వరద బాధితులతో వెటకారాలాడిన లాలూ...
posted on Aug 24, 2016 @ 2:30PM
మనిషికుండాల్సిన అనేక మంచి లక్షణాల్లో సెన్సాఫ్ హ్యూమర్ ఒకటి! కాని, సెన్సాఫ్ హ్యూమర్ వుంది కదా అని దాన్ని ఎక్కడంటే అక్కడ ప్రయోగిస్తే చండాలంగా వుంటుంది. శోభనం గదిలో భక్తి పాటలు విన్నట్టు... మన లాలూ ప్రసాద్ యాదవ్ తన పైత్యం మరోసారి ప్రదర్శించాడు!
సమోసాలో ఆలూ వున్నంత వరకూ బీహార్లో లాలూ వుంటాడు అని చెప్పుకునే వాడు ఒకప్పుడు ఈ మాజీ సీఎం. అయితే, తరువాత సీఎం కుర్చీపోయి ఢిల్లీలో కేంద్ర మంత్రి పదవి ఎలగబెట్టాడు. అది కూడా పోయి దాణా కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి ఏ పదవికి పనికి రాకుండా పోయాడు. అయినా కూడా సుడి బావుండి నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరాడు. అందుకే, మరోసారి తన సెన్సాఫ్ హ్యూమర్ కి పదును పెట్టాడు లాలూ.
ముఖ్యమంత్రిగా వున్నా, కేంద్ర మంత్రిగా వున్నా ఎప్పుడూ మీడియాని తనవైపుకి తిప్పుకోవటం లాలూకి డైలాగులతో పెట్టిన విద్య. అందుకే, ఆయన ఎప్పుడు మీడియా గొట్టాల ముందుకొచ్చి ఏం చెప్పినా సెన్సేషన్ అవుతుంటుంది. కాని, ఈసారి లాలూ సెన్సాఫ్ హ్యూమర్ మరీ పచ్చిగా మారిపోయింది! ఎదుటి వాడి కష్టం, కన్నీళ్లు ఆయనకు కామెడీగా తోచాయి. అంతే కాదు, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే అన్న సామెత నిజం చేసి కూర్చున్నాడు!
బీహార్లో అనేక గ్రామాలు గంగా నది వరదలకి తడిసి ముద్దాయ్యాయి. అయితే, ఆ వరద బాధితుల్ని పరామర్శించటానికి వెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్ ఊరికే తిరిగి రాకుండా ఓ వెకిలి కామెంట్ పడేశాడు. గంగ స్వయంగా మీ ఇళ్లలోకి వచ్చింది. మీరెంతో పుణ్యాత్ములు అన్నాడట! పేద జనం గూడు, గుడ్డా తడిసిపోయి వణుకుతూ కుర్చుంటే ఈయనగారికి జోక్ లు ఎందుకు అవసరం అయ్యాయో గంగమ్మకే తెలియాలి!
జనం సంక్షోభంలో వున్నప్పుడు లాలూ లాగా పిచ్చి మాటలు మాట్లాడే రాజకీయ నాయకులు ఈ మధ్య బోలెడు మంది తయారవుతున్నారు. ఇలాంటి వారు అన్ని పార్టీల్లోనూ వుండటం మరో విషాదం...