలీసులు జాగ్రత్తగా చూసుకుని స్వదేశానికి పంపాలి. అంతే కాని, కాన్వాయ్ నడపటానికి డ్రైవర్లు కూడా అందుబాటులో లేకుండా చేస్తే ఎలా? రేపు మరో దేశంలో మన ప్రధానికే ఇలాంటి అనుభవం ఎదురైతే మనం లైట్ తీసుకుంటామా?   భద్రత, జాగ్రత్తల విషయంలో అన్ని చోట్లకంటే తిరుమల వద్ద మరింత పకడ్బందీగా వుండాలి. ఎందుకంటే, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలన్నిటికి హిందువుల పరమ పవిత్ర క్షేత్రమైన తిరుమలే టార్గెట్. కాబట్టి ఇక మీదైనా సెలబ్రిటీల్ని, సామాన్యుల్ని టీటీడీ, పోలీసులు కంటికి రెప్పలా కాపాడాలి! మానవ ప్రయత్నానికి తోడుగా అందర్నీ కాచేవాడు ఆ వెంకన్న స్వామీ ఎలాగూ వుండనే వున్నాడు!

ఫ్రీ పబ్లిసిటీ లడ్డూ కావాలా నాయనా... శోభా డేను ఫాలోకండి!

  అడుసు తొక్కనేలా కాలు కడగనేలా.... ఇదో చాలా పాత సామెత! అంతకంటే పురాతన విమర్శకురాలు శోభా డే! అవును... ఆమె అప్పుడెప్పుడో కొన్ని పుస్తకాలు రాసిందంటారు. అవి కూడా బూతు సాహిత్యం అని కొందరు కొట్టిపారేస్తారుగాని చాలా వరకూ బోల్డ్ రైటింగ్స్ అని మెచ్చుకుంటారు! అయితే, శోభా డే ఎంతమందికి నచ్చినా, నచ్చకపోయినా పేజ్ త్రీ సర్కిల్స్ లో మాత్రం సూపర్ పాప్యులర్. పైగా ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా జడలు విప్పిన తరువాత, సోషల్ మీడియా విశృంఖలంగా మారిన తరువాత ఈమెకి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ వచ్చింది. అది తాజా రియో ఒలంపిక్స్ సందర్భంలో నానా యాగీకి కారణమైంది...   ఒలంపిక్స్ లో భారత్ పర్ఫామెన్స్ పెద్దగా అభినందనీయంగా వుండదనేది ఇప్పుడే కొత్తగా తెలిసిందేం కాదు. అసలు ఒలంపిక్స్ చరిత్రలో ఎప్పుడూ ఇండియా ఇరగదీసింది  ఏం లేదు. కాని, శోభా డే వున్నట్టుండీ ట్విట్టర్ లో చెలరేగిపోయింది. ఆ మధ్య మోదీ సర్కార్ వచ్చాక అసహనం పెరిగిపోయిందని, మైనార్టీల కంటే ఎక్కువగా తానే భయపడిపోతున్నానని శోభా డే తెగ ఆవేశపడింది. అప్పుడు కూడా ఆమెను ట్విట్టర్ లో జనం అదేదో చేసి చెవులు మూసినంత పని చేశారు. అంతే మరి... కాంగ్రెస్ వున్నంత కాలం ఏ మాత్రం గుర్తుకు రాని అసహనం బీజేపి రాగానే శోభా డేకు జ్ఞాపకం వచ్చిందంటే ఏమనాలి?   ట్విట్టర్ ద్వారా ట్రాల్ అవుతూ మీడియాలో మజా చేయటం ఓ సారి అలవాటయ్యాక ఎవరికైనా ఆ ఫ్రీ పబ్లిసిటీ ఎలా వదులుకోబుద్దవుతుంది? అందుకే, ఒలంపిక్స్ రాగానే శోభా కొత్త శోభతో వెలిగిపోయింది. అథ్లెట్లు రియోకు వెళ్లేది సెల్ఫీలు తీసుకోవటానికని నోటికొచ్చినట్టు కామెంట్స్ చేసింది. అందుకు ప్రతిఫలంగా టీవీ ఛానల్స్ మొదలు అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ వరకూ అంతటా, అంతా శోభాకు మొట్టికాయలు వేశారు. మరీ ముఖ్యంగా సింధు, సాక్షి మాలిక్ పతకాలు గెలిచాక శోభా డేకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు.   ఒలంపిక్స్ విషయంలో తన వాగుడు అసలుకే మోసం తెచ్చిందనుకున్న శోభా డే ఇక రియో సంబరాలు అయిపోతున్న వేళ సింధు, దీపా కర్మాకర్, సాక్షీల్ని తెగ పొగిడేస్తు తాజా ట్వీట్స్ చేసింది. ఆహా ఓహో అంటూ ప్లేటు ఫిరాయించింది! మరి ఈ మాత్రం దానికి కొన్ని రోజులు పాటూ నెగటివ్ ట్వీట్స్ చేస్తూ డ్రామాలు నడపటం ఎందుకు? పబ్లిసిటీ కోసమేనా? అయితే, శోభా సక్సెస్ అయినట్టే! ఆమె గాని పిచ్చి మాటలు మాట్లాడి వుండకపోతే ఎవ్వరూ పట్టించుకునే వారు ఈ ముదురు రైటర్ అండ్ జర్నలిస్ట్ ని! 

