పవన్ మాట్లాడబోయే 5 అంశాలు ఇవేనా?
posted on Aug 27, 2016 @ 2:25PM
పవన్ కళ్యాణ్ సభ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ అంతటా తిరుపతి సభే మార్మోగిపోతోంది. అసలింతకీ ఇంత హడావిడిగా పెట్టిన ఈ సంచలన సభ దేని కోసం? పవన్ ఏం మాట్లాడబోతున్నాడు? ఆ విషయం సభ పూర్తయ్యే వరకూ ఎలాగూ తెలియదుగాని... పవర్ స్టార్ ఈ సభలో మాట్లాడబోయే అయిదు ముఖ్యమైన విషయాలు మాత్రం ఇవే అంటున్నారు వి్శ్లేషకులు...
1. అభిమాని హత్య.... మరో టాలీవుడ్ హీరో వీరాభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరణించాడు. అతడి కుటుంబాన్నిపరామర్శించటానికి వెళ్లిన పవన్ ఆశ్చర్యకరంగా ఈ సభకు తెర తీశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సభలో ఖచ్చితంగా చనిపోయిన వినోద్ రాయల్ గురించి, హద్దులు మీరిన అభిమానం గురించి కామెంట్ చేసే అవకాశం వుంది!
2. ప్రత్యేక హోదా... జనసేనని ఇక మీదట రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని పవన్ భావిస్తున్నారా? అంతేనంటున్నారు ఆయనకు దగ్గరి వారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రధానమైన ప్రత్యేక హోదా గురించి పవన్ మాట్లాడే అవకాశం మెండుగా ఉంది. ఇటు బీజేపికి, అటు టీడీపికి ఆయన స్పష్టంగా సూచన చేసే ఛాన్స్ వుంది. ప్రత్యేక హోదాపై తన స్టాండ్ ఏంటో జనానికి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది.
3. జనసేన జిల్లా ఇన్ ఛార్జ్ ల ప్రకటన... జనసేన పార్టీ పెట్టింది 2014 ఎన్నికల ముందే అయినా ఇప్పటి వరకూ ఎలాంటి సంస్థాగత నిర్మాణం చేపట్టలేదు. తిరుపతి సభలో జనసేన జిల్లా ఇన్ ఛార్జ్ ల పేర్లు ప్రకటించే అవకాశం కూడా వుందంటున్నారు. అయితే, ఇది కొంత అనుమానాస్పదమే. సభ అయితే హడావిడిగా పెట్టారుగాని... నేతల పేర్లు కూడా ప్రకటిం చేస్తారా అన్నది డౌట్!
4. విజయవాడ సభ.... ఎవ్వరూ ఊహించని విధంగా తిరుపతి సభ ఏర్పాటు చేసిన పవన్ నెక్ట్స్ టార్గెట్ విజయవాడగా పెట్టుకున్నాడని టాక్. అక్కడ కూడా రాజధాని అమరావతిలో సభ జరపాలని భావిస్తున్నాడట. అదే నిజమైతే ఈ విషయం కూడా తిరుపతి వేదిక నుంచి ప్రకటించే అవకాశం వుంది!
5. కాపు రిజర్వేషన్... కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ వంటి నాయకులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత వరకూ రిజర్వేషన్ ఉద్యమంపై స్పష్టంగా స్పందించలేదు. తిరుపతి సభలో ఆ సమస్య గురించి మాట్లాడే అవకాశం వుంది. కాని, అలాంటి సూచనలు మాత్రం చాలా తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు....