English | Telugu
‘స్కంద’ మూవీ రివ్యూ.. మాస్ కి పండగే!
Updated : Sep 28, 2023
సినిమా పేరు: స్కంద
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, పృథ్వీ రాజ్, అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ఇంద్రజ, గౌతమి, ప్రభాకర్, ప్రిన్స్ తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రాఫర్: సంతోష్ డేటాకే
ఎడిటర్: తమ్మిరాజు
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023
కొన్ని కాంబినేషన్స్ మొదటిసారి చేతులు కలిపినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి కాంబోనే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను ది. ఎనర్జిటిక్ హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రామ్.. కొంతకాలంగా మాస్ బాట పట్టాడు. ఇక మాస్ డైరెక్టర్ గా బోయపాటికి తిరుగులేని పేరుంది. ఈ ఇద్దరూ కలిసి మొదటిసారి చేసిన చిత్రమే 'స్కంద'. రామ్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ చేసిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? రామ్ కి బిగ్గెస్ట్ హిట్ ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూతురు పెళ్ళి. రాష్ట్ర గవర్నర్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా ఎందరో ప్రముఖులు అతిథులుగా విచ్చేస్తారు. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఉంటాడు. పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతున్న టైంలో అతను సైలెంట్ గా పెళ్ళి కూతురుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ఏపీ సీఎం.. తన సొంత మామను చంపేసి, గుండెపోటుతో మామ చనిపోవడంతో పెళ్ళి ఆగిపోయిందని చెప్పి అందరినీ పంపించేస్తాడు. ఆ తర్వాత తెలంగాణ సీఎంకి ఫోన్ చేసి నిన్ను, నీ కొడుకుని చంపేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. అలా ఇద్దరు సీఎంల మధ్య మొదలైన గొడవలోకి భాస్కర్(రామ్) ఎంటర్ అవుతాడు. అసలు అతను ఎవరు? వీళ్ళ గొడవలోకి ఎలా వచ్చాడు? అతనికి, చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యాపారవేత్త రామకృష్ణ రాజు(శ్రీకాంత్) కి సంబంధం ఏంటి? రామకృష్ణ రాజు జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు? అతను జైలు నుంచి బయటకు రాగలిగాడా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ ప్రేక్షకులు మెచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయి. అందుకే ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ దగ్గర విజయాలను నమోదు చేస్తాయి. మరోసారి అలాంటి ఫార్ములాను నమ్ముకొని బోయపాటి తీసిన సినిమానే స్కంద.
రామకృష్ణ రాజు అరెస్ట్, ఇద్దరు సీఎంల మధ్య గొడవతో సినిమా ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ టెంపోని కంటిన్యూ చేస్తూ సదర్ ఉత్సవాలలో రామ్ ఎంట్రీ ఫైట్ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత నుండి కథలో పెద్దగా కదలిక ఉండదు. యాక్షన్ సన్నివేశాలు, రెండు పాటలతో ఫస్ట్ హాఫ్ ని నడిపించాడు దర్శకుడు బోయపాటి. ఫస్టాప్ లో ఉన్న మూడు ఫైట్స్ మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఒక దానిని మించి ఒకటి ఉన్నాయి. ఇంటర్వెల్ ఫైట్ అయితే అదిరిపోయింది. అయితే ఆ ఫైట్ విషయంలో దర్శకుడు అస్సలు లాజిక్ లు పట్టించుకోలేదు. సీఎం ఇంటికి వెళ్ళి ఒకతను దాడి చేస్తుంటే, సీఎం సెక్యూరిటీ ఒక్క బుల్లెట్ తో అతన్ని అంతమొందించవచ్చు. కానీ అతని దగ్గరకు వెళ్ళి మరీ చావు దెబ్బలు తింటుంటారు. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో లాజిక్ లు వెతక్కూడదు అని సర్ది చెప్పుకుంటే మాత్రం ఆ ఫైట్ ని ఎంజాయ్ చేయొచ్చు.
ఫస్టాప్ ని యాక్షన్ తో నింపేసిన బోయపాటి.. సెకండాఫ్ లోమాత్రం యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉండేలా చూసుకున్నాడు. ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టి పడేశాయి. అయితే సెకండాఫ్ లో చాలాసేపు రామ్ స్క్రీన్ మీద కనిపించకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయం. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్, ఫైట్ కూడా అదిరిపోయాయి. అయితే సీఎంలు వీధి రౌడీల్లా కొట్లాటకు దిగడం నమ్మశక్యంగా లేదు. కొసమెరుపు ఏంటంటే స్కంద-2 కూడా ఉందని చివరిలో చూపించారు. పార్ట్-2 కి ఇచ్చిన లీడ్ బాగానే ఉన్నప్పటికీ, అది పట్టాలెక్కడం మాత్రం పార్ట్-1 రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. దానికి బదులుగా రెండు భాగాలను ఒకే సినిమాగా టైట్ స్క్రీన్ ప్లే తో చేస్తే బాగుండేదేమో.
సంగీత దర్శకుడు తమన్ పెద్దగా మెప్పించలేకపోయాడు. పాటలు తేలిపోయాయి. గందరబాయి పాటకి మాత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో తప్ప నేపథ్య సంగీతంలో కూడా తమన్ మార్క్ కనిపించలేదు. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిడివి కుదించవచ్చు. కొన్ని పాటల ప్లేస్ మెంట్ కూడా సరిగా కుదరలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
డ్యుయల్ షేడ్స్ ఉన్న పాత్రలో రామ్ చెలరేగిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎమోషన్స్ కూడా చక్కగా పలికించాడు. శ్రీలీల పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. సీఎం కూతురు పాత్ర అయినప్పటికీ రెండు పాటలు, కొన్ని సన్నివేశాలకు పరిమితమైంది. రామకృష్ణ రాజుగా శ్రీకాంత్ ఎప్పటిలాగే మెప్పించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రాయుడుగా అజయ్ పుర్కర్, తెలంగాణ సీఎం రంజిత్ రెడ్డిగా శరత్ లోహితస్వ ఆకట్టుకున్నారు. సాయి మంజ్రేకర్, పృథ్వీ రాజ్, దగ్గుబాటి రాజా, ఇంద్రజ, గౌతమి, ప్రభాకర్, ప్రిన్స్ తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
మాస్ ని మెప్పించడమే ప్రధాన లక్ష్యంగా తీసిన స్కంద ఆ విషయంలో చాలావరకు సక్సెస్ అయింది. ఫస్టాఫ్ లో యాక్షన్ తో, సెకండాఫ్ లో యాక్షన్, ఎమోషన్స్ తో నడిచిన ఈ సినిమా.. బోయపాటి మార్క్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. లాజిక్స్ ని పక్కన పెట్టి ఓ కమర్షియల్ సినిమాలా చూస్తే.. మాస్ కి నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వడం అనుమానమే.
రేటింగ్: 2.5/5
-గంగసాని