చేతులు, కాళ్ళలో కొవ్వు పేరుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తోందా... ఈ ఆసనాలు వేస్తే చాలు!

చేతులు, కాళ్ళలో కొవ్వు పేరుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తోందా..ఈ ఆసనాలు వేస్తే చాలు!


కాలం ఏదైనా అమ్మాయిలు స్లీవ్‌లెస్ టీ షర్టులు లేదా టాప్స్ ధరిస్తారు. ఇక  షార్ట్స్ లేదా మినీ డ్రెస్ వేసుకుంటే ఫ్యాషన్ గా ఉంటుందని అటువైపు దృష్టి సారిస్తారు. కానీ కాళ్ళలో, చేతులలో పేరుకున్న కొవ్వు కారణంగా చాలామంది అధికబరువు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంటారు. కేవలం ఈ స్లీవ్ టాప్స్, మోకాళ్ళ వరకు ఉన్న షార్ట్ కారణంగా ఇలా జరగడం అమ్మాయిలకు చాలా చిరాకు తెప్పిస్తుంది. కాళ్ళూ, చేతుల్లో కొవ్వు కరగడం కోసం చాలామంది డైటింగ్ మాయింటైన్ చేస్తారు. నిజానికి కొన్ని శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫాలో అవ్వాల్సింది డైటింగ్ ప్లాన్ కాదు. ఆ భాగాల్లో కొవ్వు కరిగించే వ్యాయామం ఫాలో అవ్వాలి ఇలా చేతులు, కాళ్ళలో పేరుకున్న కొవ్వు కరిగించడానికి యోగా బాగా పనిచేస్తుంది. యోగా వల్ల పొట్ట, మెడ కొవ్వు తగ్గడంతోపాటు కాళ్లను, చేతులను టోన్‌గా మార్చవచ్చు. అందుకోసం వెయ్యాల్సిన ఆసనాలు ఏవంటే.. 

వశిష్ఠాసనం..

చేతుల కొవ్వును తగ్గించడానికి వశిష్ఠాసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ఆసనం నడుము కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా ప్లాంక్ పోజ్ లోకి వెళ్ళి. క్రంచెస్ వేసేటప్పుడు ఎలాగైతే చేతులు పాదాల మీద శరీరం బరువు మోపుతూ బ్యాలెన్స్ చేస్తామో అదే ప్లాంక్ పోజ్. . అప్పుడు కుడి వైపున చెయ్యి, కుడి కాలి మీద బరువు ఉంచండి. ఆ తరువాత, ఎడమ కాలు, ఎడమ చేతిని పైకి లేపుతూ, ఎడమ పాదాన్ని కుడి పాదంపై ఉంచాలి. ఎడమ చేతిని మీ తొడలపై ఉంచాలి.  శ్వాస తీసుకుంటూ కొన్ని క్షణాలు ఈ స్థితిలో ఉండాలి. తరువాత ఊపిరి పీల్చుకుంటూ తిరిగి ప్లాంక్ పొజిషన్‌కు రావాలి. ఇదే వశిష్టాసనం. 

కోణాసనం..

లావుగా  చేతులతో పాటు తొడల్లో ఉన్న కొవ్వును తగ్గించడానికి కోనాసన సాధన చేయవచ్చు. ఈ ఆసనం వేయడానికి, ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాల మధ్య దూరం ఉంచుతూ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి కదపాలి. శ్వాస వదులుతున్నప్పుడు, వెన్నెముకను వంచి శరీరాన్ని ఎడమవైపుకు వంచాలి. ఎడమ చేతిని పైకి చాచి, తలను పైకి చూసేలా తిప్పాలి.  ఈ సమయంలో మోచేతులను సరళ రేఖలో ఉంచాలి. గాలి పీల్చేటప్పుడు పాత భంగిమకు తిరిగి వచ్చి, ఊపిరి పీల్చుకుంటూ ఎడమ చేతిని క్రిందికి తీసుకురావాలి. 

మాలాసనం..

కాళ్లను సన్నగా చేయడానికి రెగ్యులర్ గా మాలాసనంను ప్రాక్టీస్ చేయవచ్చు. మాలసనం తొడలు, కాళ్ళను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన ఆసనం. ఈ ఆసనం దిగువ శరీరం యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది, అదనపు కొవ్వును తొలగిస్తుంది. మాలాసనం చేయడానికి, పాదాల మధ్య దూరం ఉంచుతూ తాడాసనం స్థితిలో నిలబడాలి.  స్క్వాట్ పొజిషన్‌లో మోకాళ్లను వంచండి. ముందుకు వంగి రెండు చేతులను వంచి మోకాళ్లను లోపల ఉంచాలి. ఇప్పుడు నమస్కార ముద్రలో చేతులను గుండె దగ్గర ఉంచండి. ఇదే మాలాసనం.

ఈ మూడు ఆసనాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే.. అమ్మాయిల కాళ్ళు, చేతులలో కొవ్వు తగ్గి అందంగా నాజూగ్గా మారతాయి. 

                                    ◆నిశ్శబ్ద.