కానిస్టిట్యుయెన్సీల పై కవిత కామెంట్స్ కి కారణం ఏంటి?

  టీఆర్ఎస్ , బీజేపి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందా? ఈ అనుమానం ఇప్పటిది కాదు. గత కొన్ని రోజులుగా చాలా మందికి కలుగుతున్నదే. అందుకు తగ్గట్టే సంకేతాలు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా రెండు పార్టీల చనువు స్పష్టంగా కనిపించింది.   తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలంగాణలో నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో చోటా మోటా నాయకులు ఈ మాటంటే లైట్ తీసుకోవచ్చుగాని స్వయాన సీఎం కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారంటే దాదాపూ ఖయమన్నట్లే. కాని, ఒక్కసారి మనం కొన్నాళ్లు వెనక్కి వెళితే ఇదే నియోజక వర్గాల పెంపు అంశం ఆంధ్రప్రదేశ్ విషయంలో చర్చకొచ్చింది. అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఏమాత్రం స్పందిచినట్టు కనిపించలేదు. అధికార టీడీపీ ఎన్డీఏలో భాగమైనప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కొన్నాళ్లు న్యూస్ లో నానిన  కానిస్టిట్యూయెన్సీల పెంపు మ్యాటర్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది.   మారుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ, టీఆర్ఎస్ దగ్గరవుతున్నాయి. ఈ కొత్త స్నేహం కారణంగానే నియోజక వర్గాల పెంపుకి ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ వచ్చి వుండవచ్చు. అందుకే, కవిత స్థాయి నాయకురాలు నియోజక వర్గాలు పెరుగుతాయని ప్రకటించారు. అదే నిజమైతే అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు 50 వరకూ అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజక వర్గాలు పెరిగే ఛాన్స్ వుంది. ఇక తెలంగాణలో అదే రేషియోలో దాదాపు 30వరకూ అసెంబ్లీ సీట్లు పెరగవచ్చు.   ఎంపీ, ఎమ్మేల్యేల సీట్లు, టీఆర్ఎస్, బీజీపీల పొత్తు ఇవేవీ ఇంకా కన్ ఫర్మ్ కాకున్నా కవిత లేటెస్ట్ కామెంట్స్ ఎంతో కొంత భవిష్యత్ సూచించేవే అంటున్నారు అబ్జర్వర్స్.... 

విజయలక్ష్మే కాదు... ధన లక్ష్మి కూడా!

