కర్ణాటక కాంగ్రెస్ కొంప ముంచుతోన్న నటీమణి డైలాగ్స్!
posted on Aug 31, 2016 @ 12:10PM
దేశం మొత్తంలో కాంగ్రెస్ ఎక్కడా సోదిలో కూడా లేకుండా పోయింది! ఇదేదో బీజేపి అభిమానులో , మోదీ భక్తులో అనే మాట కాదు.పచ్చి నిజం. మొన్నటికి మొన్న అసోం లాంటి చిన్న రాష్ట్రం కూడా హస్తం చేజారిపోయింది. ఇప్పుడిక మిగిలింది కర్ణాటక. అది తప్ప పెద్ద రాష్ట్రం అంటూ రాహుల్ గాంధీ చేతిలో లేదు! అయితే, త్వరలో కర్ణాటకలో కూడా ఎన్నికలు వున్నాయి! అక్కడ బీజేపికి తమ అధికారాన్ని ఇచ్చే గొప్ప పనిని అందరి కంటే ఎక్కువగా హీరోయిన్ రమ్య చేస్తోంది!
కర్ణాటకలో రమ్య అంటే మంచి ఫాలోయింగ్ వున్న నటి. అందరు టాప్ హీరోలతో ఆడిపాడిన కమర్షియల్ బామ. తరువాత అనుకోకుండా తండ్రి స్థానంలో పాలిటిక్స్ లోకి వచ్చింది. తండ్రి మరణంతో ఉప ఎన్నికల్లో నిలబడి గెలిచింది. తరువాత తన ప్రవర్తనతో సాధారణ ఎన్నికల్లోఓడిపోయింది. ఇప్పుడు మాజీ ఎంపీ అండ్ మాజీ హీరోయిన్ గా వున్న రమ్య కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది!
అసలు తన నియోజక వర్గం గురించి ఏనాడూ మాట్లాడని రమ్య వున్నట్టుండీ మొన్న పాకిస్తాన్ కు వెళ్లి వచ్చినప్పటి నుంచీ తెగ వార్తల్లో వుంటోంది. ఓ మీటింగ్లో పాల్గొనటానికి పక్క దేశం వెళ్లి వచ్చిన ఆమె ఆ దేశం నరకం కాదని స్టేట్మెంట్ ఇచ్చింది. మనోహర్ పారికర్ అలా అనటం తప్పని సెలవిచ్చింది. అయినా అసలు మన దేశంలో పాకిస్తాన్ పై ఎవ్వరికీ సరైన అభిప్రాయం లేదు. అటువంటి పాక్ ని పొగడటం ద్వారా రమ్య సాధించదలుచుకుంది ఏంటో ఆమెకే తెలియాలి? పనిలో పనిగా బీజేపి, అరెస్సెస్ వాళ్లనీ టార్గెట్ చేసింది. అంటే.... తనకి ఈ దేశం వారైన ఆరెస్సెస్, బీజేపి వాళ్లకంటే పాకిస్తానే ఇష్టం అన్నట్టు సంకేతాలు ఇచ్చింది!
సహజంగానే పాక్ ని పొగిడితే విమర్శలు ఎదురవుతాయి కదా? రమ్యకూ చాలా మంది తలంటారు.అయినా కూడా ఆమె కాంగ్రెస్ మార్క్ పొగరుతో మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ కి తీవ్ర నష్టం చేస్తోంది. మొన్నో సారి పాక్ నరకం కాదన్న రమ్యే.... మంగళూరు పట్టణం నరకమని చెప్పింది. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్లీ సారీ చెప్పి మంగళూరు స్వర్గం అంటూ కితాబిచ్చింది. ఇక తాజాగా రమ్య, స్వతంత్ర సమరంలో పాల్గొంది కాంగ్రెస్ మాత్రమేనని బీజేపి, అరెస్సెస్ ఏం చేశాయని ప్రశ్నించింది!
నిజానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి బీజేపి అసలు లేనే లేదు. 1980ల తరువాతే బీజేపి ఏర్పడింది. అటు అరెస్సెస్ వున్నా కూడా అదొక స్వచ్ఛంద సంస్థ. స్వతంత్ర పోరాటం చేయటానికి అదేం పొలిటికల్ పార్టీ కాదు. పైగా ఆరెస్సెస్ నాయకులు చాలా మంది వ్యక్తిగతంగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కూడా! అందులో కొందరు కాంగ్రెస్ పార్టీలో కూడా వుండేవారు! ఇవేవీ తెలియనీ, పట్టించుకోని రమ్య అరెస్సెస్ బ్రిటీష్ వారితో చేతులు కలిపిందని ఆరోపించింది!
ఇప్పటికే ఆరెస్సెస్ గాంధీ హత్యకి కారణమని కోర్టు ముందు దోషిగా నిలబడ్డాడు సాక్షాత్తూ రాహుల్ గాంధీ. తన ఉద్దేశ్యం అది కాదని మాట మార్చి వివరణ ఇచ్చుకున్నాడు కోర్టుకి! ఇప్పుడు ఆయన బాటలోనే రమ్య కూడా ఆరెస్సెస్ ను టార్గెట్ చేసి జనం ముందు కామెడీ అవుతోంది. పాక్ ని మెచ్చుకుని, ఆరెస్సెస్, బీజేపిల్ని తిట్టిన రమ్య వల్ల కర్ణాటక కాంగ్రెస్ కి మంచి కంటే చెడే ఎక్కువ జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు! అదంతా ఎన్నికల ఫలితాలు వచ్చిన నాడే తెలుస్తుంది...