బెజవాడ పసికందు మిస్సింగ్‌లో కొత్త ట్విస్ట్..

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మాయమైన పసికందు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. బిడ్డ మాయమైన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రిలోని ఎస్ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న శిశువును గుర్తు తెలియని మహిళ 11 గంటల సమయంలో అపహరించుకుపోయింది. పట్టపగలే అందరూ చూస్తుండగా, ఎస్ఎన్‌సీయూ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు, ప్రసూతి విభాగం వద్ద ఉన్న రెండంచెల సెక్యూరిటీ విభాగాన్ని దాటుకుని శిశువుతో సహా ఉడాయించింది. అనంతరం విజయవాడ బస్టాండ్‌లో మరో మహిళకు బిడ్డను అప్పగించినట్టు పోలీసులు గుర్తించారు.   ప్రభుత్వాసుపత్రిలోని సీసీకెమెరా ఫుటేజీని..బస్టాండ్‌లోని సీసీకెమెరాల్లో 11.30 గంటల ప్రాంతంలో నమోదైన దృశ్యాలను సరిపోల్చుకున్న పోలీసులు నిందితురాలిగా అనుమానిస్తూ "మాయమైన బేబితో మహిళ" అంటూ ఓ ఫోటోను పోస్టర్లుగా వేసి రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో అతికించారు. అంతా బాగానే ఉంది కాని ఇక్కడే పోలీసులకు కొత్త చిక్కొచ్చిపడింది. పోలీసులు ముద్రించిన పోస్టర్లలో మహిళ ఓ టీవీ ఛానెల్‌ను ఆశ్రయించారు. సీసీ కెమెరాల్లో కనిపించామన్న ఒకే ఒక్క కారణంతో ఫోటో వేస్తారా..? నేరస్తురాలిగా భావిస్తారా..? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా, తమను మానసిక వేదనకు గురి చేశారని గుంటూరుకు చెందిన ధాన్యశబరి ఆరోపించారు.   తన చేతుల్లో ఉన్న బిడ్డ తను కన్న బిడ్డ అని, ఫిబ్రవరి 24న గుంటూరులోని హెల్ప్ ఆసుపత్రిలో జన్మనిచ్చానని ఆమె చెప్పారు. ఈ బిడ్డ తనదేనని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్షలకైనా సిద్ధమని శబరి సవాల్ విసిరారు. సీసీ కెమెరాలు పెట్టారు కదా..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఎక్కడికి వెళ్లారు..? వంటి వివరాలు తెలుసుకోరా..? అని ఆమె పోలీసులను నిలదీశారు. జరిగిన పరువు నష్టానికి, మానసిక క్షోభకు న్యాయం చేయాలని ఆమె పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానని ధాన్యశబరి హెచ్చరించారు. 

యూపీలో బ్రాహ్మణులపై పార్టీల కన్ను..

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ స్థానం అత్యంత ప్రత్యేకం..దేశాన్ని శాసించాలనుకునే ఏ పార్టీకైనా ఇక్కడ స్పష్టమైన మెజారిటీ వస్తే చాలు..అలవోకగా అధికారాన్ని అందుకోవచ్చు. వచ్చే ఏడాది ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2019 ఎన్నికలలో ప్రభావం చూపనుండటంతో యూపీలో ఎలాగైనా పాగా వేయాలని జాతీయ పార్టీలతో పాటు స్థానిక పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కులానిదే పైచేయి. అలాంటిది కులాల కుమ్ములాటలకు, కుల ఘర్షణలకు రాజధాని లాంటి ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ నిర్ణయాధికారం యాదవులు, దళితులు, బ్రాహ్మణులు, ముస్లింల చేతుల్లో ఉంది. అయితే వీరందిరిలోకి బ్రాహ్మణ సామాజిక వర్గం బలమైంది. దీంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎలా కొల్లగొట్టలా..? అని అన్నీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.   భారతదేశంలోని అతికొద్ది మంది రాజకీయ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ తన వ్యూహకర్తగా నియమించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే బ్రాహ్మణులకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని అధిష్టానానికి ప్రశాంత్ సలహా ఇచ్చారంటే బ్రాహ్మణుల సత్తా ఎంటో తెలుసుకోవచ్చు. బ్రాహ్మణుల మద్థతును సాధించడం కాంగ్రెస్‌కు ఒక రకంగా సులభమే. ఎందుకంటే, గతంలో బ్రాహ్మణులు ఆ పార్టీ వెనుకే ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్డీ తివారీ, కమలాపతి త్రిపాఠీ, గోవింద్‌ వల్లభ్‌పంత్, శ్రీపతి మిశ్రా వంటి వారు బ్రాహ్మణులే. అందుకే సీఎం అభ్యర్థిగా ఢిల్లీకి పదిహేనేళ్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ప్రకటించింది కాంగ్రెస్.   బీఎస్సీ స్థాపించిన తొలి రోజుల్లో బ్రాహ్మణులను చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన బీఎస్పీ అధినేత్రి మాయవతి క్రమంగా ఆ సామాజిక వర్గం ప్రాధాన్యం తెలుసుకుని దళిత పార్టీ అనే ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నించారు. 2007లో 89 మంది బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇచ్చిన మాయవతి, 2012లో 74 మందికి ఇచ్చారు. ఈసారి కూడా ఎక్కువ మందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అధికార సమాజ్‌వాదీ పార్టీ కూడా మొదటి నుంచి బ్రాహ్మణులకు ప్రాధ్యాన్యత ఇస్తూనే ఉంది. అయితే వీరందరికంటే ముందు వరుసలో ఉంది బీజేపీ. ఎందుకంటే హిందుత్వం సామాజికంగా సంప్రదాయవాదంతో ఉంటుంది. అలాగే మత సంబంధ విషయాలు, ఆలయాల నిర్మాణం, గోవధ నిషేదం వంటి అంశాలు వారిని ఎలాగూ ఆకర్షిస్తాయి. ఇవన్నీ చాలా మంది బ్రాహ్మణులు బీజేపీకి సానుకూలంగా ఉండటానికి కారణమయ్యాయి. మొత్తం మీద యూపీలోని అన్ని పార్టీలు బ్రాహ్మణ జపం చేస్తున్నాయి. ఈ వర్గానికి ఇచ్చే ప్రాధాన్యం ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చూపిస్తుందో వేచి చూడాలి.

కేజ్రీవాల్ భార్య మరో రబ్రీదేవి కానుందా..?