సింధు రియో ఒలంపిక్స్ లో పోటీపడి సిల్వర్ గెలిచింది. ఇప్పుడు ఆమెను సత్కరించే విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంతకంటే ఎక్కువగా పోటీపడుతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా, పక్కనే వున్న మద్యప్రదేశ్, ఎక్కడో వున్న ఢిల్లీ... ఇలా అన్ని సర్కార్లు సత్తా చాటుతున్నాయి. హైద్రాబాద్ లో ప్రాక్టీస్ చేసి ప్రపంచ స్థాయికి ఎదిగిన సింధుకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అంతకంటే భేషుగ్గా... సింధు స్వంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. చంద్రబాబు ఒలంపిక్ మెడల్ విన్నర్ కి ఏకంగా మూడు కోట్లు ప్రకటించారు. అంతే కాదు, గ్రూప్ వన్ స్థాయి జాబ్, ఆంధ్రుల రాజధాని అమరావతిలో వేయి గజాల స్థలం కూడా అనౌన్స్ చేశారు. ఆమె కోచ్ గోపిచంద్ కి కూడా ఏపీ గవర్నమెంట్ 50లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది!   చంద్రబాబు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ను ఎంకరేజ్ చేయటం ఇది మొదటిసారి కాదు. 2003లో గోపిచంద్ అకాడమి ప్రారంభించేందుకు గచ్చిబౌలిలో 5ఎకరాలు ఆయనే కేటాయించారు. ఆ అకాడమీలోనే సైనా, సింధు లాంటి మెరికలు తయారయ్యారు!   ఇక రియోలో రజతం గెలిచిన మన తెలుగు బంగారం సింధుకి ఇతర రాష్ట్రాలు కూడా వరుసగా నజరానాలు ప్రకటిస్తున్నాయి. మధ్యప్రధేశ్ ప్రభుత్వం 50లక్షలు అనౌన్స్ చేస్తే ఢిల్లీ సీఎం 2కోట్లు ఇస్తామని చెప్పారు! భారత బ్యాడ్మింటన్ సమాఖ్య కూడా సింధుకి 50లక్షలు, ఆమె కోచ్ గోపిచంద్ కి పది లక్షలు ప్రకటించింది...   మరి మెడల్ గెలిచిన వారిని ఎంకరేజ్ చేసే విషయంలో ఇంత పోటీపడుతోన్న ప్రభుత్వాలు, పొలిటీషన్స్.... మెడల్ గెలవాలని తాపత్రయపడుతోన్న ఔత్సాహికుల్ని ఎంకరేజ్ చేసే చర్యలు కూడా చేపడితే ఇంకా బావుంటుంది కదా...  

దొంగనే దోచుకున్న ఖాకీ దొంగలు!

