Read more!

చేతులు, కాళ్ళలో కొవ్వు పేరుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తోందా... ఈ ఆసనాలు వేస్తే చాలు!

చేతులు, కాళ్ళలో కొవ్వు పేరుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తోందా... ఈ ఆసనాలు వేస్తే చాలు! కాలం ఏదైనా అమ్మాయిలు స్లీవ్‌లెస్ టీ షర్టులు లేదా టాప్స్ ధరిస్తారు. ఇక  షార్ట్స్ లేదా మినీ డ్రెస్ వేసుకుంటే ఫ్యాషన్ గా ఉంటుందని అటువైపు దృష్టి సారిస్తారు. కానీ కాళ్ళలో, చేతులలో పేరుకున్న కొవ్వు కారణంగా చాలామంది అధికబరువు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంటారు. కేవలం ఈ స్లీవ్ టాప్స్, మోకాళ్ళ వరకు ఉన్న షార్ట్ కారణంగా ఇలా జరగడం అమ్మాయిలకు చాలా చిరాకు తెప్పిస్తుంది. కాళ్ళూ, చేతుల్లో కొవ్వు కరగడం కోసం చాలామంది డైటింగ్ మాయింటైన్ చేస్తారు. నిజానికి కొన్ని శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫాలో అవ్వాల్సింది డైటింగ్ ప్లాన్ కాదు. ఆ భాగాల్లో కొవ్వు కరిగించే వ్యాయామం ఫాలో అవ్వాలి ఇలా చేతులు, కాళ్ళలో పేరుకున్న కొవ్వు కరిగించడానికి యోగా బాగా పనిచేస్తుంది. యోగా వల్ల పొట్ట, మెడ కొవ్వు తగ్గడంతోపాటు కాళ్లను, చేతులను టోన్‌గా మార్చవచ్చు. అందుకోసం వెయ్యాల్సిన ఆసనాలు ఏవంటే..  వశిష్ఠాసనం.. చేతుల కొవ్వును తగ్గించడానికి వశిష్ఠాసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ఆసనం నడుము కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా ప్లాంక్ పోజ్ లోకి వెళ్ళి. క్రంచెస్ వేసేటప్పుడు ఎలాగైతే చేతులు పాదాల మీద శరీరం బరువు మోపుతూ బ్యాలెన్స్ చేస్తామో అదే ప్లాంక్ పోజ్. . అప్పుడు కుడి వైపున చెయ్యి, కుడి కాలి మీద బరువు ఉంచండి. ఆ తరువాత, ఎడమ కాలు, ఎడమ చేతిని పైకి లేపుతూ, ఎడమ పాదాన్ని కుడి పాదంపై ఉంచాలి. ఎడమ చేతిని మీ తొడలపై ఉంచాలి.  శ్వాస తీసుకుంటూ కొన్ని క్షణాలు ఈ స్థితిలో ఉండాలి. తరువాత ఊపిరి పీల్చుకుంటూ తిరిగి ప్లాంక్ పొజిషన్‌కు రావాలి. ఇదే వశిష్టాసనం.  కోణాసనం.. లావుగా  చేతులతో పాటు తొడల్లో ఉన్న కొవ్వును తగ్గించడానికి కోనాసన సాధన చేయవచ్చు. ఈ ఆసనం వేయడానికి, ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాల మధ్య దూరం ఉంచుతూ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి కదపాలి. శ్వాస వదులుతున్నప్పుడు, వెన్నెముకను వంచి శరీరాన్ని ఎడమవైపుకు వంచాలి. ఎడమ చేతిని పైకి చాచి, తలను పైకి చూసేలా తిప్పాలి.  ఈ సమయంలో మోచేతులను సరళ రేఖలో ఉంచాలి. గాలి పీల్చేటప్పుడు పాత భంగిమకు తిరిగి వచ్చి, ఊపిరి పీల్చుకుంటూ ఎడమ చేతిని క్రిందికి తీసుకురావాలి.  మాలాసనం.. కాళ్లను సన్నగా చేయడానికి రెగ్యులర్ గా మాలాసనంను ప్రాక్టీస్ చేయవచ్చు. మాలసనం తొడలు, కాళ్ళను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన ఆసనం. ఈ ఆసనం దిగువ శరీరం యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది, అదనపు కొవ్వును తొలగిస్తుంది. మాలాసనం చేయడానికి, పాదాల మధ్య దూరం ఉంచుతూ తాడాసనం స్థితిలో నిలబడాలి.  స్క్వాట్ పొజిషన్‌లో మోకాళ్లను వంచండి. ముందుకు వంగి రెండు చేతులను వంచి మోకాళ్లను లోపల ఉంచాలి. ఇప్పుడు నమస్కార ముద్రలో చేతులను గుండె దగ్గర ఉంచండి. ఇదే మాలాసనం. ఈ మూడు ఆసనాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే.. అమ్మాయిల కాళ్ళు, చేతులలో కొవ్వు తగ్గి అందంగా నాజూగ్గా మారతాయి.                                      ◆నిశ్శబ్ద.  

వ్యాయామం తరువాత నొప్పులు వస్తున్నాయా.. ఇలా చేస్తే చాలు!

వ్యాయామం తరువాత నొప్పులు వస్తున్నాయా.. ఇలా చేస్తే చాలు! మహిళల ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిలో వ్యాయామాలు ముఖ్య భాగం. మహిళల్లో ఎముకలు, కండరాలు, గుండె ఊపిరితిత్తులను బలపరుస్తుంది. కానీ వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. మహిళల శరీరంలో కండరాలు ముందే సున్నితంగా ఉంటాయి. అలాంటివారు పొట్ట కొవ్వు తగ్గించుకోడానికో.. నడుము కొవ్వు వదిలించుకోవడానికో.. పిరుదుల పరిమాణం తగ్గించుకోడానికో.. ఇలా కొత్త కొత్త వ్యాయామాలు మొదలుపెడుతుంటారు. ఇలా చేసినప్పుడు కండరాల నొప్పులు, కండరాలు చీలడం వంటి సమస్యలు వస్తాయి.   పోస్ట్-వర్కౌట్ నొప్పులకు తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను పాటించాలి. విశ్రాంతి వ్యాయామం తర్వాత నొప్పిని ఎదుర్కోవటానికి అతి ముఖ్యమైన చిట్కా విశ్రాంతి తీసుకోవడం. కండరాలు కోలుకోవడానికి అవి తిరిగి సాధారణంగా మారడానికి  సమయం కావాలి. అప్పటికే అలసిపోయిన కండరాలను మరింత దెబ్బతీసే ఎలాంటి కఠినమైన వ్యాయామం చేయకుండా ఉండాలి.  స్ట్రెచింగ్.. కండరాల నొప్పులు ఉండకూడదు అంటే దానికి మరొక మార్గం స్ట్రెచింగ్. స్ట్రెచింగ్ బిగుతుగా ఉండే కండరాలను విప్పడంలో వాటి పనితీరు సాధారణంగా మారడంతో సహాయపడుతుంది. ఇది గొంతు ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. హాట్, కోల్డ్ థెరపీ.. హాట్, ఓల్డ్ థెరపీ  వల్ల కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మంచు మంటను తగ్గించడానికి, నొప్పిని అణచడానికి సహాయపడుతుంది. వేడి నొప్పి ఉన్న ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కండరాల నొప్పులతో ఇబ్బంది పడేటప్పుడు ఈ రెండూ ఫాలో అవుతూ ఉండాలి.  మసాజ్.. కండరాలకు మసాజ్ చేయడం కూడా నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మసాజ్ వల్ల నొప్పి ఉన్న ప్రాంతంలో రక్త ప్రవాహం పెరుగుతుంది.  హైడ్రేట్ అలసిపోయిన కండరాలు తిరిగి హైడ్రేటెడ్ గా మారడం చాలా అవసరం. నీరు, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, కండరాలలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. నొప్పులు తగ్గించే ఆహారాలు.. శోథ నిరోధక ఆహారాలు తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. సాల్మన్, గింజలు, ఆకు కూరలు వంటి ఆహారాలు కండరాల నొప్పులు తగ్గించడానికి, కండరాల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి అద్భుతంగా సహాయపడతాయి. నొప్పి నివారణలు తీసుకోవాలి.. నొప్పి తీవ్రంగా ఉంటే, ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారణలు మంటను తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఈ నొప్పి నివారిణిలను మితంగా మరియు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం ముఖ్యం.  నిద్ర కండరాల పునరుద్ధరణకు తగినంత నిద్ర కూడా ముఖ్యం. దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి. శక్తి స్థాయిలను పునరుద్ధరించడానికి నిద్ర సహాయపడుతుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తేలికగా వ్యాయామం చేయాలి.. నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ తక్కువ-ప్రభావ వ్యాయామాలు కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి, ఇవి కండరాలు కోలుకోవడంలో  సహాయపడతాయి. అవగాహతో ఉండాలి.. కండరాల బెణుకులు, గాయాలను నివారించడానికి వ్యాయామం గురించి అవగాహన ముఖ్యమైనది. జీబ్ లో లేదా ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో వారు సూచించిన విధంగా మొదలుపెట్టడం ముఖ్యం. తరువాత కావాలంటే వాటిని ఒక్కరే కొనసాగించుకోవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