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ స్వచ్ఛంద పదవీ విరమణ వ్యవహారం సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు రేపుతోంది. ఉన్నపళంగా వీఆర్ఎస్‌ తీసుకోవడం జవాబు లేని ప్రశ్నగా మారడంతో నెటిజన్లు సునీతను ఒక ఆట ఆడుకుంటున్నారు. 22 ఏళ్లపాటు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఆమె ఈ ఏడాది మొదట్లోనే వీఆర్ఎస్‌కు అప్లై చేసుకోగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నుంచి ఇపుడు అనుమతి రావడంతో ఆమె బాధ్యతల నుంచి తప్పుకున్నారు.  51 ఏళ్ల సునీత 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి. కేజ్రీవాల్, సునీత భోపాల్‌లో శిక్షణ కార్యక్రమంలో ఉండగా ప్రేమ వివాహం చేసుకున్నారు. కేజ్రీవాల్ కూడా తొలుత ఐఆర్ఎస్ సర్వీస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. తాజాగా ఆయన భార్య కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.   నెటిజన్లు పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సునీతను ప్రస్తావిస్తూ సెటైర్లు విసురుతున్నారు. సునీతను బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిలా పోలుస్తున్నారు. కుంభకోణాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి జైలుకెళ్లడం ఖాయం అనుకున్న దశలో తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్. రాజకీయాలు ఏం తెలియని సాధారణ గృహిణి అయిన రబ్రీదేవికి అత్యున్నత అధికారాన్ని కట్టబెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రబ్రీని సీఎం పీఠంపై కూర్చోబెట్టి లాలూ చక్రం తిప్పారు.   ఈ ఉదంతాన్ని గుర్తు చేసిన పలువురు నెటిజన్లు సునీతను చదువుకున్న రబ్రీదేవిగా అభివర్ణించారు. ఢిల్లీ సీఎం పదవిని సునీతకు వదిలేయనున్న కేజ్రీ పంజాబ్, గోవా రాష్ట్రాల బరిలోకి నిలవనున్నారని కొందరు వ్యాఖ్యానించారు. ఇక కొందరేమో రాజ్యసభకు పంపేందుకే సునీతతో ఉద్యోగానికి రాజీనామా చేయించారని కామెంట్ చేశారు. ఈ గందరగోళంపై ఆప్ స్పందించింది. సునీత రాజకీయాల్లోకి రారని..వారసత్వ రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఆప్ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని వెల్లడించింది.

ఆస్తి కోసం సోదరి భర్తను చంపిన ఎంజీఆర్ కూతురు..

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీరామచంద్రన్ అల్లుడు హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఎంజీఆర్ పెంపుడు కుమార్తె భాను శ్రీధర్ సహా ఏడుగురికి జీవితఖైదు విధించింది. ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధ భర్త అయిన విజయన్ 2008, జూన్ 4న ఆళ్వారుపేటలో దారుణహత్యకు గురయ్యారు. కారుతో గుద్ది, ఇనుపరాడ్లతో మోది చంపారు. ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును తొలుత అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ..ఆ తర్వాత సీబీసీఐడీకి అప్పగించారు.   ఎనిమిదేళ్లపాటు సాగిన దర్యాప్తులో సుమారు 70 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. ఎంజీఆర్ తన భార్య జానకి సోదరుడు ఏడుగురి పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే ఆయన ఆస్తి కోసం సుధ, భాను శ్రీధర్‌ల మధ్య వివాదం చేలరేగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి సుధ భర్తను భాను శ్రీధర్ హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇందుకు గాను కరుణకు భాను రూ.4 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. భాను శ్రీధర్‌కు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది. న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే విజయన్ భార్య సుధ స్పందిస్తూ తన భర్తకు చివరికి న్యాయం దక్కిందని చెప్పారు. ఇందుకు సహకరించిన పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు

"పరువు..ప్రతిష్టలే" దళితుల ప్రాణాలు తీస్తున్నాయా...?

"కొడుకు కులం తక్కువ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని కోడలిని చంపిన అత్తమామలు" .."కులం కోసం కొత్త జంటను కడతేర్చిన కులపెద్దలు"..ఇలా తరచూ వార్తలు వింటూ వుంటాం. ఆధునిక యుగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా తనకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే స్వేచ్ఛ ఈ తరం యువతి, యువకులకు లేకుండా కుల గోడలు అడ్డుకుంటున్నాయి. ''కూటికి పేదలమైనా, కులానికి పేదలం కాదు'' నానుడి నుంచి స్పూర్తి పొంది హత్యలకు శ్రీకారం చుట్టారు. తమ కులాన్ని కాదంటే పరువు పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. పరువు హత్యలంటే కుల దురంహాకార హత్యలే. దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల్లో మెజారిటీ దాడులు కులాంతర వివాహాలు చేసుకోవడం వల్లే జరుగుతున్నాయట...ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తూ కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అత్వాలే.   కులాంతర వివాహాలకు సంబంధించి దళితులపై దాడులు ఆగాలంటే ఆత్మరక్షణ కోసం వారికి ఆయుధాలు అనుమతించాలని సూచించారు. మహారాష్ట్ర దళిత నేతగా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చీఫ్‌గా వ్యవహరిస్తున్న రామ్‌దాస్, గతంలో చాలా సార్లు ఈ డిమాండ్ చేశారు. ఈ సారి కేంద్రమంత్రి కావడంతో ఆయుధాల విషయంపై తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయుధాలు అనుమతించే అంశం గురించి నా శాఖ ఆలోచన చేస్తోంది. కాకపోతే, ఇది ప్రధానంగా హోంశాఖ పరిధిలోనిది అని దాస్ అన్నారు.   భారతదేశంలో కుల జాడ్యం ఇంతగా వేళ్లూనుకుపోవడానికి కారణం స్వకుల వివాహాలు. కుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, పురాణాలు, మతం అన్నీ స్వకుల వివాహాలను సమర్థిస్తున్నాయి. ఈ పద్థతిని అనుసరించడం దైవ సమ్మతం అని నమ్ముతారు. అంతేకాదు కుటుంబ గౌరవం, కుల గౌరవం పాటించాలని చెబుతారు. అగ్రకుల పురుషుడు, దళిత కుల అమ్మాయితో వివాహాన్ని ఆమోదించరు..అలాగే దళిత పురుషుడు, అగ్రకుల స్త్రీతో వివాహాన్ని కూడా సహించరు. అటువంటి పెళ్లిళ్లను అడ్డుకోవడానికి ఎటువంటి దుర్మార్గానికైనా వెనుకాడరు. చివరికి తప్పు చేసింది కన్న కూతురైనా..కొడుకైనా కులం తెరలు కమ్ముకున్న కళ్లకు కనిపించరు..పరువు పోయింది..రేపటి నుంచి నలుగురిలో తలెత్తుకు తిరగలేను అని క్షణికావేశంలో కత్తిదూస్తున్నారు. పరువు హత్యలకు గురయ్యేవారిలో దళితులే కాదు, మిగతా కులాల వారు ఉన్నారు. దురదృష్టవశాత్తూ దళితులు ఎక్కువ దాడులకు గురవుతున్నారు. 

