గాంధీ గురించి గాంధీ గారి గోల!
posted on Aug 26, 2016 @ 11:13AM
కాంగ్రెస్ పార్టీని ఎవరైనా చంపేస్తున్నారా? లేక తనే చచ్చిపోతుందా? ఇది కొంచెం దుర్మార్గమైన ప్రశ్నే కావొచ్చు! కాని, ప్రాక్టికల్ గా దేశంలో అదే పరిస్థితి నెలకొంది! సెంచరీ కొట్టిన ఆ పార్టీని ఎవరో చంపాల్సిన పని లేకుండా తానే చాప సర్దేసుకుంటుంది! అదీ విషాదం....
కాంగ్రెస్ గత అరవై అయిదేళ్లుగా రాష్ట్రాల్లో, ఢిల్లీలో తనకు చేతనైనంత అధికారం వెలగబెట్టింది. ఇప్పుడు ఒకట్రెండు చెప్పుకోతగ్గ రాష్ట్రాల్లో తప్ప మరెక్కడా అడ్రస్ లేకుండా పోయింది. బీజేపి ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. మిగిలిన చోటంతా ప్రాంతీయ పార్టీలు ఖతం చేశాయి. అయితే, ఇవన్నీ కాంగ్రెస్ మీద కక్ష్యతో ఎవరో కూర్చుని చేసినవి కావు! కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఎదుటి పార్టీలకి ఎదిగే అవకాశం పుష్కలంగా ఇచ్చింది. అందుక్కారణం విస్పష్టంగా గాంధీలే!
మహాత్మ గాంధీ వంటి తిరుగులేని నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పని చేశాడు. దాన్ని నడిపాడు. తరువాత స్వతంత్రం వచ్చింది. బ్రిటీషు వాళ్లు పోయారు. కాని, నెహ్రు తరువాత నుంచి చాలా ఏళ్ల పాటూ మనల్ని గాంధీలే ఏలుతూ వచ్చారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ మాటున సోనియా గాంధీ... ఇలా దశాబ్దాల పాటూ గాంధీల యుగమే నడిచింది. ఎట్టకేలకు పార్లమెంట్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ వారి కాంగ్రెస్ బిక్కుబిక్కుమంటుంది!
ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ ... వీళ్ల పేర్ల చివర్లో వున్న గాంధీకి, మహాత్మా గాంధీకి ఏంటి సంబంధం అంటే స్పష్టమైన సమాధానం లేదు భారతీయుల వద్ద. కాకపోతే, గాంధీలే కదా అనుకుని ఇంతకాలం నెత్తిన పెట్టుకున్నారు. కాని, ఈ మధ్య రాహుల్ గాంధీ తన మేధావితనంతో పాపం మహాత్ముడ్ని కూడా రచ్చలోకి లాగాడు. గాంధీ హత్యకి అరెస్సెస్ కారణం అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు!
అరెస్సెస్ కోర్టు మెట్లు ఎక్కి రాహుల్ ని ముప్పతిప్పలు పెట్టింది. కోర్టు రాహుల్ కి తప్పుదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది. లేదంటే పరువు నష్టం కేసు విచారణ ఎదుర్కోవాలని హెచ్చరించింది. ఈ పరిణామంతో షాకైన యువరాజా వారు కోర్టుకు అరెస్సెస్ తప్పేం లేదని సెలవిచ్చారు. గాంధీ హత్యలో అరెస్సెస్ ప్రమేయం లేదన్నారు. ఇక్కడితో ఆగిపోయి వుంటే రాహుల్ మిగతా అందరు పొలిటీషన్స్ లా మెచ్యురిటీ వున్నవాడే అనిపించుకునే వాడు. కాని, అలా చేయలేదు!
కోర్టు ముందు అరెస్సెస్ కి , గాంధీ హత్యకి సంబంధం లేదన్న రాహుల్ మళ్లీ ట్విట్టర్ లో మాత్రం తాను ముందన్న మాటలకి కట్టుబడి వున్నానని అన్నాడు! ఇదేం విచిత్రం? ముందొక మాట, కోర్టు ముందు ఒక మాట, మళ్లీ ట్విట్టర్ లో ఇంకో మాట! ఇలా చేస్తే కాంగ్రెస్ టాప్ లీడర్ గా ఆయన్ని జనం ఎలా నమ్ముతారు? నిజంగా తాను అరెస్సెసే గాంధీ హత్యకి కారణం అనుకుంటే కోర్టులో కూడా అదే చెప్పి పోరాడితే పోయేది కదా? లేదంటే చేసిన తప్పు ఒప్పేసుకుని గొడవని ఇంతటితో ముగిస్తే పోయేది కదా? ఇలా రెండు రకాల మాటలు మాట్లాడితే కాంగ్రెస్ లోని చోటా మోటా నాయకులకి, రాహుల్ కి వున్న భేదం ఏంటి? ఆయన్ని సీరియస్ గా తీసుకుని జనం ప్రధాని ఎప్పుడు చేస్తారు? అసలు రాహుల్ లాంటి గాంధీ చేతిలో మహాత్మ గాంధీ పని చేసిన కాంగ్రెస్ మరి కొంత కాలం బతుకుతుందా?