ప్రాణాయామం - ఆస్తమా నుంచి ఉపశమనం

ప్రాణాయామం - ఆస్తమా నుంచి ఉపశమనం అస్తమా శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి . మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళేటప్పుడు గాని, లేదా ఒత్తిడి వల్ల గాని బ్రాంకియోల్స్‌ లోపలి పొర వాచి, మ్యూకస్‌ మెంబ్రేన్‌ ముడుచుకుపోతుంది.  దాని వల్లఅస్తమా రోగులు గాలి పీల్చడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.  ఈ వ్యాధి తీవ్రత వర్షాకాలంలో,లేదా శీతల ప్రాంతాల్లో ఉండేవారిలో అధికంగా ఉంటుంది. పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అస్తమాకు చికిత్స లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ క్రమం తప్పకుండా సాధన చేస్తే అస్తమాను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా అస్తమా నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రాణాయామం ఎపుడు చేయాలి..? ప్రాణాయామం శ్వాసకు సంబంధించిన వ్యామామం. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఉదయం 4 నుండి 6 గంటల లోపు వాతావరణం కాలుష్య రహితంగా ఉంటుంది. కాబట్టి స్వచ్చమైన గాలిలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా యోగా మ్యాట్ పై కూచుని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడానికి ముందే ముక్కు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ ఆసనం చేసేటప్పుడు ముక్కు రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఉండాలి కాబట్టి ముక్కులో ఎటువంటి మలినం లేకుండా శుభ్రపరచడం వల్ల శ్వాస పీల్చే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాణాయామానికి కనీసం మూడు గంటలు ముందుగా ఏమీ తినకూడదు.    ప్రాణాయామం చేసే పధ్ధతి: మొదట యోగ మ్యాట్ పై కానీ, కుర్చీలో కానీ కంఫర్ట్ గా కూర్చోవాలి. వజ్రాసనం వేస్తే మరీ మంచిది. ముందుగా వీలైనంతగా గాలిని లోపలికి పీల్చాలి. వెంటనే గాలిని వదలకుండా, మీకు వీలైనంత సేపు ఊపిరి బిగపట్టి మెల్లిగా గాలిని వదలాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఆ తరవాత చూపుడు వేలుతో బాటు మధ్య వేలును మడచి నాభిని ఉబ్బిస్తూ గాలిని వదలాలి. అదేవిధంగా మెల్లిగా గాలిని పీలుస్తూ నాభిని కూడా లోపలికి లాగాలి, ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత కుడి చేతి బొటన వేలితో ముక్కు కుడి రంద్రాన్ని మూసి ఉంచి ఎడమ రంద్రం ద్వారా గాలిని లోపలికి పీల్చి సాధ్యమైనంత వరకు ఊపిరి బిగపట్టి మెల్లిగా గాలిని వదలాలి. తరవాత కుడి ముక్కు రంద్రాన్ని మూసి మీకు సాధ్యమైనంత వరకు ఊపిరి బిగపట్టి ఆ తరవాత కుడి ముక్కు రంద్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఎడమ రంద్రాన్ని మూసి ఉంచి కుడి రంద్రం ద్వారా గాలిని పీల్చి వీలైనంత సేపు ఊపిరి బిగపట్టి ఆ తరవాత కుడి రంద్రాన్ని మూసి ఎడమ రంద్రం ద్వారా గాలిని వదలాలి. అదే విధంగా కుడి రంద్రాన్ని మూసి ఉంచి ఎడమ రంద్రం ద్వారా గాలి పేల్చి వీలైనంత వరకు ఊపిరి బిగపట్టి ఎడమ రంద్రాన్ని మూసి కుడి రంద్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి.

ఆహరం - సూచనలు

ఆహరం : మనిషి జీవించి వుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహారం నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలన్నీ వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా, ఆరోగ్యంగా బ్రతకవచ్చు. ఆకు కూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి(వెల్లుల్లి), నిమ్మ, కొబ్బరి మొదలుగా గా ఆహారపదార్థాలు మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్బుజా, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయి, నారింజ, కమలా, పనస, రేగి, ద్రాక్ష, సీతాఫలం మొదలుగా గల పండ్లు తినవచ్చు. ఆయా పండ్ల రసాలు తాగవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు, కిస్ మిస్, ఎండు ద్రాక్ష, ఆఖరోట్, వేరుసెనగ, పిస్తా, అంజీర మొదలుగా గల తిండి పదార్థాలు కూడా లభిస్తున్నాయి.   గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలచందలు, శనగలు, మొదలుగా గల తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తున్నాయి. పాలు, వెన్న, మీగడ, నెయ్యి, లస్సీ, మజ్జిగ, పెరుగు, పాలతో తయారయ్యే పాలు రుచికరమైన పదార్థాలు నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుంచి వెలువడు నూనెలు, తేనే, బెల్లం, పంచదార, తాటిబెల్లం, చెరకు మొదలుగా గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే, వేళకు తీసుకుంటూ వుంటే రోగాలు దరిదాపుకు రావు. గుడ్లు, చేపలు, మాంసం తామస పదార్థాలు వీటిని తిన్నందువల్ల తామసరాజస గుణాలు అధికం అవుతాయి. అందువల్ల వాటిని తినక పోవడం మంచిది. మద్యం, గంజాయి, బంగు, నల్లమందు, పొగాకు మొదలగునవి మత్తు లేక నిషా ఎక్కించే పదార్థాలు. వీటిని వాడకూడదు. ఖాద్య పదార్థాలు, స్వీట్లు, ఎప్పుడు బడితే అప్పుడు లభించాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలు పట్టుకుంటాయి. భోజనం రెండు పూటలు మాత్రమె చేయడం మంచిది. టిఫినుకు భోజనానికి మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి అవసరం. ఉదయం పూట 9 గంటల నుంచి 11 గంటల లోపున భోజనం చేసే వాళ్ళు ఉదయం తీసుకోకూడదు. మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య పండ్లు తినవచ్చు. పండ్ల రసంగాని, అలవాటు అయిన వాళ్ళు ఒక కప్పు, కాఫీ గాని, టీ గాని తాగవచ్చు. కాయ కష్టం చేసే వాళ్ళు తగిన పరిమాణంలో ఆహరం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్ళు తక్కువ ఆహరం తీసుకోవాలి. ఆహారపదార్థాల్ని తాగాలి, నీళ్ళను తినాలి, ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అనునది అందరికీ తెలిసిన నానుడియే. మనం తినే ఆహరం లాలాజలంతో కలిసి జీర్ణ కోశంలోకి వెళ్లి జీర్ణం అవుతుంది అంటే ఆహారాన్ని నీరువలె మార్చి తినాలన్నమాట. నీళ్ళు మరియు పేయ పదార్థాలు నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ వున్నట్లు తాగాలి. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టి పడతాయి. సూచనలు : 1) ప్రొద్దున మేల్కొనగానే చెంబెడు లేక గ్లాసెడు మంచి నీళ్ళు తప్పని సరిగ్గా తాగాలి. 2) మలమూత్ర విసర్జన చేయకుండా ఏమి తినకూడదు. ప్రొద్దున్నే మల విసర్జనం అలవాటు లేని వాళ్ళు అట్టి అలవాటు చేసుకోవాలి. అందుకు రెండు గ్లాసులు గోరు వెచ్చని నిరు తరగాలి. 3) భోజనం చేయునప్పుడు సాధ్యమైనంత వరకు మధ్యన నీళ్ళు తాగకూడదు. 4) యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్ది సేపటి దాకా ఏమి తినకూడదు. వాహ్యాళికి వెళ్లి వచ్చిన తరువాత కూడా కొద్దిసేపు ఏమి తినకూడదు. 5) నిద్రపోయే ముందు ఏమి తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవది వుండటం అవసరం. 6) ఉపవాస సమయంలో టిఫిన్ల పెరట అమితంగా తినకూడదు. జబ్బు పడినప్పుడు పత్యంగా ఆహరం తీసుకోవాలి. 7) పాసిపోయిన, మురిగిపోయిన ఆహార పదార్థాలు తినకూడదు. 8) సగం పాడైన పండ్లు, పాడైనంత వరకు తొలగించి, బాగా వున్నది కదా అని మిగతా భాగం తినకూడదు. 9) భోజనం చేయుటకు ముందు నీళ్ళతో పాదాలు, ముఖం, చేతులు తప్పక కడుక్కోవాలి. అందువల్ల టెన్షను తగ్గుతుంది. భోజనం తేలికగా జీర్ణం అవుతుంది. 10) భోజనం చేయు సమయంలో ప్రశాంతంగా వుండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ వుండటం, మధ్య మధ్యన ఫోన్లు చేస్తూ వుండటం, ఫోన్లు వచ్చినప్పుడు భోజనం చేస్తూ మాట్లాడుతూ వుండటం సరికాదు. 11) భోజనానికి ముందు దైవ ప్రార్థన తప్పక చేయాలి. 12) భోజనం చేశాక 10 నిమిషాలపాటు పచార్లు చేసి, కనీసం 5 నుంచి 10 నిమిషాల సేపు వజ్రాసనం వేయాలి.