ఇందులో కూడా హ్యాండిచ్చావా మోడీ జీ...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు.. మంత్రులు.. అధికారుల పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇస్తుంటారు అది తెలిసిన విషయమే. ఆ వచ్చిన ర్యాంకులను బట్టి.. వారి పనితీరును బట్టి నేతలకు క్లాసులు పీకుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ర్యాంకుల విషయంలో చంద్రబాబుకే ఓ ఝలక్ తగిలింది. అదేంటంటే.. ప్రధాని నరేంద్రం మోడీ దేశ వ్యాప్తంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చారంట. ఇందులో చంద్రబాబుకు 13 వ ర్యాంకు లభించడంతో ఆయన షాకయ్యారట. ప్రధాని నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల సీఎంల పనితీరు, ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరు వంటి విషయాలపై సర్వే చేయించారట. ఇందులో చంద్రబాబుకు 13 వ ర్యాంకు వచ్చింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫస్ట్ ర్యాంకు రావడం.     అయితే ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే.. మోడీ కేసీఆర్ కు ఫేవర్ గా ఉన్నారా.. లేక చంద్రబాబుకు ఫెవర్ గా ఉన్నారా.. అని. ఎందుకంటే ఈ మధ్య నరేంద్ర మోడీ, కేసీఆర్ పై బాగానే అభిమానం చూపుతున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌ని పలుమార్లు అభినందిస్తూ కూడా వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు ఇచ్చేశారు. ఇక టీడీపీ-బీజేపీ మిత్రపక్షం కాబట్టి.. చంద్రబాబుకు, మోడీ మధ్య మిత్రుత్వం ఉంది. అయితే మిత్రపక్షమన్న పేరు తప్ప, చంద్రబాబుని ఎప్పుడూ నరేంద్రమోడీ మిత్రుడిలా చూసిన సందర్భాల్లేవు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు నిరూపించారు మోడీ జీ కూడా. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా ఏం చెప్పకపోవడం.. ఇంకా కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో కూడా ఏపీపై చిన్నచూపు చూపడం వంటివి చేస్తూనే వచ్చారు. ఆఖరికి ఏపీ రాజధాని శంకుస్థాపన రోజు కూడా ఏం ఇవ్వకుండా మొంచి చేయి చూపించారు. ఇలా, ఎప్పుడూ ఎక్కడా ఏ సందర్భంలో చంద్రబాబుని, ఓ ముఖ్యమంత్రిగా.. మిత్రుడిగా నరేంద్రమోడీ లెక్కల్లోకి తీసుకున్న సందర్భాలే లేవు.     ఇక ఇప్పుడు ఈ ర్యాంకుల విషయంలో కూడా మోడీ చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు  తన 'ఆప్తమిత్రుడు' వెంకయ్యనాయుడి వద్ద గోడు వెల్లబోసుకున్నారట. ఇంకా ఈ ర్యాంకులను అధికారికంగా ప్రకటించ లేదు కాబట్టి.. ఈలోపు ఏదో విధంగా 'మ్యానిప్యులేట్‌' చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారట. మరి చంద్రబాబు అనుకున్నట్టు జరుగుతుందో.. చంద్రబాబు మంత్రాంగం ఫలిస్తుందా.? ర్యాంకులు తారుమారవుతాయా.? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

కలరా కమ్ముకొస్తోంది

  తెలంగాణలో రోజురోజుకీ కలరా కేసులు కలవరపెడుతున్నాయి. మంత్రులు నామోషీకి పోయి మరేం భయం లేదని అభయమిస్తున్నా కలరా జాడ్యం నానాటికీ ప్రబలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం, ఆపై అపరిశుభ్రత... ఏది నల్లా నీరో, ఏది డ్రైనేజో తెలియని వైనం. ఇలాంటి స్థితిలో కనుక ఈ అంటువ్యాధి ప్రబలితే ఏమిటన్న ఆలోచన ఎవరికీ పట్టినట్లు లేదు. కలరా గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు పెద్దగా చొరవ చూపిస్తున్న దాఖలాలూ లేవు. దాంతో అసలు కలరా అంటే ఏమిటో కూడా తెలియకుండానే ‘సగటు జీవులు’ దాని బారిన పడుతున్నారు.   నిజానికి కలరా ప్రబలడం అంటే ప్రభుత్వ యంత్రాంతం విఫలం చెందడమే! తాగు నీటిలో మానవ విసర్జితాలు కలవడం, ఆహార పదార్థాలను అమ్మేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కలరా వ్యాపించే ప్రమాదం అధికం. హైదరాబాదు వంటి మహానగరంలో సందుసందుకీ వెలిసే జ్యూస్‌షాపులు పానీయాల పేరుతో నానా చెత్తనీ అందిస్తున్నాయి. కుళ్లిపోయిన పళ్లతో చేసిన పానీయాలలో మురుగునీటితో చేసిన ఐస్ వేసి అందిస్తుంటే... వాటిని మహాభాగ్యంగా సేవిస్తున్నారు జనం. ఇక వీధివీధిలో వెలిసిన చిరుతిళ్ల బళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి అమ్మకాలను పరిశీలించి, నియంత్రించాల్సిన అధికారులు అసలున్నారో లేదో తెలియని దుస్థితి. జనం తీసుకునే ఆహారాన్నే అధికారులు ఇంత లక్షణంగా పట్టించుకుంటుంటే... ఇక నగరంలోని మురుగు పరిస్థితి చెప్పేదేముంది. పరిస్థితులన్నీ ఇంత అనుకూలంగా ఉంటే కలరా రాక తప్పుతుందా!   గత పక్షం రోజుల్లోనే పదివరకూ కలరా కేసులు నమోదయ్యాయి. ఇక అనధికారికంగా ఎంతమంది కలరా బారిన పడ్డారో చెప్పడం కష్టం. ప్రపంచ చరిత్రలో కోట్ల మందిని కబళించిన కలరా ఎంత ప్రమాదకారో చాలామందికి తెలియదు. ఈ విషయం తెలిసిన అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ గర్వభంగం

