English | Telugu
అలీ రూటులో తమిళ స్టార్ కమెడియన్!
Updated : Aug 12, 2021
టీవీల్లో, ఓటీటీల్లో టాక్ షోలు కొన్ని ఉన్నాయి. తెలుగుకు వస్తే హాస్యనటుడు అలీ కూడా ఒక టాక్ షో చేస్తున్నారు. మిగతా టాక్ షోలకు ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎక్కువమందితో అలీకి పరిచయాలు ఉండటం, ప్రముఖులతో ఆయన పని చేసి ఉండటం వల్ల టాక్ షోకు వచ్చే సెలబ్రిటీలతో సరదాగా మాట్లాడుతూ నవ్విస్తారు. అలీ టాక్ షోలో విషయంతో పాటు వినోదం ఉంటుంది. ఇప్పుడు అలీ రూటులోకి ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు వస్తున్నారని టాక్.
వడివేలు ఓ టాక్ షో చేయడానికి రెడీ అవుతున్నారని కోలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. తమిళంలో ఆయన స్టార్ కమెడియన్. స్టార్ హీరోలతో సరదాగా మాట్లాడగలరు. అందువల్ల, వడివేలు టాక్ షో చేస్తే బావుంటుంది. అయితే, ఆయన టీవీ కోసం టాక్ షో చేయడం లేదు. ఓటీటీ కోసం చేస్తున్నారట. ప్రజెంట్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయని, త్వరలో అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసి టాక్ షో స్టార్ట్ చేస్తారని కోలీవుడ్ ఇన్ఫర్మేషన్.
పదేళ్ల క్రితం వరకు ఏడాది పది, పదిహేను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే వడివేలుకు ఆ తర్వాత సినిమాలు తగ్గిపోయాయి. కొన్ని సినిమాల్లో హీరోగా చేయడంతో, ఆ టైమ్‌లో ఇతర కమెడియన్లు రంగంలోకి వచ్చి బిజీ అయ్యారు. దాంతో వడివేలు ప్రాభవం తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఆయన టాక్ షో చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.