భుజంగాసనం వేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి..!
posted on Jun 21, 2024
భుజంగాసనం వేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి..!
భారతీయుల ఋషులు, ప్రాచీన వైద్యులు భారతీయులకు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా యోగ నే. యోగ అనేది కేవలం ఆరోగ్యాన్ని చేకూర్చేది కాదు. ఇది ఒక జీవనశైలి అని చాలామంది యోగా గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి. వీటిలో భుజంగాసనం కూడా ఒకటి. భుజంగం అంటే పాము అని అర్థం. నాగుపాము పడగ విప్పి చూస్తున్నట్టుగా ఈ ఆసనం భంగిమ ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ ఆసనాన్ని భుజంగాసనం అంటారు. భుజంగాసనం వేయడం వల్ల శరీరం సాగుతుంది. శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. పొట్ట తగ్గుతుంది. వీపు, భుజాలు బలంగా మారతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శ్వాస కోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే భుజంగాసనం వేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే దీని వల్ల మేలు జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
గుర్తుంచుకోవలసిన విషయాలు..
భుజంగాసనం సరిగ్గా చేస్తేనే దాని ప్రయోజనాలు పొందవచ్చు. ఆహారం తిన్న కనీసం 4 నుండి 5 గంటల తర్వాత మాత్రమే భుజంగాసనం వేయాలి. దీంతో భుజంగాసనం చేస్తున్నప్పుడు కడుపులో ఎలాంటి అసౌకర్యం కలగదు.
ఆసనాలు వేయడం మొదలు పెట్టగానే భుజంగాసన చేయకూడదు. భుజంగాసనం చేసే ముందు శరీరాన్ని వార్మప్ చేయాలి. తరువాత స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. దీంతో చేతులు, భుజాలు, మెడ, వీపు కాస్త వదులుగా మారుతాయి. దీని వల్ల భుజంగాసనం చేయడం సులువవుతుంది.
ఏ యోగా ఆసనాలు అయినా ఉదయాన్నే చేయడం మంచిది. అలాగే భుజంగాసనం కూడా ఉదయాన్నే చేయవచ్చు.దీనివల్ల రోజంతా చలాకీగా, చురుగ్గా ఉంటారు.
యోగ ఆసనాలు వేయడంలో అనుభవం లేనివారు భుజంగాసనం వేసేటప్పుడు శరీరాన్ని ఎక్కువ సాగదీయడం మానుకోవాలి. అలాగే భుజంగాసనం చేసేటప్పుడు కాళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి.
మహిళలు గర్భధారణ సమయంలో భుజంగాసనం చేయడం మానుకోవాలి. ఇది కాకుండా ఎప్పుడైనా మణికట్టు లేదా పక్కటెముకలలో పగుళ్లు, ఇబ్బందులు ఉంటే లేదా కడుపు శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే భుజంగాసనం చేయకూడదు.
యోగా ఆసనాలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు తమకు తాము ఎప్పుడూ ఆసనాలు వేయకూడదు. గురువు లేదా నిపుణుల ముందు మాత్రమే భుజంగాసనం చేయాలి. ఆ తరువాత కావాలంటే తమకు తాము ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
*రూపశ్రీ.