  సుప్రీంకోర్టు మరోసారి చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అధికార పక్షాన్ని తోసిరాజని ఏర్పడిన ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ, పాత ప్రభుత్వమే కొనసాగాలని ఉత్తర్వులను అందించిది. ఈ తీర్పు నిజంగానే మోదీ ప్రభుత్వానికి శరాఘాతంగా భావించవచ్చు. రాష్ట్రపతి పాలన తరువాత ఒక ప్రభుత్వం ఏర్పడిపోయాక, ఆ ప్రభుత్వం చెల్లదనీ... ముందున్న ప్రభుత్వానికే పగ్గాలను అందించాలనీ, న్యాయస్థానం తీర్పుని వెలువరించడం మన దేశ చరిత్రలో ఇదే ప్రథమం. కాబట్టి ఉత్తరాఖండ్‌లో కలిగిన పరాభవం కంటే ఇది మరింత పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు.   అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపు అన్యాయం అంటూ మొదటినుంచీ నిరసన గళాలు వినిపిస్తూనే వస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్షం నుంచి కొందరు సభ్యులు తిరుగుబాటు చేయగానే, ముందూవెనుకా ఆలోచించకుండా.... బలనిరూపణకు అవకాశం ఇవ్వకుండా, గవర్నరు జ్యోతిప్రసాద్‌ రాష్ట్రపతి పాలనను సూచించారు. జ్యోతిప్రసాద్‌ మాటకు సై అంటూ కేంద్ర క్యాబినెట్ జనవరి 26న అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేసింది. పైగా ప్రతిపక్ష నేత అయిన కలికో పుల్ అధికారంలోకి వచ్చేలా పావులు కదిపింది. కానీ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో కలికో పుల్ ఇప్పుడు గద్దె దిగక తప్పలేదు. జనవరి 26కి ముందువరకు ముఖ్యమంత్రిగా సాగిన నబామ్‌ టుకి తిరిగి అధికారంలోకి రాకా తప్పదు.   ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను గద్దె దింపేందుకు రాష్ట్రపతి పాలనను పావుగా వాడుకునేది. అలాంటి విధానాలను ఖండిస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా అదే దారి పట్టడం నిజంగా దురదృష్టకరం. అయితే అప్పటికీ ఇప్పటికీ ప్రజల ఆలోచనా ధోరణిలోనూ, న్యాయస్థానాల తీరులోనూ మార్పు వచ్చిందని గమనించకపోవడంతో.... తరచూ ఇలాంటి పరాభవాలను స్వీకరించాల్సి వస్తోంది. మరి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకుంటుందా, లేకపోతే మరిన్ని మొట్టికాయలను సిద్ధపడుతుందా అన్నది త్వరలోనే తేలిపోతుంది.

అయ్యో జగన్.. ఇదీ ఫెయిల్ అయ్యిందా..!

  ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అన్నట్టు ఉంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఎందుకంటే ఎప్పడు ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ఏకి పారేద్దామా అని చూసే జగన్ కు.. ఎప్పుడూ అడ్డంకులే ఎదురవుతాయి. ఏదో చేద్దామనుకుంటారు.. అది కాస్త ఇంకేదో అవుతుంది. ఇప్పుడు ఆయన చేపట్టిన గడప గడపకి వైసీపీ కార్యక్రమం కూడా అలానే అయింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినాకానీ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని.. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని.. వారి మోసాలను ప్రతి ఇంటికి తెలియజేయాలని చెబుతూ.. జగన్ ఆధ్వర్యంలో గడప గడపకి వైసీపీ అన్న పేరుతో కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించిన మొదట్లో స్పందన బాగానే వచ్చినా.. ఆతరువాత మాత్రం రానురాను ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. ఇక మొదటి నుండి ఈ కార్యక్రమంపై కారాలు, మిరియాలు నూరుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు ఊరుకుంటారా.. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఎంట్రీ ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని తిప్పుకొట్టేందుకు రంగంలోకి దిగిపోయి.. వైసీపీకి ధీటుగా గడప గడపకీ జగన్ దిష్టిబొమ్మ దహనం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఆందోళనలు తలెత్తి కొట్టుకునే పరిస్థితి వరకూ వెళ్లింది. ఇక పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఏది ఏమైనా జగన్ ప్లాన్ ను ఇలా తిప్పికొట్టినందుకు తెలుగు తమ్ముళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట. మరి జగన్ ఇంకేం ప్లాన్ వేస్తాడో చూడాలి.  

ఏపీ హోంమంత్రి పదవి వారిలో ఎవరికో.. ?

  ఎప్పుడు ఎవరు గెలుస్తోరో... ఎలా ఓడిపోతారో..ఎవరికి పదవులు దక్కుతాయో.. ఎవరికి దక్కవో.. రాజకీయాల్లో ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఎప్పుడూ చెప్పలేము. రాజకీయాల్లో ఎప్పుడైనా ఎదైనా జరగవచ్చు.. కాకపోతే కాస్త అదృష్టం ఉండాలంతే.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ టీడీపీలో కూడా అదే జరుగుతుంది. అదేంటంటే.. ఏపీ హోంమంత్రి పదవి.. ఎవరికి దక్కుతుందా..అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   ప్రస్తుతం ఏపీ హోంమంత్రిగా చినరాజప్ప ఉన్న సంగతి తెలిసిందే. అయితే చినరాజప్పపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చినరాజప్ప  కాల్ మనీ కేసు, శాంతిభద్రతలు కాపాడలేకపోవడం, అధికారుల పై పట్టు లేకపోవడం ఇలా కొన్ని కారణాల వలన చంద్రబాబు అతని పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఈసారి హోంమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అన్నదానిపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో నేత పేరు వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతకు హోంమంత్రి పదవి దక్కనున్నట్టు విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇది కాస్త ఆ నోటా ఈ నోటా పాకి ఆ నేత చెవిలో పడిందట. ఇంకేముంది ఆయన సంతోషం పట్టలేక.. ఆ విషయం కాస్త చంద్రబాబును అడిగేశాడట. చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే ఓ నవ్వు నవ్వి సైలెంట్ గా ఉన్నారంట. అంతేకాదు ఇదే పదవికి పార్టీలోకి కొత్తగా వచ్చిన మరో ఎమ్మెల్యేకు కూడా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది.   మరోవైపు ఈ పదవి సంగతేమో కాని పార్టీలో వర్గపోరు మాత్రం బయపడేలా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే చినరాజప్ప కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి.. అసలే ముద్రగడ చేసిన రచ్చ వలన చంద్రబాబుకు ఇంకా తలనొప్పులు ఉన్న నేపథ్యంలో ఆయనను తప్పించి వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి ఇస్తే.. చీలక వస్తుందని భయపడుతున్నారంట. మరి చుద్దాం ఎవరికి ఆపదవి దక్కుతుందో.

అభివృద్ధికి అడ్డంకిగా భూసేక"రణం"

ఎక్కడబడితే అక్కడ భూసేకరణ..నిన్న రాజధాని కోసం అన్నారు..ఇప్పుడు పవర్‌ప్లాంట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్ట్‌ల కోసం అంటున్నారు. భూములను బతకనివ్వరా..? ఇది ఏపీలో భూసేకరణ జరుగుతున్న వివిధ ప్రాంతాల్లోని రైతుల అక్రందన. భోగాపురం, కొవ్వాడ, పొలాకి, బందరు ఇలా ప్రాంతమేదైనా..ప్రాబ్లమ్ మాత్రం ఒక్కటే..వినిపించేది భూములు ఇచ్చేది లేదన్న మాటే. అందుకు కారణం ఒక్కటే..ఇన్నాళ్లూ భూమికి రేటు లేదు. రెండు పంటలు పండనీ..అసలు పండకపోయినా ఎకరం పది లక్షలు పలికితే గొప్పే..ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్న తరువాత..ఇప్పటికే ఎకరం 40, 50 లక్షలు పలుకుతోంది..ఇలాంటి సమయంలో భూములు లాక్కుంటానంటే రైతులకు మంటే..?   కోనేరు సెంటర్ టు హుస్సేన్‌పాలెం..కోనేరు సెంటర్ టూ చిలకలపూడి ఈ పేర్లు చెప్పగానే కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం గుర్తొస్తుంది కదూ. బ్రిటీష్ హయాంలో ఒక ప్రముఖ పట్టణంగా వెలుగొందిన మచిలీపట్నం..ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా ఉంది..ఎన్నాళ్లు తిరగని..ఎన్నేళ్లు గడవనీ..ఇప్పటికే అదే పరిస్థితి పావలా మార్పు కూడా లేదు. ఇక్కడ పోర్ట్ నిర్మిద్దామని  ప్రభుత్వం అలా అనుకుందో లేదో..పోర్ట్‌కు మేం వ్యతిరేకం..మా భూముల జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటాం అంటూ అక్కడి ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. బందరు పోర్ట్ వస్తే ఇన్‌ఫ్రా డెవలప్ అవుతుంది. మంచి రోడ్లు, పరిశ్రమలు, రాకపోకలు వాటికి తగ్గట్టే ఏరియా రూపురేఖలే మారిపోతాయి.   స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు అవుతున్నా ఉత్తరాంధ్ర వెనుకబడే ఉంది. పొట్టచేత పట్టుకొని నిత్యం సుదూర ప్రాంతాలకు వలసలు పోవడం ఉత్తరాంధ్ర దౌర్భాగ్యం. నిరక్షరాస్యత, రక్షిత మంచినీరు, వైద్య సేవలు ఇలా అన్నింటా వెనుకబాటే. ఆఖరికి డయేరియా, మలేరియా వంటి చిన్న వ్యాధులతో అక్కడి వారు మరణిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చి ఉత్తరాంధ్ర తలెత్తుకునేలా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. అందుకే థర్మల్ విద్యుత్ ప్లాంట్, అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించదలచారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు నేరుగా ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.   చెప్పుడు మాటల ప్రభావమో..లేక మరే కారణమో తెలియదు కానీ ఆ ప్రాంతపు రైతులు ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. అమరావతిలో అమలు చేసిన ల్యాండ్‌పూలింగ్ అమలు చేసి అన్యాయం జరగకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చినప్పటికి వారి వైఖరిలో మార్పు లేదు. ఈ విధానం వల్ల మీరు నష్టపోతారని..అలా కాకుండా భూసేకరణ చట్టం అమలు చేస్తే నాలుగు రెట్ల నష్టపరిహారం లభిస్తుందని కొన్ని శక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ప్రచారం కూడా రైతుల మదిలో బలంగా నాటుకుపోయింది. ఇది అసలుకే మోసం తెచ్చి అభివృద్దిని అడ్డుకుంటోంది. ఒత్తి రగిలితేనే వెలుతురు..నూనె ఇంకితేనే వెలుతురు..ప్రమిద కాలితేనే వెలుతురు లేదంటే మిగిలేది చీకటే..!  

తెలంగాణ రాష్ట్ర విదేశాంగ మంత్రిగా కేటీఆర్..