సూర్య నమస్కారాలు - 2

  సూర్య నమస్కారాలు   ఆసనాలు:  1. ప్రణామాసనం                        నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి. ' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి .   ప్రయోజనాలు : ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది. 2.హస్త ఉత్థానాసనం శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి.  ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రయోజనాలు : వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది. 3. పాదహస్తాసనం శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి. జాగ్రత్తలు: మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది . ప్రయోజనాలు: ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది. 4.అశ్వ సంచలనాసనం లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి. జాగ్రత్తలు : ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది. ప్రయోజనాలు: శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. . సూర్య నమస్కారాల్లోని మిగిలిన ఆసనాలు మూడవభాగంలో ..

సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారాలు పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస, వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని (ఇంబాలెన్స్ ని) సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం. జాగ్రత్తలు ఋతు సమయాలలోను, వెన్నెముక కింది భాగంలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీటిని ఆచరించకూడదు. గుండె , రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలున్న వారు, జ్వరం, అల్సర్ లు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు. సూచనలు ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే జీవనశైలికి అలవాటుపడిన వారు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు వంటి రుగ్మతలున్నవారు ' పవనముక్తాసన శ్రేణి' భంగిమలను మెల్లగా ప్రాక్టీస్ చేసి ఆ తరవాత సూర్య నమస్కారాలకు ఉపక్రమించాలి . పవనముక్తాసనం వలన శరీర భాగాలలోని మజిల్స్ సాగి, సూర్య నమస్కారాలలోని కదలికలకు అనువుగా సర్దుకుంటాయి. అలా కాని పక్షంలో కీళ్ళ నొప్పులు , జ్వరం, పాదాలవాపు , చర్మం పగలడం వంటి సమస్యలు వస్తాయి. సూర్యనమస్కారాలను సాయంత్రం వేళల్లో చేయకూడదు . సూర్యుని వైపు తిరిగి, వేకువఝామునే సూర్య నమస్కారాలు చేయడాన్ని అభ్యసించాలి.

యోగ నిద్ర మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది

యోగ నిద్ర మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది మానసిక ప్రశాంతతను, రక్త ప్రసరణకు కావాల్సిన ఆక్సిజన్ సరఫరా పెంచడమే కాకుండా మనకు కలిగే ఇన్ ఫెక్షన్ల నుండి కాపాడేది, మన శరీరానికి కావాల్సిన ఫ్లేక్సిబిలిటీ మరియు శక్తినీ కూడా అందిచేది ఒక యోగానిద్ర మాత్రమే ! మరి ఆలాంటి యోగనిద్ర ఎలా చేయాలో తెలుసుకుంటే మంచిదే కదా ! * యోగనిద్ర చేయలనుకున్నప్పుడు సులువుగా వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ఒంటిమీద ఎక్కడ బిగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. వాచ్, నడుముకి పెట్టుకొనే బెల్ట్‌లాంటి లేకుండా చూసుకోవాలి. ఆ తరువాత వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లు కొద్దిగా దూరంగా ఉంచి.. రెండు చేతులు ఆకాశంవైపు ఉంచాలి. తలని కొద్దిగా ఎడమవైపు గానీ, కుడివైపు గానీ తిప్పాలి. శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ శరీరాన్ని భూమిమీద రిలాక్స్‌డ్‌గా వదిలివేయాలి. మనసులో ఆలోచనలు లేకుండా ధ్యాస పూర్తిగా శరీరం మీద పెట్టాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా గాలి పీలుస్తూ, వదులుతూ ఉదర కండరాలను పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు పరిసరాల వైపు మన ధ్యాసను మళ్లించాలి. * యోగనిద్ర చేయడం వల్ల ఆందోళనలు తగ్గుతాయి. తలనొప్పి రాకుండా ఉంటుంది. బీపీ వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. సిస్టోలిక్ బీపీ, డయాస్టోలిక్ బీపీని 10 నుంచి 15మి.మీ వరకు అదుపు కూడా చేయడంలో ఉపయోగపడుతుంది. యోగనిద్ర చేయడం వలన అన్నీ ఉపయోగాలే తప్ప ఇబ్బందులు, సమస్యలు రావు. ప్రతిరోజు యోగానిద్ర చేస్తే చాలు మనకు కలిగే చిన్న చిన్న నొప్పులకు డాక్టర్ గారిని సంప్రదించవలసిన అవసరం ఉండకపోవచ్చు. * మొదటగా కుడి అరచేతి నుంచి మొదలుపెట్టి కుడిచేతివేళ్లను, కుడి అరచేతిని, మణికట్టుని, మోచేతిని, భుజాలను, శరీరపక్క భాగాలను, నడుము జాయింట్స్, తొడ కండరాలు, మోకాళ్లు, పిక్కలు, కాలి మడమలు, అరికాళ్లు, పాదం కాలి వేళ్లు ... ఇలా ఒక్కో భాగాన్ని గమనిస్తూ నెమ్మదిగా రిలాక్స్ చేస్తూ మొత్తం కుడిపక్కన శరీర భాగాలన్నింటి బరువునంతా భూమిమీద వదిలేయాలి. ఇదే విధంగా ఎడమ అరచేతి నుంచి మొదలుపెట్టి, ఎడమ కాలి వేళ్ల వరకు శరీర భాగాలన్నింటిని చేయాలి. * ఇప్పుడు శరీరం వెనుక భాగంలో ధ్యాస ఉంచాలి. మొదట కుడి తుంటి భాగం, తరువాత ఎడమ తుంటిభాగం, వెన్నెముక కింది భాగం, మధ్య భాగం, భుజాల కీలు భాగాలు... ఇలా వరుసగా ధ్యాస ఉంచి వాటిని రిలాక్స్ చేస్తూ రావాలి. ఇప్పుడు శరీరం ముందు వైపు ధ్యాస కేంద్రీకరించాలి. తల, నుదుటి భాగం, కుడి కన్ను, ఎడమకన్ను, ముక్కు, ముక్కు కొనభాగం, కుడిచెంప, ఎడమ చెంప, పై పెదవి, కింది పెదవి, చుబుకం, కుడివైపు కాలర్‌బోన్, ఎడమవైపు కాలర్‌బోన్, కుడి ఛాతి భాగం, ఎడమ ఛాతి భాగం, బొడ్డు చుట్టుపక్కల, పొత్తికడుపు ఇలా... మొత్తం శరీరం మీద ధ్యాస ఉంచి... తరువాత శరీరాన్ని రిలాక్స్ చేయాలి.

