కస్సుమంటున్న కేసీఆర్... తుస్సుమంటున్న టీ కాంగ్రెస్!
posted on Aug 25, 2016 @ 2:38PM
కేసీఆర్... తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ పేరు ఉద్యమానికి పర్యాయపదం. కాని, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి. అందుకు తగ్గట్టే ఆయన ఉద్యమ సమయంలో లాగా ఈ మధ్య భాషా ప్రయోగం చేయటం లేదు. సాధ్యమైనంత వరకూ సంయమనం పాటిస్తున్నారు. అయినా కూడా అడపాదడపా ప్రతిపక్షాల మీద ఘాటు కామెంట్స్ చేస్తూనే వున్నారు. అయితే, తాజాగా కేసీఆర్ ఆగ్రహానికి టీ కాంగ్రెస్ నేతలు అల్లాడిపోయారు!
మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక ఒప్పందాలు చేసుకుంది. వీటి వల్ల గోదావరిపై అనేక ప్రాజెక్ట్ లు పూర్తయ్యే అవకాశం వస్తుంది. అంతే కాదు, తెలంగాణలోని కోటి ఎకరాల భూములు పచ్చగా మారతాయి! అయితే, ఇదంతా నిజంగా జరుగుతుందా? జరిగినా ఎప్పటిలోపు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. కాని, అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ తన పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతల్ని, టీ కాంగ్రెస్ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా మహారాష్ట్ర నుంచి వచ్చి బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడే కడిగిపారేశారు. ఇంకా గంట సేపు వుంటాను. ఇక్కడికే సాక్ష్యాలు తీసుకుని రా అంటూ సవాలు విసిరారు కేసీఆర్! నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తానని వేడి పుట్టించారు....
కేసీఆర్ చేసిన అతి తీవ్రమైన దాడికి బహుశా కాంగ్రెస్ నేతలు అవాక్కై వుంటారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ హస్తం పార్టీ కేసీఆర్ కి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోతోంది. ఇలాగే ప్రతీసారి ఏదో ఒకటి అనటం... దానికి కేసీఆర్ దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వటం... టీ కాంగ్రెస్ నేతలు మెల్లగా వెనక్కి తగ్గటం ... ఇదే నడుస్తోంది!
కేసీఆర్ తెలంగాణ రైతులకి నీళ్లు ఇవ్వాలని సంకల్పించటం, కాంగ్రెస్ నేతల్ని ఏకిపారేయటం... ఇదంతా పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. కాని, కేసీఆర్ తనపై, తన ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని బెదిరించటమే కాస్త ఆందోళనకరం అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఎందుకంటే, డెమొక్రసీలో ప్రతిపక్షల పనే పాలక పక్షాన్ని కార్నర్ చేయటం. అలా చేసినంత మాత్రన కేసులు పెడతామని బెదిరిస్తే ఎలా? వాళ్ల ఆరోపణల్ని గట్టిగా తిప్పి కొట్టాలిగాని అంటున్నారు విమర్శకులు...
కేసీఆర్ కేసులు పెడతామని అనటానికి కొద్ది గంటల ముందే తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలతకి సుప్రీమ్ కోర్టు గట్టి హెచ్చరిక చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కేసులు బనాయించటం సరైన పద్ధతి కాదని హితవు చెప్పింది. ఈ విషయం కేసీఆర్ కూడా గుర్తించాలంటున్నారు ఆయన ప్రత్యర్థులు. టీ కాంగ్రెస్, టీ టీడీపి నేతలే కాదు కనీసం కోదండరామ్ లాంటి న్యూట్రల్ వ్యక్తులు కూడా టీఆర్ఎస్ హీట్ ను తట్టుకోలేకపోతున్నారు. ఆ మద్య ప్రొఫెసర్ కోదండరామ్ కూడా గవర్నమెంట్ పై ఆరోపణలు చేస్తే విపరీతంగా తిట్టిపోశారు గులాబీ నేతలు. ఆయన ఆరోపణల్ని సమర్థంగా ఎదుర్కోవటం కాకుండా ప్రతి దాడికి దిగారు. ఇలా ప్రతిధ్వని అన్నదే లేకుండా గొంతు నొక్కేయటం ప్రజాస్వామ్యానికి ఎంతైనా మంచిది కాదని ఆందోళన చెందుతున్నారు ప్రజాస్వామ్యవాదులు...