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సంబంధాలు కొత్త నిర్వచనాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక దేశం మరో దేశంతో మైత్రిని కోరుకుంటోంది. ఆ సంబంధాలను మరింత మెరుగ్గా ఉంచడంతో పాటు..ఒక ప్రభుత్వానికి మరోక ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది విదేశీ వ్యవహారాల శాఖ. సాధారణంగా విదేశీ వ్యవహారాలు కేంద్రప్రభుత్వానికే పరిమితం. కానీ దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రప్రభుత్వం సొంతంగా విదేశీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయనుంది..అదే తెలంగాణ ప్రభుత్వం.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్‌ఆర్ఐ విభాగానికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తూ వస్తున్నారు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలు ఉపాధి నిమిత్తం గల్ఫ్, అమెరికా, ఆఫ్రికా తదితర దేశాలకు వెళ్లారు. వారి యోగ క్షేమాలు చూడటానికి కూడా ఎన్ఆర్ఐ విభాగం అవసరమని సీఎం గుర్తించారు. కాని దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించడానికి..పెద్ద ఎత్తున విదేశీ నిధులను ఆకర్షించేందుకు తనకంటూ ఓ ఎన్నారై పాలసీని రూపొందించుకోవాలని భావిస్తోంది తెలంగాణ. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి, దేశంలోని ఉత్తమ పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా రూపొందించడానికి ఈ మంత్రిత్వశాఖ ఉపయోగపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.   ఇదంతా బాగానే ఉంది కానీ..కొత్తగా ఏర్పాటు చేసే విదేశీ వ్యవహారాల శాఖకు మంత్రిగా ఎవరు సారథ్యం వహించబోతున్నారు..కొత్తగా ఎవరినైనా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారా..? లేదంటే ఉన్నవాళ్లకే దీనిని అదనపు బాధ్యతగా అప్పగించబోతున్నారా..? అంటూ దీనిపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకు ఇంత మదనపడవలసిన పనిలేదంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఈ శాఖకు మంత్రిని ఫిక్స్ చేసేశారు. ఆయన మరెవరో కాదు స్వయానా కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్. విదేశీ వ్యవహారాలు చూడాలంటే ఇంగ్లీష్‌ భాషపై పట్టు అవసరం, దానికి తోడు వర్తమాన విషయాలు, బిజినెస్ డీలింగ్స్ , ప్రజంటేషన్ ఇలాంటి అంశాలపై అవగాహన ఉండాలి. అన్ని అంశాలను బేరీజు వేసుకున్న కేసీఆర్ దీనికి కేటీఆరే కరెక్ట్ అని డిసైడయ్యారు.   దీనికి తోడు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వివిధ దేశాల్లో పర్యటించిన కేటీఆర్..తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చారు. కొత్త మంత్రిత్వశాఖకు సంబంధించిన విధి విధానాలు, ముసాయిదాకు సంబంధించిన ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడనుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో ఒక రాష్ట్రానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా కేటీఆర్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.

భారతీయులకు అమెరికా కల అందని ద్రాక్ష కానుందా..?

అమెరికాలో ఉద్యోగం..ఇది కోట్లాది మంది భారతీయ యువతకు ఉన్న కల..మా అబ్బాయి స్టేట్స్‌లో పనిచేస్తున్నాడని చెప్పుకోవాలని సగటు భారతీయ తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే ఇక మీదట ఇలాంటి కలలు నెరవేరాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత ఐటీ కంపెనీలు, నిపుణులను నిరోధించడానికి ఉద్దేశించిన "2016- హెచ్-1బీ, ఎల్1 వీసా సంస్కరణల చట్టం" బిల్లును యూఎస్ సెనెట్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. తక్కువ వేతనాలకే పనిచేయడానికి భారత్ సహా ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న వారితో అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి.   దీనిపై దృష్టి సారించిన అమెరికా ప్రభుత్వం గతంలో వీసా నిబంధనలను కఠినతరం చేసింది. వీసా ఫీజును గణనీయంగా పెంచడంతో పాటు సంవత్సరానికి 65 వేల వీసాలను మాత్రమే మంజూరు చేయాలని అన్ని దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను ఆదేశించింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగడంతో అగ్రరాజ్యం వెనక్కు తగ్గింది. తాజాగా వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని అమెరికా నిర్ణయించింది. దీనిలో భాగంగా "2016- హెచ్-1బీ, ఎల్1 వీసా సంస్కరణల చట్టం" బిల్లును రూపొందించింది.  ఈ కొత్త బిల్లు ప్రకారం ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 శాతం కంటే ఎక్కువ మందిని, లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్-1బి, లేదా ఎల్-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు.   పెద్ద ఎత్తున విదేశీ కార్మికుల్ని అమెరికాకు దిగుమతి చేసుకుని, కాస్తంత శిక్షణను ఇచ్చి, ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి అక్కడి నుంచే పనిచేయించుకునేలా కంపెనీలను కొత్త నిబంధనలు తాటతీయనున్నాయి.  యాంటీవీసా బిల్లును అధ్యక్షుడు ఒబామా ఆమోదించాలంటే ముందుగా ఈ బిల్లును సెనెట్ ఆమెదించాల్సి ఉంది. 2010లో ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టగా..సెనెట్ దీనిని తిరస్కరించింది. అయితే ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లును పాస్ చేయించాలన్న కృతనిశ్ఛయంతో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఉండటంతో బిల్లు పాస్ కాదన్న ప్రశ్నే లేదు.

కేబినెట్ పెరిగింది..కోటీశ్వరులు పెరిగారు..

ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందించేందుకు వీలుగా ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 19 మంది కొత్త మంత్రులను చేర్చుకుని, ఐదుగురికి ఉద్వాసన పలికారు. దీంతో కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 78కి చేరింది. ఈ మంత్రుల నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అధ్యయం చేసింది. వీరిలో 24 మందిపైనా, కొత్త వారిలో ఏడుగురిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. అలాగే కొత్తగా కేబినెట్‌లో చేరిన మంత్రుల ఆస్తులు సగటున రూ.8.73 కోట్లు కాగా, మొత్తం మంత్రివర్గ సభ్యుల సగటు ఆస్తుల విలువ రూ.12.94 కోట్లకు చేరింది.   నూతన మంత్రుల్లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంజే అక్బర్ అత్యధికంగా రూ.44.09 కోట్ల ఆస్తులు కలిగి నెంబర్‌వన్‌గా నిలిచారు.  రాజస్థాన్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పీపీ చౌదరి రూ.35.35 కోట్లు, విజయ్‌గోయల్ రూ.29.97 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది. కొత్త మంత్రులు రమేశ్‌జిగాజీనాగి, పురుషోత్తం ఖొడాభాయి రూపాలా, అనుప్రియాసింగ్ పటేల్, మహేంద్రనాథ్, ఫగ్గన్‌సింగ్ కులస్తే, రాజెన్ గొహైన్, ఎస్‌ఎస్ అహ్లువాలియా, అర్జున్‌రాం మేఘ్వాల్, సీఆర్ చౌదరి, ఎంఎల్ మాండవీయ, కృష్ణరాజ్ ఆస్తులు రూ. కోటి పైనే ఉంటాయి.   రూ.113 కోట్ల ఆస్తులతో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ కేంద్ర కేబినెట్‌లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అయితే 2016  ఆర్థిక సం.రానికి గాను  జైట్లీ ఆస్తుల విలువ (8.9 శాతం) 6 కోట్లకు క్షీణించిందని తెలిపింది.  2014-15లో రూ 67. 01 కోట్లుగా  ఉన్న  జైట్లీ వ్యక్తిగత సంపద ,  2015-16 లో రూ 60.99 కోట్లకు  తగ్గిందని తెలిపింది. ఆయన చర,  స్థిర  ఆస్తుల డేటా వివరాలను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా  వెబ్ సైట్ లో  అధికారికంగా వెల్లడించారు.  జైట్లీకి, ఆయన  భార్యకు  ఉమ్మడి ఆస్తిగా  ఆరు(ఢిల్లీ, గుర్గావ్, హర్యానా పంజాబ్ లోని అమృతసర్, గుజరాత్ లోని గాంధీనగర్)  రెసిడెన్షియల్ ఆస్తులు ఉన్నాయి.  జైట్లీ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హరిసిమ్రత్‌కౌర్ బాదల్ రూ.108 కోట్లు, విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్ వేద్‌ప్రకాశ్ రూ.95 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. కొత్త మంత్రుల్లో ఆరుగురు మాత్రం తమ ఆస్తుల విలువ రూ. కోటి లోపేనని ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడైన పర్యావరణశాఖ మంత్రి అనిల్‌మాధవ్‌దవే తన ఆస్తి కేవలం రూ.60.97 లక్షలని ప్రకటించారు.

