అభ్యుదయవాదం... కండీషన్స్ అప్లై!
posted on Aug 26, 2016 @ 12:31PM
మన దేశంలో అభ్యుదయ వాదం బోలెడంత వుంది. అసలు ఎంతగా అభ్యుదయవాదం వుందంటే... ఎక్కడో పాలస్తీనాలోని గాజాలో ఓ పసికందు మరణిస్తే ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా మన వాళ్లు ట్వీట్స్ చేస్తుంటారు! అలాగే పెషావర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తానీ పిల్లల్నే కిరాతకంగా చంపేస్తే మన దేశంలో కొవ్వుత్తులు వెలిగించి బయలుదేరతారు! ఇలా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మన దేశ అభ్యుదయవాదులు గోచిలు ఎగజెక్కుకుని పోలోమంటారు!
అదేంటి మానవత్వంతో స్పందిస్తే కూడా తప్పేనా అంటారా? తప్పేం కాదు! కాని, ఎక్కడో ప్రపంచంలో ఏ మూలో జరిగిన వాటికి స్పందించే మన వాళ్లు ఇండియాలో చాలా విషయాలు చూసీ చూడనట్టు వదిలేస్తారు! అదీ ప్రాబ్లం! కొన్నాళ్ల క్రితం జేఎన్ యూలో ఏం జరిగింది? పవిత్రంగా నెహ్రు పేరు పెట్టుకున్న ఆ విశ్వవిద్యాలయంలో దేశానికి వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. భారత్ కి బర్బాదీ తక్ అంటూ మన నాశనం కోరారు ... అక్కడి ఉద్యమకారులు! ఎందుకు? మన పార్లమెంట్ పై దాడికి కుట్ర చేసిన అఫ్జల్ గురుని ఉరి తీసినందుకు!
జేఎన్ యూలో జాతి వ్యతిరేక పనులకి పాల్పడుతున్న కొందరు విద్యార్థుల్ని మోదీ ప్రభుత్వం ఓ పట్టు పట్టడంతో సదరు అభ్యుదయవాదులంతా రంగంలోకి దిగారు. విచిత్రంగా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే విద్యార్థులకి సపోర్ట్ గా ఈ బ్యాచీ మొత్తం నిలిచింది. తప్పంతా స్మృతీ ఇరానీదే అంటూ అల్లకల్లోలం చేశారు అవార్డ్ వాప్సీ ముఠా. తరువాత అంతా కామోష్ అయిపోయారు...
ఇప్పుడు తాజాగా అదే జేఎన్ యూలో ఒక విద్యార్థిని తనపై అత్యాచారం జరిగిందని కేస్ ఫైల్ చేసింది. రేప్ చేసిన వాడు కన్నయ్యా కుమార్ లాంటి ఓ విద్యార్థి నేత. పేరు అన్ మోల్ రతన్! ఈ వామపక్ష విద్యార్థి రత్నం పీహెచ్ డీ చేస్తోన్న స్కాలర్ పై అత్యాచారం చేశాడు. కాని, మన లిమిటెడ్ టైం అభ్యుదయ వాదం ఆఫర్ ప్రకటించే మేధావులు ఇప్పడు దుకాణాలు బంద్ చేశారు! ఎక్కడా అలికిడే లేదు. యూనివర్సిటీ లోపల రేప్ ఏంటని అడిగే వాడే లేడు!
ఇప్పుడొక్కసారి ఇదే పరిస్థితిని భిన్నంగా ఊహించండి... రేప్ చేసింది ఏబీవీపీ విద్యార్థి నాయకుడైతే? ఆహా.... మేధావులు, ఉద్యమకారుల ఆవేశానికి హద్దే వుండేది కాదు! అభ్యుదయ ఆయాసంతో భలే రొప్పే వాళ్లు! కాని, దురదృష్టం రేప్ చేసింది లెఫ్ట్ సంఘమైన ఏఐఎస్యూ విద్యార్థి! అదీ ప్రాబ్లం!
ఇండియాలో ఆదర్శవాదం అంటే లెఫ్టిజమే! అదే లెఫ్టిస్టులు గీత దాటితే ఇక ఎవ్వరూ ప్రశ్నించరు! రైటిస్టులకి ఆ హక్కు వుండదు! హక్కున్న రెగ్యులర్ అభ్యుదయవాదులు తేలుకుట్టిన దొంగల్లా గప్ చుప్ గా వుంటారు! జేఎన్ యూలో ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు, వాళ్లతో జోడి కట్టిన ప్రొఫెసర్లు.. అందరి మీదా వస్తున్న ఆరోపణలకి ఎలాంటి స్పందనా లేకపోవటం ఇందుకే! దేశ రాజధానిలో వున్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో సెక్స్ పార్టీలు జరుగుతున్నాయని అంటున్నా ఎవ్వరిలోనూ కదలిక లేదు... రాదు కూడా! ఒకవేళ జేఎన్ యూ అరాచకాలన్నీ నిజమైతే.... గవర్నమెంటే తాట తీయాలి...