ఈ ఆసనాలు వేస్తే కొవ్వు కరిగిపోతుంది!

ఈ ఆసనాలు వేస్తే కొవ్వు కరిగిపోతుంది!

ప్రస్తుతకాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.  ఎక్కువగా కూర్చొని పని చేయడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా శరీరంలో అధిక కొవ్వు పెరుగుతుంది. రోజంతా డెస్క్ వర్క్ వల్ల శరీరంలో కింది భాగం బలహీనంగా మారుతుంది. అధిక కొవ్వు తొడలు, తుంటిలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, శరీరం పై భాగం కంటే దిగువ భాగంలో కొవ్వు పెరుగుతుంది దీనివీల్ల శరీరం లావుగా  కనిపిస్తుంది.

ఊబకాయం లేదా శరీరంలో ఇలా పెరిగిపోయిన కొవ్వును వ్యాయామం లేదా యోగా ద్వారా తగ్గించవచ్చు. శరీర పరిస్థితికి అనుగుణంగా ఏ వ్యాయామం లేదా యోగా చేయాలో చాలామంది మహిళలకు తెలియదు. లావుగా ఉన్న తొడల కొవ్వును తగ్గించాలనుకుంటే, ఆయా ప్రాంతాలలో ఉన్న కొవ్వును కరిగించే యోగాసనాలు చెయ్యాలి. ఇందుకోసం యోగాలో ఎన్నో అసనాలున్నాయి కూడా. ఈ కింద పేర్కొన్న మూడే మూడు యోగాసనాల ద్వారా తొడలు, తుంటి భాగంలో పేరుకున్న కొవ్వును చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.

ఉత్కటాసన

ఉత్కటాసనాన్ని కుర్చీ భంగిమ అంటారు. ఈ ఆసనం చేయడానికి రెండు కాళ్ల మధ్య కొద్దిగా ఖాళీని ఉంచి, చేతులను ముందు వైపుకు చాచి, నమస్కార భంగిమలో అరచేతులను కలపండి. ఇప్పుడు చేతులను పైకి లేపి, మోకాళ్లను వంచి, కటిని తగ్గించాలి. ఇప్పుడు, చీలమండలు, మోకాళ్లను నిటారుగా ఉంచి, నమస్కార ముద్రలోకి వచ్చి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఈ భంగిమను ప్రతిరోజు పాటిస్తూ ఉంటే తొడల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. 

ఏకపాదాసనం

ఏకపాదాసనం చేయడం వల్ల తొడల్లోనే కాకుండా తుంటి భాగంలో పేరుకున్న కొవ్వు కూడా తొందరగా తగ్గుతుంది. పాదాలను వెడల్పుగా ఉంచి నిటారుగా నిలబడాలి. ఇప్పుడు చేతులు పైకి లేపి, ప్రాణ ముద్రలో అరచేతులను కలపండి. వీపును నిటారుగా ఉంచి, శ్వాస వదులుతూ, శరీరాన్ని నేలకి సమాంతరంగా ఉండే వరకు వంచాలి. ఈ సమయంలో, చేతులను చెవుల దగ్గర ఉంచి, నెమ్మదిగా వెనుకభాగాన్ని పైకి లేపాలి. కుడి కాలు, కటి, ఎగువ శరీరం, చేతిని నేరుగా పైకి ఎత్తండి. కళ్ళను నేలపై ఉంచేటప్పుడు బ్యాలెన్స్  చూసుకోవాలి.

వృక్షాసనం..

వృక్షాసనం శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ఈ ఆసనం చేయడానికి , నిటారుగా నిలబడి కుడి కాలును నేల నుండి పైకి లేపాలి. ఎడమ కాలుపై శరీర బరువును బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు కుడి కాలు లోపలి తొడపై ఉంచి, అరచేతులతో సపోర్ట్ ఇవ్వాలి. ప్రాణ ముద్రలో ఉన్నప్పుడు చేతులు పైకి ఎత్తాలి. ఈ యోగాను కొంత సమయం పాటు రిపీట్ చెయ్యాలి.

                             ◆నిశ్శబ్ద.