అమిత్‌షా దళిత "భజన"..!

పాలనను పరుగులు పెట్టించే లక్ష్యంతో ఇటీవల కేంద్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు ప్రధాని నరేంద్రమోడీ. అచ్చం అలాగే పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో పెద్ద ఎత్తున ఉన్న దళితుల ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే ప్రణాళిక రెడీ చేస్తున్నారు అమిత్. దానిలో భాగంగా పార్టీ అంతర్గత విభాగాలు, కార్యవర్గంలో దళితులకు, వెనుకబడిన వర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.   తమ ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నట్లు మోడీ చెబుతున్నారని, అది పార్టీ వ్యవస్థ కూర్పులోనూ ప్రతిఫలించాలని భావిస్తున్నారు. ఆఫీస్ బేరర్ల బృందంలో కీలకమైన ప్రధాన కార్యదర్శుల స్థానాలు కొన్ని ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శులుగా దళితులెవరూ లేరు. ఇందుకు అనుగుణంగానే అయా స్థానాల్లో దళితులకు పెద్ద పీట వేయాలని అమిత్‌షా ప్రణాళికలు రచిస్తున్నారు.   దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారం దక్కించుకుంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమ ప్రభావం బలంగా చూపించవచ్చన్న ఆలోచనతో బీజేపీ అధినాయకత్వం ఉంది. యూపీలో అధికారంలోకి రావాలంటే దళితుల మద్ధతు తప్పనిసరి దీనిని గ్రహించిన అమిత్ తన పని మొదలెట్టారు. మే నెలలో ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించిన అమిత్‌షా సేవాపురి అనే గ్రామంలో గిరిజాప్రసాద్ బింద్, ఇక్బాల్ బింద్ అనే దళిత దంపతుల ఇంట్లో భోజనం చేశారు. ఇప్పుడు ఇదే బాటలో పార్టీ పదవుల్లోకి దళితులను నియమించి వారి మెప్పును పొందాలనుకుంటున్నారు.

ఏపీ కమలదళపతి సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్టే. అధ్యక్షుడి ఎంపిక కోసం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఏపీ బీజేపీ కోర్ కమిటీతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు ఖరారైనట్టు కనిపిస్తోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధ్యక్షునిగా బాధ్యతలు అందుకున్న హరిబాబు ఆశించిన స్ధాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటి చేసిన బీజేపీ-టీడీపీలు ఈసారి పొత్తు పెట్టుకునే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.   ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహర్తిస్తున్నాడని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పైగా కేంద్ర నాయకత్వం చెప్పిన పద్ధతిలో ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు చేయలేకపోయారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. దాంతో హరిబాబును తప్పించి వేరొకరికి పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ భావించింది. అయితే హరిబాబు స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంలో తీవ్రంగా కసరత్తు చేసింది. సోము వీర్రాజు, కన్నా, పురంధేశ్వరి, చల్లపల్లి నర్సింహారెడ్డి, శాంతారెడ్డి తదితరుల పేర్లు వినిపించినప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో సోము వీర్రాజే అధ్యక్షునిగా ఉంటే బాగుంటుందని అధినాయకత్వం నిర్ణయించింది.   అయితే మొదటి నుంచి సీఎం చంద్రబాబుపై కయ్యానికి కాలు దువ్వుతున్న సోము అధ్యక్షుడైతే రెండు పార్టీల మధ్య ఉన్న మిత్రత్వం దెబ్బతింటుందని ఒక వర్గం హైకమాండ్‌కు సూచించినట్టు సమాచారం. అన్నింటిని బేరీజు వేసుకున్న అమిత్‌షా వీర్రాజు వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. 1978లో జనతా యువమోర్చలో చేరిన సోము వీర్రాజు పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. 1994లో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమిపాలయ్యారు. 2004లో టీడీపీతో పొత్తులో భాగంగా కడియం నియోజకవర్గం నుంచి, 2009లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఈద్గాలోకి మహిళ అడుగుపెట్టిన వేళ..

ఈ రంజాన్ పండుగ లక్నోలోని ముస్లిం మహిళలకు జీవితంలో గుర్తుండిపోతుంది. అందుకు కారణం లేకపోలేదు..లక్నోకు చెందిన చారిత్రక ఐష్‌బాగ్ ఈద్గాలో నమాజ్ చేసుకునేందుకు మహిళలకు తొలిసారి ప్రవేశం కల్పించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈద్గాలో మహిళల ప్రవేశంపై ఎప్పటి నుంచో నిషేధం ఉంది. దీనిపై మహిళలు ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రయోజనం శూన్యం. మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న మౌలానా ఖాలిద్ రషీద్ వారి పక్షాన నిలబడ్డారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడైన ఖాలిద్ పలు దఫాలు ఈద్గా పెద్దలతో చర్చలు జరిపి మహిళల ప్రవేశంపై వారిని ఒప్పించారు.   ఆయన కృషి ఫలితంగా చరిత్రలో తొలిసారిగా..ఈ రంజాన్ నాడు మహిళలను ఈద్గాలోకి అనుమతించారు. వారికి కేటాయించిన స్థానంలో మహిళలు ప్రార్థనలు చేసుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.  ప్రార్థనా స్థలాల్లోకి మహిళల ప్రవేశాన్ని నిరోధించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో మహిళల కోసం ఈద్గా ద్వారాలు తెరచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ప్రభావం ముంబయిలోని హజిఆలీ దర్గాపై పడే అవకాశం ఉంది.   శనిసింగనాపూర్ ఆలయంలోకి అనుమతించాలని కోరుతూ తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలోని భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అది చూసిన కొందరు ముస్లిం మహిళలు ముంబైలోని ప్రఖ్యాత హజీ షౌకత్ ఆలీ దర్గాలోకి ప్రవేశం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. తమను దర్గాలోకి ప్రవేశించకుండా ఆపుతోంది పురుషులు కాని మతం కాదని ఆరోపించారు. మతం దృష్టిలో అందరూ సమానులే అయినప్పుడు మాపై ఈ వివిక్ష ఎందుకని ప్రశ్నించారు. ఈ ఉద్యమం కాస్త చల్లారినప్పటికీ లక్నో ఈద్గా ప్రభావంతో మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు స్మార్ట్ సర్వే