కనిపించని నాలుగు సింహమేరా పోలీస్... ఈ డైలాగ్ సాయికుమార్ బేస్ వాయిస్ లో ఫుల్ గా పాప్యులర్ అయిపోయింది! సాయికుమార్ చేసిన అగ్ని క్యారెక్టర్ లాంటి సింహం వంటి పోలీసులు చాలా మందే వుంటారు డిపార్ట్ మెంట్లో. కాని, పాపం అలాంటి సిన్సియర్ పోలీసాఫీసర్ల పరువు తీసేవారు కూడా అదే శాఖలో వుంటుంటారు! ఈ జాదు పోలీస్ అలాంటి వాడే...   పేరు బాలు జాదవ్. గతంలో కూడా అనేక జాదులు చేశాడని పేరున్న ఈ డీఎస్పీ స్థాయి అధికారి ఈసారి ఏకంగా ఎంసెట్ లీకేజీ కేసులోనే వెలెట్టాడు! ప్రస్తుతం సీఐడీ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న బాలు మహబూబాబాద్ కి వెళ్లి పేపర్ లీకేజీకి కారణమైన ఓ దళారిని పట్టుకోవాలి. కాని, తీరా అక్కడికి వెళ్లాక సదరు బ్రోకర్ ని బెదిరించి మూడు లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డబ్బిస్తే దొంగ దొరకలేదని చెప్పేస్తానంటూ అభయమిచ్చాడు. కాని, అంత డబ్బు దళారి వద్ద లేకపోవటంతో సమస్య ఎదురైంది. బాలు జాదవ్ హెడ్ కానిస్టేబుల్ సదాశివరావుతో కలిసి దళారి వెంకటేష్ ను భయపట్టి అతడి ఏటీఎం కార్డులన్నీ గీయించి లక్ష రూపాయలు డ్రా చేయించాడు! అవ్వి జేబులో పెట్టుకుని ఆఫీస్ కి వెళ్లి జాదు జాదవ్ దళారి దొరకలేదని చెప్పేశాడు. ఇలా దొంగలతో కుమ్ముక్కై ఎన్నిసార్లు వదిలిపెట్టాడో తెలియదుగాని ఈ సారి మాత్రం పై అధికారులకి మనోడి వ్యవహారంపై డౌట్ వచ్చింది.   వేరే పోలీసుల్ని పంపటంతో దళారి వెంటేష్ అరెస్ట్ అయ్యాడు. ఇంటరాగేషన్ లో మన జాదు డీఎస్పీ గారి కహానీ మొత్తం విప్పి చెప్పాడు. డబ్బులు డ్రా చేసిన ఏటీఎంలలో సీసీ కెమెరా ఫీడ్ చూటంతో అయ్యగారు క్లియర్ గా దొరికిపోయారు! ఇంకేముంది డీజీపీ అనురాగ్ శర్మ దొంగనే దోచిన తోడు దొంగలు డీఎస్పీ, హెడ్ కానిస్టేబుల్ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు! విది నిర్వహణలో ప్రాణాలు సైతం త్యాగం చేసే ఎంతో మంది పోలీసులున్న డిపార్ట్ మెంట్లో ఇలాంటి జాదు డీఎస్పీలు, హెడ్ కానిస్టేబుల్స్ నిజంగా పెద్ద కళంకమే. వీరి వల్లే సామాన్య జనం రౌడీల కంటే ఎక్కువగా పోలీసుల్ని చూసి భయపడిపోతుంటారు... మన దేశంలో!    

ఆమె లేటెస్ట్ అభిమాని రజినీకాంత్!

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఎంత వరకూ నిజమో మనకు తెలియదుగాని ఒక విజయం మాత్రం సింధు రేంజ్ ని అమాంతం పెంచేసింది! ఇప్పుడు పూసర్ల వెంకట సింధుకి ఒలంపిక్స్ సిల్వర్ మెడల్ బోలెడు మంది కొత్త ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టింది. వారిలో ఎవరో మామూలు జనం కాదు ఏకంగా రజినీకాంత్ కూడా వున్నాడు! అదీ విశేషం... సెలబ్రిటీలకే సెలబ్రిటీ అయిపోయిన సింధుని ఉద్దేశించి '' హ్యాట్సాఫ్‌ సింధు.. నేను నీకు పెద్ద అభిమానినయ్యాను. అభినందనలు'' అంటూ ట్వీట్ చేశాడు తలైవా! అంతే కాదు, ''మా హృదయాలను గెల్చుకున్నావు. నిన్ను చూసి యావద్భారతం గర్విస్తోంది. ఈ క్షణాలను మాకిచ్చినందుకు ధన్యవాదాలు'' అన్నాడు మరో లివింగ్ లెజెండ్ అమితాబ్! ఇక క్రికెట్ లోకపు దేవుడు సచిన్ అయితే ''భారత యువ కెరటమా బాగా పోరాడావు. అద్భుతమైన ప్రదర్శనతో మా మనసులు గెలుచుకున్నావ్‌'' అంటూ సింధుని అభినందించాడు.    కేవలం సినీ, క్రీడా ప్రముఖులే కాదు సింధు మేనియాలో దేశాన్ని నడుపుతోన్న ఉద్ధండులు కూడా మునిగిపోయారు! రాష్ట్రపతి ప్రణబ్ అయితే '' చరిత్ర సృష్టించినందుకు హృదయపూర్వక అభినందనలు. నీతోపాటు దేశమంతా సంతోష సాగరంలో మునిగి తేలుతోంది. నువ్వు ప్రదర్శించిన మనోబలం, ధైర్యం, తెలివి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి '' అన్నారు. ప్రధాని మోదీ సైతం తన మోదాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు. ''రజతం తెచ్చినందుకు అభినందనలు. చాలా బాగా పోరాడావు. నీ విజయం చరిత్రాత్మకం. ఏళ్లపాటు దీన్ని గుర్తుచేసుకుంటాం'' అన్నారు.    తెలుగు వారికి గర్వకారణమైన సింధుపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రశంసలు కురిపించారు. ''బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధు యువతకు స్ఫూర్తిప్రదాయని. విజయం కోసం ఆమె తుదకంటూ ఎంతో పోరాడింది. ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకం సాధించిన ఆమెను ఆదర్శంగా తీసుకొని, యువత జాతీయభావం పెంచుకోవాలి'' అన్నారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా అయితే ''అలుపన్నదే లేకుండా గగన తారకలా పోరాడావు. నీలానే ఆడాలని ఎందరిలోనో ఆశలు పుట్టించావ్‌. నీ పతకం భరత మాత కిరీటంలో అత్యంత అమూల్యమైన వజ్రం'' అన్నారు. సింధుని ఆకాశానికెత్తిన వాళ్లలో ఇంకా చాలా మందే వున్నారు. విశ్వనాథన్ ఆనంద్, అభినవ్ బింద్రా, పేస్, భూపతి, విజేందర్ సింగ్.... ఇలా బోలెడు మంది. ఒక్క విజయం రేంజ్ నే మార్చేయటం అంటే ఇదే మరి!

సింధుపై "రీజనల్" ఎఫెక్ట్...

ఒక్కసారి రెండేళ్లు వెనక్కి వెళ్లి తెలుగు వారి పరిస్థితి గుర్తుకు తెచ్చుకోండి! సోనియా నివాసం టెన్ జన్ పథ్ మొదలు భారత పార్లమెంట్ దాకా ఎక్కడ చూసినా తెలుగు వారి గోలే వుండేది! విభజన కావాలని, వద్దని రెండు వర్గాలుగా చీలి ఢిల్లీని గిల్లి గిల్లి వదిలేశారు! చివరకు, రెండు ముక్కలైంది తెలుగు నేల...    రాష్ట్ర విభజనని పాజిటివ్ గా చూసిన వారు ఇప్పుడు మనకు రెండు రాష్ట్రాలు అన్నారు! నెగటివ్ గా తీసుకున్న వారు తెలుగు జాతి విడిపోయిందని వాపోయారు. అయితే, విభజన ఎఫెక్ట్ ఇప్పటికీ తగ్గినట్టు లేదు జనాల్లో!     సింధు ఒలంపిక్స్ లో స్వర్ణం గెలిచే అవకాశం అందిపుచ్చుకోవటంతో సోషల్ మీడియా యాజ్ యూజ్ వల్ గా వెర్రెత్తిపోయింది. పోస్ట్ లు, షేర్లు అమాంతం ముంచెత్తాయి. అయితే, అందులో విశేషం ఏం లేదుగాని సింధు తెలుగమ్మాయి అవ్వటమే అసలు సమస్యకి కారణమైంది. తెలంగాణ వీరాభిమానులు ఆమె బోనం ఎత్తుకున్న ఫోటో చూపిస్తూ సింధు తెలంగాణ తేజం అన్నారు. అటు ఆంద్రా నెటిజన్లు కూడా సింధు ఆంధ్ర ఆణిముత్యం అంటూ ఆమె స్వగ్రామం, పుట్టుపూర్వోత్తరాలు రాసేయటం మొదలు పెట్టారు. మొత్తానికి మంచి ఊపులో వున్న బ్యాడ్మింటన్ స్టార్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం ఇరువైపులా చేశారు!     సింధు ఆంద్రా పడుచా, తెలంగాణ బిడ్డా అన్నది పక్కన పెడితే ఆమె నిస్సందేహంగా భారతీయురాలు. కాబట్టి అందరికీ గర్వకారణం. కాని, రాష్ట్ర విభజన జరిగిన తొలి 5ఏళ్ల కాలంలో వున్న మనం సహజంగానే కాస్త ఎఫెక్ట్ అవుతాం. అదే జరుగుతోంది సోషల్ మీడియాలోనూ! అయితే, ఈ తెలంగాణ, ఆంద్ర ఫీలింగ్స్ హద్దులు దాటకపోతే అదే పదివేలు!