యోగాతో స్ట్రెస్ ను తరిమికొట్టవచ్చు

యోగాతో స్ట్రెస్ ను తరిమికొట్టవచ్చు స్ట్రెస్ అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. అబ్బో వత్తిడి, అయ్యో, నరాలు చిట్లిపోతున్నట్లు ఉన్నాయి.. స్ట్రెస్ ను తట్టుకోలేక పోతున్నాం అనే ఫిర్యాదులు అంతటా వినిపిస్తున్నాయి.ఎల్ కేజీ పిల్లలు మొదలు రిటైర్మెంట్ కి దగ్గరపడిన పెద్దల వరకూ కోట్లాదిమంది ఎదుర్కొంటున్న సమస్య స్ట్రెస్. ఎందుకింత స్ట్రెస్ అంటే మితిమీరిన పోటీ అనేది మొదటి సమాధానం. తర్వాత ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు. ఏ కారణం చేత అయితేనేం నిజంగానే చాలామంది నరాలు చిట్లేంత వత్తిడికి గురవుతున్న మాట నిజం. మరి ఈ స్ట్రెస్ ను నివారించే మార్గాలు లేవా అంటే, తప్పకుండా ఉన్నాయి. పనిలో నైపుణ్యం సంపాదించడం ఒక మార్గం కాగా ప్రాణాయామం లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరో దివ్యమైన మార్గం. రోజూ చేసే పనులకు తోడు మరేమైనా ఇతర పనులు చేయాల్సి వచ్చినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. ఓపిక తగ్గినప్పుడు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేకపొతే స్ట్రెస్ ఎక్కువౌతుంది. పోటీ ప్రపంచంలో టార్గెట్లు రీచ్ కాలేనప్పుడు మరింత వత్తిడి కలుగుతుంది. ఏ రకంగా అయితేనేం స్ట్రెస్ తో బాధపడుతున్నాం అని కంప్లైంట్ చేసేవారంతా రోజూ ఓ గంటసేపు బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ చేయాలి. బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ వత్తిడిని ఎలా నియంత్రిస్తుంది, ఇవన్నీ ఒత్తి మాటలు అని కొందరు నమ్మరు. బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ కల్పతరువు అని అర్ధం చేసుకోకపోగా ఎగతాళి చేస్తారు. ఒకసారి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ లోని గొప్పతనం అర్ధం కాదు. ఇంతకీ బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. * ఉదయానే ప్రశాంత వాతావరణంలో తాజా గాలి వచ్చే ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. * కుడిచేతి చూపుడు వేలితో ఒక నాసికారంద్రాన్ని మూసి ఉంచి, రెండో నాశికా రంధ్రంతో నిండా గాలి తీసుకోవాలి. * మూసి ఉంచిన వేలిని తీసి ఆ రంధ్రం లోంచి పూర్తిగా శ్వాస వదలాలి. తర్వాత రెండో రంధ్రాన్ని మూసి మొదటిదానితో శ్వాస పూర్తిగా తీసుకోవాలి. ఇలా మార్చి మార్చి చేయాలి. * బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ చేసేటప్పుడు ఆలోచనలను సైతం నివారించే ప్రయత్నం చేయాలి. ఇది అంత తేలికేం కాదు. మనసు చాలా చంచలమైనది. ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తూనే ఉంటాయి. మనసు స్థిరంగా లేదని గ్రహించినప్పుదల్లా దాన్ని శ్వాస మీదికి మళ్ళించాలి. * రోజులో ఓ గంటసేపు ఈ బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ చేయగల్గితే స్ట్రెస్ అనేది మన దరిదాపులకు రాదు. వీలు చిక్కితే, పొద్దున్న, సాయంత్రం రెండు గంటలు గనుక బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ కు కేటాయించ గలగితే ఆరోగ్యం, ఆనందం మన సొంతమౌతాయి. * రోజూ బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ చేయలేనివారు కనీసం బాగా స్ట్రెస్ ఫీలౌతున్నప్పుడు అయినా చేయాలి. * బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ శారీరకంగా, మానసికంగా కూడా చెప్పలేనంత మేలు చేస్తుంది. స్ట్రెస్ నుండి బయటపడేస్తుంది. తలనొప్పులు, వికారం లాంటి అనారోగ్యాలను తగ్గిస్తుంది. * యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మానసిక జబ్బులను తగ్గిస్తుంది. హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఒక్కొసారి స్ట్రెస్ ఎక్కువై కర్తవ్యం బోధపడదు. మైండ్ బ్లాన్కుగా మారుతుంది. దిక్కుతోచనట్లు అయోమయంగా ఉంటుంది. విసుగు, అసహనం ఎక్కువౌతాయి. ఏ పనీ చేయలేని నిస్సహాయత చోటుచేసుకుంటుంది. అలాంటప్పుడు బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ మంత్రంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ ప్రాక్టీసు చేసేవారు ఎట్టి పరిస్థితిలో వత్తిడికి గురవ్వరు. ఎలాంటి సమస్యనయినా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. క్లిష్ట సమయాల్లో, స్ట్రెస్ ఫుల్ సిట్యుయేషన్ల లో కూడా సమర్ధవంతంగా పని చేయగల్గుతారు. అదీ, బ్రీతింగ్ ఎక్ష్సర్సైజ్ లేదా ప్రాణాయామం గొప్పతనం.

అద్భుతమైన సూర్య నమస్కారాల రహస్యం!

అద్భుతమైన సూర్య నమస్కారాల రహస్యం! భారతీయ జీవన విధానంలో ఒకప్పుడు యోగా ప్రాధాన్యత అధికంగా ఉండేది. దురదృష్ట వశాత్తు యోగా క్రమంగా మరుగున పడి పాశ్చాత్యుల పోకడలతో జిమ్ లు వచ్చి పడ్డాయి. అయితే భారతదేశంలో ఉన్న కొందరు గురువులు యోగ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎన్నో విషయాలను మరెన్నో మార్గాలను వ్యాప్తి చేయడం వల్ల యోగాకు మళ్ళీ ఆదరణ పెరిగింది. ముఖ్యంగా సూర్య నమస్కారాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి మరియు విశిష్టత కలిగినవి.  యోగాసనాలు, ప్రాణాయాముల కలయికయే సూర్య నమస్కారాలు. ఇది యోగాసనాలు, వ్యాయామాలకు మధ్యస్థంగా ఉంటుంది. యోగసాధనకు కావలసిన శారీరక స్థితిని సూర్యనమస్కరాలు కలిగిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఈ సూర్య నమస్కారాలు చేయాలి.  సూర్య నమస్కారాలు చేసేముందు సూర్యునికి ఎదురుగా నిలబడి ఈక్రింది మంత్రాలు చదువుతూ చేయాలి. హిరణ్మయేణ పాత్రేణ, సత్యస్యాపిహితమ్ ముఖం  | తత్ త్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే ।  సత్యాన్ని చేరటానికి నీ స్వర్ణకాంతి మమ్మల్ని నిలువరిస్తూ ఉంది. ఓ సూర్యదేవా! మా దారిని సుఖమయంచేసి సత్యాన్ని చేరుకోనీయుము. అని అర్థం.  ఇకపోతే సూర్యనమస్కారాలు రెండు విధాలుగా చేస్తారు. మొదటి విధానంలో 12 స్థాయిలుంటాయి. రెండో విధానంలో 10 స్థాయిలు మాత్రమే ఉంటాయి. ప్రతి స్థాయి ప్రారంభానికి ముందు బీజాక్షరమైన “ఓంకార” మంత్రంతో జతచేసిన సూర్యనామాన్ని జపిస్తూ సూర్యనమస్కారాన్ని ఆచరించాలి. ఆ వరుస ఇలా సాగుతుంది.  ఓం హ్రాం మిత్రాయ నమః   ఓం హ్రీం రవయే నమః ఓం హ్రూం సూర్యాయ నమః  ఓం హ్రీం భానవే నమః  ఓం హౌం ఖగాయ నమః  ఓం హ్రః పూష్టియే నమః  ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః   ఓం హ్రీం మరీచయే నమః  ఓం హ్రూం ఆదిత్యాయ నమః   ఓం హ్రీం సవిత్రే నమః   ఓం హ్రూం అర్కాయ నమః  ఓం హ్రః భాస్కరాయ నమః ప్రతిస్థాయిలోనూ గాలిని ఆపాలి. మొదటి విధానంలోని 12 స్థాయిలతో కూడిన సూర్యనమస్కారం ఇలా చేయాలి. వీటిని ఎలా చేయాలంటే... ◆ నిటారుగా నిలబడి కాళ్లు, చేతులు దగ్గరగా పెట్టాలి. చేతులను తలమీదకి తీసుకువచ్చి నడుముని వెనక్కి వంచాలి. గాలిని బాగా పీల్చాలి. ◆శరీరాన్ని ముందుకు వంచాలి. అరచేతులను కాళ్లకు రెండు ప్రక్కల నేలకి ఆనించాలి. ఇప్పుడు గాలిని బాగా వదలండి. ఈ దశలో, కుడికాలిని వెనక్కి తీసుకురావాలి. ఎడమ మోకాలిని ముందుకి తీసుకోవాలి. ఇప్పుడు పైకి చూస్తూ గాలి బాగా తీసుకోవాలి. పిరుదుల్ని మడమలకి తగిలించాలి.  ఎడమకాలు కూడా వెనక్కి తీయాలి. అరచేతులు, మునివేళ్లపైన మాత్రమే నిలబడాలి. నేలకు 30° కోణంలో తలనుండి తిన్నగా శరీరాన్ని ఉంచాలి. గాలి బయటకు విడవాలి. ఇప్పుడు, చేతులు, కాళ్లు, కదపకుండా మోకాళ్లు వంచుతూ భూమికి మోపాలి. నుదురుని నేలకు తాకించాలి. శ్వాస తీస్తూ నెమ్మదిగా వెనక్కు కదిలి, శ్వాస విడవాలి. ఇలా చేసేటప్పుడు మడమలపై ఒత్తిడి కలిగించకూడదు. చేతులూ, వ్రేళ్లూ కదలక గుండెలను ముందుకు తెచ్చి, నుదురు భూమికి తగిలించాలి. ఇది సాష్టాంగ నమస్కార ముద్ర. నుదురు, రొమ్ము, అరచేతులు, మోకాళ్లు, కాళ్లు ఇలా 8 అంగాలూ నేలను తాకుతూ ఉంటాయి. పిరుదులు పైకి లేచి ఉంచాలి. శ్వాసతీసుకోకుండా కొంతసేపు ఉండాలి. గాలి పీల్చుకొని తల ఎత్తి చేతులు, కాళ్లు ఏమాత్రం కదలకుండా వెన్నును పాములా వంచాలి. మోకాళ్లు నేలను తాకకూడదు. తరువాత గాలి విడవాలి. పిరుదులు లేపుతూ తలను నేలకి వంచాలి. అరచేతులూ, పాదాలూ భూమికి తాకుతూ ఉండగా వంచిన విల్లులాగా ఉండండి. 5వ పద్ధతినే తిరిగి చేస్తూ గాలి పీలుస్తూ విడవాలి.   గాలి పీల్చి కుడికాలిని రెండు చేతుల మధ్యకు తీసుకోవాలి. చేతులు, కాళ్లు మూడూ ఒకే వరుసలో ఉండాలి.  3వ పద్ధతిలోలాగ వెన్నెముక వంచాలి.  గాలి విడుస్తూ ఎడమకాలిని కూడా చేతులమధ్యకు తీసుకువచ్చి తలను 2వ పద్ధతిలోవలె మోకాళ్లకు ఆనించాలి. గాలి పీలుస్తూ లేచి నిలబడండి. చేతులు కిందకు వదలి, నిలబడి విశ్రాంతించాలి.  (రెండో విధానంలో 10 స్థాయిలుంటాయి. అందులో ఇక్కడ ఇచ్చిన 5, 9 స్థాయిలను వదిలిలపెట్టి మిగతావి ఆచరించాలి) ఓంకార మంత్రమున బీజాక్షరాలను పలకటం, హ, ర అక్షరాల ఉచ్చారణవల్ల నరాలు, రక్తప్రసరణ జీర్ణకోశము బాగవుతుంది. సాధన సమయంలో సూర్యుని అనేక పేర్లు చెబితే అవి బాగా శక్తి స్నేహం, ప్రేమ, బలం, శక్తి, పట్టుదల, దీక్ష, ఆరోగ్యం ఇస్తాయి.                                         ◆నిశ్శబ్ద.

