అమ్మాయిల ముఖచర్మం మెరిసిపోవాలంటే.. ఈ మూడు ఆసనాలు వేస్తే సరి..!
posted on Feb 9, 2024
అమ్మాయిల ముఖచర్మం మెరిసిపోవాలంటే.. ఈ మూడు ఆసనాలు వేస్తే సరి!
అందంకోసం తపించని అమ్మాంటూ ఉండదు. బ్యూటీ టిప్స్ కావచ్చు, బ్యూటీ క్రీములు కావచ్చు, ఏదైనా బ్యూటీ థెరపీ కావ్చచు.. అందంగా మెరిసే చర్మంతో కనిపిస్తామంటే ఏం చెయ్యడానికైనా సిద్దపడతారు. అమ్మాయిల ముఖ చర్మం ఎలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్, ఏ విధమైన క్రీములు రాకుండానే మెరిసిపోవాలంటే ఈ కింది ఆసనాలు వెయ్యాల్సిందే.. వీటిని వేస్తే రక్తం శుద్ది అయ్యి చర్మం కాంతివంతంగా మారుతుంది.
సర్వాంగాసనం..
సర్వాంగాసనం వేస్తే భుజాలు, వెనుక భాగాలు బలంగా మారుతాయి. దీన్నెలా వేయాలంటే..
మొదట శవాసనం స్థితిలో పడుకోవాలి. ఇప్పుడు కాళ్లు రెండూ దగ్గరగా ఉంచుకుని మెల్లిగా పైకి లేపాలి. క్రమంగా తొడలు, పిరుదులు పైకి లేపుతూ వెన్నెముకను పైకి లేపి దానికి సపోర్ట్ గా చేతులతో నడుమును పట్టుకోవాలి. మోచేతులను నేలకు ఆనించి నడుముకు మద్దతు ఇవ్వాలి. ఈ ఆసనంలో మెడ మీద ఒత్తిడి పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది వేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ముఖచర్మానికి ప్రసరణ బాగుండటం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది.
హలాసనం..
హలాసనం చేయడం వల్ల శరీరం బాగా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీన్నెలా చేయాలంటే..
మొదట శవాసనం స్థితిలో పడుకోవాలి. ఇప్పుడు అరచేతులను నేలకు ఆనేలా ఉంచాలి. నెమ్మదిగా కాళ్లను లేపి 90డిగ్రీలు అంటే లంబకోణంలోకి తీసుకురావాలి. ఇప్పుడు మీ శరీరం ఎల్ అక్షరం షేపులో ఉంటుంది.
లంబకోణంలో ఉన్న కాళ్లను మెల్లిగా వెనక్కు జరుపుతూ కాలి పాదాల వేళ్ళను నేలకు తలిగేలా వంచాలి. ఈ స్థితిలో కాళ్లు రెండూ ఒక్కిటిగా, నిటారుగా ఉంచాలి. నాలుగైదు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని తిరిగి సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. ఛాతీ, ముఖానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
త్రికోణాసనం..
త్రికోణాసనం వేస్తే ముఖ చర్మం కాంతివంతమవడమే కాదు ఛాతీ, భుజాలు, కాళ్లు రిలాక్స్ అవుతాయి. చేతులు, కాళ్లు, తొడలు దృఢంగా మారుతాయి. దీన్నెలా వేయాలంటే..
మొదటగా కాళ్లను దూరంగా ఉంచి నిలబడాలి. ఇలా నిలబడిన తరువాత కుడి కాలును 90డిగ్రీలు, ఎడమ కాలును 15డిగ్రీలు తిప్పాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ రిలాక్స్ అవ్వాలి.
శరీరాన్ని కుడివైపుకు వంచాలి. ఇలా వంచినప్పుడు నడుమును నిటారుగా ఉంచాలి. ఎడమ చేతిని పైకెత్తి ఆకాశం వైపుకు సూటిగా ఉంచాలి. కుడిచేతిని కిందకు ఉంచి గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపు కూడా చేయాలి.
ఈ మూడు ఆసనాలు వేస్తే ముఖానికి రక్తం సరఫరా మెరుగుపడి ముఖం చర్మం కాంతివంతమవుతుంది. చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి.
*నిశ్శబ్ద.