అ అభాగ్యుడి భార్య కాదు... మానవత్వం మరణించింది!
posted on Aug 28, 2016 @ 11:39AM
ఒక కాకి చచ్చిపడిపోతే... మిగతా కాకులన్నీ చుట్టూ చేరతాయి. ఇతర ఏ జంతువు మరణించినా దాని జాతి జంతువులన్నీ చుట్టూ మూగుతాయి. కాని, మనిషి మాత్రమే... సాటి మనిషి ఛస్తే ... అదేదో తనకు, తన వారికీ ఎప్పటికీ రాని దుష్ఫలితం అన్నట్టు దూరంగా వెళ్లిపోతాడు! కాని, విచిత్రం ఏంటంటే... ప్రతీ క్షణం తాను శాశ్వతంగా ఇక్కడే వుండిపోతానన్నట్టు స్వార్థంగా బతికే మనిషి.. తన టైం రాగానే వెళ్లిపోతాడు! కాలం నిర్ధాక్షిణ్యంగా కాటేసి తీసుకుపోతుంది!
మధ్య ప్రదేశ్ లోని ఒకానొక అభాగ్యుడు రామ్ సింగ్. చాతర్ పూర్ జిల్లాల్లో వుంటాడు. దామో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్యని తీసుకుని బస్సులో బయలుదేరాడు. వెంట 5ఏళ్ల కూతురు కూడా వుంది. కాని, అంతలోనే మృత్యువు రామ్ సింగ్ భార్యని తన వెంట తీసుకెళ్లిపోయింది. ఆమె ప్రాణం బస్సుకంటే వేగంగా ఆనంత గాలుల్లో కలిసిపోయింది! అలా రామ్ సింగ్ భార్య మల్లీ భాయి ఆనారోగ్యంతో చనిపోయాక బస్సు అమాంతం ఆగిపోయింది. ఆ క్షణంలో మల్లీ భాయితో పాటూ మానవత్వమూ చచ్చిపోయింది. బస్సు కండక్టర్ మిగతా ప్రయాణికుల ఒత్తిడి మేరకు రామ్ సింగ్ ని, అతడి 5ఏళ్ల కూతుర్ని దారి మధ్యలో జోరు వర్షంలో బస్సు నుంచి దింపేశాడు! అది అడవి కూడా..
అడవి పాలైన ఆ నిర్భాగ్యుడు, రామ్ సింగ్, భార్య శవంతో అక్కడే వుండిపోయాడు. ఇంతలో బస్సు రూపంలో వెళ్లిపోయిన మానవత్వం మళ్లీ ఓ కార్ రూపంలో వచ్చింది. అందులో వున్న ఇద్దరు లాయర్లు రామ్ సింగ్ తన అయిదేళ్ల పాపకు ఏదో తినిపించటానికి ప్రయత్నం చేస్తుండటం చూసి విషయం తెలుసుకుని పోలీసులకి ఫోన్ చేశారు. వాళ్లొచ్చి జరిగిందంతా రాసుకుని తాపీగా వెళ్లిపోయారు. సాయం మాత్రం చేయలేదు. అప్పుడు ఆ లాయర్లే ప్రైవేట్ అంబులెన్స్ కి ఫోన్ చేసి రామ్ సింగ్ భార్య మల్లీ భాయి శవం ఇంటికి చేరేలా ఏర్పాటు చేసి ముందుకు వెళ్లిపోయారు!
కొన్ని రోజుల క్రితమే రెండో కూతురికి జన్మనిచ్చిన తన భార్యతో కలిసి వెళ్లిన రామ్ సింగ్... లాయర్ల దయతో పెద్ద కూతురు, భార్య శవంతో సహా ఇంటికి చేరాడు! పాపం ఆ అభాగ్యుడికి పోయింది భార్యే కాదు... సాటి మనుషుల మీద నమ్మకం కూడా అనుకుంటా!
ఈ మధ్యే... ఇలాంటి దారుణమే ఒడిశాలోనూ జరిగింది. అక్కడా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది రాక్షసత్వానికి ఓ అభాగ్యుడు భార్య శవంతో పది కిలో మీటర్లు నడిచాడు. తరువాత అంబులెన్స్ దొరికి ఇంటికి చేరాడు!
డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రాణాలు కాపాడే ప్రభుత్వాసుపత్రులు కాదు... కనీసం శవాల్ని ఇంటికి చేర్చే అంబులెన్స్ లు కూడా లేవు! దేశపు అత్యంత పేదలకి ఇంతకంటే అమానుషమైన స్వేచ్ఛ మరొకటి వుండదు!