వెన్ను మీద పట్టు కావాలిప్పుడు!

వెన్ను మీద పట్టు కావాలిప్పుడు! మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఆడవారిలో ఎన్నో రకాల సమస్యలే వీటికి కారణం అవుతాయి. మరీ ముఖ్యంగా మహిళలు గర్భవతులు అయ్యి డెలివరీ అయిన తరువాత వారిలో ఎముకలు చాలా వరకు బలహీనం అయి ఉంటాయి. వీటిని దృఢంగా చేసుకోవడం ఎంతో ముఖ్యం.  ఈ మధ్య కాలంలో మహిళలలో ఎక్కువగా నమోదు అవుతున్న సమస్యలలో వెన్నెముక బలహీనంగా ఉండటం ప్రధానంగా గుర్తించబడుతోంది. చూడటానికి శారీరకంగా బలంగా ఉన్న చాలా మంది మహిళలలో   ఈ సమస్య అంతర్లీనంగా చాలా ఇబ్బంది పెడుతోంది అంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ అదే నిజమంటున్నారు స్త్రీ మరియు పోషకాహర నిపుణులు. అయితే మహిళలలో ఎదురయ్యే ఈ రకమైన వెన్ను నొప్పి సమస్యలకు మంచి పరిష్కారం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా యోగానే. వెన్నుపూసను బలంగా, దృఢంగా మార్చే యోగాసనం వేస్తే వెన్ను నొప్పిని తరిమికొట్టవచ్చు. సాధారణంగా వెన్ను నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయంటే… ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కుదురుగా కూర్చోలేకపోవడం, పడుకున్నపుడు కూడా కొద్దిసేపు కూడా సరిగా పడుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వెన్ను పూస బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇది మాత్రమే కాకుండా బరువులు ఎత్తేటప్పుడు, వంగి పైకి లేచేటప్పుడు, చురుగ్గా కదలాల్సినప్పుడు కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే అది వెన్నెముక బలహీనంగా ఉండటం వల్ల కలిగే ఇబ్బంది అని గమనించాలి. వెన్ను నొప్పి మీద యోగాస్త్రం:-  వెన్ను నొప్పి తగ్గడానికి ఒకే ఒక్క ఆసనం చాలు చాచి తరిమికొడుతుంది. అది కూడా ఎక్కువ సమయం కాకుండా కేవలం రెండే రెండు నిమిషాల సమయం వెచ్చించగలిగితే వెన్ను నొప్పి మాయమవుతుంది. దీనికి వేయాల్సిన ఆసనం మార్జాలాసనం!! మార్జాలాసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల వెన్ను నొప్పి నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. దీన్ని మార్జాలాసనం అని ఎందుకంటారనే విషయం గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. నిజమే!! ఈ ఆసనం వేసినప్పుడు పిల్లి ఎలా ఉంటుందో అలాంటి భంగిమలో ఉంటుంది శరీరం. కనుకనే దీన్ని మార్జాలాసనం అని అంటారు. ఇంగ్లీష్ లో అయితే క్యాట్ స్ట్రెచింగ్ అని అంటారు.  ఎలా వేయాలంటే… మొదటగా యోగాసనాలు వేయడానికి అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. యోగ మ్యాట్ లేదా మెత్తని దుప్పటి వేసుకుని  ఆసనం మొదలు పెట్టడానికి ముందు రెండు మోకాళ్ళ మీద కూర్చోవాలి.  రెండు చేతులను ముందుకు చాచి అరచేతులను నేలకు ఆనించి ఇప్పుడు మోకాళ్ళ మీద బలం వేసి పైకిలేవాలి. వీపు సమాంతరంగా ఉంటూ చేతులు, మోకాళ్ళ మీద వంగినట్టు ఉంటుంది. ఇప్పుడు కుడి కాలును వెనక్కు సమాంతరంగా చాపాలి. ఎడమచేతిని కూడా సమాంతరంగా ముందుకు చాపాలి. ఎడమ కాలును, కుడి చేతిని వంచకూడదు. ఈ భంగిమలో కొన్ని సెకెన్ల పాటు ఉండాలి. తరువాత ఎడమ కాలును వెనక్కు, కుడి చేతిని ముందుకు చాపాలి. వాటిని సమాంతరంగా ఉంచాలి.   ఈ విధంగా కాళ్ళు చేతులను మారుస్తూ ఆసనాన్ని వెయ్యాలి. ప్రతి ఆసనం కనీసం మూడు సార్ల చొప్పున కనీసం రెండు కలిపి ఆరు సార్లు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితం ఉంటుంది.  ప్రయోజనాలు:-  మార్జాలాసనం వేస్తుందం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఈ ఆసనం వేయడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ముఖ్యంగా వెన్నెముక దృఢంగా మారుతుంది. మహిళలలో చాలామందికి కనిపించే పిరుదులు, నడుము, పొత్తి కడుపు  భాగంలో క్రొవ్వు చేరడం జరగదు. వెన్ను నొప్పిలాగా వేధించే నడుము నొప్పి ఈ ఆసనం వల్ల తగ్గిపోతుంది. అధిక కొవ్వు కలిగి ఉంటే అది క్రమేపీ తగ్గిపోతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే శరీరం కూడా తేలికగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.

ఈ అమృత ముద్ర నిజంగానే అమృతమంత శక్తిని ఇస్తుంది!

