రాంగ్ డైలాగ్ తో బుక్కైన కాంగ్రెస్ హీరోయిన్
posted on Aug 23, 2016 @ 5:09PM
మేధావులు పిచ్చి వాళ్లలా కనిపిస్తారు. కాని, పిచ్చివాళ్లు కారు! అలాగే, అప్పుడప్పుడూ పిచ్చివాళ్లని చూస్తే మేధావులనిపిస్తుంది. కాని, వాళ్లు మేధావులు కాదు! ఈ సూత్రం కొంతమంది కాంగ్రెస్ నేతలకి వాడుకునే టైం వచ్చేసింది....కాంగ్రెస్ తనకు తాను మైనార్టీల పెద్ద దిక్కుగా భావిస్తుంది. బీజేపిని బూచిలా చూపించి ముస్లిమ్ లని చాలా కాలమే తన కంట్రోల్ లో పెట్టుకుంది. కాని, మోదీ ప్రభంజనంతో ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయింది. అలాగే, రాష్ట్రాల్లో కూడా లోకల్ నేతలు బలంగా వుంటే కాంగ్రెస్ అధికారం కోల్పోతూ వస్తోంది. ఇక మిగిలిన ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక! అది కూడా పళ్లెంలో పెట్టి బీజేపికి ఇచ్చేసే పనిలో వున్నారు బెంగుళూరు కాంగ్రెస్ నేతలు!
మన దేశం ముస్లిమ్ లని సమర్థించటం వేరు, పాకిస్తాన్ ను కూడా పొగిడేయటం వేరు. ఈ చిన్న తేడాని గుర్తించలేకపోతున్నారు కాంగ్రెస్ సెక్యులర్ ఛాందసవాదులు. తాజాగా... సినిమా యాక్ట్రస్ నుంచి ఎంపీ అయిన కన్నడ బ్యూటీ రమ్య అదే తప్పు చేసింది. ఆమె పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చి ఆ దేశమేం నరకం కాదని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే కాదు, భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గతంలో అలా అనటం తప్పని సెలవిచ్చింది. అయితే, ఇక్కడ రమ్య చిన్న లాజిక్ మిస్సైపోయింది. ఆమెకు మనోహర్ పారికర్ పై వ్యతిరేకత వుంటే ఆయన గురించి మాట్లాడాలిగాని పాకిస్తాన్ గొప్ప దేశం అనటం ఏంటి? ఇప్పుడు రమ్య చేసిన ఈ మేధావి మార్కు స్టేట్మెంట్ కర్ణాటక బీజేపికి మంచి ఆయుధంలా దొరికింది. ఏకంగా ఆమె మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని వారంటున్నారు.
రమ్య అంటే నిన్నటి మొన్నటి వరకూ గ్లామర్ ప్రపంచంలో ఆడిపాడిన అమ్మాయి కాబట్టి పెద్దగా రాజకీయ లౌక్యం తెలియదనుకోవచ్చు. కాని, ఈ మధ్య వరుసగా కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ పాట పాడుతున్నారు. సెక్యులర్ ఛాందసవాదిగా పేరున్న మణిశంకర్ అయ్యర్ అయితే పాకిస్తాన్ కి పోయి అక్కడి వారితో మనం కలిసి పోరాడి మోదీని అధికారంలోంచి దించేయాలి అంటూ పైత్యం ప్రదర్శించాడు! మరో కాంగ్రెస్ కరుడుగట్టిన లౌకికవాది, దిగ్విజయ్ సింగ్ కూడా హఫీజ్ అలీ, ఉసామా బిన్ లాడెన్లను జనాభ్ అంటూ, సాహెబ్ అంటూ కీర్తించాడు! తాజాగా కాశ్మీర్ ని భారత ఆక్రమిత కాశ్మీర్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు!
బీజేపినే రాజకీయంగా ఎదుర్కోటానికి కాంగ్రెస్ వాళ్లు ఇండియన్ ముస్లిమ్ లని సమర్థించాలిగాని మరీ నీచంగా పాకిస్తాన్ని, అక్కడి ఉగ్రవాదుల్ని వెనకేసుకురావటం దిగజారుడుతనం అవుతుంది. అంతే తప్ప భారతీయ ముస్లిమ్ ల ఓట్లేం రాలిపడిపోవు. ఎందుకంటే, పాకిస్తాన్ ని అభిమానించే మనదేశ ముస్లింల సంఖ్య చాలా తక్కువే కాబట్టి...