యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు, నియమాలు, నిషేధాలు
యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు, నియమాలు, నిషేధాలు
యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు
1 మనం జీవిస్తున్న ఈనాటి ఆధునిక యుగంలో, అత్యాధునిక నగరజీవితంలో క్షణం క్షణం మనిషికి కలుగుతున్న టెన్షను, వత్తిడి, నీరసం, నిస్పృహ, భయం, వ్యతిరేక ఆలోచనలు, అవధానశక్తి తరుగుదల మొదలైన రుగ్మతులు తగ్గిపోతాయి.
2 శారీరకంగా, మానసికంగాను సుఖశాంతులు, ఆరోగ్యం పొంది ఆత్మవికాస మార్గాన పయనించి మనిషి తన జన్మను సార్థకం చేసుకుంటాడు.
3 ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఆవేశం, మొదలగు దుష్ప్రవృత్తులు తగ్గి ప్రశాంతత, స్థిరత్వం మనిషి పొందుతాడు.
4 మధుమేహం, ఆస్తమా, రక్తపోటు, గుండెనొప్పి, నడుంనొప్పి, మోకాళ్ళ నొప్పి, అజీర్తి మొదలగు దీర్ఘరోగాలు నయమై, మనిషి శరీరం బంగారంలా నిగనిగలాడుతుంది.
5 స్త్రీలు యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం పొడడమే గాక, తమ సౌందర్యాన్ని పెంచుకుంటారు. తమ కుటుంబాన్ని సరిదిద్దుకొని క్రమశిక్షణతో పిల్లలని పెంచి, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దుతారు.
6 యోగాభ్యాసం అలవాటు కాగానే మనిషి దినచర్య, అలవాట్లు, ఆలోచనా విధానం, ఆహారవిహారడులు మొదలైన విషయాలన్నిటిలో సాత్విక మార్పు సాధిస్తాడు. తామస, రాక్షస ప్రవృత్తులు తగ్గుతాయి. అలాంటి సాధకులు ఉత్తమ పౌరులుగా దేశానికి, ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తారు.
7 యోగాభ్యాసం చేసే సాధకులు తమ నిత్య కార్యక్రమాలలో, విధుల్లోనూ దక్షత, ఏకాగ్రత, చురుకుదనం సాధించి అధికారుల మన్నన పొందుతారు. యోగకర్మకు కౌశలం అనో ఆర్యోక్తిని అమల్లోకి తెస్తారు.
యోగాభ్యాస నియమాలు :
1 ప్రతిరోజూ రాత్రి త్వరగా పడుకొని హాయిగా నిద్రపోవాలి. తెల్లవారు ఝామున లేచి, పళ్ళుతోముకుని, మలమూత్ర విసర్జన చేసుకుని, స్నానం చేసి, పరగడుపున యోగాభ్యాసం ఆరంభించాలి.
2 స్నానం చేయకుండా కూడా యోగాభ్యాసం చేయవచ్చు. అయితే యోగాభ్యాసం పూర్తి అయిన కొద్ది సేపటి తరువాత స్నానం చేయవచ్చు.
3 గాలి, వెలుగు వచ్చే ప్రదేశాలలో, కిటికీలు, తలుపులు తెరిచి ఉన్న గదుల్లోనూ సమతలంగా వున్న చోట యోగాభ్యాసం చేయాలి.
4 ఉదయం ప్రసరించే సూర్యరశ్మిలో యోగాభ్యాసం చేయడం ఎన్నో విధాల మంచిది.
5 నేలమీద గాని, గచ్చుమీద గాని, బండలమీద గాని యోగాభ్యాసం చేయకూడదు. తివాచీగాని, కంబలికాని, పరిశుభ్రమైన బట్టగాని పరిచి దానిమీద కూర్చుని యోగాభ్యాసం చేయాలి.
6 ఇంట్లో పురుషులు డ్రాయరు ధరించి యోగాభ్యాసం చేయాలి. స్త్రీలు తక్కువ బట్టలు, ముఖ్యంగా పంజాబీ డ్రస్సు ధరించడం మంచిది. సాధకులు యోగాభ్యాసం బహిరంగ ప్రదేశాల్లో చేస్తున్నప్పుడు వదులుగా వున్న దుస్తులు ధరించాలి.
7 యోగాభ్యాసం చేస్తున్నప్పుడు, మలమూత్ర విసర్జన చేయవలసి వస్తే, లేచి వెళ్ళి తప్పక చేయాలి. బలవంతాన ఆపుకోకూడదు. త్రేపులు, తుమ్ములు, దగ్గులు మొదలైన వాటిని ఆపుకోకూడదు. దాహం వేస్తే కొద్దిగా మంచినీళ్ళు త్రాగచ్చు.
8 తొందరపడకుండా, అలసట లేకుండా తాపీగా యోగాభ్యాసం చేయాలి. అలసట వస్తే కొద్దిసేపు శాంత్యాసనం లేక శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
9 సాధ్యమైనంతవరకు యోగాభ్యాసం ప్రతిరోజూ చేస్తూ ఉండాలి.
10 యోగాభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సును, మస్తిష్కాన్ని దానిమీదనే కేంద్రీకతించాలి. ఇతర ఆలోచనలని సాధ్యమైనంత వరకు దరికి రానీయకూడదు.
11 యోగాభ్యాసం పూర్తికాగానే తప్పక మూత్ర విసర్జన చేయాలి. ఆ మూత్రం ద్వారా లోపలి కాలుష్యం బయటికి వెళ్ళిపోతుంది.
12 పెనుగాలి వీస్తున్నప్పుడు దాని మధ్య యోగాభ్యాసం చేయకూడదు.
13 యోగాభ్యాసం చేస్తున్నప్పుడు చెమటపోస్తే బట్టతోగాని, అరిచేతులతో కాని మెల్లగా ఆ చెమటను తుడవాలి. గాలిలో చెమట ఆరిపోయినా మంచిదే.
యోగా నిషేధాలు :
1 రజస్వల, ముట్టు లేక గర్భవతి అయినప్పుడు స్త్రీలు యోగాభ్యాసం చేయకూడదు. సూక్ష్మయోగ క్రియలు మరియు ధ్యానం చేయవచ్చు.
2 బాగా జబ్బుపడినప్పుడు, ఆపరేషను చేయించుకున్నప్పుడు, ఎముకలు విరిగి కట్టు కట్టించుకున్నప్పుడు యోగాభ్యాసం చేయకూడదు. తరువాత నిపుణుల సలహా తీసుకుని తిరిగి ప్రారంభించవచ్చు.
3 8 సంవత్సరాల వయస్సు దాటే దాకా బాలబాలికలచే బలవంతాన యోగాభ్యాసం చేయించకూడదు.
4 మురికిగా వున్న చోట, పొగ మరియు దుర్వాసన వచ్చే చోట యోగాభ్యాసం చేయకూడదు.
5 యోగాభ్యాసం చేయదలచిన వాళ్ళు యోగశాస్త్ర నిపుణుల సలహాలు తీసుకోవడం అన్ని విధాల మంచిది.