ఈ అమృత ముద్ర నిజంగానే అమృతమంత శక్తిని ఇస్తుంది! మానవ శరీరంలో మూడులక్షలా యాభైవేల నాడులు ఉంటాయి. ఈ నాడులలోకి డెబ్బైరెండువేల నాడులు చాలా ప్రధానమైనవి. ఈ డెబ్బైరెండువేల నాడులలో ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి ఎంతో ముఖ్యమైనవి. ఈ నాడులలో ఎప్పుడూ రక్తం, ఆక్సిజన్ ప్రవహిస్తూ శరీరాన్ని అభివృద్దికి సహకరిస్తూ ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారం, నీరు, ద్రవపదార్థాలు మొదలయిన వాటిలో ఉండే చెడు పదార్థాలు రక్తంలోకి చేరి అవి క్రమంగా గుండెపోటు, పక్షవాతం, మూర్చ మొదలయిన వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం వల్ల కలిగే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడటం, ఎందరో వైద్యులను సంప్రదించడం జరుగుతుంది. అయితే ఎన్ని మందులు వాడినా కలగని ప్రయోజనాలు ఒకే ఒక ముద్ర వేయడం వల్ల పరిష్కారమవుతుందంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ప్రధానమైన ఆ మూడు నాడులను మొదట శుద్ది చేసుకోవాలి.  మూడు నాడులను శుద్ధి చేసుకోవాలి అంటే దానికి అత్యుత్తమ మార్గం అమృత ముద్ర. ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే కొన్ని రకాల సమస్యలకు ఇది మంచి పరిష్కారమవుతుంది.  అమృత ముద్ర ఎలా వేయాలి?? అతిగా కష్టపడవలసిన అవసరం ఏమి లేదు దీనికి. కింద చెప్పే సూచనలు పాటిస్తూ అమృత ముద్ర వేయచ్చు. సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. సుఖాసనం, పద్మాసనం ఇలా ఎలాగైనా కూర్చోవచ్చు. అలా కూర్చోలేని వాళ్ళు కుర్చీలు, మంచాల మీద అయినా కూర్చోవచ్చు ఎలాంటి సమస్యా లేదు.  సౌకర్యవంతమైన అసనంలో కూర్చున్న తరువాత మొదట ఎడమచేతి వేళ్లలో మధ్యవేలును మడిచిపెట్టాలి, ఆ తరువాత బొటనవేలును వంచి  మధ్యవేలు చివరి భాగంతో కలిపి ఉంచాలి. కుడిచేతి వేళ్ళలో ఉంగరం వేలును మడిచిపెట్టాలి. కుడి చేతి బొటన వేలును వంచి ఎడమచేతి ఉంగరపు వేలు కొనతో బొటనవేలు కొనను కలిపి ఉంచాలి.  రెండు చేతులతో ఇలా చేసాక ఆ వేళ్ళను కలిపి ఉంచిన చోట జాగ్రత్తగా గమనిస్తే వేళ్ల మధ్య ఏదో శక్తి ప్రసరణ అవుతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని అలాగే అనుభూతి చెందుతూ శరీరంలో ఉన్న నాడులు శుద్ధి అవుతున్నట్టు భావిస్తూ శరీరంలో ఉన్న అనారోగ్యం అంతా తగ్గిపోతుందని అనుకోవాలి. ఇలా చేస్తున్నంత సేపు ఏకాగ్రత శరీరంలో అవయవాల మీద ఉండాలి. అవి ఇలా శుద్ధి అవుతున్నాయని అనుకోవాలి. ఇలా అమృత ముద్రను వేయాలి. ఎంతసేపు వేయాలి?? అమృత ముద్రను ప్రతి రోజూ మూడు పూటలా వేయవచ్చు. దీన్ని ఆహారం తీసుకోవడానికి ముందు వేయడం వల్ల మంచి ఫలితం పొందొచ్చు. లేకుంటే భోజనం లేదా ఆహారం తిన్న తరువాత గంటసేపటికి ఈ ముద్రను వేయవచ్చు. పది నిమిషాలు ఈ ముద్రను వేయడం వల్ల ఆశించిన ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. నిజంగానే ఈ అమృత ముద్ర ఫలితాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఈ ముద్ర వేయడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనత, అలసట తగ్గిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మందబుద్ది ఉన్నవాళ్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం ముద్ర వేస్తే రోజంతా చలాకీగా చురుగ్గా ఉండగలుగుతారు. శరీరంలోకి నూతన శక్తిని తీసుకువస్తుంది. అదే సాయంత్రం సమయంలో ఈ ముద్ర వేస్తే నుద్రలేమి అనే సమస్య తొలగిపోయి సుఖవంతమైన నిద్ర సొంతమవుతుంది. మానసిక సమస్యలు తగ్గి జ్ఞాపకశక్తి, మేథాశక్తి పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ముద్రను మహిళలు తప్పకుండా ఆచరించాలి.                                  ◆నిశ్శబ్ద.

యోగమంత ఆహారం!

యోగమంత ఆహారం! ప్రస్తుత కాలంలో పాశ్చాత్య దేశాలలో కూడా ఆదరణ పొందుతున్న గొప్ప ఆధ్యాత్మిక మార్గం యోగ. భారతీయ ప్రాచీన మహర్షుల చేత అందించబడిన గొప్ప మార్గమిది. యోగ అనేది శారీరక, మానసిక సమస్యలకు చక్కని మార్గం అయినందుకే అంత గొప్ప ఆదరణ పొందింది. అయితే యోగ కేవలం ఆసనాలతో మిళితమైనది మాత్రమే కాదు యోగాలో ఆహారం కూడా ఎంతో ముఖ్యమైనది. యోగ సాధన చేసేవారు ప్రత్యేక ఆహారం తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు మహర్షులు ఆధ్యాత్మిక సాధకులు అవలంభించిన ఆహార మార్గాలు వేరు. ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించాలంటే కష్టమే. అయినప్పటికీ యోగ కు ముందు తీసుకోవలసిన సులువైన ఆహారం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని పాటించాలి. సాధారణంగా జిమ్ చేసేవారు డైట్ ని ఫాలో అవుతారు. వ్యాయామానికి ముందు ఇది, తరువాత ఇది, బ్రేక్స్ లో ఈ లిక్విడ్స్ లాంటి మెనూ ఒకటి తయారు చేసుకుంటారు. అయితే యోగా కు అంత పెద్ద మెనూ లేకపోయినా కొన్ని పదార్థాలు ఉన్నాయి. యోగా సాధనకు  ముందు తినేవాటిలో పండ్లే అగ్రభాగంలో ఉంటాయి. వాటిలో మొదటగా అవకాడో ముఖ్యమైనది. ఈ అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో కండరాలు, కణాల పనితీరుకు ఈ ఖనిజ లవణాలు ఎంతో అవసరం. అవకాడోలో ఉండే ఖనిజ లవణాలు కండరాలు, కణాల పనితీరును క్రమబద్ధంగా ఉండేలా చేస్తాయి. పైపెచ్చు ఇది జీర్ణమవడం కష్టతరమైన సమస్య ఏమి కాదు, చాలా సులువుగానే జీర్ణమైపోతుంది. అందువల్ల ఎలాంటి జీర్ణాశయ సమస్యలు దీనివల్ల రావు. ఇంకొక విషయం ఏమిటంటే అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా అవకాడో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.  ఇన్ని ప్రయోజనాలు కలిగిన అవకాడో తీసుకోవడం వల్ల యోగ సాధన చేయడానికి తగినట్టుగా శరీరం దృఢంగా, అనుకూలంగా మారుతుంది. సాధారణంగానే ప్రతి డైట్ మెనూ లో ఎలాంటి అబ్జక్షన్ లేకుండా అందరూ భాగం చేసేది అరటి పండు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే అరటిపండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా ప్రతి డైట్ మెనూలో దీనికి ప్లేస్ తప్పనిసరిగా ఉంటోంది. అంతేకాదు అరటిపండు కడుపు ఉబ్బరంగా ఉన్నవారికి బెస్ట్ మెడిసిన్ గా పని చేస్తుంది. కండరాల నొప్పులతో బాధపడేవారు అరటిపండు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అరటి పండును నేరుగా తినాలనే రూల్ లేదు. దీన్ని స్మూతీగానూ, ఇతర కాంబినేషన్ ఫ్రూట్స్ తో కలిపి సలాడ్ గానూ తీసుకోవచ్చు. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదు అంటారు. అయితే యోగాకు ముందు యాపిల్ తినడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. యాపిల్ లో క్షార గుణం ఉంటుంది. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లాలను శాంతపరచడంలో ఈ యాపిల్ బాగా పనిచేస్తుంది. పైపెచ్చు యాపిల్ లో నాచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తగు మోతాదులో శక్తిని అప్పటికప్పుడు అందిస్తాయి. ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి యోగ సాధన చేసే సమయంలో ఆకలి, అతి దాహం వేయకుండా చేస్తుంది. పైగా యాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు రాత్రి బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే వాటిని తినడం చాలా మంచిదని అందరూ చెబుతారు. అయితే బాదం పప్పులను అలానే తీసుకోవాలని లేదు. యోగ సాధన చేయడానికి ముందు 4 నుండి 8 వరకు నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ సొంతమవుతుంది. బాదం పప్పులలో విటమిన్ ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. పైన చెప్పుకున్న ఆహారపదార్థాలు యోగ చేయడానికి ముందు తీసుకుంటే అవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అలాగని అవి బరువుగా ఉండవు ఎంతో తేలికగా ఉంటాయి కాబట్టి యోగ సాధన సజావుగా సాగిపోతుంది..                                  ◆నిశ్శబ్ద.

ఆడవారిలో ఋతు సంబంధ సమస్యలకు చెక్ పెట్టే సర్వాంగాసనము!