ఆమె పొద్దు తిరుగుడు పువ్వు!

పాస్ట్‌ లైఫ్‌లో హీరోయిన్‌గా..ప్రజంట్ తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఆమెకు ఇమేజ్ ఉంది...తన అగ్రెసివ్‌నెస్‌తో, వాగ్ధాటితో ఇంటా బయటా జనం దృష్టిని తనవైపు తిప్పుకోవడం ఆమెకు కొట్టినపిండి. రెండుసార్లు ఓడిపోయిన ఈ ఫైర్ బ్రాండ్ ఒక నియోజకవర్గానికి శాసనసభ్యురాలు, అయితే ఆమె ఇప్పుడున్న పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో ఎంతకాలం ఇలాగే ఉంటామని.. ఎక్కడ్నుంచి వచ్చిందో అక్కడికే దుకాణం సద్దేందుకు డిసైడ్ అయినట్లు ఆ నోటా ఈ నోటా వార్తలు వస్తున్నాయి.       మామూలుగా నిప్పులేనిదే పొగ రాదు కదా!? ఈమె విషయంలో కూడా అదే జరిగింది. ఇలాంటి వార్తల్లో పక్కా సమాచారం ఏం వుండదు. కాని, అసలు ఇప్పుడున్న పార్టీ నుంచి ఆవిడ జంప్ అనే విషయం ప్రచారం కావటమే ఏదో జరిగిందనే దానికి గుర్తు! ఎందుకంటే, పొద్దున్న లేస్తే ఆ పార్టీ అధినేతతో సహా, ఎవ్వర్నీ వదిలిపెట్టక ఏకి పారేసే ఆమె అదే పార్టీలోకి తిరిగి వెళ్లబోతోందని ఊరికే ఎవరు ప్రచారం చేస్తారు? నిప్పేదో వుంటేనే కదా పొగ బయలుదేరేది!       తనపై పార్టీ ఫిరాయింపు ప్రచారం మరీ ఎక్కువైపోవటంతో సదరు నాయకురాలు క్లారిఫికిషన్ ఇచ్చుకుంది. తనకు ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనే లేదనీ.. హాయిగా ప్రతిపక్షంలోనే గడిపేస్తానని ఆమె అన్నారు. కాకపోతే, ఆమె వెళ్లాలనుకుంటోన్న పార్టీ నాయకులు చెబుతున్న దాని ప్రకారం, ఆవిడ అతి చేష్టలకు ఒళ్లుమండి వాళ్ల పార్టీ అధినేత ఇప్పుడు ఆమె వస్తాననగానే ఆహ్వానించే సీన్ లేదట. పైగా అమ్మగారు ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ అధికారం కోల్పోవటం ఖాయమనే నెగటివ్ టాక్ కూడా వుండనే వుంది. కాబట్టి సదరు పార్టీ డోర్స్ ఆవిడగారికి ప్రస్తుతానికి మూసుకున్నట్టే!      ఒక్క ఈమె విషయమే కాదు ఇప్పుడు చాలా మంది పొలిటీషన్స్ పొద్దు తిరుగుడు పూల మాదిరిగా తయారయ్యారు. ఆర్దిక ఇబ్బందులో, బయటకు చెప్పుకోలేని ఇతర అనివార్య కారణాలో తెలియదుగాని అధికారంలో వున్న సీఎం వైపు పొద్దు తిరుగుడు పూలలా టర్న్ అయిపోతున్నారు. తెలంగాణలో కేసీఆర్ వల్లే బంగారు తెలంగాణ సాధ్యం అనటం పార్టీల్లోంచి జంప్ చేయటం... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గొప్ప నాయకుడనటం పచ్చ కండువా కప్పుకోవటం రొటీన్ అయిపోయింది.