వృక్షాలకి పూజలు సరే... కొత్త విత్తనాలు నాటేదెప్పుడు?
posted on Aug 23, 2016 @ 4:22PM
మనం వృక్షాలకి దారాలు చుట్టి పూజలు చేయటం చూస్తుంటాం! అది వీలవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఎవరో ఒకరు ఆ వృక్షానికి కారణమైన విత్తనాన్ని నాటాలి! విత్తనం నాటితేనే వృక్షం పుట్టేది! ఇదంతా ఎందుకనేనా మీ డౌట్?
ప్రపంచంలో ప్రతీ దానిపై స్పందించే వర్మ ఈ ఒలంపిక్స్ పతకాల హంగామాపై కూడా స్పందించాడు. ఆయన సూటిగా చెప్పిందేంటంటే రెండు పతాకలు వచ్చిన మనం ఇంతగా ఎగిరితే అత్యధిక పతకాలు కొట్టిన అమెరికా లాంటి దేశాలు ఏం చేయాలి అని! నిజమే... అసలు ఒక్క స్వర్ణమూ రాని ఇండియా ఇంతగా పీలైపోవటానికి అస్సలేం లేదు. అయినా మన మీడియా, ప్రభుత్వాలు కాస్త అవసరానికి మించి హడావిడి చేస్తున్నాయి. అందుక్కారణం కాస్త కరుకుగా వున్నా మనం మాట్లాడుకుని తీరాలి. అప్పుడే కనీసం వచ్చే ఒలంపిక్స్ కన్నా పరిస్థితి కాస్త మెరుగవుతుంది.
జనాభా పరంగా చూసినా, దేశం విస్త్రీర్ణం పరంగా చూసినా ఇండియా బోలెడు పతకాలు సాధించాలి. కాని, అలా జరగలేదు. ఈ అవమానకర స్థితే మన వాళ్ల హడావిడికి మెయిన్ రీజన్! అసలు ఓటమిని కప్పిపెట్టటానికి గెలిచిన వాళ్లని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలాగని సింధులాగా మెడల్ గెలిచిన వార్ని ఇక్కడ మనం తక్కువేం చేయాల్సిన పని లేదు. కాకపోతే, మనం గుర్తించాల్సింది ఒక్కటే... మొత్తం భారతదేశం తరుఫున యాభై వరకూ పతకాలు వచ్చి వుంటే... మన రాష్ట్రాల్లో కూడా కనీసం అయిదారుగురు ప్లేయర్స్ మెడల్స్ గెలిచేవారు! అప్పుడు అంత మందికి మన ముఖ్యమంత్రులు ఇప్పుడిచ్చినట్టు కోట్లకు కోట్లు ఇచ్చేసే వారా? ఇదీ అసలు పాయింట్! గెలిచిన వారు ఒకరిద్దరు మాత్రమే వుండటంతో వాళ్లనే సన్మానించి, సత్కరించి మైలేజ్ పొందేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. దీనికి ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ నేత, ఆ నాయకుడు అన్న తేడా లేదు. అందరూ అనివార్యంగా ఈ హడావిడికి పూనుకోక తప్పటం లేదు.
మెడల్స్ గెలిచిన వార్ని సన్మానించటం తప్పేం కాకపోయినా ప్రభుత్వాలు చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయి. అసలు చాలా మంది పట్టించుకోలేదుగాని ఒలంపిక్స్ లో పతకాల గోల నడుస్తుండగానే పంజాబ్ లో ఒక జాతీయ స్థాయి అథ్లెట్ పేదరికం కారణంగా ఆత్మహత్య చేసుకుంది. మరో వైపు రియో ఒలంపిక్స్ లో మన మారథాన్ రన్నర్స్ కు కనీసం మధ్య మధ్యలో నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదట ఇండియన్ ఒలంపిక్ సంఘం అధికారులు. 42కిలో మీటర్లు నీళ్లు లేకుండా పరుగెత్తిన జిషా అనే అథ్లెట్ అఖరుకి స్పృహ తప్పి పడిపోయింది! ఇంతలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ గెలిచిన వార్ని మాత్రం నెత్తికెత్తుకుంటే ఏం లాభం? రానున్న ఒలంపిక్స్ లో కూడా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది! దేశం మొత్తం సన్మానించుకోటానికి, ప్రైజ్ మనీలు ఇచ్చుకోటానికి ఒకరో, ఇద్దరో అథ్లెట్లు మిగులుతారు!
నిజంగా మన కేంద్ర, రాష్ట్ర పాలకులకి చిత్తశుద్ది వుంటే ఇప్పటికిప్పుడు ప్రతీ స్కూల్లో పిల్లలకి ఆటలాడుకునే ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే, ముందు విత్తనాలు వేస్తే కదా వృక్షాలు పుట్టుకొచ్చేది....