ఆడవారిలో ఋతు సంబంధ సమస్యలకు చెక్ పెట్టే సర్వాంగాసనము! నేటి ఆధునిక జీవన శైలిలో మనిషికి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆడవారికి శారీరక సమస్యలు అన్ని హార్మోన్ల ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి. శరీరంలో వివిధ అవయవాలు ప్రభావం చెందటం వలనా…. వాటి పనితీరు మందగించడం వలనా… శరీర స్థితి మార్పుకు లోనవుతుంది. వీటన్నిటికీ చక్కని పరిష్కారం యోగ.. యోగాలో సర్వాంగాసనము గొప్ప ఫలితాలను ఇస్తుంది. అది ఏ విధంగా వేయాలి?? దాని ప్రయోజనాలు ఏంటి?? వంటివి తెలుసుకుంటే…  సర్వాంగాసనం... సర్వాంగ అంటే అన్ని అవయవాలు అని అర్థం. ఈ ఆసనం వేయటం వల్ల, శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా మహిళలలో ఎదురయ్యే థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల  "థైరాయిడ్" అనే గ్రంథి నియంత్రించ బడుతుంది. వేయవలసిన విధానం :  శిరస్సు నుంచి, పాదాల వరకూ సరిగ్గా ఉండేలా వెన్నముకను భూమికి ఆనించి నేలపై పడుకోవాలి.ఇది శవాసన భంగిమలో ఉండటం అన్నమాట. ఇలా ఉన్న భంగిమ నుండి  చేతులు తలకు ఇరువైపులా తిన్నగా వెనక్కు ఉంచాలి. ఇప్పుడు ఈ స్థితిలో నేల నుంచి 45°(నలభై అయిదు డిగ్రీలు)  కోణంలోకి కాళ్లు రెండూ ఎత్తి ఉంచాలి. అలా 45° నుండి మెల్లగా కాళ్ళను 90° కోణం వరకూ ఎత్తాలి. చేతులను శరీరం పక్కకు ఉంచాలి. తరువాత అరచేతులతో పిరుదులను పట్టుకుని, మోచేతులను భూమికి అన్చి శరీరాన్ని ఇంకా పైకి ఎత్తాలి. చేతులతో బలాన్ని ఉపయోగించి కాళ్ళను అలాగే నిలబెట్టాలి. ఈ భంగిమలో కాళ్లు గాలిలో నేలకి సమాంతరంగా ఉండాలి. కాళ్లు శరీరము ఒక్కలాగే నిటారుగా ఉండేలా భుజాలపైన బరువును ఉంచాలి. తల నేలను తాకుతూ ఉంచాలి. ఇలా కొన్ని సెకండ్ల పాటు ఉన్న తరువాత చేతులను వాదులు చేయాలి, తరువాత  90° నుండి  45° కోణం లోకి రావాలి. ఆ తరువాత కాళ్ళను మెల్లగా కిందకు దించి చేతులను తలకు రెండువైపులా ఉంచాలి. దీని తరువాత శవాసనంలోకి వచ్చి స్థిమితపడాలి.  దీని వల్ల కలిగే శారీరక లాభాలు: ఈ సర్వాంగాసనము వేయడం వలన  మెదడుకు రక్తప్రసారం  చక్కగా జరుగుతుంది. ఆడవారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే  థైరాయిడ్ గ్రంధి నియంత్రించబడుతుంది. ఈ గ్రంధి అసమతుల్యతకు గురి కావడం వలన ఆడవారిలో పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని ఈ ఆసనం ద్వారా నియంత్రించుకోవచ్చు.  ఈ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు:  ఆరోగ్య పరంగా ప్రతి ఆసనం చాలా విశిష్టమైనది, ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మొలలు, హెర్నియా, థైరాయిడ్ మొదలైన జబ్బులకూ, మలబద్ధక సమస్యకూ,  స్త్రీలలో ఎదురయ్యే  ఋతుసంబంధ ఇబ్బందులకూ చక్కని పరిష్కారం పొందగలుగుతాము.  కేవలం శారీరక, ఆరోగ్య లాభాలు మేరమే కాకుండా యోగాసనాల వల్ల ఆధ్యాత్మిక లాభాలు కూడా ఉంటాయి. సర్వాంగాసనము వేయడం వల్ల కలిగే  ఆధ్యాత్మిక లాభాలు  ఏమిటంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, మానసిక శక్తి లభిస్తుంది. తద్వారా మనిషిలో పని చేయగలిగే మానసిక సామర్థ్యం పెరుగుతుంది.  ఈ ఆసనం వేయడానికి కొన్ని సూచనలు:  మానసిక ఆందోళన, నడుంనొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు. జాగ్రత్తలు:  ఆసనం మొదలుపెట్టినప్పుడు కాళ్ళను పైకి ఎత్తేటప్పుడు కాళ్ళను నిటారుగా పైకి లేపాలి. ఆ   భంగిమలో మోకాళ్లు పంచకూడదు. అలాగే కాళ్ళను 45° నుండి 90° లకు తీసుకు వెళ్ళేటప్పుడు బలాన్ని ప్రయోగించే క్రమంలో చాలామంది తల ఎత్తుతారు. ఆ  భంగిమలోకి వెళ్ళేటప్పుడు తల ఎత్తరాదు. శరీరం బరువును  చేతులపైన, భుజాలపైన ఉంచాలి. చివరి భంగిమలో పాదాలను చాచకూడదు. ఈ ఆసనం వేసేటపుడు శ్వాస కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసన సమయంలో శ్వాస ఎలాగుండాలంటే…  కిందకు వంగే ప్రతిసారి గాలి వెలుపలికి విడవాలి. పైకి లేచే ప్రతిసారి గాలి తీసుకోవాలి. చివరి భంగిమలో సాధారణంగా ఉండాలి. ఇదీ సర్వాంగాసనం వేయవలసిన విధానం, ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు.                                     ◆నిశ్శబ్ద.

ఈ సమయంలో ఆడవాళ్ళు వేయకూడని ఆసనాలు!

ఈ సమయంలో ఆడవాళ్ళు  వేయకూడని ఆసనాలు! ఆరోగ్యం కోసం మహిళలు ఎన్నెన్నో చేస్తారు. వాటిలో ప్రభావవంతమైనది యోగా.. వెర్రి పట్టి జిమ్ ల చుట్టూ తిరిగి చివరికి మన భారతదేశ మహర్షులు మనకు ప్రసాదించిన యోగా మార్గం వైపుకు నడుస్తున్నారు అందరూ. ఖరీదైన వస్తువుల అవసరం ఏదీ లేకుండా కేవలం ఏకాగ్రత, అవగాహనల మీద చేసే యోగా ఇప్పుడు విదేశాలలో సైతం మన్నన పొందుతోంది. సెలబ్రిటీల నుండి సాధారణ హోమ్ మేకర్ వరకు ప్రతి మహిళ యోగాను ప్రయత్నించాలని అనుకుంటోందిప్పుడు. అయితే యోగా కేవలం సాధారణంగా జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ లాంటిది కాదు. ఇది మనసును శరీరంతో మమేకం చేసే గొప్ప మార్గం. మనిషి జీవితంలో మానసిక, శారీరక శక్తిని ప్రోగు చేసుకునే విశిష్ట ప్రయాణం. యోగాను పాటించేటప్పుడు చేయవలసిన, చేయకూడని పనులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటికోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు. ఇదిగో క్రింద పొందికగా పొందుపరచిన విషయాలు తెలుసుకొండి మరి.. * భోజనం చేసిన తరువాత యోగాసనాలు ఎప్పుడూ వేయకూడదు. యోగానే కాదు సాధారణ వ్యాయామాలు కూడా వేయకూడదు. ఇక చాలా మంది అల్పాహారం పెద్దగా ఎఫెక్ట్ చూపించదులే అనే ఆలోచనతో అల్పాహారం తరువాత యోగా చేయడానికి సిద్దపడతారు. అయితే ఇది మంచిది కాదు. భోజనం చేసిన నాలుగు గంటల తరువాత, అల్పాహారం తీసుకున్న రెండు గంటల తరువాత మాత్రమే  యోగా చెయ్యాలి.  * చాలామంది యోగ ఆసనాలు వ్యాయామం లాంటివే అనే ఉద్దేశ్యంతో వ్యాయామాలను, ఆసనాలను కలిపి చేస్తుంటారు. అయితే అది చాలా పొరపాటు. ఆసనాలు వేరు, వ్యాయామం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వ్యాయామం చెయ్యాలి అనుకుంటే మొదట వ్యాయామం చేసి, ఆ తరువాత శవాసనం వేసి, కాస్త శరీరం కుదురుకున్న తరువాత ఆసనాలు వెయ్యాలి. వ్యాయామం వల్ల శరీరం ఆసనాలు వేయడానికి తగ్గట్టు సిద్దమవుతుంది కూడా. * ప్రతి ఆసనానికి కొంత సమయం, ప్రతి ఆసనం తరువాత కాసింత విశ్రాంతి అనేవి చాలా అవసరం. ఇలా చేయడం వల్ల ఆసనం ద్వారా కలిగే పలితం ఆయా శరీర భాగానికి సమృద్ధిగా అందుతుంది. ఆసనాలు వేస్తే సరిపోదు… వాటి వల్ల పూర్తి పలితాన్ని పొందాలి అంటే ఆసనాలు వేసేటప్పుడు వాటి మీదనే ఏకాగ్రత పెట్టాలి.  * ఆసనాలు వేసిన తరువాత మనిషికి ఎలా అనిపించాలంటే శరీరం తేలికగా అనిపించాలి. అంతేకానీ జిమ్ చేసినట్టు చెమటలు పట్టడం, అలసిపోవడం వంటివి ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే ఆసనాలు అనేవి చాలా నిదానంగా సాగే ప్రక్రియ. ఆసనాలు వేసేటప్పుడు భంగిమలు మార్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా సున్నితంగా కదులుతారు. దీనికి అనుగుణంగా ఉచ్వాస, నిశ్వాసలు కూడా ఉండాలి. కాబట్టి కేవలం శరీరం కదలికే కాదు, అంతర ప్రక్రియ కూడా యోగా ప్రధానం. * ఆసనాలు వేయడం మొదలు పెట్టిన కొత్తలో ఒక్కొక్క దాన్ని సాధన చేస్తూ వెళ్ళాలి. అంతేకానీ భంగిమలు మారడానికి వీలవుతోంది కదా అని వరుసపెట్టి ఆసనాలు వేయకూడదు. వాటికి కేటాయించే సమయం కూడా తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవాలి.  * ఆసనాలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తుంటేనే వాటి నుండి సరైన పలితం లభిస్తుంది. లాగే నెలసరి సమయంలో, గర్భవతులుగా ఉన్నప్పుడు మహిళలు ఆసనాలు వేయకూడదు. పైన చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే ఆసనాలు మహిళల జీవితాన్ని మార్చే అస్త్రాలు అవుతాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి.                                                ◆నిశ్శబ్ద.