ప్రస్తుత రాజకీయ నాయకుల్లో టెక్నాలజీని చాకచాక్యంగా వాడి ప్రయోజనాలను రాబట్టుకొనే వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో నిలబడతారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాలనతో టెక్నాలజీని అనుసంధానం చేసి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుపొందారు. ఇప్పుడు నవ్యాంధ్రలోనూ అదే టెక్నాలజీతో ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. ఆర్థిక లోటుతో ఉన్నా అనేక సంక్షేమ పథకాలను రాజీ లేకుండా అమలు చేస్తున్నారు. పథకం ఎంత గొప్పదైనా ప్రజలకు చేరువైనప్పుడే ప్రయోజనం. కానీ అవినీతి, స్వార్థ ప్రయోజనాలు, దళారీలు చేరినప్పుడు లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా ఆశించిన ఫలితం లభించదు. ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నా మధ్యవర్తుల కారణంగా బడుగులకు చేరడం లేదు. వీటన్నింటిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి పేదలకు న్యాయం చేయాలంటే అసలేం జరుగుతుందో తెలియాలి. అందుకోసం చంద్రబాబు ఎంపిక చేసుకున్న అస్త్రం "ప్రజా సాధికార సర్వే".   సర్వే అంటే 10 పేజీల పుస్తకం లాంటి అప్లికేషన్ ఫారం నింపడం కాదు. అంతా డిజిటలైజేషన్ అవుతున్న కాలంలో సర్వే కోసం అత్యాధునిక ట్యాబ్‌లను వినియోగించనున్నారు. 4జీ సదుపాయం ఉన్న సిమ్ కార్డులు కొన్ని తీసుకున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఐరిష్, చేతి వేలిముద్రలు గుర్తించే పరికరాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వే బృందం ఇంటింటికీ వస్తుంది, ఏ గ్రామానికి ఎన్యుమరేటర్‌గా దాదాపు ఆ గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి ఉంటారు.  ప్రతి ఇంటి యజమాని నుంచి సూక్ష్మంగా వివరాలు సేకరిస్తారు. విద్యార్హత, ఉపాధి, మరుగుదొడ్డి, ఇల్లు, ఫోన్ నెంబర్, అప్పులు, భీమా వివరాలు తీసుకుంటారు. ఇలా సేకరించిన సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో నమోదవుతుంది. ప్రభుత్వం భవిష్యత్‌లో ఏ పథకం తేవాలన్నా ఈ సర్వే ఆధారితంగా చేపట్టనుంది.   దీనిని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గుంటూరు, విశాఖ జిల్లాల్లో అమలు చేయనున్నారు. తన నుంచే ఈ సర్వే చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు..అధికారులు ఆయన నివాసానికి వచ్చి వివరాలు సేకరించారు. నిబంధనల మేరకు తన వేలి ముద్రలు, ఐరిష్ నమూనాలను అందజేశారు. సీఎం అధికారులకు తన కుటుంబసభ్యులను పరిచయం చేసి వారి వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు ప్రజా సాధికార సర్వేకు సహకరించాలని, దీని వల్ల సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని ముఖ్యమంత్రి సూచించారు.

కుక్కను హింసించిన విద్యార్థులపై కాలేజీ వేటు..

మూగజీవి అని చూడకుండా అత్యంత హేయంగా ఓ కుక్కను మూడంతస్తుల భవంతిపై నుంచి విసిరేసి పైశాచికంగా ఆనందించిన ఇద్దరు మెడికల్ విద్యార్ధులను సస్పెండ్ చేస్తున్నట్లు వారు చదువుతున్న కాలేజ్ యాజమాన్యం ప్రకటించింది. చెన్నైకి చెందిన గౌతమ్ సుదర్శన్‌ అనే విద్యార్ధి చెన్నై శివారు తండాలంలోని మధా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతనితో పాటు మరో విద్యార్ధి కుక్కపై తమ రాక్షససత్వాన్ని ప్రదర్శించారు. తన ఇంటి టెర్రస్‌పై నిలబడి, కుక్కను పిట్టగోడపై నిలబెట్టి, మేడపై నుంచి విసిరేసి దారుణంగా ప్రవర్తించారు.   చేస్తున్నది రాక్షస క్రీడ అయినా ఎంతో ఆనందంగా నవ్వుతూ గౌతమ్ కెమెరాకు ఫోజు ఇచ్చాడు. అంతే కాకుండా ఆ మూగజీవి ప్రాణభయంతో అరుస్తూ నేలపై పడటాన్ని సైతం స్లో మోషన్‌లో వీడియో తీసి ఆనందించాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేయడంతో రంగంలోకి దిగిన చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అందులో ఉన్న గౌతమ్ తన స్నేహితుడేనని చెప్పడంతో ఆ శాడిస్ట్ ఆచూకీ తెలిసింది.   పోలీసులు తమను వెతుకుతున్నారని తెలుసుకున్న గౌతమ్, మరో విద్యార్ధి ఆశిష్ పాల్ చెన్నై నుంచి పారిపోయారు. అయితే పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలుకెళ్లకుండా తప్పించుకున్నా..వారు చదువుతున్న కళాశాల మాత్రం వారు వైద్యులుగా పనికిరాని భావించి సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వీరికి ఈ శిక్ష సరిపోదని నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.