జాగో... జాగింగ్ కరో

 జాగో... జాగింగ్ కరో! * జాగింగ్ అనేది చక్కని ఆరోగ్య ప్రక్రియ. జాగింగ్ వలన కొన్ని వారాలలోనే మీ శరీరం ఫిట్‌గా తయారవుతుంది. అయితే జాగింగ్ ప్రారంభించటానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. *  జాగింగ్ చేసేటప్పుడు మంచి దుస్తులు ఎంచుకోండి. మరీ బిగుతుగా ఉన్న వాటిని కాకుండా వదులుగా సౌకర్యవంతంగా ఉన్న వాటిని ధరించండి, పరిగెత్తటానికి మంచి షూలను వాడండి. షూ సరిగా లేనట్లయితే పరిగెత్తటానికి  సౌకర్యంగా ఉండదు. *  జాగింగ్ ప్రారంభించటానికి ముందుగా, కొన్ని సులభమైన వ్యాయామాలను చేయండి. వీటిని వార్మప్ ఎక్సర్‌సైజులు అంటారు. వేగంగా నడవటం ప్రారంభించి, కొద్ది కొద్దిగా పరిగెత్తి, వేగంగా పరిగెత్తండి. వీటి వలన ప్రశాంతమైన జాగింగ్‌ని ఆస్వాదిస్తారు.  * సరైన పద్ధతిలో పరిగెత్తండి. సరైన విధంగా జాగింగ్ చేయకపోవటం వలన వెన్నునొప్పి లేదా వెన్ను సమస్యలు వచ్చే ఇబ్బంది వుంది. * కాంక్రీటుతో చేసిన నేలపైన జాగింగ్ చేయకుండా గడ్డి ఉండే నేల పైన జాగింగ్ చేయటం వలన కాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. జాగింగ్ చేయటానికి ముందుగా  నీటిని పుష్కలంగా తాగండి. వీలుంటే వాటర్ బాటిల్‌ని వెంట తీసుకెళ్ళండి. జాగింగ్ చేశాక వెంటనే ఆగకుండా నెమ్మదిగా వేగాన్ని తగ్గించి, నెమ్మదిగా నడుస్తూ క్రమంగా ఆపేయండి.  * రోజు జాగింగ్ చేయటం వలన జిమ్ చేసిన ఫలితాలను పొందుతారు. * జాగింగ్ ను ఉత్సాహవంతమైన నడకతో ప్రారంభించండి. * ప్రతిరోజూ 40 నిమిషాల జాగింగ్ వలన శరీర బరువు తగ్గుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రభావాలు కూడా తగ్గుతాయి. మానసిక ఒత్తిడి మాయమైపోతుంది. * జాగింగ్ వలన శరీర రక్త ప్రసరణ మెరుగు పడటమే కాకుండా గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. * ప్రతిరోజూ జాగింగ్ చేయడం వలన వారం రోజులలో 1000 కేలరీలు వ్యయమవుతాయి.     Attachments 

Nutritional Facts Scale

లైఫ్‌ బ్యూటిఫుల్‌గా వుండాలంటే మనం అందంగా, యాక్టివ్‌గా, హెల్‌దీగా వుండాలి. ఈ మూడూ కావాలంటే రైట్‌ డైట్‌ తీసుకోవాలి. ఆల్‌మోస్ట్‌ మనందరం క్యాలరీలు లెక్క చూసుకుని మరీ తింటుంటాం కదా? దోశలో ఇన్ని క్యాలరీలు, పిజ్జాలో ఇన్ని క్యాలరీలు అంటూ ఏవో కాకి లెక్కలు కాకుండా పక్కాగా మనం తినే ఫుడ్‌లో ఎన్ని క్యాలరీలు వున్నాయో తెలుసుకోవాలంటే ‘న్యూట్రిషినల్‌ ప్యాక్ట్స్‌ స్కేల్‌ అనే మెషిన్‌ని ఇంటికి తెచ్చుకుంటే చాలు న్యూట్రిషియన్‌ ప్యాక్ట్‌స్కేల్‌ మెషిన్‌ మనం బరువు చూసుకునే మెషిన్‌నిలా ఉంటుంది చూడటానికి. కాని ఈ మెషిన్‌పై మనం తినబోయే ఫుడ్‌ ఐటమ్స్‌ని పెడితే చాలు ఒక్క సెకనులో పూర్తి ఇన్‌ఫర్‌మెషన్‌ వచ్చేస్తుంది. మెషిన్‌లో ఓ పక్కన  డిసిప్లెలో మనం పెట్టిన ఫుడ్‌ ఐటమ్‌లో ఉన్న ప్రోటీన్లు, సోడియం, కాలస్ట్రాల్‌, కార్బో హైడ్రేట్లు ఇలా ఓ 16 రకాల వివరాలు డిసిప్లే అవుతాయి. ఆ లెక్కలని చూసి ఓకే అనిపిస్తే మనం తినచ్చు. సో... క్యాలరీలకి స్ట్రిక్టగా చెక్‌ చెప్పాలంటే ఈ మెషిన్‌ని తెచ్చుకుంటే చాలు.

నాభి ఆసనం

  నాభి ఆసనం : ఈ ఆసనంలో శరీరమంతా నాభిపై ఆధారపడి ఉంటుంది కనుక దీనికి యీ పేరు వచ్చింది. విధానం : వెల్లకిల పడుకొని వేసే నౌకసనానికి ఉల్టగా యీ ఆసనం వుంటుంది. బోర్ల పడుకొని, నమస్కారం చేస్తున్నట్లు రెండు చేతులు సిరస్సు ముందు వైపుకు చాచాలి. రెండు కాళ్ళు చాచి మడమలు కలపాలి. శ్వాస పీలుస్తూ రెండు చేతులు, రెండు కాళ్ళు, సిరస్సు, ఛాతీ, శక్త్యానుసారం పైకి ఎత్తాలి. పొట్ట మీద, నాభి మీద శరీరమంతా ఆధారపడి ఉంటుంది. 2నుంచి 5 సెకండ్ల తరువాత శ్వాస వదులుతూ యధా స్థితికి రావాలి. 3నుంచి 5 సార్లు ప్రారంభంలో చేయాలి. రెండు చేతులు, రెండు కాళ్ళు ఆరంభంలో ఎత్తవచ్చు లేక ఒక చేయి ఒక కాలు అయినా ఎత్తవచ్చు. లాభాలు: నాభి, పొట్ట యందలి అవయవాలు బలపడతాయి. నాభి తన స్థానాన్నుంచి తొలిగితే బాధలు కలుగుతాయి. యీ ఆసనం వల్ల నాభి తన స్థానంలో వుంటుంది. నిషేధం : హెర్నియా, అల్సర్ వ్యాధి గల వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, కొద్ది కాలం క్రితం పొట్ట ఆపరేషను చేయించుకున్న వాళ్ళు యీ ఆసనం వేయకూడదు. "నాభికి శక్తి చేకూర్చేది నాభి ఆసనం"

శిధిలాసనం

  శిధిలాసనం : ఈ ఆసనంలో శరీరం వదులు (శిధిలం) అవుతుంది కనుక దీనికి యీ పేరు వచ్చింది. విధానం : బోర్లపడుకొని, రెండు అరచేతులు నేలపై ఆనించి వాటి మీద వుంచిన సిరస్సును కుడి ప్రక్కకు త్రిప్పాలి. ఆ వైపుకు మోకాలును మడిచి రెండవ కాలు చాచి వదులుగా వుంచాలి. శరీరమంతా వదులు చేస్తూ, కండ్లు మూసుకొని శ్వాస మెల్లగా పీలుస్తూ వదులుతూ వుండాలి. అవయవాలన్నింటి మీద మనస్సును కేంద్రీకరించాలి. బోర్లపడుకోనివేసే ఒక్కొక్క ఆసనం వేయగానే విశ్రాంతి కోసం శిధిలాసనం తప్పక వేయాలి. లాభాలు : దీనివల్ల శరీర అవయవాలన్నింటికి విశ్రాంతి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. నిద్ర బాగా వస్తుంది. టెన్షను తగ్గుతుంది. గుండెజబ్బు, రక్తపు పోటు కలవారికి లాభిస్తుంది. "శరీర అవయవాలన్నింటికి విశ్రాంతినిచ్చేది శిధిలాసనం"